ఎప్పుడోసారి
నేన్నిన్ను ప్రేమించే వుంటాను
ఎడారినై
నేను ప్రవహిస్తున్నప్పుడు
నదిలాంటి నిన్ను
నాలోకి ఆహ్వానించే వుంటాను
ప్రేమంటే
ఒక క్షణంలో పుట్టేది కాదు కదా
ఆదిమ కాలం నుండీ
నిన్ను ఆరాధిస్తూనే వున్నాను
ప్రేమంటే
ఒక పదంలో చెప్పేది కాదు కదా
హృదయం మీదొక ప్రేమలేఖను రాసుకుని
నిశ్శబ్దం అంచున
ఎన్ని సార్లో నిరీక్షించి వుంటాను
నువ్వు చూస్తావని
ఎన్ని నవ్వుమేడలో కట్టుకుని వుంటాను
లైబ్రరీ మెట్లమీద
మనం
చేజార్చుకున్న ఊహలన్నీ
ఏ నిద్ర పట్టని రాత్రో
నా వెంటబడి తరుముతాయి
తీరంలో మనం
అల్లుకున్న కవితలన్నీ
కెరటాల్లా హోరెత్తుతాయి
జీవితాన్ని అతిగా ప్రేమించడం కూడా
నేరమేనన్న నిజం
ఒక్కోసారి భయపెడుతుంది నన్ను
పొద్దున లేచాక
ఎర్రని గులాబి పువ్వొకటి
కిటికీలోంచి అమాయకంగా పలకరిస్తుంది
భూగోళం లాంటి పసిపాప
నా గదిలో
తన నవ్వుల్ని వదిలేసి వెళ్ళిపోతుంది
నా కలల మీద
పరిమళాలను అద్దిందెవరని అడిగితే
కాలం ఇప్పటికీ
వేలెత్తి నిన్నే చూపిస్తుంది
బహుశా
ఎప్పుడో సారి ప్రేమించే వుంటాను నిన్ను
పిట్టలు
చెట్టును ప్రేమించినట్టు
నదులు
సముద్రాన్ని ప్రేమించినట్టు
రాత్రులు
చీకటిని ప్రేమించినట్టు.