పొద్దువాలే పూట

పొద్దున్ననగా వెళ్ళిన పిట్ట
పొద్దు వాలే వేళకూ తిరిగి రాదు.
గూటిలో మొదలైన అలజడి
క్షణాల్లో భూగోళాన్ని చుట్టేస్తుంది.
రాస్తూ రాస్తూ వదిలెళ్ళిన చిరునవ్వు కవిత
ఎత్తుగడ నుండీ కురిసిన
అందమైన ఉత్ప్రేక్ష చినుకులు
తడితడిగా మెరుస్తుంటాయి.

ఇన్నాళ్ళూ నన్ను చిత్రించుకుని మురిసిన
నుదురుగోడ మసకబారుతుంది.
నా గుండెపువ్వుపై చలాకీగా ఎగిరే
తూనీగల రెక్కలు ముడుచుకుంటాయి.
నాలోంచి ప్రవహించిన అక్షరాలన్నీ
నా ఛాయాచిత్రం ముందు చేరి
దీపాలై వెలుగుతుంటాయి.

వీధుల్లోనూ వాకిళ్ళ నిండా జనం చేరి
లోగొంతుకలతో
నన్ను తవ్విపోస్తుండడాన్ని చూస్తూ
రెండుగా చీలిపోతాను.
ప్రపంచానికి ఒకింత దూరంగా నిలబడిన నేను
ప్రపంచంతో చిట్టచివరిగా సంభాషించే
నేనుని
ఎలా కవిత్వం చేయాలా అని చూస్తుంటాను.

ఉన్నట్టుండి గుంపులోంచి ఎవరో ఒకరు
ఒక ఆర్ద్రమైన పాటపైకి నన్ను చేర్చి
మోసుకుపోతుంటారు.
ఇన్నేళ్ళ నా ప్రస్థానమంతా
ఆ పాటలో ఒదిగిపోతుంది.
ఎవరైనా చివరికి ఒక పాట కావాల్సిందేనేమో!

నా ప్రస్థానగీతాన్ని పొదివిపట్టుకుని
శూన్యంలోకి నడక ఆరంభిస్తాను.
సంవేదనల్లేని సమయాల్లేని
సాపేక్షాల్లేని ఒకానొక నిశ్చలత్వం
నాలోకి ప్రవేశించి తలుపులు మూసేస్తుంది.

సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...