మాగాడి చుట్టూ కొంగల ఈకలు రాలినట్టు
పళ్ళెం చుట్టూ మెతుకులు
ఆటలకి పరుగుతీస్తూ సగం కలిపి
వదిలిన పాలబువ్వ
‘పళ్ళెం చుట్టూ కళ్ళమే’
అని అరిసే అమ్మ గొంతు
కొత్తగా పండక్కి అలికిన పేడమట్టి కమ్మని వాసన
గుడిసె చూరుకి వేలాడుతున్న ఎండ
మట్టిదుమ్ము అరిచేతుల నిండా అద్దుకొని
గురి చూసి కొట్టిన గోళీకాయ కేరింత
గాలిని మేస్తూ మబ్బుల పరుగు
రెక్కలతో ఎండని విసురుతూ పచ్చుల పయానం
జంగిడి గొడ్లు అడివికి బోయిన బాటంతా
గిట్టల జాడలు
పేడకల్ల తాంబేళ్ళ గుంపు
బర్రెపెండ మీద కుచ్చిన రాయి
నెత్తిన పొదిగిన ఉంగరం
ఒంటి చుట్టూతా నీడని పెనేసుకున్న చెట్లు
పగలంతా గోలీలాటలో కాలానికి దుమ్ము పూసి
మట్టి పులుముకొని వెళ్ళి
ఇంటిముందు వాలగానే అమ్మ చివాట్లు
బెరుకు బెరుగ్గా గడపలోకి చేరి
మంచం మీద ముడుక్కుంటే
అప్పటిదాకా తిట్టిన అమ్మ
బతిమిలాడి ఒళ్ళో కూచ్చోబెట్టుకొని
కొసరి కొసరి తినిపించిన బువ్వ
అప్పుడు బుగ్గ మీద అమ్మ పెట్టిన ముద్దు
ఒళ్ళంతా చక్కిలిగింతలు పుట్టిన కులుకు
కాసేపు పక్కమీద కన్నుకొరికి
కునుకు తీరి ఇంటి ముందు
దడి పక్కన నిలబడగానే
కుంకుమ చల్లుకున్న పుల్లెద్దులాగా
గుడిసెనకమాల కొట్టంలోకి చొరబడుతూ సూర్యుడు
బజాట్లో ఊతకర్ర నేల పొడుస్తూ
అడుగులు లెక్కపెడుతూ
చెట్టు కొమ్మలంతున్న
బుర్ర మీసాల సందున
చిరునవ్వు పిట్టల్ని ఎగరేస్తూ
వెళుతుండే ముతక తాత
దిబ్బలో ఎండిన పెంటకుప్పల్ని
గెలిగిస్తూ కోళ్ళ గుంపు
మర్నాడు పండక్కి పళ్ళెంలో
పొగలుకక్కే రాగిసంగటి ముద్దల మజ్జ
చియ్య ముక్కల రుచివిందు
నీళ్ళతొట్టి కాడ జాలాడమ్మటి
బండ మీద అంట్లు తోముతూ గాజుల చేతులకి
బూడిద పూసుకున్న అమ్మ
తూరుపు ముంగిట్లో ఎడ్డకొండ ఎనకమాల
తొంగిచూస్తున్న పున్నమినాటి జీరంగిగుడ్డు చంద్రుడు
సావిటి కాడ మసీదులో అల్లాని పిలుస్తున్న గొంతు
ఎద్దుల కాడి మీద గడ్డిమోపు కట్టుకొని అరక తోలుకుంటూ వస్తున్న నాన్న
పైన నింగిలో సగం చీకటి సగం వెలుతురు నిండుకొని ఉంది
బతుకులోని తీపి చేదుల్లాగా
ఊరంతా ఇప్పుడు నలుపూ తెలుపుల గచ్చకాయలా ఉంది