తలుపుల్లేని ఇల్లు

1.

నేనే జ్ఞాపకాల్ని మాలకట్టేవాడినో
నన్నే జ్ఞాపకాలు ఓ మాలగాకట్టేవో తెలీదు
జ్ఞాపకాలతో అల్లుకున్న అక్షరమాలల్ని
మెడలోవేసుకు సాగిపోయేవాడిని
అప్పుడదే ప్రపంచం.
సీతాకోకల రెక్కలమీద
రంగురంగుల చుక్కల్లాంటి అక్షరాలతోనే
నా ప్రయాణం!

2.

నేనే తలుపులు తెరిచి నిలబడ్డానో
లేక అవే తలుపులు నెట్టుకుని
నాలోకి జొరబడ్డాయో
నా వేకువలోకి వాలిన ఎర్రని మేఘాలు
నా లోపల హోరెత్తుతున్న కెరటాలు
అవి ఏ శోకతప్తమైన కంటిజీరలో
ఏ యుద్ధసన్నాహాల నినాదాలో
అలలు అలలుగా నేను ఎగసిపడుతున్న రొద
తీగలు తీగలుగా నేను సాగిపోతున్న భావన
నాతోటలో ఇప్పుడేవేవో రెక్కలు తెగిన పక్షుల దీనాలాపన!

3.

నేనే వెతుక్కుంటున్నానో
అవే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయో
నాచుట్టూ నల్లని అక్షరాల పోగులు
ఏ పోగును తాకినా ఏదో తడి
ఏ అక్షరాన్ని ముట్టుకున్నా ఏదో ఆర్తనాదం!

4.

నేనే ఒక పొడుగుగీతను గీసుకున్నానో
లేక ఎవరో నాప్రక్కనొక పొట్టిగీతను గీశారో
మొత్తానికి నేనో సరళరేఖనయ్యాను
తలెత్తి చూస్తే
నిండానీళ్ళతో బరువైన ఆకాశం
తలప్రక్కకు తిప్పితే
గుంపులు గుంపులుగా మనుషులు
నగ్నంగా!

5.

ఈ కన్నీటిదీవి ఇప్పుడు
నా వాస్తవికత
ఈ దుఃఖసముద్రం
నా సహచరి
ఆ ఎడారులు
ఆ పక్షుల్లేని అరణ్యాలు
ఈ తలుపుల్లేని ఇల్లూ
ఇప్పుడిదే నా ప్రపంచం

నా కళ్ళ మీద
ఇప్పుడొక కొత్త వాక్యం.

సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...