మొత్తంగా తనను తాను
అక్షరాల్లో కుప్పబోశాడు
ఎక్కడ ముట్టుకున్నా
వదిలివెళ్ళిన ఆఖరిచూపో
రగిలి రగిలి బూడిదైన గుండెనో
రెప్పల చివర మిగిలిన కలో చేతులకు తగులుతుంది
ఎన్ని వసంతాల్ని
మరెన్ని అందమైన హేమంత రాత్రుల్ని
కోల్పోయాడో కానీ
కోల్పోయింది ఇదీ అని విడమరిచి చెప్పే
జాలిచూపుల్ని కోరుకోలేదు
వాక్యం వాక్యంలో
నదుల్ని నింపి వెళ్ళాడు
చేతుల్లో రెండు కళ్ళనూ పట్టుకుని
ఎన్ని బీడుభూముల్లో సంచరించాడో
కాగితం మీద మాత్రం
ఆకుపచ్చని బొమ్మలుగా గీసి వెళ్ళాడు
ఎన్ని నక్షత్రాలను పోగొట్టుకున్న
ఆకాశపు దుఃఖమో
అతడు
ఎన్ని తీరాల దుఃఖాల్ని మోస్తూ కూడా
పెదవి విప్పని సముద్రమో అతడు
తోవ తోవలో
ముళ్ళు మాత్రమే గుచ్చుకుని
రక్తమోడిన పాదాలు అతడు
లేకుంటే ఇలా
ఏ పదాన్ని కదిపినా పచ్చివాసన వేసేది కాదు
అతడ్ని కవీ అని పిలిచి
చేతుల్ని దులుపుకోవడం ఏం మర్యాద?
కవిత్వం అని కదా పిలవాల్సింది.