చెట్టు నీడలో ఇల్లు

ఇల్లును నాటిన ఏడాదికి
ఇంటిపక్క ఖాళీలో
ఒక పసుపు పూల చెట్టును నాటాను
ఇంటి నీడ చుట్టూ చెట్టు అల్లుకుంది

అది తొలిసారి పూత పూసినప్పుడు
ఇంటి ఆడబిడ్డ నీళ్ళాడినంత సంబరం

ఐదు తుఫాన్లను చూసిందది
రోజు వారీ గాయాలకైతే లెక్కేలేదు

ఆఖరిసారి తుపానుకు
వేళ్ళతో సహా ఒరిగిపోయినప్పుడు
నా లోపలంతా అమ్మను పోగొట్టుకున్నప్పటి దుఃఖం

మిగిల్చే శూన్యాలను లెక్కగడితే
కూలిన మనిషీ
విరిగిన చెట్టూ రెండూ ఒక్కటే

మనిషి సంగతేమో కానీ
నేల ప్రతి ప్రార్థనా వింటుంది
ఎక్కడినుంచి చేదుకుందో పచ్చదనాన్ని
చిగురై కళ్ళు తెరిచింది
మళ్ళీ ఆకాశం మీద కాలు పెట్టింది

నా ఇంటిని తలచుకుంటే గర్వంగా వుంటుంది
ఇంటి నీడలో చెట్టున్నందుకు కాదు
చెట్టు నీడలో ఇల్లున్నందుకు.


సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...