నీ కొడుకొక్కడే పాండవుల్ని తన బాణధారల్లో ముంచెత్తుతున్నాడు. అప్పుడతని యుద్ధం చూస్తున్న నాకు రెండు సైన్యాల్లోనూ అతనికి సమానుల్లేరనిపించింది. పాండవపక్షం దొరలంతా అతనితో తలపడ్డారు. ఐనా ఎవర్నీ లెక్కచెయ్యకుండా అందరికీ అన్ని రూపులై సమరం సాగించాడతను. అదిచూసి ఉత్సాహం తెచ్చుకుని మన సైన్యాలు అతనికి సాయంగా వెళ్ళి శత్రువుల్ని ఢీకొన్నయ్.
భీముడు, అశ్వత్థామ ఒకవంక ఒకరికొకరు పోటీగా యుద్ధం చేస్తున్నారు. సౌబలుడు (శకుని) ధర్మరాజు నెదిరించి నాలుగు బాణాల్తో అతని గుర్రాల్ని చంపాడు. సహదేవుడు అన్నని తన రథం మీద ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్ళాడు. ధర్మరాజు మరో రథాన్ని సమకూర్చుకుని వేగంగా తిరిగొచ్చి సౌబలుణ్ణి తాకాడు. వాళ్ళిద్దరి మధ్యా పోరు ఘోరమైంది. శకుని కొడుకు నకులుడితో, సాత్యకి కృతవర్మతో, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో యుద్ధం సాగించారు. ఇలా అన్నిచోట్లా భయంకరంగా పోరు కొనసాగింది. చివరికి మనమొనలో దొరలు శత్రువుల దెబ్బకి నిలబడలేక వెనక్కి తిరిగితే దుర్యోధనుడు వాళ్ళందర్నీ కూడగట్టి శత్రువులమీదికి ఉసిగొలిపితే ధర్మరాజు కోపంగా మూడు బాణాల్తో కృపుడి వింటినారిని తెంచి నాలుగు బాణాల్తో కృతవర్మ గుర్రాల్ని కూల్చితే అశ్వత్థామ అతన్ని తన రథం మీద పక్కకి తీసుకుపోయాడు. దుర్యోధనుడికి మండిపోయింది, ఏడువందల రథాల్ని ధర్మరాజు మీదికి పంపాడు. వాళ్ళతన్ని చుట్టుముట్టి బాణాలు కురిపిస్తుంటే శిఖండి మొదలైన యోధులు వచ్చి వాళ్ళని చెల్లాచెదురు చేశారు.
అప్పుడు శకుని మన యోధుల్తో “మీరు ధర్మరాజుని వదలకుండా పోరాడుతూండండి, నేను వెనక నుంచి వచ్చి వాళ్ళని చంపుతా” అని బయల్దేరాడు. శల్యుడి సైన్యం ముందునుంచి దాడి చేసింది. ఐతే పాండవసేనల ధాటికి ఆగలేక వెనక్కి తగ్గింది. ఇంతలో శకుని పదివేల ఆశ్వికసైన్యంతో శత్రుసైన్యం వెనకభాగాన్నుంచి ముట్టడించాడు. అది చూసి మనసైన్యం ఉత్సాహంగా పోరాడింది. ధర్మరాజు సహదేవుణ్ణి ఐదువేల ఆశ్వికుల్తో, ద్రౌపదేయుల్ని తీసుకుని వెంటనే వెళ్ళి శకునిని ఎదిరించమని పంపాడు. సహదేవుడలాగే వెళ్ళి శకునితో తలపడ్డాడు. రెండు ఆశ్వికసేనలకీ భీకరరణం జరిగింది. సహదేవుడి ప్రతాపానికి శకుని నాలుగువేల మందిని పోగొట్టుకుని ఆరువేల బలగంతో వెనక్కి తిరగాల్సొచ్చింది. చావగా మిగిలిన మూడువేల బలంతో సహదేవుడు అన్న దగ్గరికి తిరిగి చేరుకున్నాడు.
చుట్టు తిరిగొచ్చి శకుని ధృష్టద్యుమ్నుడి సైన్యం మీద దాడిచేశాడు. ఐతే ధృష్టద్యుమ్నుడా హయసేనని చించిచెండాడాడు. అతని దెబ్బకి ఐదువేల మూడొందల గుర్రాలు చచ్చినయ్. ఐనా శకుని శక్తికొద్దీ పోరాడాడు. చివరికి కేవలం వందమంది ఆశ్వికులు మిగిల్తే వాళ్ళతో అక్కణ్ణుంచి పక్కకి తొలిగాడు శకుని.
దుర్యోధనుడి కోసం చూస్తే అతను కనిపించలేదు. ఎటు వెళ్ళాడని శకుని చుట్టుపక్కల వాళ్ళనడిగితే వాళ్ళతనికి దూరంగా ధవళవర్ణ రథాన్ని చూపించి అది దుర్యోధనుడిదని చెప్పారు. అతను వెంటనే అక్కడికి వెళ్ళి దుర్యోధనుణ్ణి కలిసి “శత్రువుల గుర్రాల్ని నేను నాశనం చేశా, ఇక రథాల పని పట్టాల్సుంది. రథాలు, ఏనుగులు పోతేగాని కాల్బలాన్ని ఊచకోత కొయ్యలేం, పాండవుల్ని జయించలేం” అని చెప్పాడు. అది విని మన సైన్యం ఆనందించింది. దుర్యోధనుడు ఉత్సాహంగా శత్రువుల మీదికి బయల్దేరాడు.
కృష్ణార్జునులది చూశారు. అర్జునుడు కృష్ణుడితో “ఆ దుర్యోధనుడికి ఎదురుగా మన రథాన్ని వేగంగా పోనివ్వు, ఆ సైన్యం అంతు చూద్దాం. యుద్ధం మొదలైనప్పుడు సముద్రంలా కనపడ్డ వాళ్ళ సైన్యం ఇప్పుడు చూశావా చిన్నగుంటలాగా ఉంది? వీళ్ళ బుద్ధికి బుద్ధుంటే ఇంత వినాశనాన్ని కొని తెచ్చుకుంటారా? భీష్ముడు పడినప్పుడైనా కళ్ళు తెరిచి సంధి మార్గానికొస్తారనుకున్నా. ఆయన కూడ ఎంతగానో చెప్పి చూశాడు. ఆ మాటలు విననప్పుడు గాని నాకర్థం కాలేదు దుర్యోధనాదులు బుద్ధిహీనులని. మరెవరైనా ఐతే భీష్ముడు పడ్డాక పరిస్థితి అర్థం చేసుకోకుండా వుంటారా? మత్తగజంతో సహా సోమదత్తుడు చచ్చినప్పుడు, సైంధవుణ్ణి రక్షించబోయి ఎంతోమంది రాజులు బలైనప్పుడు, ద్రోణాచార్యుడు ప్రాణాలు విడిచినప్పుడు కూడ ఆవగింజంతైనా ఆలోచించలేదే, ఇలాటి మూర్ఖులు కూడ ఉంటారా? దుశ్శాసనుడు మొదలైన అనేకమంది తమ్ముళ్ళు పోయారు, కొడుకులు చుట్టాల్తో కలిసి కర్ణుడు కాటికి పోయాడు – ఇవేవీ చూడలేదా ఈ దుర్యోధనుడు? వీడు బతికుండగా ధర్మరాజుకి రాజ్యం రాదని తేలిపోయింది. కనక ఇప్పుడు మన కర్తవ్యం దుర్యోధనుణ్ణి చంపటం” అని వివరించాడు.
అందుకు అంగీకరిస్తూ కృష్ణుడు “ఔను, నేను సంధికి వెళ్ళినప్పుడు విదురుడు కూడ, దుర్యోధనుడు బుద్ధిహీనుడు, తన బొందిలో ప్రాణం వుండగా పాండవులకి రాజ్యాన్నివ్వడని చెప్పాడు. నిజానికి వాడు పుట్టినప్పుడే మునులు ఈ పాపాత్ముడి వల్ల క్షత్రియలోకం అంతా నాశనం ఔతుందని జోస్యం చెప్పారు కదా” అన్నాడతనితో. అర్జునుడు “వాళ్ళ మాటలే నిజమయినయ్. వీడిప్పటికి అందర్నీ చంపించాడు, ఇక తనూ చస్తే తప్ప ధర్మరాజుకి రాజ్యం రాదు, అది నిశ్చయం. త్వరగా ఆ దిక్కుకి పోదాం పద, ఆ దుర్నీతిపరుడు చూస్తుండగానే వాడి దుర్బలమైన సేనని తుదముట్టిస్తా చూడు” అని కార్చిచ్చు లాగా కౌరవసేనా వనంలోకి ప్రవేశించాడు అర్జునుడు. అతని భీకర బాణాలు మన సేనల్ని కాలుస్తుంటే నిలవలేక కాలికి బుద్ధి చెప్పినయ్. నీ కొడుకొక్కడే స్థిరంగా నిలబడి అందర్నీ పిలిచి కూడగట్టి పాండవబలాల మీదికి ఉసిగొల్పాడు.
ధృష్టద్యుమ్నుడు, శిఖండి, శతానీకుడు వాళ్ళనెదుర్కుని శరపరంపరల్లో ముంచెత్తారు. దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడి వక్షాన అనేక బాణాలు నాటితే అతను కోపంతో దుర్యోధనుడి గుర్రాల్ని, సారథిని చంపాడు. దుర్యోధనుడు తటాల్న రథం దిగి ఒక గుర్రాన్నెక్కాడు. ఎక్కి పక్కకెళ్ళి ఏనుగుల గుంపుల్ని పాండవుల మీదికి పంపాడు. అవి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టినయ్. అర్జునుడు ఘోరనారాచ ధారల్తో వాటిని చెల్లాచెదురు చేస్తుంటే భీముడు తన గదాదండంతో కిందికి దూకి ఏనుగుల తుండాలు తునకలు చేస్తూ కుంభాలు నుజ్జు చేస్తూ వీరవిహారం సాగించాడు. మరోపక్క నుంచి పాండవసైన్యం మీదికి దూకుతున్న ఏనుగుల్ని ఆపటానికి ధర్మజ, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు మొదలైన యోధులు అటు పరిగెత్తారు.
ఇంతలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ రథికుల మధ్య దుర్యోధనుడు కనిపించక యుద్ధంలో మరణించాడేమోనని అనుమానిస్తూ అక్కడున్న వాళ్ళనడిగితే కొందరతను శకుని దగ్గర వున్నాడన్నారు, ఇంకొందరు కంగారెందుకు, బతికుంటే తర్వాత కనపడతాడుగా, ఇప్పుడు మనం యుద్ధం చెయ్యటం ముఖ్యం అని శత్రువుల్తో పోరాటంలో మునిగిపోయారు. ఆ ముగ్గురు రథికులు శకుని వున్న చోటికి బయల్దేరారు.
ఇలా రక్షించే వాళ్ళెవరూ లేని ఆ సైన్య భాగాన్ని పాంచాల వీరులు చుట్టుముట్టి మట్టుబెట్టారు. అప్పుడు అక్కడే వున్న నేను ధృష్టద్యుమ్నుడికి చిక్కకుండా తప్పించుకున్నా గాని అంతలో నాలుగొందల రథాల్తో అటే వచ్చిన సాత్యకి చేతికి దొరికిపోయా.
ఇంతలో ఏనుగుల్ని మోదటం ముగించి భీముడు కనపడితే నీ కొడుకులు దుర్విషహుడు, దుష్ప్రదర్శనుడు, ఇంకా కొంతమంది కలిసి అతనితో తలపడ్డారు. అతను రథం ఎక్కి భల్లాలు, నారాచాల్తో వాళ్ళలో చాలామందిని చంపాడు. అదిచూసి చావగా మిగిలిన నీ బలాలు శోకంతో, క్రోధంతో అతన్ని చుట్టుముట్టినయ్. ఐతే అతను అవలీలగా ఐదొందల రథాల్ని, నూటడెబ్భై ఏనుగుల్ని, ఎనిమిదొందల గుర్రాల్ని పదివేల పదాతుల్ని అప్పటికప్పుడు తన బాణాలకి బలిచేశాడు. మిగిలిన మన బలాలు బిక్కచచ్చి అతని వైపు చూడటానిక్కూడా సాహసించలేకపోయినయ్. నీ కొడుకుల్లో కేవలం దుర్యోధనుడు, సుదర్శనుడు మాత్రం మిగిలారు. అలా అంతమందిని చంపి ఆనందంగా మదాతిరేకంతో భీముడు మల్లచరిస్తే మనవాళ్ళంతా నిర్ఘాంతపోయి నిలబడ్డారు తప్ప కాలు కదపలేదు.
కృష్ణుడు అర్జునుడితో “శత్రువులు దాదాపుగా నశించినట్టే. నీ ప్రతాపం వల్ల నీ సోదరులంతా క్షేమంగా వున్నారు. సాత్యకి సంజయుణ్ణి పట్టి తెచ్చాడు. ధృష్టద్యుమ్నుడు ఆరోగ్యంగా వున్నాడు. శత్రుపక్షాన ఇక మిగిలింది ఆ ఎదురుగా కనపడే గుర్రాల దండు. దాని మధ్య బిక్కుబిక్కుమంటూ నివురుగప్పిన నిప్పులా దుర్యోధనుడు, అతనితో ఒక్క తమ్ముడు. ఈ చిన్నసేన పనిపూర్తి చెయ్యటం నీకో లెక్కలోది కాదు. పద, దుర్యోధనుణ్ణి పరలోకాలకి పంపుదువు గాని” అని ప్రోత్సహించాడు. “ఇదీ ఒక సైన్యమేనా? రెండొందల రథాలు, వంద ఏనుగులు, రెండువేల పదాతులు. శకునితో ఐదొందల గుర్రాలు. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ కాపుండి నిలబెడితే వుంది గాని నా బాణాల దెబ్బలు తగులుతుంటే ఎంతసేపుంటుందీ సైన్యం? సగం మంది చస్తే మిగతా సగం వెనక్కి చూడకుండా పారిపోతారు. అప్పుడిక దుర్యోధనుడు బయటపడక తప్పదు. ఎదిరించాడా నా బాణాలకి ఆహుతౌతాడు. ఈ పూటతో ఈ యుద్ధం సమాప్తం కాబోతుంది” అన్నాడు అర్జునుడు ఆవేశంగా.
దుర్యోధనుడి కెదురుగా కదిలింది అర్జునుడి రథం. అది చూసి భీముడు, సహదేవుడు ఆ దిక్కుగా వేగంగా వచ్చారు. వాళ్ళనెదిరించటానికి శకుని సిద్ధమయాడు. అందరికీ తీవ్రావేశాలు కమ్ముకున్నయ్. శకుని, సుశర్ముడు అర్జునుణ్ణి ఎదుర్కున్నారు. సుదర్శనుడు భీముడితో, దుర్యోధనుడు సహదేవుడితో తలపడ్డారు. సహదేవుడు పదునైన బాణాలేసి దుర్యోధనుడు తూలేట్టు చేశాడు. దుర్యోధనుడు సహదేవుడి నుదుట బలంగా కొట్టాడు. అతను తూలి పడబోయి నిలదొక్కుకుని దుర్యోధనుడి మీద బాణాలు కురిపించాడు.
గాంధారదేశపు గుర్రం రౌతులు అర్జునుణ్ణి చుట్టుముట్టారు. శక్తుల్ని, తోమరాల్ని అతని మీద విసిరారు. ఐతే అతను క్రూరభల్లాల్తో వాళ్ళ శిరసుల్ని పుచ్చకాయల్లా దొర్లించాడు. గాంధారబలాల చావుతో త్రిగర్తదేశపు రౌతులతన్ని కమ్ముకున్నారు. వాళ్ళలో సత్యకర్ముడి తలని తళతళలాడే కుండలకాంతుల్తో నేలమీద పొర్లించాడు అర్జునుడు. అలాగే సత్యేషుణ్ణీ క్షణంలో పైకి సాగనంపాడు. ఇంతలో సుశర్మ కనిపించాడు. ఇన్నాళ్ళూ తనని తిప్పలు పెట్టిన అతని మీద వేడివేడి చూపులు రగులుస్తూ మూడు బాణాలతని ఒంటికి నాటాడు. దాంతో సుశర్మ సైన్యంలో రథికులంతా ఒక్కసారిగా అతన్ని కమ్ముకున్నారు. అతను వాళ్ళని చిటికలో చిందరవందర చేసి ఒక ఘోరభల్లంతో వాడి రొమ్ము చీల్చి ప్రాణాలు తీశాడు. అతని కొడుకులు ఏడుగుర్ని ఒక వరసన, ఎనిమిది మందిని ఇంకో వరసన, ముప్పై మందిని మరో వరసన తలలు నరికి తండ్రితో పాటు ప్రయాణం కట్టించాడు. ఇక మిగిలిన త్రిగర్త సైన్యం తలా ఓ దిక్కు పరిగెత్తింది.
భీముడి బారిన పడ్డ సుదర్శనుడు ఎక్కువసేపు బతకలేదు. అతని బలాలు భీముణ్ణి చుట్టుముడితే అతను బలమైన బాణాల్తో వాటిని చంపి చెల్లాచెదురు చేశాడు. అదిచూసి సహించలేక దుర్యోధనుడి ముందున్న సైన్యం పాండవబలాల మీదికి దూకింది. శకుని సహదేవుడితో తలపడ్డాడు. శకుని కొడుకు ఉలూకుడతనికి తోడుగా నిలబడ్డాడు. చిన్నతమ్ముడికి తోడుగా భీముడు వచ్చాడు. శకుని మూడు భల్లాల్తో సహదేవుణ్ణి పొడిచి పదినారాచాలు అతని శరీరానికి గుచ్చితే మండిపడి భీముడు, సహదేవుడు భీభత్సంగా శకుని సైన్యాన్ని చించిచెండాడారు. శకుని ఆశ్వికదళం సమూలంగా నాశనమైంది. ఐనా వెనక్కి తగ్గకుండా శకుని మూడుమొనల చిన్న ఈటెని బలంగా విసిరితే ఆ దెబ్బకి సహదేవుడు రథం మీద మూర్ఛపడ్డాడు. భీముడు వీరావేశంతో మన సేన మీద పడ్డాడు. అతని ధాటికి నిలవలేక మన సైన్యం పారిపోతుంటే దుర్యోధనుడు అందర్నీ గట్టిగా అరిచి పిల్చి నిలబెట్టాడు. ఒక రథాన్నెక్కి శకునిని కలిసి అంతా కలిసి పాండవ సేన మీద దాడి చేశారు.
పాండవ సేనలు వాళ్ళ మీద తిరగబడినయ్. ఇంతలో సహదేవుడు కూడ తెలివొచ్చి లేచి పదిబాణాల్తో శకునిని కొట్టి అతని విల్లు విరిచాడు. అతనింకో విల్లు తీసుకునేంతలో భీముడు, నకులుడు అతని మీద బాణాలేస్తుంటే శకుని కొడుకు ఉలూకుడు వాళ్ళనడ్డుకున్నాడు. ఇలా తండ్రీ కొడుకులు పోరాడుతుంటే భీముడు ఉలూకుణ్ణి అనేక బాణాల్తో కొట్టి శకునికి అరవై బాణాలు నాటించి అతని అనుచరుల్ని చెల్లాచెదురు చేశాడు. కోపంతో ఉలూకుడు సహదేవుణ్ణి బాణవర్షంలో ముంచాడు. అతను మహాకోపంతో ఒక భల్లాన వాడి తల నరికాడు. కొడుకు చావు చూసి శకుని కళ్ళ నీళ్ళు కుక్కుకున్నాడు. అప్పుడతనికి విదురుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినయ్. పెద్ద నిట్టూర్పు విడిచి సహదేవుడి మీద మూడు నారాచాలేశాడు. సహదేవుడు వాటిని మధ్యలో విరిచి అతని విల్లు తుంచాడు. శకుని కత్తితో కలిసిన ఇనపసమ్మెటని సహదేవుడి మీద విసిరాడు. దాన్ని కూడ అతను అనేకబాణాల్తో మధ్యలోనే నరికాడు. అదిచూసి శకుని పక్కనున్న వాళ్ళు పారిపోయారు. వాళ్ళని చూసి అతను కూడ దూరంగా పారిపోయాడు. దుర్యోధనుడు దీనుడయ్యాడు.