శ్మశానవాటి (పేరడీ)

(శ్మశానాన్ని గురించిన జాషువా గారి పద్యాలు చాలా ప్రఖ్యాతమైనవి. ఎంతో గొప్ప భావాల్ని పొదువుకున్నవి. వాటికి పేరడీగా ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లో జరుగుతున్న ఒడుదుడుకుల గురించి రాసినవి ఈ పద్యాలు. పాఠకుల అనుకూలత కోసం ముందుగా జాషువా గారి పద్యాన్నిచ్చి తర్వాత దాని పేరడీని ఇస్తున్నా.)

ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్‌
కన్నుల్‌ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్‌ లేచి రాడక్కటా
ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్‌

ఎన్నో ఏండ్లు గడించి దాచినవి అన్నీ స్టాకు మార్కెట్టులో
నిన్నా మొన్నటి దెబ్బతో తరిగి తన్నేశాయి బాల్చీలనే
ఎన్నాళ్ళీ తలకిందులైన పయనం బేజీవు లల్లాడిరో
కన్నీళ్ళే గతిగా చితిన్‌ రగులు టెక్నా స్టాకులున్నందుకున్‌

ఆకాశంబున కారుమబ్బు గములాహారించె దెయ్యాలతో
ఘూకమ్ముల్‌ చెరలాడసాగినవి వ్యాఘోషించె నల్దిక్కులన్‌
కాకోలమ్ములు గుండె జల్లు మనుచున్నంగాని ఇక్కాటియం
దాకల్లాడిన జాడ లేదిచట సౌఖ్యంబెంత క్రీడించునో

స్టాకానందము పోయి నీరసము వేసారించె; మార్జిన్లలో
ఆకాశాన చరించు షేర్లు కొని అల్లాడేటి దౌర్భాగ్యులన్‌
ఘూకమ్ముల్‌ పరికించుచున్నయవి; వ్యాఘోషించె నల్దిక్కులన్‌
బ్రోకర్‌ కాకులు కర్కశ స్వర మహా భూతాల్‌ పిశాచాలుగా

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము నిప్పులలోన కరిగిపోయె
ఇచ్చోటనే భూములేలు రాజన్యుని
అధికార ముద్రిక లంతరించె
ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూ
సల సౌరు గంగలో కలిసిపోయె
ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికం గన్న
చిత్రలేఖకుని కుంచియ నశించె

ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణ దృక్కులొలయ
అవనిపాలించు భస్మ సింహాసనంబు

ఇచ్చోటనే బీటుబీ వీర స్టాకులు
నీలిగి గుట్టలై నేలరాలె
ఇచ్చోటనే మేటి హీరోలుగా ఉన్న
మైక్రొసాఫ్ట్‌ యాహూలు మట్టిగరిచె
ఇచ్చోటనే పట్టలేని ఇంటర్నెట్టు
ఐపీవొ మ్యాజిక్కు లంతరించె
ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికంగన్న
క్వాల్‌కాము పరువెల్ల కరిగిపోయె

ఇది శవాలకు నిలయమ్ము; కదలలేక
వెర్రి చూపులు చూసెడు విగతజీవ
బంధుమిత్రుల సత్రమ్ము; భ్రాంతి నుంచి
మేలుకోనట్టి వారికి మేలుకొలుపు