తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – ఆరో భాగం

అప్పటివరకు విన్న జనమేజయుడు ఉత్సాహంగా ఆ తర్వాత యుద్ధక్రమం ఎలా జరిగిందో చెప్పమని వైశంపాయన ఋషిని వేడుకున్నాడు. అతనిలా చెప్పాడు: కర్ణుడి చావుతో బిక్కచచ్చి మిగిలిన కొద్ది కౌరవసైన్యంతో దుర్యోధనుడు శిబిరానికి తిరిగెళ్ళాడు. శ్రేయోభిలాషుల ఓదార్పుతో తేరుకుని, శల్యుణ్ణి సేనాపతిగా చేసుకుని మర్నాటి యుద్ధానికి సిద్ధమయాడు. భీకర సమరం జరిగాక మధ్యాన్నానికి ధర్మరాజు చేతిలో శల్యుడు మరణించాడు. మిగిలిన కౌరవసైన్యం కూడ దాదాపు సమూలంగా నాశనమైంది. దాంతో దుర్యోధనుడి ధైర్యం నీరుగారింది. ఒంటరిగా రణరంగం విడిచి వెళ్ళి ఒక మడుగులో దాక్కున్నాడు. ఆ విషయం తెలిసిన పాండవులు, వాళ్ళ బలాలు వెళ్ళి చుట్టుముట్టి పిలిస్తే బయటికొచ్చి భీముడితో చాలాసేపు గదాయుద్ధం చేసి అతని దెబ్బకి తొడలు విరిగి పడ్డాడు. ఆ తర్వాత రాత్రివేళ అశ్వత్థామ కృపకృతవర్మలు తనకి తోడుగా పాండవ శిబిరాల్లో జొరబడి అక్కడ ఉన్న వాళ్ళందర్నీ హతమార్చాడు.

తిరిగి తెల్లవారాక సంజయుడు కురుక్షేత్రాన్నుంచి హస్తినకి వచ్చాడు.

అతని కళ్ళనుంచి నీళ్ళు ధారాపాతంగా కారుతున్నయ్. కాళ్ళు తడబడుతున్నయ్. ఆపలేని దుఃఖంతో, చేతులు పైకెత్తి ఏడుస్తూ ఎవరు కనిపించినా “రారాజిక మనకి లేడు, అందరికీ ఆనందం కలిగించిన వాడు చివరికి అన్యాయానికి బలయ్యాడు”అని ఆక్రోశిస్తూ నడిచి నడిచి ధృతరాష్ట్రుడి మందిరంలోకి వెళ్ళాడు. లోపలి కొలువులో ధృతరాష్ట్రుణ్ణి చూశాడు. అతని చుట్టూ గాంధారి, కోడళ్ళు, విదురుడు వున్నారు. అందరూ దీనంగా యుద్ధవార్తలు తలుచుకుని దుఃఖిస్తున్నారు. సంజయుడు బిగ్గరగా ఏడుస్తూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి తనెవరో చెప్పుకుని నమస్కరించి ఎలుగు రాచిన గొంతుతో “మహారాజా, శల్యుడు మరణించాడు, శకుని పరలోకాలకి పోయాడు, ఉలూకుడు అంతరించాడు. సంశప్తకులంతా యముడికి అతిథులయ్యారు. కాంభోజులు, యవనులు, పర్వతీయులు, మ్లేచ్ఛులు, అంతా గతించారు. నాలుగు దిక్కుల రాజులూ శవాలై పడ్డారు. నీ కొడుకులు, కర్ణుడి కొడుకులు నిష్క్రమించారు. భీముడి ప్రతిజ్ఞ తీరి రారాజు తొడలు విరిగి దుమ్మూ ధూళిలో కలిశాడు. వాళ్ళవైపు ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉత్తమౌజుడు, యుధామన్యుడు మొదలైన పాంచాలురంతా పరలోకాలకి పోయారు. మత్స్య, ప్రభద్రక బలాలన్నీ మట్టిగలిసినయ్. నీ మనవలు ప్రతివింధ్యుడు మొదలైన ద్రౌపదేయులైదుగురూ అస్తమించారు. పాండవసైన్యంలో ఏనుగులు, గుర్రాలు, భటులు ఒక్కరు మిగల్లేదు. కౌరవ శిబిరాల్లో గాని పాండవ శిబిరాల్లో గాని మగపురుగన్నది మచ్చుకైనా లేదు. మనవైపు అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ – ఈ ముగ్గురే ప్రాణాల్తో వున్నారు. వాళ్ళవైపు ఐదుగురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి, నీకొడుకు యుయుత్సుడు – ఈ ఎనిమిది మంది మాత్రం మిగిలారు. నీ కొడుకు కోసం పదకొండక్షౌహిణులు, అతన్ని చంపటానికి ఏడక్షౌహిణులు – మొత్తం పద్దెనిమిదక్షౌహిణుల సేనలు యుద్ధభూమికి బలయినయ్” అని చెప్పేసరికి ధృతరాష్ట్రుడు మూర్ఛపడ్డాడు. విదురుడు వివశుడై కిందపడ్డాడు. గాంధారి, మిగిలిన స్త్రీలు నేలమీద పడి ఏడ్చారు. చుట్టూ వున్న చుట్టాలు మొహాల్లో కళంతా పోయి నిశ్చేష్టులై నిలబడ్డారు.

సంజయుడు అనేక ప్రయత్నాల్తో అందర్నీ తెలివిలోకి తెచ్చాడు. ధృతరాష్ట్రుడికి శరీరమంతా ఒణుకొచ్చింది. నాలిక పిడచగట్టుకుపోయింది. అతిప్రయత్నం మీద విదురుడి వంకకి తిరిగి “కొడుకులంతా పోయారు, దిక్కూమొక్కూ లేనివాణ్ణయాను, తమ్ముడా నాకూ మీ వదినకీ ఇంక నువ్వేరా దిక్కు”అని బావురుమన్నాడు. మళ్ళీ మూర్ఛలో మునిగాడు. చల్లటి నీళ్ళు చల్లి, విసనకర్రల్తో విసిరి అతన్ని సేదదీర్చారు. కడవలో చిక్కిన మహాసర్పంలా బుసలుకొట్టాడు ధృతరాష్ట్రుడు. శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. అక్కడ వున్న వాళ్ళంతా గొల్లుమన్నారు. కాసేపటికి కోలుకుని విదురుడితో “నాయనా, వదిన్ని, కోడళ్ళని, చుట్టాల్ని వాళ్ళ వాళ్ళ నివాసాలకి పంపు”అని చెప్తే అతను ఒక్కొక్కర్ని ఓదార్చి తగిన వాహనాలు ఏర్పాటుచేసి ఇళ్ళకి పంపించాడు. అందరూ భోరుభోరున ఏడుస్తూ అక్కణ్ణుంచి కదిలారు.

ధృతరాష్ట్రుడు ఉసూరుమంటూ కూర్చున్నాడు. “ఇంక ఇప్పుడేమిటి గతి” అని వాపోయాడు. సంజయుణ్ణి చూసి “కొడుకులంతా కాటికిపోయారు కాని పాండవులైదుగురూ చెక్కుచెదరకుండా వున్నారంటే నా మనసు భగ్గున మండుతున్నది. ఇన్నాళ్ళూ వాళ్ళ మాటలు వినటమే కాని కొడుకుల్ని కంటితో చూసుకున్నది లేదు. ఇప్పుడిక ఆ మాటలు కూడ కరువైనయ్. భక్తితో కొలుచుకునే పెద్దకొడుకు లేడు. యుద్ధం మాట వచ్చినప్పుడు ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ మనవైపున్నారు, నాకు పాండవులొక లెక్కా అన్నాడు. కర్ణుడొక్కడు చాలు వాళ్ళందర్నీ కట్టగట్టి మట్టుబెట్టటానికన్నాడు. వాళ్ళంతా కాక బాహ్లికుడు, సోమదత్తుడు, భగదత్తుడు, శకుని, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, సైంధవుడు, విందానువిందులు – ఇంతమంది మనవైపున్నారు, గెలుపు తథ్యం అన్నాడు. నేనూ నిజమే అనుకున్నా. చివరికి పాండవులు మిగిలారు, మనవాళ్ళంతా మడిశారు. భీష్ముడు సామాన్యుడా? వీరసింహుడు. అంత మహాత్ముణ్ణి నక్కలాటి శిఖండిని అడ్డుపెట్టుకుని జయించాడు అర్జునుడు. యోధాగ్రేసరుడు ద్రోణాచార్యుడికి ఎందుకూ కొరగాని వాడి చేతిలో చావొచ్చిపడింది. వీరవిక్రముడు సైంధవుడు అనవసరంగా బలయ్యాడు. మహావీరులైన బాహ్లిక సోమదత్తుల్ని శత్రువులు అవలీలగా చంపారు. విధినేమనుకోవచ్చు? ఏనుగంతవాడు భూరిశ్రవుడు. ఎదురన్నది లేనివాడు భగదత్తుడు. ఇద్దరూ దూదిపింజల్లా ఎగిరిపోయారు.

శత్రుభయంకరుడు కర్ణుడు. ఐనా శత్రువుల్లో ఒక్కణ్ణి కూడ చంపలేకపోయాడు. లోకాలన్నీ చెప్పుకునే భుజవిక్రమం శల్యుడిది. ఏం సాధించింది? ఇంతమంది మహానుభావుల్నీ శత్రువులు తేలిగ్గా చంపేశారు. పాండవుల్ని చంపటానికి తనూ తన తమ్ముళ్ళూ చాలనుకున్నాడు, ఆ తమ్ముళ్ళందర్నీ ఊచకోత కోశారు, తనని తొడలు విరిచి కింద పడేశారు.

అంతా ఐపోయింది. నాకు మిగిలింది అడవులకి పోయి ఆకులూ అలములూ తినటం. ఇక్కడే వుంటే ఆ భీముడు రోజూ నన్ను సూటిపోటి మాటల్తో చంపుతాడు. దుర్యోధనుడి గురించి, దుశ్శాసనుడి గురించి పదేపదే చెప్పి నన్ను దెప్పిపొడుస్తాడు. నా బతుకు నిత్య చావౌతుంది. దుర్యోధనుడు మూర్ఖుడు, వీడివల్ల రాజలోకం అంతటికీ కీడు మూడుతుందని ఇదివరకే విదురుడు చెప్పాడు. బుర్రతక్కువ వాళ్ళు అతని మాట వినలేదు. దైవం నన్ను కూడ వాళ్ళ మాటలే వినేట్టు చేసింది. దానికి ఫలితం ఇప్పుడనుభవిస్తున్నా. ఏం అనుకుని ఏం లాభం?

కర్ణుడి చావు తర్వాత యుద్ధం ఎలా జరిగిందో చెప్పు. ఎవర్ని మనబలాలకి సేనాధిపతిగా నియమించారు? అర్జునుణ్ణెదుర్కుని అతనెలా నిలబడ్డాడు? అంతా వివరంగా చెప్పు నాకు”అని సంజయుణ్ణడిగాడు ధృతరాష్ట్రుడు.

సంజయుడు చివరిరోజు యుద్ధక్రమాన్ని వివరించటం ప్రారంభించాడు.

కర్ణుడు, అతనితో పాటు అనేకమంది శూరులు, రాజులు, చతురంగబలాలు సమసినయ్. మనసేనలు బాగా సన్నగిల్లినయ్. ఆ రోజు కలిగిన ఓటమిని తల్చుకుంటూ బాధగా వెనక్కితిరిగి శిబిరాలకేసి కదిలాడు దుర్యోధనుడు. మందిరానికి వెళ్ళకుండా బయటనే ఒక విశాల స్థలంలో బంధుమిత్రుల్తో కొలువుదీరాడు. అప్పుడు కృపాచార్యుడతనితో ఇలా అన్నాడు: “యుద్ధం రాజధర్మం, అది నువ్వు ఆచరిస్తున్నావ్, మంచిపనే. ఐతే నేను చెప్పే మాటలు కూడ విను. నచ్చితే ఆచరించు, కాదంటే మాను, నీ ఇష్టం.

యుద్ధం మొదలై పదిహేడు రోజులైంది. మనవైపు మహామహులు ఎందరో మరణించారు. మన సైన్యం అలిసిపోయి వుంది. అటువైపు కృష్ణుడి రక్షణలో ముఖ్యులంతా క్షేమంగా వున్నారు. అర్జునుడు అడ్డూ ఆపూ లేకుండా మనసేనల్ని రణభూమికి బలిస్తున్నాడు. ద్రోణుడు, కర్ణుడు మిగిలిన మహారథులం అంతా రక్షిస్తున్న సైంధవుణ్ణి అతను అవలీలగా చంపాడు, మానవమాత్రులకి సాధ్యమయ్యే పనేనా అది? అతని బలిమితో వాళ్ళ సైన్యం చీకూచింతా లేకుండా వుంది. ఇప్పుడు మిగిలున్న మనసైన్యాన్ని ఊచకోత కొయ్యటం అతనికి సులువు.

బలంగా వున్నప్పుడు యుద్ధం, బలం తగ్గినప్పుడు సంధి సరైన మార్గాలని పెద్దలు చెప్పారు. మనకిది సంధి సమయం. ఆత్మవినాశనం ఘోరపాపం. బతికుంటే అన్ని రకాల శుభాలూ పొందొచ్చు. అవసరమైంది చేసి తన్ని తను రక్షించుకోవాలి ముందు.

సంధి చేసుకో. ధర్మరాజు ఎలాగూ ధృతరాష్ట్రుడికీ, నీకూ రాజ్యభాగాలిస్తాడు. కృష్ణుడు కూడ కాదనడు. వాళ్ళిద్దరి మాట మిగిలిన పాండవులు జవదాటరు. నీ మంచి కోరే చెప్తున్నా, నా ప్రాణాలు కాచుకోవటానికి కాదు.”

అంతా విని దుర్యోధనుడొక పెద్ద నిట్టూర్పు విడిచాడు. కళ్ళు మూసుకుని కొంతసేపు ఆలోచించాడు. అతని వైపు తిరిగి “నువ్వు చెప్పిందంతా నా మంచి కోసమే. కాని అది నాకు హితం కాదు. ఎందుకంటే, ఇంతగడిచాక ఇప్పుడు సంధి అంటే భీముడు నా మీద తన ప్రతిజ్ఞ చెల్లిస్తాడని భయపడి అలా చేశాననుకుంటారంతా. పైగా ఇంతకాలం ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించి సామంతులందరి సేవలందుకున్న నేను ఎవడో దయ తలిచి ఇచ్చే రాజ్యం తీసుకోవాలా? ఇప్పటికి మించిపోయిందేమీ లేదు, మనందరం కలిసి విక్రమిస్తే పాండవుల్ని ఓడించటం కష్టం కాదు. నీ మాట వినలేదని బాధ వద్దు. రణమే మనకి శరణం” అని తెగేసి చెప్పాడు దుర్యోధనుడు. చుట్టూ వున్న రాజులంతా అతన్ని మెచ్చుకుని మరుసటి రోజు యుద్ధంలో పరాక్రమించటానికి ఉవ్విళ్ళూరారు.

అప్పుడు కృప, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, శల్యులు కూడబలుక్కుని దుర్యోధనుడితో “ఈ రాత్రి మనం ఇక్కడుండటం మంచిది కాదు, కర్ణుడు లేడని ధైర్యంతో శత్రువులు రాత్రికి రాత్రి మన మీద పడొచ్చు. చతురంగబలాల్తో దూరంగా వెళ్ళి వుండి వాళ్ళు ఊహించని దిక్కునుంచి రేపు దాడి చేద్దాం, అలా మనం విజయం పొందొచ్చు”అని చెప్తే అతను అలాగేనన్నాడు. అక్కడికి రెండామడల దూరంలో సరస్వతీ నది ఒడ్డున బలాల్ని మోహరించి, అంతా నదిలో హాయిగా స్నానాలు చేసి వెంట తెచ్చుకున్న ఆహారాలు భోంచేసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సేనాపతిగా ఒకరిని నియమించమని దుర్యోధనుణ్ణి కోరారు. అతను తన మిత్రుడైన అశ్వత్థామని సలహా అడిగితే అతను “యుద్ధనైపుణ్యంలో, శౌర్యంలో, భుజబలంలో, పరాక్రమంలో, ధైర్యసంపదలో శల్యుడు తనకి తనే సాటి. తన మేనల్లుళ్ళు పాండవుల్ని కాదని నీతో చేరిన అతని కన్న నీకు దగ్గరి వాళ్ళు ఇంకెవరు? శల్యుణ్ణి సర్వసేనాపతిని చెయ్యి”అని చెప్పాడు. దుర్యోధనుడు సింహాసనం దిగి వినయంగా శల్యుడితో “నిజమైన స్నేహితుడివి నువ్వు. నా సైన్యానికి అధిపతివై మమ్మల్నందర్నీ గట్టెక్కించు, పాండవుల్ని మట్టుబెట్టు. నువ్వు ముందుంటే మేమంతా నీ వెనక నడుస్తాం” అని ప్రార్థించాడు. శల్యుడు ఎంతగానో ఆనందించాడు. “నేను నీ వైపుకి వచ్చినప్పుడే నా ధనం, ప్రాణం, సైన్యం నీ వశమైనయ్, ఇప్పుడింతగా ప్రాధేయపడాలా? తప్పకుండా నీ సైన్యాన్ని రక్షిస్తా. నాకు కృష్ణార్జునులు ఓ లెక్కకాదు. నా బాణపరంపరల్తో పాండవబలాల్ని చీకాకు పరిచి భీష్మ, ద్రోణ, కర్ణుల్ని మించి విక్రమిస్తా. దేవతలంతా నన్ను పొగిడేట్టు చేస్తా, చూడు” అని చెప్తే నీకొడుకు సుప్రీతుడయాడు.

కనక కలశాల్లో సరస్వతీ జలాల్ని తెప్పించి తను, తగిన రాజులు సేనామధ్యంలో అతన్ని అభిషేకించి సైన్యాధిపత్య పట్టాన్ని అతనికి కట్టారు. మంగళ తూర్య రావాలు చెలరేగినయ్. సైనికులు సింహనాదాలు చేశారు. తర్వాత అందరూ సుఖనిద్ర చేశారు.

అక్కడ ధర్మరాజు కూడ ఆరుబయట కొలువు దీరి మనవార్తల కోసం వెళ్ళిన గూఢచారుల కోసం ఎదురుచూస్తూ వినోదాల్లో పొద్దుపుచ్చుతున్నాడు. ఇంతలో మనవైపు నుంచి మంగళ వాద్యాల ధ్వనులు వినిపించినయ్, వాళ్ళ చారులు వెళ్ళి ఇక్కడ జరిగిన విశేషాలు వినిపించారు. ధర్మరాజు కర్తవ్యమేమిటని కృష్ణుణ్ణడిగాడు. కృష్ణుడతనితో “శల్యుడు సామాన్యుడు కాడు, భీష్మ, ద్రోణ, కర్ణుల్లో ఎవరికీ తక్కువ కాడు. దానికి తోడు ఇప్పుడు తనకి కలిగిన గౌరవంతో ఇంకా ఉత్సాహంగా యుద్ధంలో విజృంభిస్తాడు రేపు. అతన్ని చంపే వాళ్ళు మనసైన్యంలో ఒక్కరే వున్నారు, అది నువ్వే. మేనమామనే దయాదాక్షిణ్యాలు వదిలి రేపే అతన్ని నువ్వు చంపాలి. దాంతో దుర్యోధనుడు పూర్తిగా నీరుగారిపోతాడు. యుద్ధం పరిసమాప్తమౌతుంది” అని కార్యం బోధించాడు. ధర్మరాజు “నీమాటకి నేను ఎదురుచెప్తానా?”అని అందర్నీ విడుదులకి వెళ్ళమని చెప్పి తనూ వెళ్ళి హాయిగా నిద్రపోయాడు.

అప్పుడు నేనిక్కడికి తిరిగొచ్చి నీకు కర్ణుడి మరణం వరకు జరిగిన యుద్ధక్రమం చెప్పి వెళ్ళా. అలా నే వెళ్ళేసరికి అప్పుడప్పుడే తెల్లవారుతున్నది.

పద్దెనిమిదవ రోజు

ఉదయాన్నే దుర్యోధనుడు చిన్ననాయకుల్ని పిలిచి దొరల్నందర్నీ వాళ్ళ వాళ్ళ సైన్యాల్ని యుద్ధసన్నద్ధుల్ని చెయ్యమని చెప్పటానికి పంపాడు. అందరూ లేచి ఉత్సాహంగా సాధన సామాగ్రిని సిద్ధం చేశారు. ఆ రోజు యుద్ధంలో ఎవరూ ఒక్కరుగా ఒక శత్రువుతో తలపడకూడదని, మూకుమ్మడిగా శత్రువుల మీద పడాలని నిశ్చయించుకుని అలా ఒకరికొకరు మాటిచ్చుకున్నారు. శల్యుడు ముందుగా కదిలాడు, అతని వెనక మన సైన్యం నడిచింది. సర్వతోభద్ర వ్యూహం పన్నాడు శల్యుడు. ముందుగా శల్యుడు. అతని చుట్టూ కర్ణుడి కొడుకులు, వాళ్ళ పరివారాలు. కుడిపక్క శక, యవన సైన్యాల్తో కృపుడు. ఎడమపక్క త్రిగర్త సైన్యాల్తో కృతవర్మ. వెనక కాంభోజ సైన్యాల్తో అశ్వత్థామ. మధ్యలో కురువీరుల రక్షణలో దుర్యోధనుడు. అతని ముందు ఏనుగుదండుతో శకుని.

పాండవులు మూడు వ్యూహాలు పన్నారు. ఒకదానికి ధృష్టద్యుమ్నుడు, మరోదానికి సాత్యకి, మూడోదానికి శిఖండి నాయకులు.

అప్పటికి మనవైపు పదకొండువేల రథాలు, పదివేల ఏడొందల ఏనుగులు, రెండులక్షల గుర్రాలు, మూడుకోట్ల పదాతులు వున్నారు. వాళ్ళవైపు ఆరువేల రథాలు, మూడువేల ఏనుగులు, లక్ష గుర్రాలు, కోటి కాల్బలం మిగిలినయ్.

భేరీనాదాలు దిక్కులు నిండినయ్. సూర్యుడు ఉదయాద్రి మీదెక్కి యుద్ధం చూట్టానికి సిద్ధమయాడు.

పోరు ఘోరంగా ప్రారంభమైంది. భీమార్జునులు మన బలాల మీద విరుచుకుపడ్డారు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి ధర్మరాజుతో కలిసి మరోచోట మన వ్యూహాన్ని భేదించారు. సాత్యకి, కవలలు కూడ ఇంకోచోట దాడి చేశారు. హాహాకారాల్తో మన బలాలు పరిగెత్తినయ్. అదిచూసి శల్యుడు రథాన్ని ధర్మరాజు మీదికి పోనివ్వమని సారథికి చెప్పాడు. వెళ్ళి పాండవసేనల్ని తాకాడు. అతన్ని చూసి పారిపోతున్న మన సైన్యాలు నిలబడినయ్, శత్రువుల్తో తలపడినయ్.

ఒకవైపు నకులుడు, కర్ణుడి కొడుకు చిత్రసేనుడు యుద్ధం చేస్తున్నారు. చిత్రసేనుడొక గట్టి బాణంతో నకులుడి ధనుస్సు విరిచాడు. మూడు బాణాల్ని అతని నొసట నాటాడు. గుర్రాల్ని, కేతనాన్ని కూల్చాడు. సారథిని చంపాడు. అతను వాలూ పలకా తీసుకుని వస్తే అనేక భల్లాలతని మీద విసిరాడు. ఐతే నకులుడా భల్లాలు తగలకుండా పలకని అడ్డం పెట్టుకుని వేగంగా అతని రథమ్మీదికి లంఘించి క్షణంలో కత్తితో తల నరికాడు.

అదిచూసి వాడి సోదరులు సత్యసేనుడు, సుశర్ముడు శోకరోషాల్తో నకులుడి మీదికి దూకారు. అతనింకో రథం ఎక్కి పెద్దవిల్లు తీసుకుని వాళ్ళనెదుర్కున్నాడు. వాళ్ళిద్దరూ భల్లాల్తో అతని రథాన్ని నుగ్గుచెయ్యసాగారు. నకులుడు చిరునవ్వుతో సత్యసేనుడి గుర్రాల్ని కూల్చి విల్లు నరికితే అతను వేగంగా మరో రథం ఎక్కి ఇంకో విల్లు తీసుకుంటే నకులుడతన్ని రెండు పదునైన బాణాల్తో పొడిచాడు. సుశర్ముడు నకులుడి విల్లు విరిచాడు. నకులుడు మరో విల్లు తీసుకుని సత్యసేనుడి విల్లు మళ్ళీ విరిచాడు. సత్యసేనుడు మరోవింటితో నకులుడి మీద బాణవృష్టి కురిపిస్తే అతను వాటిని వారించి నూరుబాణాల్తో అతని వక్షాన్ని కొట్టి రెండు బాణాలతని తమ్ముని ఒంటికి నాటాడు.

కోపంతో అన్నదమ్ములు నకులుడి సారథిని చంపి, విల్లు విరిచి రథాన్ని ముక్కలు చేశారు. ఇలా విరథుడైన నకులుడు ధీరుడై నిలబడి ఒక ఘోరమైన శక్తితో సత్యసేనుణ్ణి చంపాడు. అన్న చావు చూసి భయం, క్రోధం కలిగినయ్ సుశర్ముడికి. ఇంతలో భీముడి కొడుకు శ్రుతసోముడొచ్చి నకులుణ్ణి తన రథం ఎక్కించుకున్నాడు. ఇద్దరూ కలిసి సుశర్ముడి మీద బాణపరంపరలు కురిపించారు. సుశర్ముడు నకులుడికి మూడు బాణాలు నాటి ఇరవై బాణాల్తో శ్రుతసోముడి వక్షాన్ని కొడితే ఒక అర్థచంద్ర బాణంతో వాడి తల నరికాడు నకులుడు. నకులుడి విజృంభణ చూసి మనసేనలు వెనక్కి పరిగెత్తినయ్. శల్యుడు ఆగండాగండని పిలిచి నిలవరించి సైన్యాన్ని కూడగట్టాడు. కృష్ణుడి రక్షణలో పాండవులు భయం లేకుండా పోరుతుంటే వాళ్ళ అండ చూసుకుని ధృష్టద్యుమ్నుడు మొదలైన రథికులు మన బలగాల్ని చించిచెండాడారు. వాళ్ళందరి ప్రతాపానికి కౌరవసేనలు చెల్లాచెదురౌతుంటే శల్యుడొక్కడే ధర్మరాజు వైపుకి దూసుకుపోయి అతని పక్కల కాపు కాస్తున్న భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదేయులు, నకుల సహదేవుల్ని తలా పదిబాణాల్తో తలపడ్డాడు. పాంచాల, ప్రభద్రక బలాలతన్ని చుట్టుముట్టినయ్. శల్యుడు సాహసంగా ఆ బలగాల్ని చిందరవందర చేసి తన బాణపరంపరల్తో పీనుగుపెంటలు చేశాడు. ఎటుచూసినా తనే ఐ బాణవర్షం కురిపించాడు. మనసైన్యాలు ఉప్పొంగినయ్, పాంచాలసైన్యాలు అల్లకల్లోలమై ధర్మరాజు వెనక్కి పరిగెత్తినయ్. ధర్మరాజు ఆ బలగాల్ని కూడగట్టుకుని శల్యుణ్ణి ఎదుర్కుని బాణవృష్టి కురిస్తే శల్యుడొక క్రూరనారాచంతో ధర్మరాజుని కొట్టాడు, అదతని ఒంట్లోంచి దూసుకువెళ్ళింది.

భీముడు, ఇతరులు ధర్మరాజుని దాటుకుని వచ్చి శల్యుణ్ణి తాకారు. ఏడు బాణాల్తో భీముడు, ఐదు శరాల్తో సహదేవుడు, తొమ్మిది బాణాల్తో నకులుడు, ఎన్నో నారసాల్తో ద్రౌపదేయులు శల్యుణ్ణి కొట్టారు. కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, అతని కొడుకు ఉలూకుడు, నీ కొడుకులు శల్యుడికి సాయంగా వచ్చి నిలబడ్డారు. అశ్వత్థామ కూడ వచ్చి వాళ్ళని కలుసుకున్నాడు. కృపుడు, ధృష్టద్యుమ్నుడు ఒకరితో ఒకరు తలపడ్డారు. అశ్వత్థామ ఐదుగురు ద్రౌపదేయుల్తో రణం సాగించాడు. శల్యుడు, భీముడు ఒకర్నొకరు ఎదుర్కున్నారు. శల్యుడు భీముడి గుర్రాల్ని నేలకూల్చాడు. భీముడు గదతో కిందికి దిగి కౌరవసైన్యాన్ని మోదటం సాగించాడు. సహదేవుడు శల్యుణ్ణి బాణవర్షంలో ముంచెత్తాడు. శల్యుడతని గుర్రాల్ని కూడ చంపాడు. సహదేవుణ్ణి దాటుకుని ఇతర శత్రు రథికులు శల్యుణ్ణెదుర్కున్నారు. శల్యుడి కొడుకు సహదేవుడి మీద బాణాలు విసిరాడు. సహదేవుడొక కరకు కత్తిని తీసుకుని అతని బాణాల్ని ఖండిస్తూ వేగంగా రథం మీదికురికి అవలీలగా అతని తల నరికి నేలపడేసి ఒక్క గెంతులో మరో రథం మీదికి దూకాడు.

కొడుకు చావుతో కోపోద్రేకాన శల్యుడు పాండవసైన్యాన్ని తన బాణాల్తో చిందరవందర చేశాడు. ధర్మరాజు మీదికి దూకి అతని మీద బాణపరంపరలు కురిపించాడు. అదిచూసి భీముడు అమిత కోపంతో శత్రుభీకరమైన తన ఎనిమిదంచుల గదాదండాన్ని తీసుకుని శల్యుడి గుర్రాల్ని మోదిచంపాడు. శల్యుడొక ఘోరతోమరాన్ని అతని వక్షాన నాటాడు. అలా వక్షాన నాటిన తోమరాన్ని ఎడమచేత్తో పెరికి దాంతోనే శల్యుడి సారథిని పొడిచి చంపాడు భీముడు. అలా విరథుడైనా వీరోద్రేకంతో శల్యుడొక భూరిగదని తీసుకుని చండయుముడిలా కిందికి దిగాడు. అదిచూసి భీముడు కూడ అతనికెదురుగా నడిచాడు. భీముడితో గదాయుద్ధంలో పోటీపడాలంటే శల్యుడికే సాధ్యం, శల్యుడికి తగ్గ వీరుడు భీముడే అని అంతా యుద్ధం మాని వాళ్ళ గదాసమర ప్రకారాన్ని చూడటానికి బొమ్మల్లా నిలబడిపోయారు.

ఇద్దరు ఒకర్నొకరు క్రూరంగా చూసుకుంటూ గర్జిస్తూ రంకెలేస్తూ మండలప్రచార గతుల్లో ఒకరికొకరు తీసిపోకుండా తలపడ్డారు. వాళ్ళ గదల రాపిడుల్లో నిప్పులెగిసి ఆకాశానికి ఎగురుతున్నయ్. క్షణక్షణానికి పెరుగుతున్న వేగంతో వాళ్ళ సమరం భీకరమైంది. ధిక్కారాలు, భూమి కంపించే పదఘట్టనలు మారుమోగుతున్నయ్. శరీరాంగాలు గదల తాకిడికి నెత్తురు చిమ్ముతున్నా లెక్కచెయ్యకుండా పోరు సాగించారు. ఒక్కోసారి ఎనిమిదడుగుల దాకా వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుని ముందుకు వచ్చి ఒకరినొకరు ఢీకొంటున్నారు. శరీరాలు హూనమౌతుంటే ఆవేశాలు పెరుగుతున్నయ్. చివరికి ఒకరి మెడ మీద మరొకరు మోదుకుని ఇద్దరూ మూర్ఛపడ్డారు. చూస్తున్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు. కృపాచార్యుడు పరుగున వచ్చి శల్యుణ్ణి ఆదరంగా ఎత్తుకుని తన రథం మీద ఎక్కించుకున్నాడు, కింద పడ్డా గదని గట్టిగానే పట్టుకుని వున్న అతని శౌర్యానికి విస్తుపోతూ.

ఇంతలో భీముడు తనంత తనే లేచి ఇంకా లేవని శల్యుణ్ణి చూపించి గేలిచేశాడు. అదిచూసి ఊరుకోలేక దుర్యోధనుడు, తన చుట్టూ వున్న సైన్యంతో భీముడి మీదికి నడిస్తే ధర్మరాజు పక్కనున్న చేకితానుడు మొదలైన వాళ్ళు పెద్దగా అరుస్తూ భీముణ్ణి దాటివెళ్ళి ఆ సైన్యాన్ని తాకారు. దుర్యోధనుడొక పదునైన ఈటెని బలంగా విసిరి చేకితానుడి ప్రాణాల్ని గాల్లో కలిపాడు. దాంతో పాండవులు కోపోద్రేకంగా కౌరవసైన్యం మీదికి ఉరికారు. శల్యుడు ధర్మరాజుని, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుణ్ణి, మూడువేల రథాల త్రిగర్తుల్తో కలిసి అశ్వత్థామ అర్జునుణ్ణి మహోత్సాహంతో ఎదిరించారు. ఆ రభసలో ఒకరికొకరు కనపడనంతగా దుమ్ము రేగింది. వాళ్ళ వాళ్ళ పేర్లు, బిరుదులు అరిచి చెప్పుకుంటూ సమరం సాగిస్తున్నారు రథికులు. అంతటా “కొట్టండి, పొడవండి” అన్న ధ్వనులే వినపడుతున్నయ్.

శల్యుడు ధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజు పద్నాలుగు శరాల్తో శల్యుణ్ణి కొడితే అతనొక పదును బాణాన్ని ధర్మరాజు వక్షాన నాటాడు. దానికి కోపంతో ధర్మరాజు చండసేనుడనే శల్యుడి చక్రరక్షకుణ్ణి చంపి తొమ్మిది నారాచాలు అతని సారథికి గుచ్చాడు. అప్పుడు సాత్యకి, భీముడు చేదిబలాల్తో శల్యుణ్ణి తాకారు. అతను వెనకాడకుండా ఐదు గట్టిబాణాల్తో భీముణ్ణి గాయపరిచాడు, ఇరవై ఏడు అమ్ముల్తో సాత్యకిని బాధించి ఇరవై ఐదుగురు చేదిరథికుల్ని చంపాడు. నకులసహదేవులు వస్తే నిశితసాయకాల్తో వాళ్ళ శరీరాలు తూట్లు పొడిచాడు. సహించక ధర్మరాజు అతని మీద బాణపరంపరలు కురిపించి జెండాని విరిస్తే అతను లెక్కచెయ్యకుండా అనేకబాణాల్తో ధర్మరాజుని, పదేసి బాణాల్తో సాత్యకి, భీముడు, నకులసహదేవుల్ని సమాధానపరిచాడు. ఇంకో కేతనాన్ని ఎత్తించి పాండవ వీరులందర్ని తనొక్కడే ముప్పుతిప్పలు పెట్టాడు. వాళ్ళ బాణాల దెబ్బలకి అతని శరీరం అంతా రక్తమయమైంది. ఐనా అతని ఉత్సాహం పెరిగిందే తప్ప తగ్గలేదు. ధర్మరాజుకీ అతనికీ ఘోరసమరం జరిగింది. ఐతే శల్యుడి బలమైన పదిబాణాల దెబ్బలకి ధర్మరాజు శోషవచ్చి రథం మీద ఒరిగాడు.

కోపంతో సాత్యకి శల్యుడి మీద బాణవృష్టి కురిపించాడు. శల్యుడొక భల్లంతో అతని విల్లు ముక్కలుచేశాడు. మూడేసి బాణాల్తో నకులుణ్ణి, భీముణ్ణి, సహదేవుణ్ణి కొట్టాడు. ఇంతలో తెలివొచ్చి ధర్మరాజు అతని మీద ఒక ముద్గరం విసిరాడు, సాత్యకి ఒక తోమరాన్ని, భీముడు భల్లాన్ని, నకులుడు శక్తిని, సహదేవుడు గదని ఒకేసారి అతని మీద ప్రయోగించారు. ఐతే శల్యుడు వాటన్నిటినీ బాణాల్తో దార్లోనే విరిచి వాళ్ళందరి మీద బాణవర్షం కురిశాడు. శల్యుడి వల్ల తనకి రాజ్యం రాబోతుందని మురిసిపోయాడు దుర్యోధనుడు.

అలా ఎవరినీ లెక్కచెయ్యకుండా అందర్నీ హడలు కొట్టిస్తున్న శల్యుణ్ణి చూసి ధర్మరాజుకి విషాదం కమ్ముకుంది. కృష్ణుడు తన చేతిలో శల్యుడు చస్తాడని చెప్పిన మాట అబద్ధమయ్యేట్టుందనిపించింది.

అశ్వత్థామ అండ చూసుకుని సంశప్తకులు అర్జునుణ్ణి చుట్టుముట్టారు. ఐతే ఆ మహారథికుడు అనేక రకాలైన బాణాల్తో వాళ్ళందర్నీ చిందరవందర చేశాడు. ఆ ప్రాంతమంతా రక్తపుమడుగైంది. అశ్వత్థామ అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడతని సూతుణ్ణి, గుర్రాల్ని అవలీలగా చంపాడు. ఇంతలో సురథుడనే పాంచాల రాకుమారుడు అశ్వత్థామ మీదికి తన రథాన్ని తోలిస్తే అతను ఒక్క బాణంతో వాణ్ణి చంపి పడేసి వాడి రథం మీదికి ఎగిరి ఆ రథం మీదనుంచే అర్జునుడితో మళ్ళీ తలపడ్డాడు.

తమ్ముల్తో కలిసి దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో పోరాడాడు. కృపుడు శిఖండితో, కృతవర్మ ప్రభద్రకుల్తో శరపరంపరలు కురిపించారు. శల్యుడు ధర్మజ, భీమ, నకుల సహదేవ, సాత్యకుల్తో తనొక్కడే తీవ్రరూపంతో తలపడ్డాడు. వాళ్ళందర్నీ బాణాల్లో ముంచెత్తాడు. అతని ప్రతాపానికి మనసేనలు ఉప్పొంగినయ్. సేనలన్నీ ఆ దిక్కుకి పరిగెత్తి శత్రుసైన్యాల్తో ఢీకొన్నయ్. అదిచూసి కృష్ణార్జునులు వాళ్ళ సైన్యాన్ని కూడ ఏకముఖంగా అమర్చుకుని మనసేనల్ని తాకారు. అర్జునుడు కృప, కృతవర్మల్ని, సహదేవుడు సౌబలుణ్ణి, ద్రౌపదేయులు కొందరు రాజుల్ని, శిఖండి అశ్వత్థామని, భీముడు దుర్యోధనుణ్ణి, నకులుడి సాయంతో ధర్మరాజు శల్యుణ్ణి ఎదిరించారు. మిగిలిన యోధులు వాళ్ళకి తగ్గవాళ్ళతో యుద్ధం సాగిస్తున్నారు.

శల్యుడి ప్రతాపాగ్నికి శత్రుసైన్యాలు మిడతల్లా ఆహుతౌతున్నయ్. బాణాలు, భల్లాలు యధేచ్ఛగా కురిపిస్తూ అతను అందర్నీ ముప్పుతిప్పలు పెడుతుంటే రెండువైపుల సైన్యాలు కూడ అతని యుద్ధకౌశలానికి అబ్బురపడినయ్. పాండవబలగాలు ధర్మరాజు వారిస్తున్నా వినకుండా చెల్లాచెదురై పరిగెత్తినయ్. చివరికి ధర్మరాజు తెగించి తనే శల్యుణ్ణి కేకేసి పిలిచి అతనితో తలపడితే అది చూసి వాళ్ళసేనలు తిరిగొచ్చి మళ్ళీ యుద్ధంలో నిలబడినయ్. తమ్ముల్ని, దొరల్ని దగ్గరికి పిలిచి ధర్మరాజు “మీరు భీష్మ ద్రోణాదుల్ని మీమీ పౌరుషాల్తో ఓడించారు. ఇప్పుడీ శల్యుడి చావు నాచేతిలో వుంది, ఇది తప్పదు. దానికి మార్గం ఇది – నా రథానికి కుడివైపు నకులుడు, సాత్యకి కావలిగా వుంటారు; ధృష్టద్యుమ్నుడు, సహదేవుడు ఎడమపక్క. నా ముందు భీముడు, నా వెనక అర్జునుడు వుంటారు. ఇంత తంతు ఎందుకని అడగొద్దు. ఇవాళ నేనో శల్యుడో తేలిపోవాలి. అతన్ని రక్షించటానికి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, సౌబలుడు, సుయోధనుడు అడ్డం పడొచ్చు, వాళ్ళ సంగతి మీరు చూడాలి. నా పరాక్రమం ఏమిటో చూపిస్తా, శల్యుడి చావు చూస్తా” అని చెప్తే అందరూ దానికి ఒప్పుకుని అతని రథం మీద అవసరమైన ఆయుధాలన్నీ చేర్పించి వాళ్ళ వాళ్ళ స్థానాల్లో సన్నద్ధులై నిలబడ్డారు.

అలా కూడగట్టుకుని వస్తున్న పాండవుల్ని చూసి దుర్యోధనుడు మనసేనల్ని వాళ్ళ మీదికి ఉరికించాడు. ధర్మజ శల్యులు పులుల్లా తలపడ్డారు. నీ కొడుకొక అర్థచంద్ర బాణంతో భీముడి కేతనాన్ని నరికాడు. మణికింకిణీనాదంతో ఆ సింహకేతనం నేల రాలింది. అలాగే అతని వింటినీ విరిచాడు దుర్యోధనుడు. మహాకోపంతో భీముడొక ఉగ్రశక్తితో అతని వక్షాన్ని కొడితే నీకొడుకు మూర్ఛపోయి రథం మీద పడ్డాడు. భీముడు మరో వింటిని తీసుకుని అతని సూతుణ్ణి చంపితే గుర్రాలు రథాన్ని లాక్కుని దూరంగా పరిగెత్తినయ్. అదిచూసి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ మనసేన ముందుకు దూకారు. అర్జునుడు వాళ్ళతో తలపడ్డాడు. రణం ఘోరమైంది.

మనసేనలు శల్యుణ్ణి దాటివెళ్ళి ధర్మరాజుని చుట్టుముట్టినయ్. అతను నిర్భయంగా తన బాణవర్షంతో వాళ్ళని వెనక్కి నెట్టాడు. శల్యుడతని మీద శరాలు కురిపిస్తే ధర్మజుడు వాటిని తన బాణాల్తో వమ్ముచేశాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం సాగిస్తున్నారు. ద్రోణశిక్షణలో ధర్మరాజింత విలుకాడయాడా అని అంతా ఆశ్చర్యపోయారు. శల్యుణ్ణి చంపి ధర్మరాజు రాజ్యం సాధిస్తాడా లేక ధర్మరాజునే చంపి శల్యుడు దుర్యోధనుడికి రాజ్యం సంపాయించిపెడతాడా అని అందరూ ఆత్రంగా వాళ్ళ యుద్ధాన్ని చూస్తున్నారు. శల్యుడు ధర్మజుడి విల్లు విరిచి అతన్ని వందబాణాల్తో కొట్టాడు. ధర్మరాజు వెంటనే మరో విల్లు తీసుకుని అతని వింటిని విరిచి మూడొందల బాణాల్తో శల్యుణ్ణి కొట్టాడు. అంతటితో ఆగకుండా అతని గుర్రాల్ని, సారథిని వెంటవెంటనే చంపాడు ధర్మరాజు. అలా కదల్లేని రథంతో వున్న శల్యుడికి ఏ అపాయమూ జరక్కుండా అశ్వత్థామ వచ్చి తన రథం మీద ఎక్కించుకున్నాడు.

అదిచూసి ఉత్సాహంతో ధర్మరాజు మనసైన్యం మీద విరుచుకుపడ్డాడు. ఇంతలో శల్యుడు మరో రథం సమకూర్చుకుని వచ్చి మళ్ళీ ధర్మజుడితో తలపడ్డాడు. ఆ దగ్గర్లో వున్న సాత్యకి, భీముడు, నకుల సహదేవులూ వచ్చి అతన్నెదుర్కున్నారు. అతను వాళ్ళందరి మీద బాణాలు కురిపించాడు. ధర్మరాజుని దాటుకుని తనకి దగ్గరగా వస్తున్న పాండవసైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు.

ధర్మరాజు సాత్యకి, భీమ, నకుల సహదేవుల సాయంతో శల్యుణ్ణెదుర్కున్నాడు. ఇద్దరూ ఒకర్నొకరు బాణాల్తో నొప్పించుకున్నారు, శరీరాలు రక్తసిక్తాలైనయ్. నీ కొడుకు శల్యుడికి సాయంగా మనసైన్యాల్ని తరిమాడు. వాళ్ళు భీమాదుల్తో పోరారు. శల్యుడొక బలమైన నారసాన్ని ధర్మరాజు వక్షాన నాటితే అతనొక ఉగ్రనారాచంతో శల్యుణ్ణి కొట్టాడు. శల్యుడు మూర్ఛపడ్డాడు. వెంటనే తేరుకుని ఒక పదునుబాణంతో ధర్మజుణ్ణి కొడితే అతను ఆరుబాణాల్తో శల్యుడి బంగారుకవచాన్ని ముక్కలుచేసి తొమ్మిది వాలుటమ్ముల్తో అతని వక్షాన్ని గాయం చేశాడు. శల్యుడు రెండు క్రూరభల్లాల్తో అతని ధనువు విరిచాడు. అతనింకో ధనుస్సు తీసుకుని శల్యుడికి అనేక బాణాలు గుచ్చాడు. భీముడు అన్నకి తోడుగా బాణాలు ప్రయోగించాడు. శల్యుడికి తోడుగా కృపుడు వచ్చాడు.

ఇంతలో శల్యుడు మరో కవచాన్ని ధరించి ధర్మరాజునెదుర్కున్నాడు. కృపుడు ధర్మరాజు సారథిని చంపితే శల్యుడతని గుర్రాల్ని నేలకూల్చాడు. తన చేతిలో శల్యుడు చస్తాడని కృష్ణుడన్న మాట అబద్ధమౌతుందా అని ధర్మరాజుకి కొంచెం అనుమానం కలిగింది. ఐతే అంతలోనే సంభాళించుకుని కృష్ణుడి మాట తప్పదని కూడబలుక్కుని రణం కొనసాగించాడు. ఐతే అతను వేసిన బాణాలు మెల్లగా కదలటం గమనించాడు శల్యుడు. ధర్మరాజుకి భయం వేసి అలా చేస్తున్నాడని లెక్కేసుకుని ఇంకా విజృంభించాడు. ఇంతలో భీముడతని విల్లు నరికి, రెండుబాణాలతని శరీరాన గుచ్చి, గుర్రాల్ని చంపి, సారథి తల నరికాడు. అతివేగంగా భల్లాలు విరిసి అతని కవచాన్ని నుగ్గుచేసి కిందపడేశాడు.

అలా రథం, విల్లు పోగా కోపోద్రేకంతో కత్తీ డాలూ తీసుకుని కిందికి దూకాడు శల్యుడు. ధర్మరాజు మీదికి లంఘించాడు. ఐతే భీముడతి రౌద్రంగా మధ్యలోనే ఆ వాలూ పలకా ముక్కలు చేశాడు. ఇంతలో సాహసం, నేర్పు వున్న పరిజనాలు పరిగెత్తుకొచ్చి శల్యుడికి కవచం, గద అందించారు. అతను కవచం తొడిగి గదని చిత్రవిచిత్ర గతుల్లో తిప్పుతూ ధర్మరాజు వైపుకి కదిలాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదేయులు, భీముడు, నకుల సహదేవులు అంతా కలిసి అతని మీద బాణవర్షం కురిపిస్తున్నా లెక్కచెయ్యక వాటిని తన గదాదండంతో అడ్డుకుంటూ సాగాడతను.

గుర్రాలు, సారథి లేని రథం మీద ఉన్నాడు ధర్మరాజు. సింహంలా తనవైపుకి కదిలొస్తున్న శల్యుణ్ణి చూశాడు. తను రోజూ గంధపుష్పాల్తో పూజించే మహిమాన్వితమైన శక్తి వంక చూశాడు. కృష్ణుణ్ణి మనసులో ధ్యానించుకున్నాడు. శక్తికి మొక్కాడు. దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. త్రిపురాసుర సంహార సంరంభియైన శూలిలా దాన్ని శల్యుడి వక్షానికి గురిపెట్టాడు. దాని గంటల మోతలు మనసైన్యం చెవులు బద్దలు చేస్తున్నయ్. దాని మణిదండం వెలుగులు వాళ్ళ కళ్ళకి మిరుమిట్లు గొలుపుతున్నయ్. శల్యుడి విశాల వక్షానికి సూటిగా వెళ్ళి తాకిందా ఘోరశక్తి. అతని కవచాన్ని చించి, వక్షాన్ని చీల్చి, శరీరాన్ని దూసుకు వెళ్ళి వెనక భూమిలో గుచ్చుకుంది.

శల్యుడి ముక్కులు, చెవులు, కళ్ళలోంచి ధారాపాతంగా రక్తం కారసాగింది. రెండు చేతులూ ముందుకి చాచి ఒక పర్వతంలా బోర్లాపడి ప్రాణాలు విడిచాడతను.

అలా ధర్మరాజు చేతిలో, ధర్మయుద్ధంలో మరణించాడు శల్యుడు.

అన్న చావు చూసి శల్యుడి తమ్ముడు వీరావేశంగా ధర్మరాజు మీదికి ఉరికాడు. ధర్మరాజు చిత్రచాపంతో వాడి విల్లుని, కేతువుని తుంచి వెంటనే ఒక భీకరమైన భల్లంతో వాడి తల వయ్యలు చేశాడు. పాండవసైన్యాలు సింహనాదాలు చేసినయ్. వాళ్ళ వైపు తూర్యధ్వనులు మోగినయ్. మనసేనలు దిక్కులేక పరిగెత్తినయ్. సాత్యకి వెంటబడి “పోనివ్వకండి, కొట్టండి” అంటూ తరిమాడు.

కృతవర్మ అతనికి అడ్డుపడ్డాడు. ఆ యాదవయోధులిద్దరి మధ్య ఘోరసమరం సాగింది. కృతవర్మ సాత్యకి విల్లు విరిచి పదిబాణాలతని శరీరానికి నాటితే అతను వేగంగా మరో విల్లు తీసుకుని కృతవర్మ గుర్రాల్ని, సారథిని, రథాన్ని నరికితే కృపుడు హడావుడిగా వచ్చి అతన్ని తన రథం మీద తీసుకెళ్ళాడు. సాత్యకి ధాటికి మనసేనలు పరిగెత్తుతుంటే నీ కొడుకు ఒక్కడే అడ్డు నిలబడి అతన్నెదిరించాడు. ఇంతలో మరో రథం ఎక్కి కృతవర్మ తిరిగొచ్చాడు. ధర్మరాజు కృతవర్మ గుర్రాల్ని చంపితే అశ్వత్థామ అతన్ని తన రథం మీద దూరంగా తీసుకెళ్ళాడు. కృపాచార్యుడు, ధర్మరాజు తలపడ్డారు. నీ కొడుకొక భద్రగజం ఎక్కి మన సైన్యానికి ఉత్సాహం కలిగిస్తూ నిలబడ్డాడు.

శల్యుడి చుట్టాలు దుర్యోధనుణ్ణి దాటుకుని పెద్దరొదతో వెళ్ళి పాండవుల్ని చుట్టుముట్టారు. దుర్యోధనుడు వాళ్ళని వారించి తన వెనకే వుండమని చెప్పాడు గాని వాళ్ళతని మాటలు వినిపించుకోకుండా ముందుకు దూకి ధర్మరాజు మీద దాడి చేశారు. పాండవుల వైపు నుంచి దొరలంతా చతురంగబలాల్ని సమకూర్చుకుని వాళ్ళనెదుర్కున్నారు. దూరంగా వుండి చూస్తూ ఊరుకున్న దుర్యోధనుడితో శకుని “ఇలా వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి ఊరుకోవటం నీకు ఉచితం కాదు. చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు?” అంటే అతను “ఔనౌను, నేను వాళ్ళని వదిలెయ్యను, సాయపడతా” అని తన సైన్యాన్ని పోగుచేసుకుని వాళ్ళకి సాయంగా బయల్దేరాడు. ఐతే ఈలోగానే పాండవుల చేతిలో శల్యుడి బంధుగణం అంతా నాశనం ఐంది. అదిచూసి మన సేనలు కాలికి బుద్ధి చెప్పినయ్. దుర్యోధనుడు ఎంతగా పిలుస్తున్నా వినకుండా పారిపోతుంటే అతను తన రథసారథిని పిలిచి “ఇలా ఏనుగు మీద నుంచి సైన్యాన్ని కూడగట్టటం కష్టం, నువ్వు త్వరగా రథాన్ని సిద్ధం చేసుకురా” అంటే అతను వెంటనే వెళ్ళి రథాన్ని తీసుకొచ్చాడు.

అదంతా చూస్తున్న పాండవసేన “ఈపూటతో యుద్ధం ముగుస్తుంది, ధర్మరాజుకి రాజ్యం వచ్చేస్తుంది, దుర్యోధనుడి చావు దగ్గర్లోనే వుంది” అని ఆనందించింది. దుర్యోధనుడు తన రథం మీద బయల్దేరి పారిపోతున్న సైన్యానికి అడ్డంగా నిలబడ్డాడు. “ఇలా పారిపోవటం మగతనమా? పోతే మిమ్మల్ని పాండవులు ఒదుల్తారా? ఎక్కడున్నా వెదికి పట్టి చంపుతారు. అప్పుడు యుద్ధం చేసినందుకు ఫలితం కూడ దక్కదు. యుద్ధభూమిలో చస్తే కనీసం సద్గతులైనా వస్తయ్. పైగా పాండవుల బలగం మనకన్నా చిన్నది, వాళ్ళంతా అలిసిపోయి వున్నారు. మనం గెలవటానికి ఇదే సరైన అదును” అని అరిచి చెప్పి పిలిస్తే అప్పుడు నిజమేనని మన సేనలు వెనుదిరిగినయ్.

దుర్యోధనుడు ముందుండగా అతని వెనక మన సైన్యం నడిచింది. శత్రుసైన్యాన్ని భీముడు ముందుండి నడిపిస్తున్నాడు. మన పదాతిసేనలతన్ని చుట్టుముట్టినయ్. దాంతో అతను గదాదండాన్ని ధరించి ఘోరాకారంతో రథం దిగి మనసేనల్ని నుగ్గుచేశాడు. అతని ధాటికి ఇరవయ్యొక్క వేల మంది సుభటులు అసువులు పోగొట్టుకున్నారు. పాండవుల మీదికి దూకిన కరి, హయ, రథ బృందాల్ని నాశనం చేసి అర్జునుడు తన చేతుల తీట తీర్చుకున్నాడు. నకుల సహదేవులు, సాత్యకి శకుని మీదికి బాణాలు సారించారు.

సాల్వుడో మదగజం ఎక్కి పాండవసేనలో జొరబడ్డాడు. వాళ్ళ రథాల్ని, గుర్రాల్ని, ఏనుగుల గుంపుల్ని దారుణంగా తొక్కించాడు. అతనలా భీభత్సం సృష్టిస్తుంటే ధృష్టద్యుమ్నుడతన్ని ఎదుర్కున్నాడు. సాల్వుడు తన ఏనుగుని అతన్ని తొక్కటానికి ఉసిగొల్పాడు. ధృష్టద్యుమ్నుడు పదును నారాచాల్తో దాని కుంభాన్ని కొడితే అది బాధగా పరిగెత్తింది. అతి ప్రయత్నం మీద ఆ గజాన్ని మళ్ళించుకుని మళ్ళీ ధృష్టద్యుమ్నుడి మీదికి దూకాడు సాల్వుడు. అతని ఏనుగు ధృష్టద్యుమ్నుడి రథాన్ని తొండంతో పట్టి ఎత్తింది. అతను భయంతో గదని తీసుకుని రథమ్మీంచి కిందికి దూకాడు. సారథి, గుర్రాల్తో సహా అతని రథాన్ని ఆకాశానికెత్తి నేలకేసి కొట్టి నుగ్గు చేసిందా ఏనుగు. పరుగున వచ్చి భీముడు, శిఖండి, సాత్యకి సాల్వుడి మీద బాణవర్షం కురిపించారు. అతను వాళ్ళందర్నీ ఒంటరిగా ఎదిర్చి నిలబడ్డాడు.

ధృష్టద్యుమ్నుడింతలో కుదటపడి గదతో పైకెగిరి ఆ ఏనుగు కుంభస్థలాన్ని బలంగా మోదాడు. అది భీషణంగా అరుస్తూ నేలకూలింది. అదే సమయంలో సాత్యకి వెడల్పు మొన వున్న ఒక బాణంతో సాల్వుడి శిరసుని ఖండించాడు. మన సేనలు గగ్గోలు పెట్టినయ్. వాళ్ళ మీద విజృంభించి దూకుతున్న సాత్యకిని మళ్ళీ కృతవర్మ ఎదుర్కున్నాడు. పెద్దగా అరిచి పిలిచి పారుతున్న మనసేనల్ని నిలబెట్టాడు. ఇద్దరూ తీవ్రంగా యుద్ధం సాగించారు. ఎనిమిది శరాల్తో కృతవర్మని కొట్టాడు సాత్యకి. అతని వింటిని విరిచాడు కృతవర్మ. బలమైన మరో విల్లు తీసుకుని అతని గుర్రాల్ని, సారథిని చంపాడు సాత్యకి. అలా విరథుడై ఒక భయంకరమైన శూలాన్నతని మీద విసిరాడు కృతవర్మ. దాన్ని భల్లంతో ముక్కలు చేశాడు సాత్యకి. సాత్యకి బాణధాటికి చావుకి దగ్గరౌతున్న కృతవర్మని అక్కణ్ణుంచి తప్పించాడు కృపుడు. మనసేనలు విరిగినయ్.

నీ కొడుకొక్కడే పాండవుల్ని తన బాణధారల్లో ముంచెత్తుతున్నాడు. అప్పుడతని యుద్ధం చూస్తున్న నాకు రెండు సైన్యాల్లోనూ అతనికి సమానుల్లేరనిపించింది. పాండవపక్షం దొరలంతా అతనితో తలపడ్డారు. ఐనా ఎవర్నీ లెక్కచెయ్యకుండా అందరికీ అన్ని రూపులై సమరం సాగించాడతను. అదిచూసి ఉత్సాహం తెచ్చుకుని మన సైన్యాలు అతనికి సాయంగా వెళ్ళి శత్రువుల్ని ఢీకొన్నయ్.

భీముడు, అశ్వత్థామ ఒకవంక ఒకరికొకరు పోటీగా యుద్ధం చేస్తున్నారు. సౌబలుడు (శకుని) ధర్మరాజు నెదిరించి నాలుగు బాణాల్తో అతని గుర్రాల్ని చంపాడు. సహదేవుడు అన్నని తన రథం మీద ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్ళాడు. ధర్మరాజు మరో రథాన్ని సమకూర్చుకుని వేగంగా తిరిగొచ్చి సౌబలుణ్ణి తాకాడు. వాళ్ళిద్దరి మధ్యా పోరు ఘోరమైంది. శకుని కొడుకు నకులుడితో, సాత్యకి కృతవర్మతో, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో యుద్ధం సాగించారు. ఇలా అన్నిచోట్లా భయంకరంగా పోరు కొనసాగింది. చివరికి మనమొనలో దొరలు శత్రువుల దెబ్బకి నిలబడలేక వెనక్కి తిరిగితే దుర్యోధనుడు వాళ్ళందర్నీ కూడగట్టి శత్రువులమీదికి ఉసిగొలిపితే ధర్మరాజు కోపంగా మూడు బాణాల్తో కృపుడి వింటినారిని తెంచి నాలుగు బాణాల్తో కృతవర్మ గుర్రాల్ని కూల్చితే అశ్వత్థామ అతన్ని తన రథం మీద పక్కకి తీసుకుపోయాడు. దుర్యోధనుడికి మండిపోయింది, ఏడువందల రథాల్ని ధర్మరాజు మీదికి పంపాడు. వాళ్ళతన్ని చుట్టుముట్టి బాణాలు కురిపిస్తుంటే శిఖండి మొదలైన యోధులు వచ్చి వాళ్ళని చెల్లాచెదురు చేశారు.

అప్పుడు శకుని మన యోధుల్తో “మీరు ధర్మరాజుని వదలకుండా పోరాడుతూండండి, నేను వెనక నుంచి వచ్చి వాళ్ళని చంపుతా” అని బయల్దేరాడు. శల్యుడి సైన్యం ముందునుంచి దాడి చేసింది. ఐతే పాండవసేనల ధాటికి ఆగలేక వెనక్కి తగ్గింది. ఇంతలో శకుని పదివేల ఆశ్వికసైన్యంతో శత్రుసైన్యం వెనకభాగాన్నుంచి ముట్టడించాడు. అది చూసి మనసైన్యం ఉత్సాహంగా పోరాడింది. ధర్మరాజు సహదేవుణ్ణి ఐదువేల ఆశ్వికుల్తో, ద్రౌపదేయుల్ని తీసుకుని వెంటనే వెళ్ళి శకునిని ఎదిరించమని పంపాడు. సహదేవుడలాగే వెళ్ళి శకునితో తలపడ్డాడు. రెండు ఆశ్వికసేనలకీ భీకరరణం జరిగింది. సహదేవుడి ప్రతాపానికి శకుని నాలుగువేల మందిని పోగొట్టుకుని ఆరువేల బలగంతో వెనక్కి తిరగాల్సొచ్చింది. చావగా మిగిలిన మూడువేల బలంతో సహదేవుడు అన్న దగ్గరికి తిరిగి చేరుకున్నాడు.

చుట్టు తిరిగొచ్చి శకుని ధృష్టద్యుమ్నుడి సైన్యం మీద దాడిచేశాడు. ఐతే ధృష్టద్యుమ్నుడా హయసేనని చించిచెండాడాడు. అతని దెబ్బకి ఐదువేల మూడొందల గుర్రాలు చచ్చినయ్. ఐనా శకుని శక్తికొద్దీ పోరాడాడు. చివరికి కేవలం వందమంది ఆశ్వికులు మిగిల్తే వాళ్ళతో అక్కణ్ణుంచి పక్కకి తొలిగాడు శకుని.

దుర్యోధనుడి కోసం చూస్తే అతను కనిపించలేదు. ఎటు వెళ్ళాడని శకుని చుట్టుపక్కల వాళ్ళనడిగితే వాళ్ళతనికి దూరంగా ధవళవర్ణ రథాన్ని చూపించి అది దుర్యోధనుడిదని చెప్పారు. అతను వెంటనే అక్కడికి వెళ్ళి దుర్యోధనుణ్ణి కలిసి “శత్రువుల గుర్రాల్ని నేను నాశనం చేశా, ఇక రథాల పని పట్టాల్సుంది. రథాలు, ఏనుగులు పోతేగాని కాల్బలాన్ని ఊచకోత కొయ్యలేం, పాండవుల్ని జయించలేం” అని చెప్పాడు. అది విని మన సైన్యం ఆనందించింది. దుర్యోధనుడు ఉత్సాహంగా శత్రువుల మీదికి బయల్దేరాడు.

కృష్ణార్జునులది చూశారు. అర్జునుడు కృష్ణుడితో “ఆ దుర్యోధనుడికి ఎదురుగా మన రథాన్ని వేగంగా పోనివ్వు, ఆ సైన్యం అంతు చూద్దాం. యుద్ధం మొదలైనప్పుడు సముద్రంలా కనపడ్డ వాళ్ళ సైన్యం ఇప్పుడు చూశావా చిన్నగుంటలాగా ఉంది? వీళ్ళ బుద్ధికి బుద్ధుంటే ఇంత వినాశనాన్ని కొని తెచ్చుకుంటారా? భీష్ముడు పడినప్పుడైనా కళ్ళు తెరిచి సంధి మార్గానికొస్తారనుకున్నా. ఆయన కూడ ఎంతగానో చెప్పి చూశాడు. ఆ మాటలు విననప్పుడు గాని నాకర్థం కాలేదు దుర్యోధనాదులు బుద్ధిహీనులని. మరెవరైనా ఐతే భీష్ముడు పడ్డాక పరిస్థితి అర్థం చేసుకోకుండా వుంటారా? మత్తగజంతో సహా సోమదత్తుడు చచ్చినప్పుడు, సైంధవుణ్ణి రక్షించబోయి ఎంతోమంది రాజులు బలైనప్పుడు, ద్రోణాచార్యుడు ప్రాణాలు విడిచినప్పుడు కూడ ఆవగింజంతైనా ఆలోచించలేదే, ఇలాటి మూర్ఖులు కూడ ఉంటారా? దుశ్శాసనుడు మొదలైన అనేకమంది తమ్ముళ్ళు పోయారు, కొడుకులు చుట్టాల్తో కలిసి కర్ణుడు కాటికి పోయాడు – ఇవేవీ చూడలేదా ఈ దుర్యోధనుడు? వీడు బతికుండగా ధర్మరాజుకి రాజ్యం రాదని తేలిపోయింది. కనక ఇప్పుడు మన కర్తవ్యం దుర్యోధనుణ్ణి చంపటం” అని వివరించాడు.

అందుకు అంగీకరిస్తూ కృష్ణుడు “ఔను, నేను సంధికి వెళ్ళినప్పుడు విదురుడు కూడ, దుర్యోధనుడు బుద్ధిహీనుడు, తన బొందిలో ప్రాణం వుండగా పాండవులకి రాజ్యాన్నివ్వడని చెప్పాడు. నిజానికి వాడు పుట్టినప్పుడే మునులు ఈ పాపాత్ముడి వల్ల క్షత్రియలోకం అంతా నాశనం ఔతుందని జోస్యం చెప్పారు కదా” అన్నాడతనితో. అర్జునుడు “వాళ్ళ మాటలే నిజమయినయ్. వీడిప్పటికి అందర్నీ చంపించాడు, ఇక తనూ చస్తే తప్ప ధర్మరాజుకి రాజ్యం రాదు, అది నిశ్చయం. త్వరగా ఆ దిక్కుకి పోదాం పద, ఆ దుర్నీతిపరుడు చూస్తుండగానే వాడి దుర్బలమైన సేనని తుదముట్టిస్తా చూడు” అని కార్చిచ్చు లాగా కౌరవసేనా వనంలోకి ప్రవేశించాడు అర్జునుడు. అతని భీకర బాణాలు మన సేనల్ని కాలుస్తుంటే నిలవలేక కాలికి బుద్ధి చెప్పినయ్. నీ కొడుకొక్కడే స్థిరంగా నిలబడి అందర్నీ పిలిచి కూడగట్టి పాండవబలాల మీదికి ఉసిగొల్పాడు.

ధృష్టద్యుమ్నుడు, శిఖండి, శతానీకుడు వాళ్ళనెదుర్కుని శరపరంపరల్లో ముంచెత్తారు. దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడి వక్షాన అనేక బాణాలు నాటితే అతను కోపంతో దుర్యోధనుడి గుర్రాల్ని, సారథిని చంపాడు. దుర్యోధనుడు తటాల్న రథం దిగి ఒక గుర్రాన్నెక్కాడు. ఎక్కి పక్కకెళ్ళి ఏనుగుల గుంపుల్ని పాండవుల మీదికి పంపాడు. అవి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టినయ్. అర్జునుడు ఘోరనారాచ ధారల్తో వాటిని చెల్లాచెదురు చేస్తుంటే భీముడు తన గదాదండంతో కిందికి దూకి ఏనుగుల తుండాలు తునకలు చేస్తూ కుంభాలు నుజ్జు చేస్తూ వీరవిహారం సాగించాడు. మరోపక్క నుంచి పాండవసైన్యం మీదికి దూకుతున్న ఏనుగుల్ని ఆపటానికి ధర్మజ, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు మొదలైన యోధులు అటు పరిగెత్తారు.

ఇంతలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ రథికుల మధ్య దుర్యోధనుడు కనిపించక యుద్ధంలో మరణించాడేమోనని అనుమానిస్తూ అక్కడున్న వాళ్ళనడిగితే కొందరతను శకుని దగ్గర వున్నాడన్నారు, ఇంకొందరు కంగారెందుకు, బతికుంటే తర్వాత కనపడతాడుగా, ఇప్పుడు మనం యుద్ధం చెయ్యటం ముఖ్యం అని శత్రువుల్తో పోరాటంలో మునిగిపోయారు. ఆ ముగ్గురు రథికులు శకుని వున్న చోటికి బయల్దేరారు.

ఇలా రక్షించే వాళ్ళెవరూ లేని ఆ సైన్య భాగాన్ని పాంచాల వీరులు చుట్టుముట్టి మట్టుబెట్టారు. అప్పుడు అక్కడే వున్న నేను ధృష్టద్యుమ్నుడికి చిక్కకుండా తప్పించుకున్నా గాని అంతలో నాలుగొందల రథాల్తో అటే వచ్చిన సాత్యకి చేతికి దొరికిపోయా.

ఇంతలో ఏనుగుల్ని మోదటం ముగించి భీముడు కనపడితే నీ కొడుకులు దుర్విషహుడు, దుష్ప్రదర్శనుడు, ఇంకా కొంతమంది కలిసి అతనితో తలపడ్డారు. అతను రథం ఎక్కి భల్లాలు, నారాచాల్తో వాళ్ళలో చాలామందిని చంపాడు. అదిచూసి చావగా మిగిలిన నీ బలాలు శోకంతో, క్రోధంతో అతన్ని చుట్టుముట్టినయ్. ఐతే అతను అవలీలగా ఐదొందల రథాల్ని, నూటడెబ్భై ఏనుగుల్ని, ఎనిమిదొందల గుర్రాల్ని పదివేల పదాతుల్ని అప్పటికప్పుడు తన బాణాలకి బలిచేశాడు. మిగిలిన మన బలాలు బిక్కచచ్చి అతని వైపు చూడటానిక్కూడా సాహసించలేకపోయినయ్. నీ కొడుకుల్లో కేవలం దుర్యోధనుడు, సుదర్శనుడు మాత్రం మిగిలారు. అలా అంతమందిని చంపి ఆనందంగా మదాతిరేకంతో భీముడు మల్లచరిస్తే మనవాళ్ళంతా నిర్ఘాంతపోయి నిలబడ్డారు తప్ప కాలు కదపలేదు.

కృష్ణుడు అర్జునుడితో “శత్రువులు దాదాపుగా నశించినట్టే. నీ ప్రతాపం వల్ల నీ సోదరులంతా క్షేమంగా వున్నారు. సాత్యకి సంజయుణ్ణి పట్టి తెచ్చాడు. ధృష్టద్యుమ్నుడు ఆరోగ్యంగా వున్నాడు. శత్రుపక్షాన ఇక మిగిలింది ఆ ఎదురుగా కనపడే గుర్రాల దండు. దాని మధ్య బిక్కుబిక్కుమంటూ నివురుగప్పిన నిప్పులా దుర్యోధనుడు, అతనితో ఒక్క తమ్ముడు. ఈ చిన్నసేన పనిపూర్తి చెయ్యటం నీకో లెక్కలోది కాదు. పద, దుర్యోధనుణ్ణి పరలోకాలకి పంపుదువు గాని” అని ప్రోత్సహించాడు. “ఇదీ ఒక సైన్యమేనా? రెండొందల రథాలు, వంద ఏనుగులు, రెండువేల పదాతులు. శకునితో ఐదొందల గుర్రాలు. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ కాపుండి నిలబెడితే వుంది గాని నా బాణాల దెబ్బలు తగులుతుంటే ఎంతసేపుంటుందీ సైన్యం? సగం మంది చస్తే మిగతా సగం వెనక్కి చూడకుండా పారిపోతారు. అప్పుడిక దుర్యోధనుడు బయటపడక తప్పదు. ఎదిరించాడా నా బాణాలకి ఆహుతౌతాడు. ఈ పూటతో ఈ యుద్ధం సమాప్తం కాబోతుంది” అన్నాడు అర్జునుడు ఆవేశంగా.

దుర్యోధనుడి కెదురుగా కదిలింది అర్జునుడి రథం. అది చూసి భీముడు, సహదేవుడు ఆ దిక్కుగా వేగంగా వచ్చారు. వాళ్ళనెదిరించటానికి శకుని సిద్ధమయాడు. అందరికీ తీవ్రావేశాలు కమ్ముకున్నయ్. శకుని, సుశర్ముడు అర్జునుణ్ణి ఎదుర్కున్నారు. సుదర్శనుడు భీముడితో, దుర్యోధనుడు సహదేవుడితో తలపడ్డారు. సహదేవుడు పదునైన బాణాలేసి దుర్యోధనుడు తూలేట్టు చేశాడు. దుర్యోధనుడు సహదేవుడి నుదుట బలంగా కొట్టాడు. అతను తూలి పడబోయి నిలదొక్కుకుని దుర్యోధనుడి మీద బాణాలు కురిపించాడు.

గాంధారదేశపు గుర్రం రౌతులు అర్జునుణ్ణి చుట్టుముట్టారు. శక్తుల్ని, తోమరాల్ని అతని మీద విసిరారు. ఐతే అతను క్రూరభల్లాల్తో వాళ్ళ శిరసుల్ని పుచ్చకాయల్లా దొర్లించాడు. గాంధారబలాల చావుతో త్రిగర్తదేశపు రౌతులతన్ని కమ్ముకున్నారు. వాళ్ళలో సత్యకర్ముడి తలని తళతళలాడే కుండలకాంతుల్తో నేలమీద పొర్లించాడు అర్జునుడు. అలాగే సత్యేషుణ్ణీ క్షణంలో పైకి సాగనంపాడు. ఇంతలో సుశర్మ కనిపించాడు. ఇన్నాళ్ళూ తనని తిప్పలు పెట్టిన అతని మీద వేడివేడి చూపులు రగులుస్తూ మూడు బాణాలతని ఒంటికి నాటాడు. దాంతో సుశర్మ సైన్యంలో రథికులంతా ఒక్కసారిగా అతన్ని కమ్ముకున్నారు. అతను వాళ్ళని చిటికలో చిందరవందర చేసి ఒక ఘోరభల్లంతో వాడి రొమ్ము చీల్చి ప్రాణాలు తీశాడు. అతని కొడుకులు ఏడుగుర్ని ఒక వరసన, ఎనిమిది మందిని ఇంకో వరసన, ముప్పై మందిని మరో వరసన తలలు నరికి తండ్రితో పాటు ప్రయాణం కట్టించాడు. ఇక మిగిలిన త్రిగర్త సైన్యం తలా ఓ దిక్కు పరిగెత్తింది.

భీముడి బారిన పడ్డ సుదర్శనుడు ఎక్కువసేపు బతకలేదు. అతని బలాలు భీముణ్ణి చుట్టుముడితే అతను బలమైన బాణాల్తో వాటిని చంపి చెల్లాచెదురు చేశాడు. అదిచూసి సహించలేక దుర్యోధనుడి ముందున్న సైన్యం పాండవబలాల మీదికి దూకింది. శకుని సహదేవుడితో తలపడ్డాడు. శకుని కొడుకు ఉలూకుడతనికి తోడుగా నిలబడ్డాడు. చిన్నతమ్ముడికి తోడుగా భీముడు వచ్చాడు. శకుని మూడు భల్లాల్తో సహదేవుణ్ణి పొడిచి పదినారాచాలు అతని శరీరానికి గుచ్చితే మండిపడి భీముడు, సహదేవుడు భీభత్సంగా శకుని సైన్యాన్ని చించిచెండాడారు. శకుని ఆశ్వికదళం సమూలంగా నాశనమైంది. ఐనా వెనక్కి తగ్గకుండా శకుని మూడుమొనల చిన్న ఈటెని బలంగా విసిరితే ఆ దెబ్బకి సహదేవుడు రథం మీద మూర్ఛపడ్డాడు. భీముడు వీరావేశంతో మన సేన మీద పడ్డాడు. అతని ధాటికి నిలవలేక మన సైన్యం పారిపోతుంటే దుర్యోధనుడు అందర్నీ గట్టిగా అరిచి పిల్చి నిలబెట్టాడు. ఒక రథాన్నెక్కి శకునిని కలిసి అంతా కలిసి పాండవ సేన మీద దాడి చేశారు.

పాండవ సేనలు వాళ్ళ మీద తిరగబడినయ్. ఇంతలో సహదేవుడు కూడ తెలివొచ్చి లేచి పదిబాణాల్తో శకునిని కొట్టి అతని విల్లు విరిచాడు. అతనింకో విల్లు తీసుకునేంతలో భీముడు, నకులుడు అతని మీద బాణాలేస్తుంటే శకుని కొడుకు ఉలూకుడు వాళ్ళనడ్డుకున్నాడు. ఇలా తండ్రీ కొడుకులు పోరాడుతుంటే భీముడు ఉలూకుణ్ణి అనేక బాణాల్తో కొట్టి శకునికి అరవై బాణాలు నాటించి అతని అనుచరుల్ని చెల్లాచెదురు చేశాడు. కోపంతో ఉలూకుడు సహదేవుణ్ణి బాణవర్షంలో ముంచాడు. అతను మహాకోపంతో ఒక భల్లాన వాడి తల నరికాడు. కొడుకు చావు చూసి శకుని కళ్ళ నీళ్ళు కుక్కుకున్నాడు. అప్పుడతనికి విదురుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినయ్. పెద్ద నిట్టూర్పు విడిచి సహదేవుడి మీద మూడు నారాచాలేశాడు. సహదేవుడు వాటిని మధ్యలో విరిచి అతని విల్లు తుంచాడు. శకుని కత్తితో కలిసిన ఇనపసమ్మెటని సహదేవుడి మీద విసిరాడు. దాన్ని కూడ అతను అనేకబాణాల్తో మధ్యలోనే నరికాడు. అదిచూసి శకుని పక్కనున్న వాళ్ళు పారిపోయారు. వాళ్ళని చూసి అతను కూడ దూరంగా పారిపోయాడు. దుర్యోధనుడు దీనుడయ్యాడు.

ఐతే సహదేవుడు శకునిని పోనివ్వకుండా వెంటపడ్డాడు. శకుని వెనక వున్న మన పక్షం వాళ్ళు కూడ అతన్ని యుద్ధానికి ముందుకి తోశారు. ఇక తప్పేదిలేక తన గుర్రపుదండుతో సహదేవుణ్ణి ఎదుర్కున్నాడు శకుని. సహదేవుడతనికి మాయాజూదం గుర్తుచేసి ఆ రోజు సభలో నవ్వినవాళ్ళలో మిగిలున్న దుర్యోధనుడు చూస్తుండగానే శకుని తలని ముక్కలు చేస్తానని చెప్తూ పదిబాణాలతనికి గుచ్చాడు. అతని గుర్రాల్ని, గొడుగుని, జెండాని, విల్లుని ముక్కలు చేశాడు. శకుని ఒక నిష్టురశక్తిని తీసి సహదేవుడి వక్షానికి గురిపెట్టాడు. ఐతే సహదేవుడొక భల్లంతో దాన్ని విరిచి ఇంకో రెండు భల్లాల్తో అతని రెండు చేతులూ నుజ్జు చేశాడు. తర్వాత మరో పదునైన భల్లంతో అతని తల నరికి కింద పడేశాడు.

ధర్మరాజు ఆనందంగా తన శంఖాన్నూదితే వాళ్ళ సేనలో మిగిలిన దొరలు కూడ వాళ్ళ శంఖాలు పూరించారు. మన సైన్యం అల్లకల్లోలమైంది. శకుని సైన్యం మాత్రం పారిపోకుండా నిలబడి సహదేవుడి మీద శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తే అర్జునుడు, భీముడు వాటన్నిటిని వారించి ఆ సేనని చిత్తు చేశారు. దుర్యోధనుడు ఇంకా మిగిలున్న కొద్దిమంది సైన్యాన్నీ పురిగొల్పితే వాళ్ళు అర్జునుడితో తలపడ్డారు. తన చుట్టూ రక్షణగా వున్న సైన్యం బాగా పలచబడటం గమనించి దుర్యోధనుడు అక్కణ్ణుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ఆ సమయాన పాండవ సైన్యం పరిమాణం రెండువేల రథాలు, ఏడొందల ఏనుగులు, ఐదువేల గుర్రాలు, పదివేల పదాతులు. మనవైపు సైన్యమంతా దాదాపుగా సమసిపోయింది. ఆ పరిస్థితి చూసి నీ కొడుకు గుర్రం దిగి గద బుజాన పెట్టుకుని ఒంటరిగా కాలినడకన ఎక్కడికో కదిలిపోయాడు.

ధృతరాష్ట్రుడది విని నిర్ఘాంతపోయాడు. “రారాజుగా బతికినవాడు శత్రువుల చేతిలో ఓడి ఒంటరిగా కేవలం గద మాత్రమే తోడుగా ఎక్కడికి పోయాడో కదా, ఇంతకన్నా దైన్యం ఇంకోటుందా?” అని మొత్తుకున్నాడు. సంజయుడు తన కథనాన్ని కొనసాగించాడు. “ఔను, పదకొండక్షౌహిణుల సైన్యాన్ని శాశించి చివరికి ఒక్కడు కూడ తన వెనకలేని స్థితిలో అక్కడికి కొద్దిదూరంలో ఈశాన్యాన ఒక మడుగుంటే దాన్లో దాక్కుందామని వెళ్ళాడు. అప్పుడతనికి విదురుడి నీతిబోధలు గుర్తొచ్చినయ్, అవి వినకుండా తను ఇంతదూరం తెచ్చుకున్నానని గుర్తింపొచ్చింది.

అవతల మిగిలున్న మనసేనలు ధైర్యంగా పోరాడినా వాటిని నాశనం చెయ్యటం అర్జునుడికి పెద్దపని కాలేదు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ తప్ప మనసేనంతా నిశ్శేషంగా సమసిపోయింది. అప్పుడు ధృష్టద్యుమ్నుడు నన్ను గమనించి సాత్యకితో “వీడిప్పుడు మనకేం హాని చేస్తాడు? వదిలెయ్యరాదూ” అంటే సాత్యకి, “వీడు ద్రోహి, వీణ్ణిప్పుడే నా కత్తికి బలిస్తా” అని కత్తి దూసేసరికి వ్యాసమహర్షి హఠాత్తుగా ప్రత్యక్షమై “సంజయుణ్ణి చంపటం అనుచితం, వదిలెయ్యి” అని చెప్తే అతను ఆయన మీది గౌరవంతో నన్ను వదిలేశాడు. వ్యాసుడు “ఇప్పటికి బతికిపోయావ్, ఎక్కడన్నా దూరంగా పో” అని నాతో అని మాయమయాడు.

నేను దుర్యోధనుణ్ణి వెదుక్కుంటూ అక్కడికి కోసెడు దూరంలో వున్న మడుగు దగ్గరికెళ్ళా. అక్కడతను కళ్ళ నీళ్ళు పెట్టుకుని దుఃఖిస్తూ నన్ను తేరిపార చూశాడు. నేనూ కాసేపేమీ మాట్టాడలేక నిలబడిపోయా. మనలో ఎవరన్నా బతికున్నారా అని అడిగాడతను. అశ్వత్థామ, కృప, కృతవర్మల గురించి చెప్పాన్నేను. అప్పుడతను నా బుజం తట్టి నీతో చెప్పటానికి నాతో ఇలా అన్నాడు – “మనవాళ్ళంతా మరణించారు, శత్రువులు, వాళ్ళ చుట్టాలు దిట్టంగా వున్నారు. ఇప్పటికి నేను తప్పించుకుని ఎక్కడికన్నా పోయి వుండి మెల్లగా బలం కూడగట్టుకుని ఎప్పటికైనా పగ తీరుస్తానని చెప్పు”.

తర్వాత మాయాప్రభావంతో నీళ్ళు తనని అంటకుండా ఆ మడుగులో జలస్తంభనంలో కూర్చున్నాడు దుర్యోధనుడు.

ఇంతలో అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ అటువైపు వచ్చారు. వాళ్ళ రథాశ్వాలు అలిసిపోయి కదల్లేక కదులుతున్నయ్. వాళ్ళు కూడ శస్త్రాస్త్రాల దెబ్బలకి ఒళ్ళు హూనమై దయనీయస్థితిలో వున్నారు. నన్ను చూసి ఇంకా బతికేవున్నానని ఆశ్చర్యపడ్డారు. దుర్యోధనుడి జాడ తెలుసునా అని నన్నడిగితే, నేనక్కడ జరిగిందంతా వాళ్ళకి చెప్పా. మేమిలా మాట్టాడుకునేంతలో ఆ చుట్టుపక్కల పాండవులొస్తున్న శబ్దాలు వినిపిస్తే హడావుడిగా అక్కణ్ణుంచి మన శిబిరానికి వెళ్ళాం.

అక్కడంతా భీభత్సంగా వుంది. అప్పటికే హతశేషులైన పనివాళ్ళ వల్ల యోధులంతా మరణించారని విని ఆడవాళ్ళంతా బిగ్గరగా దీనంగా ఘోరంగా ఏడుస్తున్నారు, ఎక్కడ చూసినా రోదనధ్వనులే వినబడుతున్నయ్. అంతఃపురకాంతల్ని తగు వాహనాల మీద హస్తినకి పంపుతున్నారు పరిచారకులు. అదెలా జరిగిందంటే, కౌరవకాంతల రోదనలు విని యుయుత్సుడికి కడుపు తరుక్కుపోయింది. వేగంగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళని హస్తినకి తీసుకెళ్ళి దించటానికి అనుజ్ఞ అడిగితే అతను కృష్ణుడి అనుమతితో అది చాలా మంచి ఆలోచనని యుయుత్సుణ్ణి అభినందించి కౌగిలించి సాదరంగా పంపించాడు. యుయుత్సుడు మన శిబిరంలోని వృద్ధకంచుకుల్తో కలిసి ఎవరెవరికి ఎలాటి వాహనాలు ఏర్పాటు చెయ్యాలో అవి ఏర్పాటు చేసి అందర్నీ తీసుకుని హస్తినకి వచ్చాడు. అప్పుడతనికి ఎదురుగా విదురుడు కనిపించాడు. యుద్ధరంగంలో జరిగిన విషయాలు యుయుత్సుడతనికి చెప్తే విదురుడు “ఇప్పటి వరకు సంజయుడు వచ్చి మహారాజుకి యుద్ధవార్తలు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ విషయం చెప్పటం బాగుండదు. సంజయుడు వచ్చేవరకు ఈ కౌరవకాంతల్ని నువ్వు నీ ఇంట్లో వుంచుకో, యుద్ధం విషయాలు బయటికి పొక్కకుండా మనం కట్టుదిట్టం చేద్దాం” అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి అలాగే చేశారు. యుయుత్సుడు స్త్రీలందర్నీ తన మందిరంలో వుంచి గట్టి కాపలాలు పెట్టించాడు.

అలా, స్త్రీలందరూ వెళ్ళిపోవటంతో మన శిబిరాలు నిశ్శబ్దమై పోయినయ్. కేవలం పరిచారకులు మాత్రం మిగిలారు. ఇంతలో దుర్యోధనుడి కోసం వెదుకుతూ పాండవులు వస్తున్న కలకలం వినపడి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ ఎక్కడికో వెళ్ళిపోయారు. పాండవులు వెదికి వెదికి అతను కనిపించక తిరిగెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ నేనూ, మన ముగ్గురు యోధులూ మడుగు దగ్గరికెళ్ళాం.

ఆ ముగ్గురూ దుర్యోధనుణ్ణి ఆప్యాయంగా పలకరించారు. “రారాజా, నీలాటి వాడికిది యోగ్యమైన పని కాదు. బయటికి రా, మనం వెళ్ళి పాండవుల్ని చించిచెండాడుదాం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు మా వెనకుండు, మేం నీకు రాజ్యం తెచ్చిపెడతాం. అలా జరగదా, అందరం కలిసి వీరస్వర్గం చేరుదాం” అని ఉత్సాహపరిచారతన్ని. ఐతే దుర్యోధనుడి ఆలోచన వేరేగా వుంది. “అస్త్ర శస్త్రాల దెబ్బలకి ఒళ్ళు అవిసిపోయింది, మనసు వశం తప్పింది. మీ మాటల బట్టి మీరూ బాగా అలిసినట్టనిపిస్తుంది. ఇవాల్టికి విశ్రాంతి తీసుకుందాం, రేపు ఉదయమే లేచి వాళ్ళ పనిపడదాం” అన్నాడతను వాళ్ళతో. అశ్వత్థామ సాహసంగా “నీకెలాటి అనుమానం వద్దు, నేను పాంచాల సైన్యాల్ని సమూలంగా నాశనం చేసి నీకూ, నా తండ్రికీ ఋణం తీరుస్తా, అప్పటివరకు కవచం విడవను” అని ప్రతిజ్ఞ చేశాడు.

ఈ లోగా ఏం జరిగిందంటే – భీముడి కోసం మాంసం మోసుకుపోతున్న కిరాతులు కొందరు నీళ్ళ కోసం అదే మడుగు దగ్గర ఆగి దప్పి తీర్చుకుంటుండగా వాళ్ళకి మేం కనపడ్డాం. అంతకు ముందే ధర్మరాజు దుర్యోధనుడెక్కడన్నా అడవుల్లో కనపడితే చెప్పమని అడవిజాతుల వాళ్ళకి చెప్పి వున్నాడు గనక ఈ కిరాతులు మేం మాట్టాడుకునే మాటలన్నీ జాగ్రత్తగా విన్నారు. ఆ తర్వాత దుర్యోధనుడు కూడ మాతో సంభాషించటం విని వెంటనే ఆ మాంసపు మూటల్నక్కడే పడేసి దుర్యోధనుడి జాడ భీముడికి చెప్తే అంతకన్న ఎక్కువ బహుమానాలు దొరుకుతాయని పరుగున అతనికి దగ్గరకి వెళ్ళి అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి తోసుకుంటూ అతని దర్శనం చేసి దుర్యోధనుణ్ణి చూశామని అతనికి చెప్పారు. అతను ఆనందంతో వాళ్ళకి మోయలేనన్ని బహుమానాలిచ్చి అన్న దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు మడుగు దగ్గర చూసింది, విన్నది మళ్ళీ చెప్పించాడు. అంతా విని ధర్మరాజు కూడ వాళ్ళకి అనేక బహుమానాలిచ్చి వెంటనే తన బంధు బలగాల్తో మడుక్కేసి బయల్దేరాడు.

అలా, మేం దుర్యోధనుడితో మాట్టాడుతుండగానే పాండవులక్కడికి వేగంగా వస్తున్న ధ్వనులు వినపడినయ్. మన రథికులు ఆత్రుతగా దుర్యోధనుడితో “రారాజా, ఇప్పుడు కర్తవ్యం ఏమిటో త్వరగా నిర్ణయించాలి నువ్వు. బయటికి వచ్చావా, ఇక్కడే వాళ్ళతో తలపడి యుద్ధం చేద్దాం, లేదూ ఇప్పుడు కాదు, తర్వాత అంటే నిన్ను ఎప్పుడు ఎక్కడ కలవమంటావో చెప్పు, అప్పుడు అక్కడికి వచ్చి కలుస్తాం” అనడిగారతన్ని. దుర్యోధనుడు “ఇప్పటికి ఇక్కడ వుండకుండా ఎక్కడికన్నా వెళ్ళి చీకటి పడ్డాక ఇక్కడికే రండి. అందాకా నేను నా జలస్తంభన విద్యతో నీళ్ళలోనే వుంటా, నన్ను బయటికి రప్పించటం వాళ్ళ తరం కాదు” అని చెప్పి పంపించాడు మమ్మల్ని. మేమంతా రథాల మీద బయల్దేరాం కాని అతన్ని ఒంటరిగా అలా విడిచి వెళ్ళటానికి మనసొప్పక కొంచెం దూరం వెళ్ళాక నేను దిగిపోయా. కాకపోతే పాండవుల చారులు ఆ చుట్టుపక్కలంతా గాలిస్తున్నారు గనక వెంటనే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళకుండా ఒక పొదలో నక్కి కూర్చుని అక్కడ జరిగేదంతా చూస్తున్నా. మిగిలిన ముగ్గురూ దూరంగా వెళ్ళి ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుని విచారిస్తున్నారు.

ఇక్కడ, కిలకిల నవ్వుకుంటూ సరససంభాషణలు చేసుకుంటూ, పాంచాల కుమారులు వెనక వస్తుంటే ఆర్భాటంగా కదిలొచ్చారు పాండవులు. ఎదురుగా మడుగులో జలస్తంభనంతో హాయిగా వున్న దుర్యోధనుడి సంగతి గ్రహించారు. ధర్మరాజు కృష్ణుడితో మెల్లగా అన్నాడూ “చూశావా, ఎలా దాక్కున్నాడో? మనం ఎవరం తన దగ్గరికి వెళ్ళలేం, అది తెలిసి తనూ ఏమాత్రం భయం లేకుండా వున్నాడు” అని. కృష్ణుడు కూడ అతనితో గుసగుసగా “మాయల బుద్ధి ఇప్పటికీ పోనిచ్చుకున్నాడు కాడు. కాకపోతే ఇదివరకు ఎంతమంది రాక్షసులు మాయల్తో విర్రవీగలేదూ, వాళ్ళకి తగిన ఉపాయాల్తో వాళ్ళని విష్ణువు, ఇంద్రుడు చంపలేదు? వీణ్ణీ ఎలాగో బయటికి రప్పించే ఉపాయం ఆలోచించు” అని బదులిచ్చాడు.

మడుగులో వున్న దుర్యోధనుణ్ణి సూటిపోటి మాటల్తో బయటికి రప్పించదల్చుకున్నాడు ధర్మరాజు. “సుయోధనా, ఇలాటి దౌర్భాగ్య పరిస్థితి లోకంలో ఎక్కడన్నా విన్నామా, కన్నామా? నీకోసం పోరాడి అసంఖ్యాకులైన రాజులు, బంధువులు, మిత్రులు చస్తే నువ్వొక్కడివి ప్రాణాలు కాపాడుకోవటానికి నీళ్ళలో దాక్కున్నావా? నిన్ను వీరుడంటారు, శూరుడంటారు, అభిమానధనుడంటారు. రాజువి, అందునా కౌరవవంశాన పుట్టినవాడివి. అంతా నవ్వే ఈ నీ ప్రవర్తన వంశానికే తలవంపులు కాదా? రాజధర్మం వదిలిన వాడికి ఇహముందా, పరముందా? కొడుకులు, తమ్ముళ్ళు యుద్ధాన ఘోరపుచావులు చచ్చినా నీ శరీరాన్ని రక్షించుకోవటానికిలా మడుగులో దాక్కున్నావే, ఇంత నీచపు బతుకా? పాండవులకి భయపడి రాజరాజు వెళ్ళి మడుగులో దాక్కున్నాడని లోకమైంతా కోడైకూస్తుందే, చివరికిదా నువ్వు కోరుకున్న కీర్తి? కర్ణ, శకుని, దుశ్శాసనులు నిన్నుద్ధరిస్తారనుకున్నావ్, అది సాగకపోయేసరికి ఇలా పిరికిపందవై పారిపోయొచ్చావ్. రాజధర్మం ప్రకారం వచ్చి శత్రువుల్తో తలపడు, చావో రేవో తేల్చుకో. గెలిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం. ఏదైనా రాజులకి సమ్మతమైన మార్గమే. నీళ్ళలో దాక్కోవటం వల్ల నగుబాటు తప్ప ఏమీ ఉపయోగం లేదు. తెంపు చేసి దూకటం మగతనం, దాక్కోవటం కాదు” అని అతనంటే, నీళ్ళలోంచే ఇలా బదులిచ్చాడు దుర్యోధనుడు –

“ప్రాణభయం కాదు, నేనా ఒంటరివాణ్ణి; ఆయుధాలు లేవు, పరివారాలు లేవు, బంధుమిత్రులు లేరు. అలిసిపోయా, దప్పికతో వున్నా, ఒళ్ళంతా హూనమై వున్నా. బుద్ధి యుద్ధం మీదికి పోక వున్నా. విశ్రాంతి తీసుకుంటున్నా తప్ప యుద్ధం మానేశానని కాదు. మీరూ అలిసినట్టున్నారు. బడలిక తీరాక వద్దురు, అప్పుడు చేద్దాం యుద్ధం”.

అతని మాటలకి ధర్మరాజు విసుక్కున్నాడు. “నువ్విప్పటివరకు తీసుకున్న విశ్రాంతి చాలు, బడలికా బాగానే తీరింది. మాటలెందుకు, యుద్ధానికి సిద్ధపడు” అన్నాడతనితో. దుర్యోధనుడికీ ఒళ్ళు మండింది. “ఎవరికోసం రాజ్యం, భోగాలు కావాలనుకున్నానో ఆ కొడుకులు, తమ్ముళ్ళు ఇకలేరు. ఈ రాజ్యం నాకెందుకు, నువ్వే కట్టుకుని ఊరేగు. నీ తమ్ముళ్ళు, చుట్టాలు బతికేవున్నారు, ఏనుగులూ గుర్రాలూ లేకపోతేనేం? ఈ బీడుబడ్డ రాజ్యం నీదే, ఏలుకో పో” అన్నాడతను ఈసడింపుగా.

అది విని చిరునవ్వు నవ్వాడు ధర్మరాజు. “కొడుకులు, తమ్ముళ్ళు అంతా చచ్చాక కూడ శల్యుడి సాయంతో మమ్మల్ని గెలుద్దామని బయల్దేరావు కదా, ఇంతలోనే విడ్డూరంగా అదేమీ జరగనట్టు మాట్టాడుతున్నావ్! ఐనా నువ్వుండగా నేను రాజునెలా ఔతాను? నిన్ను చంపి నేను రాజునౌతా, లేదా నన్నోడించి నువ్వు రాజ్యం తీసుకో. అంతేగాని రాజ్యం ఇస్తున్నా అనే మాటకి అర్థం వుందా? కృష్ణుడు రాయబారిగా నీ దగ్గరికొచ్చినప్పుడు సూదిమొన మోపినంత చోటివ్వనన్నావే, నువ్వే రాజ్యం ఇచ్చేవాడివైతే కురువంశం అంతా ఇలా ఎందుకు నాశనం ఔతుంది? గెలిచే దారి కనిపించక ఈ మాటలంటున్నావ్ గాని నువ్వు కావాలని రాజ్యం ఇస్తావా? అసలు శత్రువులకి సంపదలిస్తాననే వెర్రివాడుంటాడా? పైగా, నువ్విప్పుడు రాజ్యం ఇచ్చినా నిన్ను వదుల్తాననుకున్నావా? ఐనా ఇంత నీచమైన పనెందుకు, రాజోచితంగా ప్రవర్తించు” అని చీవాట్లు పెట్టాడు.

మిగతా పాండవులు, చుట్టుపక్కలున్న వాళ్ళు కూడ అలాటి సూటిపోటి మాటల్తో హింసించారతన్ని. అవి వింటూ ఎక్కువసేపు భరించలేకపోయాడు దుర్యోధనుడు. చివరికి యుద్ధానికే నిశ్చయించుకున్నాడు. ధర్మరాజుతో “మీరా ఐదుగురన్నదమ్ములు, చుట్టాలు, పరివారం ఇంతమంది వున్నారు, నేనొక్కణ్ణి. ఇంతమంది ఒకడితో యుద్ధం చెయ్యటం ధర్మం కాదు. కాబట్టి మీరు ఒక్కొక్కరే రండి, నేను మీ అందర్నీ వరసగా చంపుతా. అలా కాదంటే నువ్వు, నీ తమ్ముళ్ళు, సాత్యకి, ద్రౌపది అన్నదమ్ములు – మీరంతా ఒక్కసారి రండి. ఒక్క దెబ్బతో చంపుతా. ఏదో మీకు భయపడి ఇలా అంటున్నానుకోకు, సమరధర్మం చెప్తున్నానంతే. ఇప్పుడే వచ్చి మిమ్మల్ని చంపి భీష్మ, ద్రోణ, కర్ణ, భగదత్త, బాహ్లిక, సైంధవ, శకుని, శల్యాది బంధుమిత్రుల ఋణం తీరుస్తా” అన్నాడతను పౌరుషంగా.

ధర్మరాజు అతను దారికి వస్తున్నాడని సంతోషించాడు. “యుద్ధధర్మం గుర్తుంచుకుని శత్రువుల్ని గెలవాలని నువ్వుబలాటపడటం బాగుంది. ఒక్కడివే వచ్చి ఇంతమందితో తలపడతాననటం నీ ధైర్యసాహసాలకి గుర్తు. ఐతే నువ్వలా అన్నంతమాత్రాన నేను ఒప్పుకుంటాననుకోకు. నీక్కావల్సిన శస్త్రాస్త్రాలు, వాహనం తీసుకో. మాలో ఒక్కడు నీతో పోరాడతాడు, మిగతా అందరం పక్కన నిలబడి చూస్తాం. నువ్వు గెలిస్తే రాజ్యం నీదే ” అన్నాడతనితో.

దానికి దుర్యోధనుడు “ఇదీ బాగానే వుంది, ఇన్నాళ్ళూ రథాల మీద అస్త్రశస్త్రాల్తో రణాలు చేశాం, చూశాం. వింతకూరలు భోజనానికి రుచినిచ్చినట్టు కొత్త రకాల యుద్ధమార్గాలు కూడ వీరుడికి ప్రీతికరాలే. నేను గదాదండాన్ని ధరించి పదాతినై నిలబడతా, మీ అంతు చూస్తా” అన్నాడు ఉత్సాహంగా. వెంటనే ధర్మరాజు “అలాగే, వేరే ఎవరో ఎందుకు, నేనే గదాధారినై వచ్చి నీ చావు చూస్తా” అని ఉద్రేకంగా బదులిస్తే దుర్యోధనుడు గతుక్కుమన్నాడు, ఆ మాటలతనికి గుచ్చుకున్నయ్. బుట్టలో చిక్కిన మహాసర్పంలా బుసలు కొట్టాడతను. ఆవేశంగా జలాల్ని చీల్చుకుని గదాదండం భుజాన అమర్చుకుని కాలదండం ధరించివచ్చే యముడిలా కదిలి వచ్చాడు.

అలా అతను బయటికి రావటంతో పాండవులు, పాంచాలురు ఒకర్నొకరు బుజాలు చరుచుకున్నారు, వెకిలినవ్వులు నవ్వారు. అవమానంతో దుర్యోధనుడి గుండె రగిలిపోయింది. “నవ్వండి, నవ్వండి. నా గదాఘట్టనలకి ఒక్కొక్కడు మట్టిగరుస్తుంటే అప్పుడింకా పగలబడి నవ్వుదురు గాని” అని ఈసడించుకున్నాడు వాళ్ళని. ఐతే అంతలోనే వాళ్ళంతా ఒక్కసారిగా తన మీద పడతారేమోనని భయం వేసిందతనికి. ధర్మరాజుతో “మీరొక్కకళ్ళే రండి, అంతా ఒక్కసారి రావటం ధర్మం కాదు సుమా” అన్నాడు అనుమానంగా.

ధర్మరాజు “పసివాడు అభిమన్యుణ్ణి ఒక్కడనుకోకుండా పెద్దపెద్ద యోధులు మీరంతా కలిసి చంపారు గుర్తుందా, అలాగే ఇప్పుడూను” అని అతన్నెత్తిపొడిచి, “మాట వరసకన్నా గాని, అది యుద్ధధర్మం కాదని నాకు తెలుసు. జుట్టంతా చక్కగా ముడుచుకో, దిండుతో గట్టిగా బంధించుకో. నీకు ఆనందం కలిగించే విషయం మరోటి చెప్తా విను. మా ఐదుగుర్లో నువ్వే ఎవరో ఒకర్ని ఏరుకో, వాణ్ణి చంపితే నువ్వే రాజువి, లేదా స్వర్గసామ్రాజ్యం నీది. ఇవిగో అన్ని రకాల ఆయుధాలు, పరికరాలు. నీకేవి కావాలో తీసుకో. ప్రాణాల్తో నిన్ను వదలమని తప్ప నీకేం కావలసినా కోరుకో” అన్నాడు.

దుర్యోధనుడు కనకచిత్రితాలైన శిరస్త్రాణాలు, కవచాలు తీసుకుని ధరించాడు. పర్వతం లాటి గదని చేతిలో అమర్చుకున్నాడు. భీకరాకారుడై నిలబడ్డాడు. “నకుల సహదేవులా, అర్జునుడా, భీముడా, నువ్వా, ఎవడు గదాయుద్ధంలో నా ముందు నిలబడే వాడు? ఒక్కొక్కడే రండి, అందర్నీ యముడి దగ్గరికి పంపుతా. నాతో గదాయుద్ధం ఆ ఫాలాక్షుడికే తరం కాదు, మీరో లెక్కా? ఇప్పుడిక నానుంచి మిమ్మల్నెవడు కాపాడతాడో చూస్తా” అని పెద్దగా అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ సమరోత్సాహంతో ఊగిపోతుంటే అతనికి వినపడకుండా కృష్ణుడు గుసగుసగా ధర్మరాజుతో “కొంపముంచావే, ఇప్పుడతను మీ ఐదుగుర్లో ఎవర్నెంచుకున్నా చిక్కే. గదాయుద్ధంలో అతని కౌశలం ముందు మీరెవరూ చాలరు. ఇన్నాళ్ళూ ఇంత కష్టపడి ఇంతమందిని చంపి చివరికి ఈ యుద్ధాన్ని కూడ జూదం కిందికి తీసుకొచ్చావే? అప్పుడు శకునికి మాయాద్యూతంలో సంపదలన్నీ పదమూడేళ్ళు అనుభవించే పందెం కాసినట్టు ఇప్పుడు ఇన్నాళ్ళ శ్రమతో సాధించిందంతా ఒక్క పందెంలో ఒడ్డేస్తున్నావే? భీముణ్ణి యుద్ధానికి పంపుదామంటే అతనికి భుజబలం వుంది గాని దుర్యోధనుడికున్నంత నేర్పు లేదు. ఇప్పుడెలా?” అంటూంటే భీముడు అందుకుని “ఈ మాత్రానికే ఆయన్ని అంతలేసి మాటలంటావెందుకు? ఒక్కసారి గద నాచేతికొచ్చిందంటే వాణ్ణి ప్రాణాల్తో వదుల్తానా? వాడు నన్నేమీ చెయ్యలేడు, చూస్తుండు” అన్నాడతనితో.

అతని నిశ్చయం చూసి ముచ్చటపడ్డాడు కృష్ణుడు. “ఆలోచించకుండా అన్న మాటలవి, పట్టించుకోకు. బకాసురుడి బింకం అణిచావ్, హిడింబుణ్ణి అవలీలగా చంపావ్, కీచకుణ్ణి ముద్దకింద కొట్టావ్, జరాసంధుణ్ణి చిత్రవధ చేశావ్, ఇవి మనుషులు చేసే పన్లేనా? నీ ముందు నిలబడటం మానవమాత్రులకి సాధ్యమయే పనా? యుద్ధంలో కాళిందాదుల ఏనుగుమూకల్ని నేలబెట్టి చావగొట్టావ్, కౌరవులందర్నీ కాటికి పంపావ్. నువ్వు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతుంటే ఇతనూ అక్కడే వుండి చూస్తూ నిలబడ్డాడు తప్ప నిన్నాపగలిగాడా?

అందరూ వెళ్ళి ఒక్కసారి మీదపడి చంపకుండా ధర్మరాజు ఎందుకింత శ్రమ కలిగించాడా అని అనుకున్న మాట వాస్తవం, ఐతే నీ పోటుతనం తల్చుకుని ఊరడిల్లుతున్నా. ఆనాడు సభలో వాళ్ళు ద్రౌపదిని పరాభవించినప్పుడు నువ్వు చేసిన ప్రతిజ్ఞల్లో ఒకటి మిగిలుంది, అదిప్పుడు పూర్తి చెయ్యాలి నువ్వు. యుద్ధం పూర్తి చెయ్, ధర్మరాజుకి రాజ్యం ఇప్పించు. నీ గదపండగని చూట్టానికి అందరమూ ఎదురుచూస్తున్నాం. నువ్వు గెలవటం ఖాయం. నా మాట గుర్తు పెట్టుకో. ఐతే దుర్యోధనుడు తక్కువవాడు కాడు, నువ్వు గట్టిగా యుద్ధం చెయ్యాలి సుమా” అని హెచ్చరించాడతన్ని. మిగిలిన వాళ్ళంతా కూడ భీముణ్ణి పొగిడారు, ఉత్సాహం కలిగించారు.

దుష్టదుర్యోధనుణ్ణి చంపి రాజ్యం అన్న పరం చేస్తానని మాటిచ్చి గదని చేతికమర్చుకుని దుర్యోధనుడి కెదురుగా నిలబడ్డాడు భీముడు – వృత్రాసురుడిపైకి దూకబోయే ఇంద్రుడిలా. ఇనుమడిస్తున్న సమరోత్సాహంతో దుర్యోధనుడితో “పాపపుపనని కొంచెమైనా జంకులేకుండా మమ్మల్ని లక్కయింటిలో కాల్చబోయావ్, శకుని మాయాజూదంలో ధర్మజుణ్ణి వంచించి ద్రౌపదిని సభామధ్యంలో అవమానపరిచావ్, ఆ పాడుపన్ల ఫలితం ఇప్పుడనుభవించబోతున్నావ్. నీకోసం పోరాడి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు గతించారు, అనేకమంది చుట్టాలు, స్నేహితులు వాళ్ళ బంధుమిత్రుల్తో సహా చచ్చారు. అన్నిటికి మూలమైన శకుని కాటికి పోయాడు. నువ్వొక్కడివి మిగిలావ్, ఇప్పుడు నా గదాదండానికి నిన్ను బలిస్తా, తయారై రా” అన్నాడతన్ని కవ్విస్తూ. దుర్యోధనుడు కూడ “ఎందుకీ పనికిరాని మాటలు? చేవుంటే నా గదా సమర కౌశలాన్ని రుచిచూద్దువు రా. గదాయుద్ధంలో నన్ను జయించటం నీకే కాదు, ఆ ఇంద్రుడికైనా అసాధ్యం. ధర్మయుద్ధం చెయ్, నువ్ చావకపోతే చూడు” అని అంతే పదునుగా బదులిచ్చాడు.

ఆ మాటల యుద్ధం చూసి అక్కడున్న రాజులంతా మెచ్చుకున్నారు. దుర్యోధనుడు ఉత్సాహపడ్డాడు. మదగజ ఘీంకారాలు, అశ్వహేషలు చెలరేగినయ్. అందరు కాస్త దూరంగా చుట్టూ కూర్చున్నారు. మధ్యలో భీమ దుర్యోధనులు ప్రచండగదాసమరానికి సిద్ధమౌతున్నారు. వాళ్ళ పదఘట్టనలు నేలని వణికిస్తున్నయ్.

(చివరి భాగానికి…)