సెప్టెంబర్ 1999

ఇతోధికంగా ప్రోత్సాహాన్నిస్తున్న “ఈమాట” పాఠకులకు స్వాగతం! ఈ సంచికలో వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా వారు ఈ సంవత్సరపు కథా, కవితల పోటీలలో ఎన్నుకున్న రచనలను అందిస్తున్నాం. ఇందుకు ఆనందంగా ముందుకు వచ్చి ఎంతో సహకారాన్నందించిన వంగూరి ఫౌండేషన్‌ స్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్‌ రాజు గారికి మా హార్దిక కృతజ్ఞతలు.

క్రితం సంచికలో తానా వారు ఎన్నుకున్న కథలు ఇండియాలో ఉన్న రచయితలవైతే వంగూరి ఫౌండేషన్‌ వారివి అమెరికా రచయితలవి. ఇలా ఈ రెండు ప్రాంతాల రచయితల దృక్పథాల్ని, వాళ్ళు ఎన్నుకున్న అంశాల్ని, వారి వారి కథన పద్ధతుల్ని పోల్చి చూసే అవకాశం కలుగుతోంది. ఆసక్తి ఉన్నవారు ముందుకు వచ్చి యీ విషయంపై వారి అభిప్రాయాలను మిగిలిన వారితో పంచుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయాల్ని “పాఠకుల అభిప్రాయాలు” ద్వారా గాని, లేకుంటే వచ్చే సంచిక కోసం విశ్లేషణాత్మక వ్యాసాలుగా కాని పంపవచ్చు.

శ్రీ చేకూరి రామారావు గారు ఇక్కడికి వచ్చి వెళ్ళిన సందర్భంగా “ఈమాట”కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది మీరు ఈ సంచికలో చూస్తారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను సూటిగా, తేటగా వివరించారాయన. ఇలా ఎంతో ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపిన శ్రీ చేరా గారికి అభివందనాలు. ఈ ఇంటర్వ్యూ జరగటానికి కారకులు, వీటిలో చాలా ప్రశ్నలు తయారుచేసిన వారు శ్రీ విన్నకోట రవిశంకర్‌. వారికి మా కృతజ్ఞతలు.

అసంఖ్యాక అంశాల పరిశోధనల్లో మునిగిపోయి ఉండి కూడా శ్రీ వెల్చేరు నారాయణరావు గారు అజంతా కవిత్వం మీద ఒక చక్కటి వ్యాసం రాసి ఇచ్చారు. వారికీ మా కృతజ్ఞతలు.

ఈ సంచికలో ప్రవేశపెడుతున్న మరో కొత్త శీర్షిక “పదకేళి”. ఇది మీకు వినోదాత్మకంగా ఉంటుందని, ఈ అన్వేషణలో మీరు విస్తృతంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఈ శీర్షికను నడపడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చిన శ్రీ సోమయాజుల కాశీ విశ్వనాథం గారికి మా కృతజ్ఞతలు.

ఎందరో పాఠకులు “ఈమాట”ను చదవటమే కాకుండా వారి బంధుమిత్రులకు కూడా దీని గురించి తెలియజేసి ప్రచారం కలిగిస్తున్నారు. అందుకు వారందరికీ ఎంతో కృతజ్ఞులం. అలాగే, తమకు తెలిసిన రచయితల్ని కూడా “ఈమాట”కు తమ రచనలు పంప వలసిందిగా ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది.

ప్రముఖ రచయిత్రి మహ జబీన్‌ సూచించినట్లు రచయిత్రుల రచనల్ని ప్రచురించాలని మాకూ చాలా ఉత్సాహంగా ఉంది. మగవారితో అన్ని విషయాలలోనూ సమానులుగా ఉన్న ఇక్కడి తెలుగు మహిళలు రచనా విషయంలోనూ ఏమాత్రం తీసిపోకూడదు. వారికి మా హృదయపూర్వక ఆహ్వానం అందిస్తున్నాం. వారి దృష్టికోణం నుంచి ఎన్నో విషయాలను చర్చించవలసిన అవసరం ఉంది.

ముఖచిత్రాల వల్ల ఈ పత్రిక తొలి పేజీ రావటానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నదని, ముఖ్యంగా low speed modemsతో చూడాలనుకుంటున్న వాళ్ళకు కొంత కష్టంగా ఉంటున్నదని కొందరు పాఠకుల నుంచి విన్నాం. అందుకు గాను ప్రయోగాత్మకంగా ఈ సారి ముఖచిత్రం లేకుండా ప్రచురిస్తున్నాం. ఈ విషయం మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తే సంతోషిస్తాం. ఇక ముందు ఎలా చెయ్యాలో నిర్ణయించుకోవటానికి అవెంతో ఉపయోగపడతాయి.