తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మూడవ భాగం

పదమూడవ రోజు

తెల్లవారింది. నీ కొడుకు విషాదవదనంతో అందరికీ వినపడేట్టు ద్రోణుడితో అన్నాడు – “ధర్మరాజుని పట్టిస్తానని నాకు వరం ఇవ్వటం ఎందుకు, దాన్ని తీర్చలేక ఇప్పుడిలా అందరి ముందు నువ్వూ నేనూ చులకన కావటం ఎందుకు? ఇలా నన్ను వెర్రివాణ్ణి చేస్తే నీకు ఒరిగిందేమిటి?” అని. ఆ మాటలు నచ్చకపోయినా బాధపడకుండా ద్రోణుడన్నాడూ – “నరనారాయణులు అక్కడుంటే ధర్మరాజుని పట్టటం సాధ్యమా? ఇవాళ ఏం చేస్తానో చూద్దువు గాని, ఎలాగైనా అర్జునుణ్ణి దూరంగా తీసుకువెళ్ళే మార్గం చూడు. ఇచ్చిన మాట తప్పుతానా?”

అప్పుడు సంశప్తకులు మేం తప్ప అతన్ని పక్కకి తీసుకెళ్ళి అక్కడే యుద్ధంతో తీరికలేకుండా ఉంచగలిగే వాళ్ళు ఇంకెవరూ లేరు అని వెళ్ళి మళ్ళీ అర్జునుణ్ణి యుద్ధానికి పిలిచారు. అర్జునుడలా వెళ్తే ద్రోణుడు పద్మవ్యూహం సంఘటించాడు. దానికి అనేక రాజులు దళాలు. రాజకుమారులు కేసరాలు. కర్ణ దుశ్శాసనుల్తో దుర్యోధనుడు కర్ణిక. వలయాకారంగా వుంటుంది గనక కొందరు దాన్ని చక్రవ్యూహం అని కూడ అంటారు. ఆ వ్యూహానికి ముఖస్థానాన ద్రోణుడు దర్పంతో నిలబడ్డాడు. అవసరమైన చోట్లలో రక్తమాల్యాలు ధరించి సైంధవుడు, అశ్వత్థామ, కృపుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శల్యుడు, నీకొడుకులు, మనవలు నిలిచారు. పాండవసైన్యం భీకరంగా వచ్చి ద్రోణుణ్ణి తాకింది. ఐతే అతని బాణధాటికి నిలబడి ఎవరూ వ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించలేక పోయారు.

ధర్మరాజు కల్లోలపడ్డాడు. ఈ ఆపద నుంచి బయట పడెయ్యగలిగింది ఎవరా అని చుట్టూ వెదుకుతుంటే ఉత్సాహ, శౌర్య సంపదల్లో దుర్నిరీక్ష్యుడైన అభిమన్యుడు కనపడ్డాడు. అతన్ని చూసి వీడు తప్ప ఇంకెవరూ ఈ మొగ్గరాన్ని నుగ్గు చెయ్యలేరని నిశ్చయించాడు ధర్మరాజు. “దీన్ని భేదించటం అర్జునుడికీ నీకూ కృష్ణుడికీ ప్రద్యుమ్నుడికీ మాత్రమే తెలుసు. కనుక నువ్విప్పుడు దీన్ని ఛేదించి మన పరువు కాపాడు” అనడిగాడు. దానికతను చిరునవ్వు ముఖంతో “మా తండ్రి నాకు దీన్ని భేదించే మార్గం చెప్పాడు. కనుక వ్యూహాన్ని విచ్ఛిన్నం చేసి లోనికి వెళ్ళి శత్రుబలగాల్ని చించి చెండాడతా. కాని శత్రువులు మూకుమ్మడిగా చుట్టుముడితే బయటికొచ్చే దారి మాత్రం నాకు తెలీదు. ఐనా దానికేముంది, అవసరాన్ని బట్టి ఏదో చేస్తాలే. నేను ఈ మొగ్గరాన్నెలా ప్రవేశిస్తానో చూద్దువుగా” అన్నాడు ఉల్లాసంగా.

దానికి ధర్మజుడు “నువ్వు తెరిస్తే నీవెనకే మేమూ వస్తాం. అదే నువ్వు మాకిచ్చే వరం” అని చెప్పాడు. భీముడు కూడ, “నువ్వు ముందు ఈ వ్యూహం లోకి కొంచెం దారి చెయ్యి చాలు, నేనూ సాత్యకీ ద్రుపదుడు ధృష్టద్యుమ్నుడు విరాటుడు నీ వెనకే వచ్చి దాన్ని చెల్లాచెదురు చేసేస్తాం” అన్నాడు. దానికి అభిమన్యుడు, “ధర్మజుడు ఇంత ప్రీతిగా అడిగి గౌరవిస్తే, ద్రోణుడు మెచ్చేట్టు ఆ మొనని పిండి చెయ్యకుండా ఉంటానా? కొడుకుని కని అర్జునుడూ సుభద్రా పొందిన ఆనందం వమ్ము చేస్తానా? వయసులో చిన్నవాడినైనా గోపకుడినై కౌరవమూకల్ని గోవుల్లా తోలి చూపిస్తా. మామకి, తండ్రికి ప్రియం చేస్తా. సుయోధనుడు బిత్తరపోయేట్టు చేస్తా” అన్నాడు ఉబుకుతున్న ఉత్సాహంతో. ధర్మరాజు “నీ ధైర్యం, శౌర్యం, బలం, కీర్తి వర్ధిల్లుతాయ”ని దీవించాడు.

అభిమన్యుడు తన సారథితో రథాన్ని ద్రోణుడి మీదికి పోనివ్వమన్నాడు. ఆ సుమిత్రుడు అనుమానంగా “నువ్వా బాలుడివి. అనేక యుద్ధాల్లో ఆరితేరిన ద్రోణాదులు తొలియుద్ధం చేస్తున్న నీ చేతిలో ఓడుతారనుకోవటం అత్యాశేమో” అంటే “ద్రోణాదులే కాదు ఇంద్రాదులొచ్చినా, ఆ ఫాలాక్షుడే స్వయంగా పూనుకున్నా నేను జయిస్తా. ఏం భయమక్కర్లేదు, పద” అని అదిల్చి ద్రోణుడి కెదురుగా బయల్దేరాడు. అతని వెనకే మిగతా సేన కదిలింది. ద్రోణాదులు వాళ్ళనెదుర్కుని పోరారు. ఐతే మెరుపు మెరిసినట్టు బాణవర్షంలో ద్రోణుణ్ణి ముంచి అతన్ని దాటి మొగ్గరం లోకి జొరబడ్డాడు అభిమన్యుడు.

ఇలా భేదించటం మహా కష్టమైన ఆ పద్మవ్యూహాన్ని అవలీలగా ఛేదించి ప్రవేశించిన అభిమన్యుడు తన శరపరంపరల్తో కౌరవసేనని కల్లోలసముద్రం చేశాడు. విరిగిన రథాలు, తెగిన తలలు, ముక్కలైన కేతనాలు, చెల్లాచెదురుగా పడ్డ చేతులు, కాళ్ళు, గుర్రాలు, ఏనుగులు – వ్యూహం కాస్తా విచ్చి చితికి దీనదశకి చేరుకుంది. ఇది చూసి సహించలేక నీ కొడుకు అతని మీదికి దూకబోతుంటే ద్రోణుడు చెయ్యి ఊపి పెద్దరాజుల్ని కేకేసి “దుర్యోధనుడు అభిమన్యుడి వాత పడకుండా అడ్డుపడండి, మీ శౌర్యపరాక్రమాలు చూపండి” అని ఎలుగెత్తి చెప్తూ తన రథాన్ని అటుకేసి మళ్ళించాడు.

కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, భూరిశ్రవుడు, శలుడు, సౌబలుడు, పౌరవుడు, శల్యుడు, వృషసేనుడు దుర్యోధనుడికి అడ్డుగా నిలిచి అభిమన్యుడితో తలపడ్డారు. నోటి కండ లాక్కుంటే దూకే పులిలా విజృంభించి అభిమన్యుడు వాళ్ళని చెల్లాచెదురు చేశాడు. లేళ్ళగుంపులా పారుతున్న ఆ యోధానుయోధుల్ని చూసి వీణ్ణి వారించటం వీళ్ళ వల్ల అయే పనికాదని స్వయంగా తనే అందుకు పూనుకున్నాడు ఆచార్యుడు. పారిపోతున్నవాళ్ళు కూడ అతన్ని వచ్చి కలిశారు. ఐతే అభిమన్యుడు అందరినీ సమాధానపరిచి తన నిశితశరాల్తో శరీరాలు తూట్లు పొడుస్తుంటే దుర్యోధనుడు సేనకి చెయ్యి ఊపి పిలిచాడు. బలవంతులైన అనేకమంది దొరలొచ్చి అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు.

అభిమన్యుడు తన మీదికి ఆవేశంగా వచ్చిన అశ్మకుణ్ణి రథంతో సహా నుగ్గుచేశాడు. అదిచూసి విరుగుతున్న బలాల్ని కూడకట్టి ద్రోణాదులు, నీ కొడుకులు కొందరు అభిమన్యుడితో తలపడితే అతను వాళ్ళందరికీ గాయాలు చేసి కర్ణుడి వెంట పడ్డాడు. అతను వేసిన ఒక క్రూరనారాచం కర్ణుడి కవచాన్ని చొచ్చి గాయం చేస్తే అతను కటకట పడ్డాడు. అభిమన్యుడు నీ కొడుకుల్నందర్నీ కూడ అలాగే చేస్తే వాళ్ళు వెనక్కి తగ్గారు. శల్యుడు వేగంగా వచ్చి తాకితే అంతే వేగంగా అతన్ని మూర్ఛితుణ్ణి చేస్తే నీ బలాలు ద్రోణుడు వారిస్తున్నా వినకుండా దిక్కులేకుండా పారిపోయినయ్. శల్యుడలా ఐతే అతని తమ్ముడు కోపోద్రేకంతో పది తీవ్రబాణాల్తో అభిమన్యుణ్ణి గుచ్చాడు. దాంతో అభిమన్యుడు కాలయముడై వాడి గుర్రాల్ని చంపి, సారథిని కూల్చి, పతాకని పటుక్కున విరిచి, వాడి రెండు ఘనబాహువుల్నీ తుంచి, వేగంగా వాడి దగ్గరికి వెళ్ళి భల్లంతో వాడి తల నేల దొర్లించాడు.

కౌరవవీరానీకం కలిసికట్టుగా అతన్ని కమ్ముకుంది. ఐనా అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందరికీ అన్ని రూపులా తానే బలుపిడుగులు కురిసే ప్రళయమేఘంలా భల్లాలు, అంజలికాలు, క్షురాలు, ప్రకూర్మాలు, నఖరాలు – ఇలా నానా రకాల ఆయుధాల్తో మనసేనని అల్లకల్లోలం చేస్తుంటే విచ్చి పారే సైన్యాన్ని ఆపలేక ఆచార్యుడు నివ్వెరపోయి చూస్తూ నిలబడ్డాడు. ఐతే అలా విరిగిన మనసేనని పోనివ్వకుండా వెంట తరిమి అభిమన్యుడు తన రథాన్ని కొరివి తిప్పినట్టు చుట్టూ తిప్పుతూ పీనుగుపెంటలు చేశాడు.

అప్పుడా కుమారుడి వీరవిక్రమాన్ని చూసి ద్రోణుడు ముచ్చటపడ్డాడు. దుర్యోధనుడికి బుద్దొచ్చేలా అతనికి వినపడేట్టు కృపుడితో ఇలా అన్నాడు – “ఈ విజయాత్మజుడు చూశావా, ఒక్కడే మన బలంలో వున్న యోధానుయోధులందర్నీ కలిపి ఎలా మట్టిగరిపిస్తున్నాడో!” అది విని అతిదీనంగా చూస్తూ నవ్వుగానినవ్వు నవ్వుతూ నీ కొడుకు తన చుట్టూ వాళ్ళతో అన్నాడు -“ఈ ధనురాచార్యుడి మాటలు వింటున్నారా – ఒక్క బాలుణ్ణి, వెర్రివెధవని ఎంత పెద్ద చేసి పొగుడుతున్నాడో? అర్జునుడి మీది పక్షపాతం చూపించుకుంటున్నాడు గాని ద్రోణుడే తల్చుకుంటే వీడిలా చెలరేగ్గలడా? అది తెలీక వీడు ఇదంతా తన పోటుతనం అనుకుంటున్నాడు. అందరూ కలిసి దూకి వీడి అంతు చూడండి.” అది విని అందరూ అభిమన్యుడి మీదికి వెళ్ళబోతుంటే దుశ్శాసనుడు వాళ్ళని ఆపి “వీడి సంగతి చూడటానికి ఇంతమంది ఎందుకు, నేనొక్కణ్ణే వీణ్ణి అంతం చేస్తా. అది విని కృష్ణార్జునులూ చస్తారు. దాంతో మన పగ తీరిపోతుంది,” అని ఒక్క అరుపు అరిచి ఆవేశంగా అభిమన్యుణ్ణి తాకాడు.

కరలాఘవాలు, శరలాఘవాలు, విచిత్ర రథప్రచారాల్తో వాళ్ళిద్దరూ యుద్ధం సాగించారు. మిగిలిన వాళ్ళంతా ప్రేక్షకులై చూస్తున్నారు. అభిమన్యుడు నీ కొడుకు విల్లు తుంచి భల్లాల్తో ఒళ్ళు తూట్లు చేసి “అప్పుడు సభలో ధర్మరాజుకి బాధ కలిగించేట్టు నువ్వన్న మాటలకి ఫలితం ఇప్పుడు చూపిస్తా నీకు, పిరికిపందా! పారిపోకుండా కొంచెం సేపు నిలబడి తలపడు. నిన్ను చంపి నన్ను పెంచిన వాళ్ళ ఋణం తీర్చుకుంటా” అని అతని వీపు సంధి ఎముకల్లో ఒక వాలాన్ని, వక్షాన మరికొన్ని వాలాల్ని గుచ్చితే ఎప్పుడో చచ్చిన పీనుగులా రథమ్మీద చేరగిలపడ్డాడతను. సారథి రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. అది వరకు అభిమన్యుడి వెనకనే వచ్చి వ్యూహం లోకి జొరబడి అడ్డుపడిన బలాల్తో పోరుతూ తలలెత్తిచూస్తూ అభిమన్యుడి యుద్ధం గమనిస్తున్న పాండవులు అది చూసి ఆనందంతో అరిచారు.

దుర్యోధనుడు బాధగా కర్ణుణ్ణి చూసి వీడు దుశ్శాసనుణ్ణి ఎలా గాయపరిచాడో చూశావా అంటే అర్థం చేసుకుని అతను తన బలాల్తో అభిమన్యుడి మీదికి నడిచి దివ్యాస్త్రాలు వేస్తే అభిమన్యుడు లెక్కచెయ్యకుండా అతనితో తలపడితే యుద్ధంలో కర్ణుడు అలిసిపోవటం చూసి అతని తమ్ముడు అభిమన్యుడి మీద బాణపరంపరలు విసిరాడు. క్రోధంతో అభిమన్యుడు ఓ భల్లంతో వాడి శిరస్సుని ఖండించాడు. అది చూసి కర్ణుడు పక్కకి తొలిగిపోతే అతని సైన్యం అభిమన్యుణ్ణి కప్పుకుంది. అతను వాళ్ళని చిందరవందర చేసి కర్ణుడి వెంటపడితే అతను భయంతో పారిపోయాడు. అతన్ని చూసి సైన్యం కూడ కకావికలైంది. అప్పటికీ ద్రోణుడు పేరుపేరునా పిలిచి కర్ణా నిలబడు, కృపా ఇలా పారిపోతే ఎలా, బాహ్లికా ఇలా భయపడటం తగునా, రారాజా నీ బలం ధైర్యం చూపి నిలబడు అంటూ ఎంత పురికొల్పినా ఎవరూ అతన్ని పట్టించుకోనేలేదు.

అభిమన్యుడు ఉత్సాహంతో సింహనాదం చేసి శంఖం మోగించి విల్లుతాడు సారించి తనివి తీరక ఆ దొరలందర్నీ తరిమి తరిమి కొట్టాడు. రణరంగం దారుణమైంది. ఎటు చూసినా అవయవాలు, శవాలు, నెత్తుటి మడుగులు. అప్పటి మధ్యాహ్న సూర్యుడూ తనూ ఒకరే ఐనట్టు ఆ బాలుడు తీవ్రుడై మన సైన్యాన్ని కాల్చి మసిచేశాడు.

ఇది వింటున్న ధృతరాష్ట్రుడికి ఒక సందేహం కలిగింది “సంజయా, బాలుడొక్కడే అంతమంది మహారథుల్తో పోరుతుంటే పాండవుల్లో ఒక్కరు కూడ వాడికి తోడుగా రాక పోవటం ఎలా జరిగింది?” అనడిగాడు. దానికి సంజయుడు “పాంచాల యాదవ పాండ్య కేకయ విరాట సైన్యాలు తోడురాగా మన సేనల్ని అల్లకల్లోలం చేస్తూ అభిమన్యుడి వెనకే కదిలొచ్చిన పాండవసైన్యాన్ని సైంధవుడు అడ్డుకున్నాడు” అని చెప్తే ధృతరాష్ట్రుడు “అలా పాండవుల్ని అడ్డుకోవటానికి సైంధవుడెంత తపస్సు చేశాడో కదా, లేకుంటే అదెలా సాధ్యం?” అన్నాడు. “నువ్వన్నది నిజమే. పాండవులు అరణ్యాల్లో ఉన్నప్పుడు ద్రౌపది విషయంలో తనకి జరిగిన అవమానానికి బాధపడి పరమేశ్వరుణ్ణి గురించి గాఢతపస్సు చేశాడతను. ఈశ్వరుడు ప్రత్యక్షమైతే పాండవుల్ని నివారించే వరం కోరుకుంటే ఆ మహాదేవుడు ఒక్కరోజు అర్జునుడు తప్ప మిగిలిన పాండవులందర్నీ నివారించే వరం ఇచ్చాడు. అందువల్ల అతనికి ఆరోజు ఆ గౌరవం దక్కింది” అని యుద్ధక్రమం చెప్పటం కొనసాగించాడు సంజయుడు.

సింధుదేశపు స్థిరవారువాలు కట్టిన రథమ్మీద వరగర్వంతో నిలిచి నీ అల్లుడు సైంధవుడు సాత్యకిని, భీముణ్ణి, ధృష్టద్యుమ్నుణ్ణి, విరాటుణ్ణి, శిఖండిని, ద్రుపదుణ్ణి, ద్రౌపదీయుల్ని, కేకయుల్ని, ధర్మరాజుని – అందర్నీ తనొక్కడే ఎదుర్కుని వారించి ముప్పుతిప్పలు పెట్టాడు. అంతకుముందు అభిమన్యుడి విక్రమానికి నుగ్గైన రథాలు, జంతుకళేబరాలు కూడ వాళ్ళ మార్గాన్ని దుర్గమం చేశాయి. ఇంతలో అభిమన్యుడి ధాటికి పారిపోతున్న మన సేనలు కూడ వచ్చి సైంధవుణ్ణి కలిసి పాండవబలగాల్ని కదలకుండా చేసినయ్.

అక్కడ ద్రోణుడు అతిప్రయత్నం మీద కొన్ని బలగాల్ని కూర్చుకుని అభిమన్యుడిని తాకాడు. వాళ్ళలో కర్ణుడి కొడుకు వృషసేనుడు అభిమన్యుడి మీద బాణవర్షం కురిపిస్తే అతను క్రోధంతో వాడి సూతుణ్ణి చంపి, విల్లు తుంచి, గుర్రాల ముఖాల్ని బాణాల్తో గుచ్చితే పీనుగులా పడివున్న అతన్ని తీసుకుని గుర్రాలు దూరంగా పరిగెత్తినయ్. ఐతే అభిమన్యుడు వదలకుండా వాణ్ణి తరుముతూ వెంటపడితే వసాతి అనే రాజు అతన్నెదుర్కుని ఆరు బాణాలేశాడు. అభిమన్యుడు వాణ్ణి ఒక బాణంతో పడేస్తే వాడు కిందపడి తన్నుకుని చచ్చాడు.
మన సైన్యం మళ్ళీ కొంత కూడకట్టుకుని అతన్ని చుట్టుముడితే అభిమన్యుడు లేళ్ళ మీదికి దూకే బెబ్బులి లాగా దొరికిన వాళ్ళని దొరికినట్టు రాజుల్ని ఊచకోత కోశాడు. సైన్యం అతలాకుతులమౌతుంటే శల్యుడి కొడుకు రుక్మరథుడనేవాడు మీకేం భయం వద్దు, నేను వీణ్ణిప్పుడే చంపుతానని అతని ఉరాన తొమ్మిది అమ్ములు, భుజాన రెండు నాటి ఇంకా వెయ్యబోయేంతలో అభిమన్యుడు ఒక శరంతో వాడి చేతిని మరోరెంటితో వాడి తలనీ నరికేశాడు. అదిచూసి రుక్మరథుడి స్నేహితులు అనేకమంది రాజులు ఒక్కమారుగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. దాంతో అభిమన్యుడి కథ ముగిసిందని నీ కొడుకు ఆనందించాడు.

ఐతే అభిమన్యుడు అలా చుట్టుముట్టిన వాళ్ళ మీద గాంధర్వి ఐన ఒక మాయని ప్రయోగించాడు. అది అదివరకు అర్జునుడి తపస్సుకి మెచ్చి తుంబురాదులు ఇచ్చింది. దానివల్ల ఆ రాజులకి అనేకమంది రథికులు వచ్చి తమతో తలపడుతున్నట్టు అనిపించి దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరయారు. ఈలోగా అభిమన్యుడు తన రథాన్ని గిరగిర తిప్పుతూ వాళ్ళని నానా తిప్పలు పెట్టాడు. వాళ్ళు పారిపోయారు. ఇది సహించలేక నీ కొడుకు స్వయంగా అతన్నెదుర్కుని కొంతసేపు యుద్ధం చేశాడు కాని అభిమన్యుడి ప్రతాపానికి ఆగలేక వెనక్కి తప్పుకున్నాడు.

చివరికి దుర్యోధనుడు కూడ అలా వెనక్కి తగ్గేసరికి నీ కొడుకులు దిగాలు పడిపోయారు. అప్పుడు దుర్యోధనుడు తిరిగి మన సేనల్ని కూడుకుని అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, బృహద్బలుడు, సౌబలుడు తోడుగా అభిమన్యుణ్ణి ఎదుర్కున్నాడు.

ఇంతలో నీ మనవడు లక్ష్మణుడు సింగపుకొదమలా అభిమన్యుడి పైకి దూకితే కొడుకు ఒంటిగా అభిమన్యుడితో యుద్ధం చెయ్యటం చూసి దుర్యోధనుడు కంగారు పడుతుంటే అక్కడున్న మనవాళ్ళంతా అభిమన్యుడి మీద బాణాలు కురిపించారు. ఐతే అభిమన్యుడు ఘోరశరాల్తో వాళ్ళని వారిస్తూనే “తెలిసి తెలిసి నాతో తలపడ్డావ్, ఇంకెక్కడికి తప్పించుకుంటావ్” అంటూ అతని వక్షాన, బాహువుల్లో బాణాలు నాటి మణికుండలాల్తో ప్రకాశించే అతని తలని నరికి నేల పడేశాడు. మన సైన్యం గొల్లుమంది. ఆ దృశ్యం చూసిన నీ కొడుకు ఆగ్రహోదగ్రుడై “ఇంక వీణ్ణి వదలొద్దు పొడవండి చంపండి” అనరిచాడు. మన మహారథులంతా నిశితశరాల్తో అభిమన్యుడిని ముంచెత్తారు.

అతను వాళ్ళ అమ్ముల్ని వమ్ము చేసి సైంధవుడితో పాండవులు యుద్ధం చేస్తున్న వైపుకి తన రథాన్ని నడుపుతుంటే నిషాదులు, కాళింగులు గజబలాల్తో అతన్ని అడ్డుకున్నారు. అతను వాళ్ళతో ఘోరంగా పోరుతూంటే వెనక మిగిలిన పెద్ద యోధులంతా మళ్ళీ అతన్ని చుట్టుముట్టారు. అక్కడ సైంధవుడు కూడ పాండవబలాల్ని లోపలికి కదలనివ్వకుండా ఎంతో చాకచక్యంతో పోరాడుతున్నాడు.

అభిమన్యుడు ద్రోణుణ్ణి పదిహేను బాణాల్తో, ఎనభై బాణాల్తో కృతవర్మని, పది విశిఖాల్తో అశ్వత్థామని, ఒక్క పెద్ద నారసంతో కర్ణుణ్ణి నొప్పించి కృపుడి రథాన్ని విరిచి బృహద్బలుడికి ముప్పై బాణాలు నాటి వాళ్ళ చుట్టూ వున్న అనేకమంది రాజుల్ని యముడి దగ్గరికి పంపాడు. బృహద్బలుడు ఎన్నో బాణాలేస్తే అతను వాడి వింటిని, జెండాని విరిచి, సారథిని గుర్రాల్ని చంపాడు. వాడో క్రూరమైన కత్తితో కిందికి దూకి తలపడబోతే అభిమన్యుడు విసిరిన ఒక భల్లం వాడి వక్షాన్ని చీల్చింది, వాడు పరలోకాలకి పోయాడు. వాడి బంధువులు అనేకమంది కమ్ముకుంటే ఇంతలో ఆ దగ్గర్లో వున్న కర్ణుణ్ణి చూసి అతనితో తలపడ్డాడు అభిమన్యుడు. వాళ్ళిద్దరూ భయంకరంగా పోరాడారు. మగధపతి సుశర్మ కొడుకు అశ్మంతకుడు వచ్చి తాకితే సారథి, గుర్రాలు, రథికుడు – అందరి తలలూ వరసగా నరికి అభిమన్యుడు సింహనాదం చేశాడు.

అదిచూసి భరించలేక దుశ్శాసనుడి కొడుకు అభిమన్యుడి మీదికి లంఘించి నాలుగు బాణాల్తో గుర్రాల్ని, ఒకదానితో అతని సారథిని, పదిబాణాల్తో అతని శరీరాన్ని నాటితే అభిమన్యుడు “ఇంతకుముందే నీ తండ్రి ఓడిపోయి పారిపోయాడు, ఇప్పుడు నువ్వొచ్చావ్. నువ్వెక్కిడికి పోతావో చూస్తా” అంటూ ఏడు నిశితశరాల్తో పీడించి ఒక గొప్ప నారసాన్ని బలంగా వేస్తే హడావుడిగా అశ్వత్థామ దాన్ని మధ్యలోనే ఖండించాడు. ఐతే అభిమన్యుడతని వంక నైనా చూడకుండా నీ మనవడి విల్లు తుంచి సారథిని చంపి ఆరు బాణాలు వక్షాన నాటితే వాడు గబాల్న ఇంకో రథమ్మీదికి ఉరికాడు.

అప్పుడు శత్రుంజయుడు, చంద్రకేతుడు, సువర్చసుడు, సూర్యభానుడు, మేఘవేగుడు అనే మేటిరాజులు అతన్ని తాకితే అభిమన్యుడు క్షణంలో వాళ్ళందర్నీ ఖండఖండాలు చేసి ఇక దుర్యోధనుడి వైపుకి కదిలాడు. అదిచూసి కర్ణుడు ద్రోణుడితో “వీరరథికుల్ని చెండాడుతూ వీడిప్పుడు రారాజు మీదికే వెళ్తుంటే నువ్విలా ఊరికే ఉండటం భావ్యమా” అని నిష్టూరమాడి దుర్యోధనుడికి అడ్డుగా వెళ్ళాడు.

ద్రోణుడు అక్కడున్న యోధులందరితో “అర్జునుడెంతో వీడంత, వయసుకి చిన్నే గాని తేలిగ్గా దొరికేవాడు కాదు. మనందరం కలిసి ఒక్కసారిగా వీణ్ణి ఎదుర్కుందాం” అని ప్రోత్సహిస్తే వాళ్ళు అభిమన్యుడితో తలపడ్డారు. ఈలోగా అభిమన్యుడి దెబ్బకి హతాశుడై కర్ణుడు, “అర్జునుడితో మనం ఇదివరకు యుద్ధాలు చెయ్యలేదా, ఎన్నడూ ఇలా దెబ్బలు తిన్నది లేదు” అంటే ద్రోణుడు చిన్న నవ్వు నవ్వి అన్నాడూ -“అర్జునుడికి నేను కవచధారణమనే విద్యని నేర్పాను, అది వీడు నేర్చుకున్నాడు. దాని మూలాన వీడి చేతిలో ధనుస్సుండగా ఎదురుపడి వీణ్ణి నొప్పించటం దేవతలకైనా సాధ్యం కాదు. వంచనతో మనం ఒక్కసారిగా వీడి విల్లు విరిచి, సారథిని చంపి, రథం నుగ్గుచేస్తే కాని మనకి అవకాశం కలగదు. నువ్వలా చెయ్యగలవా?”

అది విని కర్ణుడు అభిమన్యుడికి భయపడి వెనక్కి తగ్గినట్టు నటించి వెనగ్గా తిరిగి వచ్చాడు. అభిమన్యుడి ఎదుట వున్న వాళ్ళు అతని దృష్టి మరలకుండా అతనితో పెనుగుతుంటే వెనక నుంచి ఒక వాడి బాణంతో అతని విల్లు విరిచాడు కర్ణుడు. అదే సమయమని ద్రోణుడు అశ్వాల్ని కూల్చాడు. కృపుడు సారథిని చంపాడు. అలా నిరాయుధుడు, విరథుడు ఐన అభిమన్యుణ్ణి శకుని, కృతవర్మ, శలుడు, బాహ్లికుడు, అశ్వత్థామ, ఇంకా అనేకులు అస్త్రశస్త్రాల్తో చిక్కుపరిచారు. ఐతే అభిమన్యుడు వాలుని పలకని తీసుకుని పైకెగిరాడు. రథాలు, గుర్రాలు, ఏనుగుల మీద దూకుతూ విహరిస్తుంటే ఎవరి మీద దూకుతాడోనని అందరూ గగ్గోలు పడ్డారు.

ద్రోణుడు ఒక బల్లెంతో వాలుని విరిచాడు. కర్ణుడు పలకని ముక్కలు చేశాడు. అభిమన్యుడు తన రథమ్మీద వున్న చక్రాన్ని చేతబట్టి అడ్డున్న సైన్యాన్ని చంపుతూ ద్రోణుడి మీదికి పరిగెత్తుతుంటే శకుని, కృతవర్మ, కృపుడు, కర్ణుడు, శల్యుడు మొదలైన వాళ్ళు ఒక్కుమ్మడిగా ఆ చక్రాన్ని ముక్కలు చేశారు. అతను వేగంగా గద తీసుకుని అశ్వత్థామ మీదికి దూకితే అశ్వత్థామ రథమ్మీంచి దూకి వెనక్కి పరిగెత్తాడు. అభిమన్యుడతని సారథిని గుర్రాల్ని గదతో మోది సౌబలుడి వైపుకి నడిచాడు. అడ్డుపడిన గాంధార రాజుల్ని చంపి వసాతి బంధువులు పదిమందిని వాళ్ళ ఏనుగులతో సహా పీనుగుల్ని చేశాడు.

అంతటి భీభత్సమైన సమరం సాగిస్తూ విరథుడై, విల్లు లేక, ఒంటిగా చాలా అలిసిపోయివున్నాడతను. శరీరం స్వాధీనం తప్పుతున్నది, తూలుతున్నది. ఐనా పళ్ళబిగువున, మనోనిశ్చయంతో దీక్షగా తనని తప్పించుకు పోయే వాళ్ళని అవమానిస్తూ ఎదుర్కున్న వాళ్ళని చంపుతూ వీరవ్రతం సాగించాడు. ద్రోణాది ప్రముఖులు దూరంగా నిలబడి చూస్తున్నారు ఏం చెయ్యాలో తోచక. ఆ స్థితిలో అతన్ని చంపటానికి వాళ్ళెవరూ సాహసించలేకపోయారు.

అప్పుడు దుశ్శాసనుడి కొడుకు రథం మీద అక్కడికి వస్తే తన గదతో వాడి సారథిని గుర్రాల్ని చంపాడు అభిమన్యుడు. వాడు క్రోధంతో ఒక గద తీసుకుని అతన్ని ఎదుర్కున్నాడు. చూచేవారికి అద్భుతమూ శోకమూ కలుగుతుండగా ఉగ్రంగా రణం సాగించి ఒకరొకరి శరీరాల్ని మాంసపు ముద్దలుగా మోదుకుని తుదిశ్వాస విడిచే వరకు రాజధర్మాన్ని పాటించి కన్నుమూశారిద్దరూ.

నెత్తుటినేల ఎర్రటి ఆకాశమైంది. అందులో చంద్రుడిలా అభిమన్యుడు. ఆయుధఖండాలు, భూషణాలు, మణులు తారల్లా వున్నాయి.

సముద్రం లాటి యుద్ధభూమిలో యోగనిద్రలో వున్న విష్ణువులా పవళించివున్నాడతను.

పాండవబలం శోకసంద్రమైంది. మన సైన్యం సంతోషంతో బొబ్బలు పెట్టింది.

“అనితర సాధ్యమైన పరాక్రమ విక్రమంతో ఆచార్యాది మహాయోధులందర్నీ అల్లకల్లోలపరిచి వీరస్వర్గం అందుకున్న అభిమన్యుడి గురించి మనం కలత పడకూడదు. శత్రువుల్ని చంపి గెలుపు సాధించటమే మన కర్తవ్యం” అని ధర్మరాజు తన సేనకి ధైర్యవచనాలు చెప్పాడు.

సంధ్యాసమయం ఐంది. యుద్ధభూమంతా నెత్తుటిగడ్డలా కనిపించింది. పిశాచాలు, నిశాచరులు రక్తపానం చేస్తూ మాంసాలు తింటూ ఆడుతూ పాడుతున్నారు. సైన్యాలు శిబిరాలకి చేరుకున్నయ్.

సమరవేషాలు తీసేసి శూన్యాకారాల్తో ధర్మజాదులు శోకసంతప్తులయారు. ధర్మరాజు “నన్ను సంతోషపరచాలని యోధానుయోధుల రక్షణలో ఉన్న నిర్భేద్యమైన సైనిక వ్యూహాన్ని ఛేదించి ఒంటరిగా ఎందరో మహారథుల్ని వధించాడు. దుశ్శాసనుణ్ణి ఓడించి చతురంగబలాల్ని తూర్పారబట్టాడు. ఇది మరెవరికైనా సాధ్యమయే పనేనా? ఇప్పుడు అర్జునుడు వచ్చి కొడుకెక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పగలన్నేను? కృష్ణుడికి అతని చెల్లెలికి ఎంత దుఃఖం తెచ్చిపెట్టాను ! బాలుడే, సుకుమారుడే, యుద్ధాల్లో అనుభవం లేనివాడే, అలాటి వాణ్ణి చూస్తూ చూస్తూ మొన చీల్చమని పంపిన నన్ను ఏమనుకోవాలి? వాడితో నేను కూడ పోయివుంటే బాగుండేది, ఇప్పుడు అర్జునుడికి నా మొహం ఎట్లా చూపిస్తాను? ఇంద్రుడంతటి వాడే సాయం కోరి వస్తే వెళ్ళి కాలకేయాది రాక్షసుల్ని సంహరించిన వాడి కొడుకు శత్రువుల చేత చిక్కి మరణించాడని అతనికి మచ్చ తెచ్చిపెట్టాను కదా. ఇప్పుడీ మాట విని అర్జునుడేం చేస్తాడో! బతికితే రాజ్యం వస్తుందని, మరణిస్తే స్వర్గం, సద్గతి కలుగుతాయని చెప్పుకునే మాటలన్నీ ఇలా మన ఆత్మీయులు పోయినప్పుడు కలిగే దుర్భరశోకం ముందు వట్టిమాటలుగానే అనిపిస్తయ్. నిరర్థకాలుగా కనిపిస్తయ్” అంటూ తనని తను రకరకాలుగా నిందించుకుంటూంటే వ్యాసమహాముని ప్రత్యక్షమై అతనికి మృత్యుదేవతా మహత్యాన్ని, షోడశమహారాజుల చరిత్రల్ని వినిపించి కొంత ఉపశమింపజేసి అంతర్ధానమయాడు.

అర్జునుడు సంశప్తక సేనా వనాన్ని అనలుడిలా హరించి వస్తూ “కృష్ణా, నాకెందుకో దుశ్శకునాలు తోస్తున్నయ్, మనసు కీడు శంకిస్తున్నది. ఒకవేళ ద్రోణుడి చేతికి ధర్మరాజు చిక్కలేదు గదా” అన్నాడు విచారంగా. “నీ సోదరులంతా కుశలమే. మరేదో అశుభం జరిగింది, మనం వెళ్ళి తెలుసుకుందాం” అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ తమ శిబిరానికి చేరారు. అక్కడంతా విషణ్ణవదనాల్తో అర్జునుణ్ణి తప్పించుకు తిరగటం చూసి “కృష్ణా, ఏదో జరక్కూడనిది జరిగింది. నవ్వు మొహంతో రోజూ కనిపించే అభిమన్యుడు కనిపించటం లేదు. నా మనస్సు కలత చెందుతున్నది” అంటే కృష్ణుడు సమాధానం చెప్పకుండా వూరుకున్నాడు. అర్జునుడు హడావుడిగా ధర్మరాజు శిబిరానికి వెళ్ళాడు.

అక్కడ ధర్మరాజుని చుట్టుకుని పెద్దలంతా వున్నారు కాని అభిమన్యుడు కనిపించలేదు. కంపించే గొంతుతో –

“ఇంతమంది ఇక్కడ ఉన్నా అభిమన్యుడు మాత్రం కనపడడు. ఈ మౌనం వదిలి ఏమైందో చెప్పండి. ద్రోణుడు పద్మవ్యూహం పన్నితే దాన్ని భేదించటానికి వాణ్ణి పంపుదామనే పనికిమాలిన ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఏమిటి? అలా మీరు పంపితే పోయి ఒక్కడే వాళ్ళ చేతికి చిక్కలేదు గదా? వాడికి ప్రవేశించటమే చెప్పాను గాని నిర్గమించటం తెలియదని మీకు తెలీదా?

దివ్యశరాఢ్యుడు, సంగరకేళీనిపుణుడు వాణ్ణి పడేసిన వాడు ఎవడు?

ఐనా వాణ్ణి పడెయ్యటం ఏ ఒక్కడి వల్లా కాదు, ఇదేదో పదిమంది కలిసి చేసిన కుట్ర ఫలితం.

అయ్యో, నాలాటి మందభాగ్యుడికా అలాటి విలువైన పుత్రరత్నం దక్కేది? ఐనా మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు వాడికి సాయపడకుండా?

అంతమంది శత్రువులు ఒక్కటై నానా శస్త్రాస్త్రాల్తో నరుకుతుంటే నన్ను తలుచుకుని తోడుగా రాలేకపోయానని ఎంత కలవరపడ్డాడో ! కాదు కాదు, అంతటి మహావీరుడు ఎప్పుడూ అలా ఆలోచించడు. ఐనా అంతమంది ఒక్కసారి మీదపడి బాలుణ్ణి వధించేముందు నన్ను గాని కృష్ణుణ్ణి గాని తలుచుకోలేదా ఆ దుర్మార్గులు?

సంశప్తకుల్తో ఘోరపోరాటం సాగిస్తున్నప్పుడు యుయుత్సుడు తండ్రినేమీ చెయ్యలేక ఇలా చిన్నపిల్లవాణ్ణి పదిమంది కలిసి అన్యాయంగా చంపుతారా అని కౌరవుల్ని ఆక్షేపించటం విన్నట్టనిపించింది కాని అప్పుడంతగా పట్టించుకోలేదు, కృష్ణుడు విని వుండడా, అంత ముఖ్యమైన విషయమైతే చెప్పడా అని. అప్పుడైనా వచ్చివుంటే వాణ్ణి రక్షించుకుని వుండేవాణ్ణేమో”

అంటూ రకరకాలుగా పలవిస్తూ మాట్టాడుతున్న అర్జునుణ్ణి పొదివిపట్టుకుని కృష్ణుడు “ఇలా ఉండటం నీకు తగదు. శూరుల జీవితాలు ఇలాటివే కదా – శత్రువుల్ని తుంచి ఇక్కడ యశస్సు, పైన స్వర్గమూ పొందిన కొడుకుని చూసి ఆనందించాలి గాని బాధ పడతారా నీలాటి జ్ఞానులు? నీ దుఃఖం చూసి మిగిలిన వాళ్ళెంత చిన్నబోయారో చూడు” అంటే “అలాగే, వాడి యుద్ధప్రకారం నాకు వివరించి చెప్పండి. వాడి చావుకి కారణమైన వాళ్ళని త్వరగా వాడి దగ్గరికి పంపించాల్సిన పని వుంది నాకు. ఐనా ఇంతమంది మహారథులు మనలో వుండి ఒక్కరూ వాడికి తోడు కాలేకపోవటం నమ్మ శక్యంగా లేదు. మిమ్మల్ని మీ మగతనాల్ని నమ్మి వాణ్ణి మీకప్పగించినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. అసలిలాటి బలహీనులు, భీరువులు మీకు తోడు ఈ గదలూ ఖడ్గాలూ విల్లమ్ములూ ఎందుకు సింగారానికి కాక?” అని గద్దిస్తుంటే నోరెత్తి మాట్టాడాటానికి ఎవరూ సాహసించలేకపోయారు. కృష్ణుడొక్కడే అనునయవాక్యాలు పలికాడు.

చివరికి ధర్మరాజు సాంత్వనస్వరంతో -“నువ్వు సంశప్తకుల్తో పోరుకి పోతే ఇక్కడ ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. మేం వెళ్ళి అతనితో తలపడ్డాం గాని అతని బాణాగ్ని జ్వాలకి తట్టుకోలేక వెనక్కి తిరిగాం. అప్పుడు నాకు గుర్తొచ్చింది అభిమన్యుడికి పద్మవ్యూహ భేదనం తెలుసునని. వాడు దాన్ని భేదిస్తే వాడి వెనకే మేమందరం వెళ్ళాలని బయల్దేరాం. వాడు త్రుటిలో దాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించాడు. ద్రోణాదులు వాడిని చుట్టుముడితే సాయంగా మేం వెళ్తుంటే రుద్రవరగర్వంతో సైంధవుడు మమ్మల్నడ్డుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మేం వాణ్ణి దాటలేకపోయాం.

అభిమన్యుడు ద్రోణ, కర్ణ, కృతవర్మ, కృప, అశ్వత్థామాది మహావీరుల్ని చిక్కుపరిచి కురుసేనని కాల్చి కర్ణాదుల్ని పరిగెత్తించి బృహద్బల లక్ష్మణుల్ని సంహరించి అనేకమంది రాజుల్ని మర్దించి చివరికి విరథుడై పదాతిగా గదతో తూగాడుతూనే యుద్ధం చేస్తూ దుశ్శాసనుడి కొడుకు వస్తే వాడి రథాన్ని నుగ్గు చేసి వాడూ గదతో వస్తే ఇద్దరూ మహాఘోరంగా గదాయుద్ధం చేసి ఒకరి చేతిలో ఒకరు మరణించారు” అని చెప్పేసరికి అర్జునుడు గుండె చెదిరి మూర్ఛితుడయ్యాడు. అప్పటివరకు అతనిలో మినుకుమినుకుమంటున్న కొద్దిపాటి ఆశ కూడ ఆ మాటల్తో ఆరిపోయింది.

కృష్ణుడు, ధర్మరాజు అతన్ని పట్టుకుని ఉపచారాలు చేస్తే లేచి మహోద్వేగంతో “ఇదే నా ప్రతిజ్ఞ, అందరూ వినండి. రేపు నేను సింధురాజుని చంపి తీరతాను. వాడు భయపడి ధర్మజుణ్ణి గాని, కృష్ణుణ్ణి గాని, నన్ను గాని శరణు వేడితేనో లేకపోతే అసలు యుద్ధానికే రాకపోతేనో తప్ప దీనికిక తిరుగులేదు. ఇలా చెయ్యలేకపోతే నేను గురుద్రోహులు, బ్రహ్మహంతకులు, మద్యపానరతులు పోయే దుర్గతులకి పోతా. అంతే కాదు, రేపు సూర్యాస్తమయం లోగా నేను వాణ్ణి చంపకపోతే గాండీవంతో సహా అగ్నిప్రవేశం చేస్తా” అంటూ కఠోరప్రతిజ్ఞ చేసి, గాండీవాన్ని తెప్పించి దాని గుణధ్వని మోగించాడు. కృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం పూరించారు.

ఆ పాంచజన్య దేవదత్తాల ధ్వనులకు మనసేనలు తల్లడిల్లినయ్. వేగపు చారులు పరుగున వచ్చి అర్జున ప్రతిజ్ఞని వినిపించారు. సైంధవుడి గుండె ఝల్లుమంది. తన చుట్టాల్ని వెంటబెట్టుకుని దుర్యోధనుడి శిబిరానికి వెళ్ళాడు.

“అక్కడికి నేనొక్కణ్ణే అభిమన్యుడి చావుకి కారణమైనట్టు అర్జునుడిలా నా వెంట పడటం ఏమిటి? ఇప్పుడు నన్ను రక్షించగలిగే వాళ్ళెవరింక? ఎవరికీ కనపడకుండా ఎక్కడికన్నా వెళ్తా, నాకు సెలవిప్పించండి” అన్నాడు.

ఇలా అర్జునుడు ప్రతిజ్ఞ చెయ్యటం తనకి ఉపయోగపడొచ్చని గ్రహించాడు దుర్యోధనుడు. “మేం అందరమూ నీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డం వేస్తాం. నీకేం భయం అక్కర్లేదు, రాజధర్మం తప్పకుండా రేపు యుద్ధరంగానికి రా.” అని భరోసా ఇచ్చాడు. సైంధవుడు కొంత శాంతించాడు.

ఐనా అనుమానం పూర్తిగా పోక వాళ్ళని వెంటబెట్టుకుని ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణుడు కూడ “నా బాణాలతో కోట కట్టి నిన్ను రక్షిస్తా. అర్జునుడు నిన్నేమీ చెయ్యలేకుండా ఒక గొప్ప దురవగాహమైన వ్యూహాన్ని పన్నుతా. కనక రాజధర్మానికి హాని కలక్కుండా యుద్ధానికి రా. పైగా రాచపుటక పుట్టి శరీరం మీద ఇంత ప్రేమ పెంచుకోవటం మంచిది కాదు. అందరూ ఏదో ఒక రోజు వెళ్ళేవాళ్ళే కదా” అని బోధిస్తే ఒప్పుకున్నాడు. మన శిబిరాల్లో తూర్యఘోషలు మిన్ను ముట్టినయ్.

ధర్మరాజు రాజులందర్నీ వాళ్ళ శిబిరాలకి పంపాడు. కేవలం అతని సోదరులు, కృష్ణుడే అక్కడున్నారు. కృష్ణుడు అర్జునుడితో “నాతో మాట మాత్రం చెప్పకుండా అందరూ వింటుండగా ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశావ్. సూర్యాస్తమయంలోగా వాణ్ణి చంపటం అంత తేలిగ్గాదు. ద్రోణుడొక అద్భుతమైన వ్యూహాన్ని పన్ని వాణ్ణి దాని వెనక దాచబోతున్నాడని మన చారులు చెప్తున్నారు. వాళ్ళ మహావీరుల్ని ఒక్కొక్కర్ని ఓడించటమే కష్టం, అలాటప్పుడు వాళ్ళందరూ కలిసి ఒకే పనికి నడుం కడితే అందర్ని ఉమ్మడిగా ఓడించటం ఇంకెంత కష్టమో ఆలోచించావా?” అన్నాడు.

ప్రతిగా అర్జునుడు నవ్వాడు. “కృష్ణా, నా గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ సంగతి నాకు తెలుసు. నేనా సైంధవుణ్ణి చంపటానికి తరుముతుంటే ఎవరూ అడ్డం ఆగలేరు. చూస్తుండు. గాండీవం సాధనం, సమరకర్త అర్జునుడు, సారథి అబ్జనాభుడు. అలాటి రథాన్ని ప్రతిఘటించటం హరుడి వల్ల కూడ కాదు, వీళ్ళ సంగతి చెప్తావెందుకు? నీ అండ ఉండగా ఈ కార్యం సాధించటం అనివార్యం. ఈ పూటకి వెళ్ళి నిద్ర పో, పొద్దున్నే మళ్ళీ సారథ్యం పని ఉంది” అని మాట్లాడుకుంటూ పట్టరాని కోపంతో వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ నడిచారు.

కృష్ణుడి కోరిక మేరకు కొద్దిరోజుల క్రితమే అక్కడికొచ్చి వున్న సుభద్రని, ఉత్తరని అనునయించమని అర్జునుడు కృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు సుభద్ర మందిరానికి వెళ్ళి శోకిస్తున్న ఆమెతో “రాచకూతురికి వీరపత్ని కావటం, కొడుకుని కనటం, వాణ్ణి మహావీరుణ్ణి చెయ్యటం, ధర్మాలు. నువ్వు ఈ మూటిలో ప్రసిద్ధి పొందావు. రాచధర్మాన్నాచరించి శత్రువుల్ని వధించి వీరస్వర్గం పొందిన కొడుకు గురించి విచారపడొచ్చునా? తగుమాటల్తో నీ కోడలి దుఃఖాన్ని ఉపశమింప చెయ్యి. నీ భర్త రేపా సైంధవుణ్ణి చంపి మనందరికీ సంతోషం కలిగిస్తాడు” అని చెప్పాడు. ఐతే ఆమె శోకం ఆపుకోలేక కొడుకుని తలుచుకుని బిగ్గరగా ఏడ్చింది. ద్రౌపది కూడ వచ్చి సుభద్ర, ఉత్తరలతో తనూ కలిసి విలపించింది. ముగ్గురూ నేల మీద పడి దొర్లి దొర్లి పొర్లి పొర్లి హృదయవిదారకంగా ఆక్రందించారు. తనూ శోకమానసుడైనా కృష్ణుడు ఎలాగో వాళ్ళని సమాధానపరిచి అర్జునుడి శిబిరానికి వచ్చాడు.
పవిత్రజలాల్తో ఆచమనం చేశాడు. దర్భశయ్యని చేసి అక్షతలు, గంధ పుష్పాల్తో దాన్ని అలంకరించి ఆయుధాల్ని అర్చించి చుట్టూ పెట్టి అర్జునుణ్ణి మధ్యలో కూర్చోబెట్టాడు. “నువ్వు రోజూ రాత్రివేళ చేసే దేవపూజ ఇప్పుడు చెయ్యమం”టే అర్జునుడు తను రోజూ చేసే శివపూజ మార్గాన ధూప దీప నైవేద్యాలు కృష్ణుడికి సమర్పించాడు. కృష్ణుడవి స్వీకరించి అతన్ని దీవించి సుఖనిద్ర చేయమని చెప్పి తన సారథి దారుకుడిని తీసుకుని తన శిబిరానికి వెళ్ళాడు.

మర్నాడు జరపవలసిన కార్యం గురించి ఆలోచిస్తూ కొంతసేపు పడుకున్నాడు కృష్ణుడు. తర్వాత లేచి దారుకుడితో “దూరం ఆలోచించకుండా అర్జునుడు ఘోరప్రతిజ్ఞ చేశాడు. దీన్ని తీర్చటం సామాన్యమైన విషయమా? వ్యవహారం అడ్డుతిరిగితే అర్జునుడు లేకుండా నేనుండటం అసాధ్యం. ఆరు నూరైనా నూరు ఆరైనా రేపు అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరేట్టు చేస్తా. అవసరమైతే నేనే యుద్ధం చేసి అడ్డమైన వాళ్ళందర్నీ హతమారుస్తా. నువ్వు వెళ్ళి మన రథాన్ని సిద్ధం చెయ్యి. యుద్ధ రంగానికి దగ్గర్లో ఉండు. నా పాంచజన్య ధ్వని నీకు గుర్తు. అది వినబడితే వెంటనే నా దగ్గరకు వచ్చెయ్యి” అని వివరించాడు. దానికి దారుకుడు “అలాగే చేస్తా. ఐతే నువ్వూ అర్జునుడు పూనుకుని సైంధవుణ్ణి చంపబోతుంటే మిమ్మల్ని అడ్డుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారక్కడ?” అని అతని ఉద్రేకాన్ని కొంత ఉపశమింప చేశాడు. ఏ రకమైన పాంచజన్యధ్వని సంకేతమో ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు.

అక్కడ అర్జునుడు దర్భశయ్య మీద కలత నిద్రలో ఉన్నాడు. అతనికో కల వచ్చింది. అందులో కృష్ణుడు కనపడ్డాడు. “నీకు రేపు యుద్ధంలో పాశుపతాస్త్రం అవసరం కలగొచ్చు. ఆ మహాస్త్రం మంత్రాన్ని, పిడికిట పట్టే విధానాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అందుకు పరమశివుణ్ణి తలుచుకో” అని చెప్తే అర్జునుడు ఆచమనం చేసి పరమేశ్వర ధ్యానం చేస్తుంటే ఇద్దరూ ఆకాశాని కెగిరారు. దార్లో అనేక విశేషాలు చూస్తూ కైలాసగిరిని చేరారు. ప్రమథనాథుణ్ణి దర్శించి ప్రణమిల్లారు. అంతకుముందు నిత్యార్చన ప్రకారంగా కృష్ణుడికి తను సమర్పించిన గంధ మాలాక్షతలు ఇక్కడ శివుడి శరీరం మీద అర్జునుడికి కనిపించినయ్. శివకేశవుల అభేదాన్ని అలా చూసి ఆశ్చర్యపడ్డాడతను. పరమేశ్వరుడు వాళ్ళకి స్వాగతం పలికి ఎందుకు వచ్చారని అడిగాడు. పాశుపతం ఇమ్మని కోరమని అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. అతనలాగే చేశాడు. పరమశివుడు వాళ్ళతో “ఆ సరోవరంలో నా ధనుర్బాణాలున్నయ్, వెళ్ళి తీసుకురండి” అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి చూస్తే విషజ్వాలలు కక్కుతూ మహోరగాలు వాళ్ళకి కనిపించినయ్. అవే దివ్యబాణాలని గ్రహించి వాళ్ళు పాదప్రక్షాళనం చేసుకుని శతరుద్రీయం జపిస్తే అవి వాటి పూర్వాకారాలు ధరించినయ్. వాళ్ళా ధనుర్బాణాల్ని శివుడి దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడొక మహాబలశాలి ఐన బాలుడు ఆ వింటిని తీసుకుని శరాన్నెక్కు పెడితే అర్జునుడతన్ని చూసి ఆ పద్ధతి నేర్చుకున్నాడు. అప్పుడే శివుడు కూడ అతనికి మంత్రోపదేశం చేశాడు. అలా అర్జునుడప్పుడు మంత్రం, ప్రయోగవిధానంతో సహా పాశుపతాస్త్రాన్ని సంపూర్ణంగా అందుకున్నాడు. ఇద్దరూ పరమేశ్వరుడి సెలవు తీసుకుని తిరిగివచ్చారు. అర్జునుడు కల నుంచి లేచి చూస్తే తెల్లవారుతున్నది.

అవతల కృష్ణుడు మిగిలిన రాత్రంతా అర్జునుడికి తనను ఉన్న అనుబంధం గురించి, మర్నాడు యుద్ధంలో జరిపించవలసిన కార్యక్రమం గురించి దారుకుడితో మాట్లాడుతూనే గడిపాడు.

పద్నాలుగవ రోజు

ఉదయాన్నే ధర్మరాజు దేవార్చన చేసి కొలువు తీరాడు. తమ్ముళ్ళు, రాజులు వచ్చారు. కృష్ణుడు కూడ అక్కడికి వచ్చాడు. ధర్మరాజు అతనితో “నువ్వు ఇప్పటికి ఎన్నో సార్లు మమ్మల్ని కాపాడావు. ఈ రోజు అర్జునుడి ప్రతిజ్ఞ మనసులో పెట్టుకుని మాకు జయం కలిగించు” అని ప్రార్థించాడు. “ఇవాళ అర్జునుడు వైరి సేనల్ని పిండిపిండి చేసి సైంధవుడి తల నరుకుతాడు. ఇది నిశ్చయం” అని ధైర్యం చెప్పాడు కృష్ణుడు. ఇంతలో అర్జునుడక్కడికి వచ్చి తన స్వప్న వృత్తాంతం వినిపించాడు. అందరూ ఆశ్చర్యంతో ఆ పరమేశ్వరుణ్ణి తల్చుకుని నమస్కరించారు.

కృష్ణుడు రథానికి జయప్రదాలైన మంత్రాలు ప్రయోగించాడు. అర్జునుడు దానికి ప్రదక్షిణం చేసి అధిరోహించాడు. నొగల్లో కృష్ణుడు, అర్జునుడి పక్కన సాత్యకి కూర్చున్నారు. కొంత దూరం వెళ్ళాక అర్జునుడు సాత్యకికి ధర్మరాజు రక్షణ భారం అప్పగించి పంపించాడు.

ద్రోణుడు ఇరవైనాలుగు కోసుల పొడవు, పది కోసుల వెడల్పుతో శకటవ్యూహం కట్టి అందులో పశ్చిమార్థంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహాన్ని నిర్మించాడు. దాని పక్కనే సూచీవ్యూహాన్ని పన్నాడు. సైంధవుణ్ణి ఆ సూచీవ్యూహం మూలంలో సేనకి వెనక భాగంలో భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థ్హామ, వృషసేనుడు, కృపుడు అతని పక్కన వుండేట్టు ఏర్పరచి నిలబెట్టాడు. వాళ్ళకి బలంగా పద్నాలుగు వేల ఏనుగులు, అరవై వేల రథాలు, లక్ష గుర్రాలు, పదిలక్షల పదాతులు ఉన్నారు.

ఆ మహావ్యూహాన్ని ఖేచరులు కూడ మెచ్చుకున్నారు. ఒక్క దుర్మర్షణుడు మాత్రం అర్జునుడి అంతు చూట్టానికి నేనొక్కణ్ణి చాలు అంటూ వ్యూహం బయటికి వెళ్ళి దానికి ముందు పదిహేడు వందల విండ్లంత దూరాన తన సైన్యంతో నిలబడ్డాడు. ద్రోణుడు శకటవ్యూహం ముఖస్థానాన నిలిచాడు. దుర్యోధనుడు, మన సైన్యాన ఇతర దొరలు సంతృప్తిగా తలలు పంకించారు. ఇంతలో కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ భయంకరంగా అర్జునుడు దూసుకు వచ్చాడు. అతనికి కొద్దిగా వెనగ్గా ధృష్టద్యుమ్నుడు, నకులుడి కొడుకు శతానీకుడు మొగ్గరం పన్ని నిలిచారు. అర్జునుడు తన రథాన్నాపి దేవదత్తం ఒత్తితే పాంచజన్యరవం కూడ దానికి తోడైంది.

దుర్మర్షణుడు వీరావేశంగా తన బలగంతో అర్జునుడి మీదికి దూకాడు. అదిచూసి అర్జునుడు “మదంతో ముందుకి దూకుతున్నాడు, వీడే మనకివాళ తొలిముద్ద” అని వాణ్ణి ఢీకొన్నాడు. అర్జునుడు ఒక్కడే కదా అని దుర్మర్షణుడి సైన్యం అతన్ని చుట్టుముట్టి వివిధ శస్త్రాస్త్రాల్తో ముంచెత్తింది. అతనా సైన్యాన్ని చిందరవందర చేసి భీభత్సంగా నాశనం చేస్తే దుర్మర్షణుడు వెనక్కు తిరిగి పారిపోయాడు. వాడితో పాటే వాడి సైన్యాలూ పరిగెత్తినయ్.

అది చూసి సహించక యువరాజు దుశ్శాసనుడు అర్జునుడితో తలపడ్డాడు. అతన్ని చూసి అర్జునుడు ఒక పెలుచ నవ్వు నవ్వాడు. దేవదత్తాన్ని పూరించి గాండీవజ్యానాదం దిక్కుల పిక్కటిల్లగా అతని సైన్యాన్ని ఊచకోత కోశాడు. పీనుగుపెంటలైన సేనని చూసుకుని దుశ్శాసనుడు పారిపోతుంటే విజయుడు వదలక తరిమాడు. “పారిపోతే చావు తప్పుతుందా? అప్పుడు సభలో అవాకులూ చవాకులూ పేలి ఇప్పుడు నీ చావుకి తెచ్చుకున్నావ్” అంటూ అతని వీపున పది అమ్ములు నాటితే వెనక్కి తిరిగైనా చూడకుండా పరిగెత్తాడు దుశ్శాసనుడు. సైంధవుడి విషయం తలుచుకుని వాణ్ణి అప్పటికి వదిలేసి వ్యూహం వైపుకి తిరిగొచ్చాడు అర్జునుడు.

వచ్చి ద్రోణుడికి కొద్ది దూరంలో రథాన్ని ఆపి కృష్ణుడి అనుజ్ఞ తీసుకుని ఆచార్యుడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. “నా మంచి కోరేవాళ్ళలో పాండురాజు, ధర్మజుడు, కృష్ణులతో సాటివాడివి నువ్వు. నీ దృష్టిలో నేనూ అశ్వత్థామ ఒక రకంగా పెరిగాం. సైంధవుణ్ణి చంపాలనే నా ధర్మబద్ధమైన ప్రతిజ్ఞని సాధించటానికి ఈ వ్యూహంలో చొరటానికి నాకు అనుమతివ్వు.” ఆ మాటలకి చిన్న నవ్వుతో ద్రోణుడు నన్ను గెలవకుండా నువ్వు సైంధవుణ్ణి ఎలా చేరతావ్ అంటూ అతని మీద బాణాలు ప్రయోగించాడు. అప్పుడతనితో యుద్ధం చెయ్యటానికి ద్రోణుడి నుంచి అనుజ్ఞ తీసుకుని తొమ్మిది నారాచాలు వేస్తే వాటిని దార్లోనే తుంచాడు ద్రోణుడు. తుంచి వేగంగా కృష్ణార్జునుల మీద అనేక బాణాలేస్తే అతని విల్లు విరచటానికి అర్జునుడు బాణం వెయ్యబోయేంతలో అతని వింటితాటిని తెగ్గొట్టాడు ద్రోణుడు. అర్జునుడు మరొక తాటిని సంధించేలోగా చిరునవ్వుతో అతన్ని బాణవర్షంలో ముంచాడు ద్రోణుడు. అర్జునుడికి అమిత క్రోధం కలిగింది. వర్షపు చినుకుల్లా బాణాలు కుమ్మరిస్తూ ద్రోణుణ్ణి దాటి సైన్యం లోకి వెళ్ళి కనిపించిన ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రథికుల్ని నరకటం సాగించాడు.

ద్రోణుడు వచ్చి అతనికి అడ్డుపడి అతని వక్షానికి గురిగా పెద్ద నారసాన్ని వేస్తే కొంచెం తూలి నిలదొక్కుకున్నాడు అర్జునుడు. ద్రోణుడి మీద నానాబాణాలేశాడు. ద్రోణుడు కృష్ణుడి మీద, గుర్రాల మీద, కేతనం మీద బాణాలు గుప్పించాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా పోరుతుంటే ఇదే అదునని మన సైన్యం కొంత అర్జునుడి మీదికి దూకింది. ఇలా వృద్ధుడైనా అర్జునుడితో పోటీగా యుద్ధం చేస్తున్న ద్రోణుణ్ణి చూసి కృష్ణుడు “ఈయనతో యుద్ధం ఇక చాలు, మనం శకటవ్యూహం లోకి జొరబడదాం, ఇదే కర్తవ్యం” అని అర్జునుడితో అంటే “నీ ఇష్టం” అని పార్థుడంటే ద్రోణుడికి ప్రదక్షిణంగా రథాన్ని పోనిచ్చాడు కృష్ణుడు. అదిచూసి నవ్వుతూ ద్రోణుడు “అర్జునా, ఇలాటివి ఎక్కడైనా చూశామా, శత్రువుని జయించకుండా ఇష్టం వచ్చిన విధంగా వెళ్ళటమేనా?” అంటే “నువ్వు గురువువి గాని నాకు శత్రువువెలా ఔతావ్? యుద్ధంలో నువ్వు కోపం తెచ్చుకుని నిలిస్తే నిన్ను గెలవటం నాకే కాదు ఆ హరుడికైనా సాధ్యమా?” అంటూ ఆగకుండా సాగాడు.

ఇలా మన సైన్యం లోకి వచ్చిన అర్జునుడి తోనే అతని చక్రరక్షకులు యుధామన్యుడు, ఉత్తమౌజుడు కూడ ప్రవేశించారు. అప్పుడు కృతవర్మ, కాంభోజుడు, శ్రుతాయువు ఉన్నచోటనే ఉండి తలలెత్తి అర్జునుడి రథాన్ని, దాని వెనకనే తరుముకొస్తున్న ద్రోణుణ్ణి చూసి అర్జునుడి మీద దూకాలనుకునేంతలో నారాయణగోపాలకులు అర్జునుణ్ణి పొదివి యుద్ధం చెయ్యసాగారు. అతను వాళ్ళందర్నీ ముప్పుతిప్పలు పెడుతుంటే ద్రోణుడు వచ్చి అమ్ములవాన కురిపిస్తే అర్జునుడు అతన్ని నేరుగా ఎదుర్కోకుండా అతను వేసిన బాణాల్ని మధ్యలోనే నరికేశాడు. ఐతే ద్రోణుడు వదలకుండా అర్జునుడి మీద ఇరవై ఐదు, కృష్ణుడి మీద డెబ్బై నారసాల్ని కురిపిస్తే వాటన్నిటిని వారించలేక పక్కకి దాటి కృతవర్మ బలాల్ని దాడిచేశాడు అర్జునుడు. ఇంక చేసేది లేక ద్రోణుడు వెనక్కి తిరిగి తన పూర్వస్థానానికి వెళ్ళాడు.

కృతవర్మ అర్జునుణ్ణి ఎదుర్కున్నాడు. అతను కృష్ణార్జునులు ఒక్కొకరి మీద అరవై బాణాలేస్తే అర్జునుడు అతని వింటిని విరిచి ఇరవయ్యొక్క బాణాల్తో అతన్ని నొప్పించాడు. అతనింకొక విల్లు తీసుకుని ఐదుబాణాలు విజయుడి వక్షాన నాటితే కృష్ణుడు “ఆ పక్క ఆలస్యమౌతున్నది, వీడేం మనకి చుట్టమా పక్కమా తొందరగా ముగించు” అంటే వాణ్ణి కీలుబొమ్మలా మూర్ఛపుచ్చి కిందపడేశాడు అర్జునుడు. అప్పుడిక కాంభోజసైన్యాన్ని కలగిస్తూ దారి చేసుకుని వెళ్తుంటే మూర్ఛ లేచి కృతవర్మ అర్జునుడి చక్రరక్షకుల్ని అడ్డుకున్నాడు.

కౌరవసేనని చీల్చుకు వెళ్తున్న అర్జునుణ్ణి శ్రుతాయుధుడు ఎదిరించాడు. అర్జునుడి మీద, కృష్ణుడి మీద పదిహేడు అమ్ములు వేసి ఒక బాణాన కేతువుని కొట్టాడు. క్రీడి తొంభై బాణాల్తో వాణ్ణి వారిస్తే వాడు డెబ్భై ఐదు అతని మీద వేశాడు. కోపంతో అర్జునుడు వాడి విల్లు తుంచి ఏడు శరాల్తో వాడి ఉరాన్ని చొప్పించాడు. వాడు తీవ్రంగా ఇంకో విల్లు తీసుకుని తొమ్మిది బాణాల్తో అర్జునుడి చేతుల్ని వక్షాన్ని కొడితే ఎలనవ్వుతో పార్థుడు వాడి సారథిని, అశ్వాల్ని చంపి డెబ్భై క్రూరశరాల్తో వాణ్ణి నొప్పిస్తే వాడొక పెద్దగదని తీసుకుని రథం దిగి అర్జునుడి రథమ్మీదికి పరిగెత్తాడు.

మహారాజా! ఆ శ్రుతాయుధుడు వరుణవరప్రసాది. ఆ గద వాడికి వరుణుడిచ్చింది. ఆ గద వాణ్ణి అజేయుణ్ణి చేస్తుందని, ఐతే యుద్ధం చెయ్యని వాళ్ళ మీద దాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతిరిగి వాడినే చంపుతుందని వరుణుడు వాడికి చెప్పాడు కాని పోయే కాలం వచ్చినవాడికి అవి గుర్తుండవు కదా, వాడా గదతో కృష్ణుణ్ణి మోదాడు. అది కృష్ణుణ్ణి ఏమీ చెయ్యకపోగా అతనికి పూలమాలికలా అయింది. వెంటనే పిడుగులా శ్రుతాయుధుణ్ణి హతమార్చింది. అంతకు ముందే అర్జునుడు వాడి బాహువుల్ని ఖండిస్తే వాడో పర్వతంలా కింద పడ్డాడు. అదిచూసి వాడి సేనలు, ఆ చుట్టుపక్కల వున్న మిగతా రాజుల సేనలూ చెల్లాచెదురైనై.

అప్పుడు కాంభోజుడు సుదక్షిణుడు అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడు కుపితుడై పద్నాలుగు బాణాల్తో వాడి సూతుణ్ణి, గుర్రాల్ని, వింటిని, కేతనాన్ని నరికి ఒక నిశితాస్త్రంతో వాడి గుండె పగిలేట్టు కొట్టాడు. మొదల్నరికిన చెట్టులా వాడు కూలాడు. సుదక్షిణుడి చావుతో శూరసేనుడు, శిబి, వసాతి చుట్టుముడితే అర్జునుడు బాణవర్షంతో వాళ్ళ ఆరువేల రథాల్ని నుగ్గుచేశాడు. వాళ్ళు పారిపోయారు.

శ్రుతాయువు, అయుతాయువు రెండు వైపుల నుంచి వేలకొద్ది బాణాలు కురిపిస్తూ అర్జునుణ్ణి చుట్టుముట్టారు. శ్రుతాయువు తోమరంతో అర్జునుణ్ణి దిమ్మదిరిగేట్టు కొట్టాడు. దానికితోడు అయుతాయువు కూడ శూలంతో పొడిచాడు. సొమ్మసిల్లి అర్జునుడు తన కేతనం పట్టుకుని తూలితే కృష్ణుడతన్ని తెలివిలోకి రప్పించాడు. కురుసైన్యంలో సింహనాదాలు చెలరేగినై. తెలివి తెచ్చుకున్న అర్జునుడు ఐంద్రాస్త్రం ప్రయోగిస్తే అది ఆ ఇద్దర్నీ అంగాంగాలు ఖండించి చంపింది. వాళ్ళ అనుచరులు ఐదువందల మంది రథికుల్ని కూడ వధించింది. అది చూసి వాళ్ళ కొడుకులు నియుతాయువు, దీర్ఘాయువు ఏమైతే అదైందని అతని మీద పడితే త్వరితంగా వాళ్ళని కూడ తండ్రులకి తోడు పంపించేశాడు.

దుర్యోధనుడు మ్లేచ్ఛబలాల్ని అతని మీదికి పురిగొల్పితే వాళ్ళు మహాసాహసంతో అతనితో పోరారు. ఐతే అతను కార్చిచ్చులా ఆ బలాల్ని కాలుస్తుంటే అంబష్ట దేశపు రాజు శ్రుతాయువు ఉద్రేకంగా అర్జునుడి నొగల్ని తాకేంత దగ్గరికి తన రథాన్ని నడిపితే అర్జునుడతని వింటిని తుంచి గుర్రాలని కూల్చాడు. వాడొక భీకరమైన గదని తీసుకుని కృష్ణుణ్ణి కొడితే అర్జునుడా గదని విరిచాడు. వాడు మరో గదతో లంఘిస్తే వేగంగా వాడి భుజాల్ని కంఠాన్ని తుంచాడు.

ఇలా ద్రోణుణ్ణి దాటుకుని, కృతవర్మని చీకాకు పెట్టి, శ్రుతాయుధుణ్ణి దండాయుధుడి దగ్గరికి పంపి, కాంభోజుణ్ణి కాటికి పంపి, శ్రుతాయువుని గతాయువుగా చేసి నీ సైన్యంలోకి చొచ్చుకుపోయి వీరయోధుల ప్రాణాల్ని తన బాణాల్తో బయటికి లాగేస్తున్న అర్జునుణ్ణి చూసి దుర్యోధనుడు కుతకుతలాడాడు. ఒంటిగా రథాన్ని తోలుకుని ద్రోణుడి దగ్గరికి వెళ్ళి అతన్ని నానా దుర్భాషలాడాడు – “నిన్ను అవలీలగా దాటి మన సైన్యం లోకి జొరబడి అతలాకుతలం చేస్తున్న అర్జునుడి వంక కన్నెత్తైనా చూడవు. పాండవపక్షపాతీ! పాము రక్షణలో వున్న కప్పల్లా వున్నాం, నిన్ను నమ్ముకుని. ఏదో కంటితుడుపుగా నాకు వరమిచ్చావ్, ఏం సాధించావ్? నువ్వేదో రక్షిస్తావని సైంధవుడు సైన్యంలోనే వున్నాడు. వాణ్ణి చంపించటానికి పూనుకున్న తేనె పూసిన కత్తివి నువ్వు” అంటూ. అంతలోనే సంభాళించుకుని, “బాధలో నేనన్న మాటలు పట్టించుకోవద్దు. ఎలాగైనా సైంధవుణ్ణి రక్షించు” అని వేడుకున్నాడు.

దానికి ద్రోణుడు “నాకేం బాధలేదు, నాకు నువ్వూ అశ్వత్థామ వేరువేరు కారు. ఇప్పుడు నేను సేనాముఖాన్ని విడిచి లోనికి వెళ్తే పాండవబలగాలు మన సేనల్ని చెల్లాచెదురు చేస్తయ్, సైంధవుడికి కూడ ముప్పు రావొచ్చు. అదీగాక నేను ధర్మరాజుని బంధించాల్సిన పని కూడ వుంది కదా! పైగా, నేను వృద్ధుణ్ణి, అర్జునుణ్ణి వెంటబడి తరమలేను. నువ్వూ అతనూ కుర్రవాళ్ళు. కొంతమందిని వెంట తీసుకు వెళ్ళి అతనితో నువ్వే తలపడి ఆపరాదూ” అన్నాడు. “నిన్నూ కృతవర్మనీ ఓడించి, అనేక మంది రాజుల్ని హతమార్చిన అర్జునుణ్ణి నేను ఎదుర్కోవాలా? కాదూ కూడదూ అదే ఇప్పుడు కర్తవ్యం అంటే నా పరువు పోని మార్గం చెప్పు, అలాగే చేస్తా” అన్నాడు దుర్యోధనుడు. “నువ్వన్నది నిజమే. ఐతే నీకో మహత్తు చూపిస్తాను. ఇదుగో ఈ బంగారు కవచానికి కవచధారణ విద్యని ఆవహింపజేసి ఇస్తున్నాను. దీన్ని ధరిస్తే ఎవరి బాణాలూ నిన్ను ఏమీ చెయ్యలేవు. దీన్ని బ్రహ్మ ఇంద్రుడికిస్తే అతను అంగిరసుడికి, అంగిరసుడు బృహస్పతికి, బృహస్పతి అగ్నివైశ్యుడికి, అగ్నివైశ్యుడు నాకు ఇచ్చారు” అని దాన్ని తొడిగి దీవించి పంపాడు ద్రోణుడు. దాంతో సుయోధనుడు సంతుష్టుడై చమూసమూహాల్తో అర్జునుడి మీదికి బయల్దేరాడు.

ఇక్కడ పాండవబలాలు మన మొగ్గరం మీదికి దండెత్తినయ్. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడితో ఘోరంగా పోరాడు. మనవైపు నుంచి మేటిదొరలు అక్కడికి చేరారు. ఇరువైపుల వారు ఒకర్నొకరు తలపడ్డారు. వికర్ణుడు, వివింశతి, చిత్రసేనుడు – భీముడితో కలబడ్డారు. బాహ్లికుడు ద్రౌపదేయుల్తో. దుశ్శాసనుడు సాత్యకిని, శకుని నకుల సహదేవుల్ని, సోమదత్తుడు శిఖండిని, అలంబుసుడు ఘటోత్కచుణ్ణి ఎదుర్కున్నారు. సైంధవుడికి తోడుగా వుంటూనే అప్పుడప్పుడు మొన ముందుకి కూడ వచ్చి చూసిపోతున్న శల్యుడు అక్కడే వున్నాడప్పుడు. ధర్మజుడితో అతను తలపడ్డాడు. అందరూ ఇక రేపు లేదన్నట్టు శక్తంతా కూడగట్టి శరయుద్ధాలు చేస్తున్నారు. ఐతే ద్రోణాచార్యుడి రక్షణలో మన వ్యూహం పటిష్టంగా నిలబడటం చూసి సహించలేక ధృష్టద్యుమ్నుడు మహాక్రోధంతో ద్రోణుడి గుర్రాల్ని తాకేంత దగ్గరకి తన రథాన్ని నడిపించి ఒక వాలుని పలకని తీసుకుని ద్రోణుడి రథమ్మీదికి గెంతి చిత్ర విచిత్ర విన్యాసాల్తో అతని బాణాలు తనకి తగలకుండా చూసుకుంటూ అతన్ని చేరబోతూ వాలుతో గుర్రాల్ని కొట్టి గాయాలు చేశాడు. ఐతే ఆ అదునులో ద్రోణుడతని వాలుని విరిచి సారథిని గుర్రాల్ని చంపి ఒక పదునైన నారసాన్ని అతని మీదికి వేస్తే – వేగంగా సాత్యకి దాన్ని మధ్యలోనే నరికి సింహం చేతిలో చిక్కిన లేడిని రక్షించినట్టు ధృష్టద్యుమ్నుణ్ణి అక్కణ్ణుంచి తప్పించాడు.

దానికి ద్రోణుడు కోపించి సాత్యకి మీద క్రూరశరాలు ప్రయోగించాడు. సాత్యకి కూడ తన సారథితో “ద్రోణుడి అభిమతం ధర్మరాజుని పట్టటం. అతనికా అవకాశం ఇవ్వకుండా మనం అతనితో తలపడదాం” అని తన రథాన్ని ద్రోణుడికి ఎదురుగా తిప్పించాడు. ఇద్దరూ తీవ్ర బాణజాలాల్తో చూసేవాళ్ళకి కళ్ళపండగ్గా సమానంగా పోరారు. అతని లాఘవానికి ద్రోణుడు కూడ సాత్యకిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ద్రోణుడి వింటిని సాత్యకి రెండుగా నరికితే అతను మరో విల్లు తీసుకుంటే దాన్ని కూడ సాత్యకి నరికాడు. ఇలా అతను ఎన్ని తీసినా సాత్యకి నరుకుతూనే వుంటే అంతా విస్తుపోయారు. ఇక సహించలేక ద్రోణుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే సాత్యకి వారుణాస్త్రంతో దాన్నెదుర్కున్నాడు. ఆకాశంలో ఆ రెండు అస్త్రాలూ ఘోరంగా పోరి కొంతసేపటికి శాంతించినయ్. ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకికి అండగా వచ్చి నిలిస్తే దుశ్శాసనుడు ముందుండగా మన కుమారవర్గం వాళ్ళని తాకింది.

అక్కడ దారంతా పీనుగుపెంటలు చేస్తూ అర్జునుడు సైంధవుడున్న చోటికి దగ్గరౌతున్నాడు. అప్పుడు అవంతీశ్వరులు విందానువిందులు ఒకే రథమ్మీద వచ్చి అర్జునుణ్ణి అడ్డుకున్నారు. అర్జునుడి బాణాల్ని లెక్కచెయ్యకుండా అతని మీద, కృష్ణుడి మీద, గుర్రాల మీద అనేక శరాలు పంపారు. ఐతే అర్జునుడు తీవ్రవేగంతో సారథిని, గుర్రాల్ని చంపి, కేతనాన్ని కూల్చి దాంతో పాటే విందుడి తలనీ నేలకూల్చాడు. అన్న చావు చూసి అనువిందుడు రోషంతో గద తీసుకుని రథాన్నుంచి దూకి పరిగెత్తి కృష్ణుడి ఫాలాన మోదాడు. అర్జునుడు తటాల్న వాడి గద విరిచి కాళ్ళూ చేతులూ తలా నరికి యుద్ధభూమికి బలిచ్చాడు. వాడి సేనలు ధైర్యంగా నిలబడి చుట్టుముడితే విజయుడు వాటిని నాశనం చేసి కదిలాడు.

ఐతే సమయం మధ్యాన్నాన్ని మించటం, అర్జునుడూ అతని గుర్రాలూ అలిసినట్టు కనిపించటం, సైంధవుడున్న చోటు ఇంకా చాలా దూరం వుండటంతో మనసైన్యంలో ఉత్సాహం కలిగింది. అందరూ సింహనాదాలు చేశారు. అర్జునుడు కృష్ణుడితో, “గుర్రాలకి చాలా బాణాలు గుచ్చుకుని వున్నయ్, ఇంకా చాలా దూరం వెళ్ళాల్సుంది. వాటికి కాస్త విశ్రాంతి ఇచ్చి, ఆ బాణాల్ని లాగి వైద్యం చేస్తే మంచిదేమో” అంటే అలాగే చేశాడు కృష్ణుడు. అర్జునుడు పాదచారిగా ఉండటం చూసి మనబలాలు అతన్ని చుట్టుముట్టటానికి ప్రయత్నించినయ్. ఐతే అతను నవ్వుతూ తీవ్రాస్త్రాల్తో మన బలాల్ని వారించి నెత్తుటికాలవలు పారించాడు. కృష్ణుడతనితో “గుర్రాలు దాహంతో అలమటిస్తున్నయ్. వీటికిప్పుడు మనం నీళ్ళు పెట్టాలి. ఎలా?” అంటే అర్జునుడు నవ్వి, “ఇవిగో నీళ్ళు” అంటూ ఒక దివ్యాస్త్రంతో నేల చీల్చి కొలను తయారుచేసి బాణాల్తో దానికి గట్టు అమర్చాడు. కృష్ణుడు గుర్రాల్ని తరిమి నీళ్ళు తాగించి ఆ నీటిలో అంతలోనే పెరిగిన గడ్డిని పెట్టి సేద తీర్చాడు. ఇద్దరూ మళ్ళీ రథం మీద ఎక్కి బయల్దేరారు.

అదంతా చూసిన మన సేన అవాక్కై అర్జునుడి మీదికి వెళ్ళాలనే ఆలోచనైనా లేకుండా దిగాలు పడి చూస్తున్నది. ఇంతలో దుర్యోధనుడక్కడికి వచ్చి కవచధారణ వల్ల భయపడకుండా కృష్ణార్జునుల రథానికి అడ్డంగా నిలబడ్డాడు. అదిచూసి కృష్ణుడు “వీడి వాలకం ఆశ్చర్యకరంగా వుంది. మీ పరాభవాలన్నిటికి మూలకారణం వీడు. తనంతట తను ఇలా నీకు బలికావటానికి వచ్చి నిలబడ్డాడు. వీణ్ణి అంతం చెయ్యి” అని ప్రోత్సహిస్తే అర్జునుడు దేవదత్తం వూదాడు, కృష్ణుడూ పాంచజన్యం మోగించాడు. “దుర్యోధనుడిక చచ్చాడు, చచ్చాడ”ని మన వాళ్ళు కలవరపడ్డారు. ఐతే దుర్యోధనుడు “మనకేం భయం లేదు. వీళ్ళ అంతు నేను చూస్తా, చూస్తూ వుండండి” అని మన వాళ్ళకి ధైర్యం చెప్పి “అర్జునా, నువ్వు నిజంగా పాండురాజుకి పుట్టినవాడివే ఐతే ఇప్పుడు నీ మగతనం చూపించు” అని దూషిస్తూ అతని మీద, కృష్ణుడి మీద, గుర్రాల మీద, కేతనం మీద బాణాలేశాడు. అర్జునుడు వేసిన బాణాలతన్ని తాకను కూడ లేదు.

కృష్ణుడు విషాదంతో “అర్జునా ఏమిటిది, నీ గాండీవం మొక్కబోయిందా, నీ చేతుల్లో శక్తి సన్నగిల్లిందా? గురి సరిగా వుందా? పిడికిలి సరిగా పడుతున్నావా? ఏమీ అర్థం కావటం లేదే!” అంటే “అది కవచధారణ మహిమ. ఇదివరకు ఆచార్యుడు నాకొక్కడికే అది చెప్పాడు, ఇప్పుడు వీడికి కూడ చెప్పినట్టున్నాడు. ఐనా దాన్నెలా పనికిరాకుండా చేస్తానో చూడు. అంగీరసుడు ఇంద్రుడికి ఒక మహాస్త్రం ఇచ్చాడు, దాన్ని అతను నాకిచ్చాడు. అది అన్ని కవచాల్ని భేదిస్తుంది” అంటూ ఆ మహాస్త్రాన్ని సమంత్రకంగా విడిస్తే – ఇంతలో హఠాత్తుగా అశ్వత్థామ అడ్డుకుని దాన్ని సర్వాస్త్రఘాతి ఐన మరో అస్త్రంతో ఖండించాడు. అర్జునుడు అవాక్కయాడు. ” ఆ అస్త్రాన్ని ఒక్కసారే ప్రయోగించాలి, దాన్ని అశ్వత్థామ నిష్ఫలం చేశాడు. ఐనా పోయిందేం లేదు, నా వింటి బలిమితోనే అతన్ని ఓడిస్తా” అన్నాడు. ఇంతలో దుర్యోధనుడు వాళ్ళిద్దర్నీ తొమ్మిదేసి బాణాల్తో నొప్పిస్తే అర్జునుడు వేగంగా అతని సారథిని, గుర్రాల్ని చంపి, రథాన్ని విరిచి అతని చేతుల్ని బాణాల్తో గాయం చేశాడు. తన చేతులలా గాయం కావటంతో వికల మనస్కుడయాడు దుర్యోధనుడు. ఆ కవచం ఇంక పనిచెయ్యదనుకుని దాన్ని తీసేసి మరో మామూలు కవచాన్ని తొడుక్కున్నాడు.

అర్జునుడలా దుర్యోధనుడితో పోరుతుంటే సైంధవుడి చుట్టూ వున్న వాళ్ళు దుర్యోధనుడిని కాపాడటానికి అతనికి తోడై వచ్చారు. అది కూడ తమకు అనుకూలమైన పరిణామమేనని కృష్ణార్జునులు ఆనందించారు. వృషసేనుడు, శలుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, భూరిశ్రవుడు ఒక్క పెట్టున వాళ్ళని చుట్టుముట్టారు. వాళ్ళ వెనక దాక్కుని సైంధవుడూ అర్జునుడి మీదికి బాణపరంపరలు కురిపిస్తున్నాడు. అర్జునుడెంత తీవ్రశస్త్రాస్త్రాల్తో పోరాడినా వెనుతిరక్కుండా వాళ్ళూ రణం సాగించారు.

మరోవంక ద్రోణుడు, మన ఇతర దొరల్తో ధర్మరాజు, అతని తమ్ములు, ధృష్టద్యుమ్నాది వీరులు యుద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ద్రోణ ధర్మజుల యుద్ధం చాలా ఆసక్తికరంగా సాగింది. ద్రోణుడి శరవర్షంతో ధర్మరాజు రథాన్ని కమ్మేస్తే “ఇంకేముంది, ధర్మరాజు ద్రోణుడికి చిక్కాడ”ని సేనలు గగ్గోలు పడ్డారు. ధర్మరాజు ఆ బాణాల్ని విరిచి తీవ్ర రశ్మితో మండే ఓ గొప్ప శక్తిని ద్రోణుడి మీదికి విరిరాడు. అతను దాన్ని బ్రహ్మాస్త్రంతో నిర్జించాడు. అంతతో ఆగక తనకేసి వస్తున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని ధర్మజుడు కూడ బ్రహ్మాస్త్రంతోనే ఉపసంహరించాడు. అంతేకాకుండా ఐదు బాణాల్తో ద్రోణుడి వింటిని నరికాడు. ద్రోణుడు గద విసిరాడు. ధర్మరాజు కూడ ఉగ్రజ్వాలల్తో మండే గదని విసిరితే ఉగ్రాకృతితో ద్రోణుడతని గుర్రాల్ని చంపి వింటినీ జెండానీ రథాన్నీ విరిచాడు.

ధర్మరాజు రథం దిగి నిరాయుధుడై చేతులు పైకెత్తి దీనుడై ద్రోణుణ్ణి చూస్తూ నిలబడ్డాడు. అలా దీనంగా నిలబడ్డ ధర్మరాజుని చూస్తూ చూస్తూ ఏమీ చెయ్యటానికి చేతులు రాక ద్రోణుడు పక్కన ఉన్న సైన్యం మీదికి దృష్టి మరల్చాడు. ఈ లోగా వచ్చిన సహదేవుడి రథం మీదికి పరుగున ఎక్కి బతుకు జీవుడా అని పారిపోయాడు ధర్మరాజు. తృటిలో జరిగిపోయిన ఈ సంఘటనని గమనించక మిగిలిన రథికులు యుద్ధం కొనసాగిస్తున్నారు. అలంబుసుడు భీముడితో తలపడి “నేను లేనప్పుడు మా అన్న బకాసురుణ్ణి చంపావు, ఇప్పుడు నీ అంతు చూస్తా” అంటూ అతని మీద రకరకాల మాయలు ప్రయోగిస్తే భీముడు దివ్యాస్త్రాల్తో వాటిని పటాపంచలు చేశాడు. దాంతో ఆ రాక్షసుడు పారిపోయాడు. అదిచూసి ద్రోణుడు పాండవవీరుల్ని ఎదిరించి నిలబెట్టి పోరాడాడు. ఘటోత్కచుడు ద్రోణుడితో తలపడుతుంటే అలంబుసుడు అడ్డుగా వచ్చి అతన్నెదుర్కున్నాడు. సాత్యకి అలంబుసుడితో తలపడబోతుంటే ఘటోత్కచుడతన్ని పక్కకి నెట్టి తనే వాడితో యుద్ధానికి పూనుకున్నాడు. అలంబుసుడు వేగంగా అతని మీద చక్రాన్ని విసిరితే ఘటోత్కచుడు గదతో దాన్ని పొడి చేశాడు. అలంబుసుడు రకరకాల శక్తుల్ని ప్రయోగిస్తే అర్థచంద్ర బాణాల్తో నాశనం చేశాడు ఘటోత్కచుడు.

అలా ఆ ఇద్దరు రాక్షసులూ వివిధాయుధాల్తో, మాయల్తో, మాయారూపాల్తో పోరాడుతుంటే పాండవులు, వాళ్ళ హితులూ కలిసి అలంబుసుడి మీద శరపరంపరలు కురిపించారు. వాడు మాయాబలంతో ఆ శరాల్ని తప్పించుకుని భీముడి మీద ఇరవై ఐదు, ధర్మరాజు మీద మూడు, సహదేవుడు, ద్రౌపదేయులు, ఘటోత్కచుడు ఒక్కొకరి మీద ఐదేసి, నకులుడి మీద డెబ్భై మూడు బాణాలేసి బొబ్బ పెట్టాడు. ఘటోత్కచుడు వాడి రథమ్మీదికి దూకి సారథిని చంపి రథాన్ని ముక్కలు చేశాడు. విరథుడై కిందికి దూకి వాడు తన మాయాబలంతో బాణవర్షం కురిపిస్తే ఘటోత్కచుడు కూడ రథం దిగి మాయాశరాల్తో వాటిని విరిచి గదతో వాడిని మోదాడు. అలంబుసుడు గాయపడ్డాడు. కత్తి తీసుకుని ఆకాశానికెగిరాడు. ఘటోత్కచుడు కూడ అదేపని చేశాడు. ఇద్దరూ చిత్ర విచిత్ర గతుల్తో యుద్ధం చేసి భూమికి దిగి ఒకరొకరి కంఠాలకి గురిగా కత్తులు విసిరితే అవి రెండూ ఒక దానికొకటి కొట్టుకుని కింద పడినయ్.

దాంతో రాక్షసులిద్దరూ మల్లయుద్ధానికి పూనుకున్నారు. అనేక ప్రకారాల పిడిగుద్దుల్తో, పోటుల్తో, వేటుల్తో వాళ్ళ ప్రావీణ్యాన్ని చూపుతూ అద్భుతంగా పోరారు. సేనలన్నీ ఆశ్చర్యంతో చూస్తున్నాయి. చివరకు అలంబుసుడు కొంత అలసి పోవటంతో ఘటోత్కచుడు విజృంభించి వాణ్ణి కింద పడేసి తను పైనెక్కి మోకాళ్ళు, మోచేతులు, పిడికిలి దెబ్బల్తో వాణ్ణి ముద్దముద్దగా కొట్టి వాడి తొడ ఎముకల్ని నుగ్గునుగ్గుగా చితక్కొట్టి కాల్తో వాడి పీక నులిమి చంపి పోటుతనంతో రంకె వేశాడు. పాండవబలంలో సింహనాదాలు, వాద్యఘోషలు చెలరేగినై. ఘటోత్కచుడు ధర్మరాజుకి నమస్కరిస్తే అతను సంతోషంగా వాణ్ణి కౌగిలించుకుని మూర్ధాఘ్రాణం చేశాడు.

మరోవంక సాత్యకి ద్రోణుడితో తలపడి పోరుతున్నాడు. ఇరవై ఐదు పిడిబాణాల్తో సాత్యకి ద్రోణుణ్ణి కొడితే మూడు నారసాల్తో ద్రోణుడతన్ని తిప్పికొట్టాడు. సాత్యకి నూటైదు బాణాలేస్తే ద్రోణుడు తొమ్మిది అమ్ములేశాడు. అంతతో ఆగక ద్రోణుడు వంద శరాల్తో అతన్ని నొప్పిస్తే సాత్యకి తూలి తిరిగి వెయ్యలేక చూస్తుంటే మనవాళ్ళు ఆనందంగా అరిచారు. అది ధర్మరాజు విన్నాడు. ధృష్టద్యుమ్నుణ్ణి పిలిచి “పిట్టని తాటికి కట్టి ఆడించే బాలుడి లాగా ద్రోణుడు సాత్యకిని తిప్పలు పెడుతున్నాడు. భీముణ్ణి తీసుకుని నువ్వక్కడికి వెళ్ళి అతన్ని రక్షించు” అని తొందర పెట్టాడు. వాళ్ళు హుటాహుటిన సాత్యకిని దాటి వెళ్ళి ద్రోణుడితో తలపడ్డారు.

ఇంతలో ధర్మరాజుకి పాంచజన్య ధ్వని వినపడింది. కాని దాని వెనకే గాండీవ గుణ ధ్వని వినపడలేదు. అతనికి కంగారు కలిగింది. సాత్యకిని పిలిచాడు. డగ్గుత్తికతో “పాంచజన్యం పదేపదే వినిపిస్తున్నది. విజయుడొక్కడే సైంధవ వధకి కౌరవసైన్యం లోకి వెళ్ళాడు. అతనికేమైనా అయిందేమోనని నాకు కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. మన బలంలో అతన్ని రక్షించ గలిగేవాడివి నువ్వొక్కడివే. అర్జునుడు నీకు ఆప్తుడు, గురువు. నువ్వు పక్కనుంటే చాలు కౌరవుల్ని జయిస్తానని అర్జునుడు ఎప్పుడూ చెప్తూ వుంటాడు. వెళ్ళి నీ శరదర్పంతో కురుబలాన్ని దాటుకుని అర్జునుణ్ణి చేరు. నా మనసు చల్లబడేట్టు చెయ్యి. ఇది నా ప్రార్థన, మన్నించు” అని వేడుకున్నాడు.

అందుకు సాత్యకి “నీ మాట కాదంటానా? ఐతే అర్జునుడు పొద్దున వెళ్ళేటప్పుడు నన్ను నీకు రక్షగా వుండమని పదేపదే చెప్పాడు. ఇక్కడ నిన్ను ద్రోణుడు పట్టుకుంటే అక్కడ సైంధవుణ్ణి చంపీ ఉపయోగం లేదు కదా?” అంటే, ధర్మరాజు “నా గురించి నీకేం చింత అక్కర్లేదు. ఇక్కడ ద్రుపదుడు, విరాటుడు, కేకయులు, ద్రౌపదేయులు, ఘటోత్కచుడు, శిఖండి – ఇలా ఎందరో మహావీరులున్నారు, ఇక ధృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణ సంహారానికి. నువ్వు నిశ్చింతగా అర్జునుడికి సహాయంగా వెళ్ళు” అని చెప్పాడు. సాత్యకి, “ఐతే గుర్రాలకి నీళ్ళు పెట్టించి, రథం సిద్ధం చేయించి బయల్దేరతా” అని దారుకుడి తమ్ముడు సారథిగా రథం సిద్ధం చేస్తుంటే తను వెళ్ళి స్నానం చేసి ఆప్యాయంగా కొంత మధువు తాగి పెళ్ళికి వెళ్తున్నట్టు రథం ఎక్కి ఎక్కుపెట్టిన ధనువుని, ముచ్చటైన అమ్ముల్ని తొడల మీద పెట్టుకుని బయల్దేరాడు. భీముడు కూడ తనతో రాబోతుంటే అతన్ని వారించి ధర్మరాజు పక్కనే ఉండమని చెప్పి లేళ్ళ గుంపుల్ని చూసే పెద్దపులిలా మన సేన వంక చూస్తూ కదిలాడు సాత్యకి.

సాత్యకి అర్జునుడి దగ్గరికి బయల్దేరితే ద్రోణుడతని వెంట పడ్డాడు. ద్రోణుణ్ణి ఆపటానికి పాండవబలాలు అతనితో తలపడబోతే మనబలంలో వీరులు వాళ్ళని ఢీకొన్నారు. సాత్యకి, ద్రోణులు ఘోరంగా పోరసాగారు. “నీ గురువు అర్జునుడు నాకోడిపోయి పక్కకి తిరిగి లోపలికి పోయాడు. నువ్వూ అలా చేద్దామనుకుంటున్నావేమో, అది సాగనివ్వను. నిలబడి యుద్ధం చెయ్యి” అని గర్జించాడు ద్రోణుడు. “ధర్మరాజు కోరిక మీద అర్జునుడి దగ్గరికి వెళ్తున్నా. ఆలస్యం చెయ్యటం మీలాటి పెద్దలకు భావ్యం కాదు” అని అతన్ని వేడుకున్నాడు సాత్యకి. ఐనా వినక ద్రోణుడు రణం సాగిస్తుంటే సాత్యకి సారథితో “ద్రోణుడు మనల్ని పోనివ్వడు. మనమే పక్కకి తప్పుకు పోవాలి. ఇటు బాహ్లికుడి సైన్యం వుంది, అటు అంగరాజ్య సైన్యం. ఆ పక్క దాక్షిణాత్య సేన. వీటిలో ఒకదాన్లోకి వెళ్దాం పద” అంటే అతను అంగ సైన్యం వైపుకి కదిలాడు. ద్రోణుడు వదలకుండా వెంటపడ్డాడు. సాత్యకి ఆ సైన్యాన్ని చీల్చుకుని వెళ్తుంటే కృతవర్మ అడ్డుపడ్డాడు. అదిచూసి సంతుష్టుడై ద్రోణుడు వెనక్కి తిరిగి తన స్థానానికి వచ్చాడు.

కృతవర్మ సాత్యకి వింటిని విరిచాడు. అతను ఇంకో విల్లు తీసుకుని కృతవర్మ చేతులు గాయాలు చేసి అతని సారథిని చంపాడు. కృతవర్మ తనే రథం తోలుకుంటూ ధైర్యంగా నిలబడ్డాడు. ఐతే అతను సాత్యకి వెంట వెళ్ళకుండా పక్కనే వున్న భీముడి బలగాల మీద విరుచుకు పడ్డాడు. సాత్యకి ముందుకి సాగి కాంభోజసేనలోకి చొరబడ్డాడు. ఆ సేనలో వున్న దొరలు అతన్నెదుర్కున్నారు.

ద్రోణుడు కృతవర్మకి మరో సారథిని ఏర్పరచి అతని స్థానానికి అతన్ని పంపి తను సాత్యకి వెంట బయల్దేరాడు. అదిచూసి ధర్మరాజుతో వున్న రాజులు ద్రోణుణ్ణి వెనక నుంచి తాకారు. ఐతే కృతవర్మ వాళ్ళకి అడ్డుపడి కదలకుండా ఆపి చీకాకు పరిచాడు. అదిచూసి భీముడు సోదరపుత్రమిత్ర సహితంగా కృతవర్మ మీదికి దూకాడు. ఐతే అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాళ్ళందరికీ సమాధానాలు చెప్తూ సేనని గగ్గోలు పరిచాడు. శిఖండి కృతవర్మతో తలపడితే కృతవర్మ అతని వింటిని విరిచి గాయం చేస్తే సారథి రథాన్ని అక్కడినుంచి దూరంగా తోలుకుపోయాడు. దాంతో మత్స్య, చేది, కేకయ సైన్యాలు చెల్లాచెదురైనై.

దూరాన్నుంచి అది చూస్తున్న సాత్యకి అర్జునుడికి సాయంగా తర్వాత వెళ్ళొచ్చు, ముందు ధర్మజుడికి రక్షణ ముఖ్యం అని ద్రోణుడితో యుద్ధం ఆపి రథాన్ని వెనక్కి తోలుకుని వచ్చి కృతవర్మని అటునుంచి ఢీకొన్నాడు. ఒక భల్లంతో కృతవర్మ విల్లుని తుంచాడు. నాలుగిటితో గుర్రాల్ని చంపాడు. దీప్తివంతమైన ఒక బాణంతో సూతుడి తల నరికాడు. అలా కృతవర్మ పొగరు దించి ఉల్లాసంగా వెనక్కి తిరిగాడు సాత్యకి. త్రిగర్త సైన్యం అడ్డుకోబోతే వాళ్ళని ఊచకోత కోశాడు. పాండవసైన్యం ఉత్సాహంగా ఉరకలేస్తుంటే ద్రోణుడు సాత్యకిని తరమటం మాని ఆ సైన్యాన్ని అడ్డుకున్నాడు.

సాత్యకి దారికి అడ్దంగా జలసంధుడనే మగధరాజు ఏనుగు మీదెక్కి నిలబడ్డాడు. సాత్యకి శరప్రవాహంతో ఆ ఏనుగునాపితే జలసంధుడు సాత్యకి వింటిని విరిచాడు. విరిచి ఏభై బాణాలతని వక్షాన నాటాడు. సాత్యకి కోపించి ఒక గట్టివిల్లు తీసుకుని వాడి విల్లు నరికి అరవై అమ్ములు వాడి శరీరానికి నాటాడు. జలసంధుడు చలించకుండా ఒక తోమరంతో సాత్యకి చేతిని కొట్టి కత్తిని విసిరి అతని వింటిని విరిచాడు. పట్టరాని క్రోధంతో సాత్యకి మరో విల్లు తీసుకుని వాడి చేతులు, తల నరికి కేక పెట్టాడు. దాంతో అక్కడి సైన్యం కకావికలై పారిపోతుంటే చూసి ద్రోణుడు కృతవర్మని తన స్థానంలో వుంచి మళ్ళీ సాత్యకితో తలపడ్డాడు. అతన్ని చూసి నీ కొడుకులు దుర్మర్షణుడు, దుస్సహుడు, వికర్ణుడు, దుర్ముఖుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు సాత్యకిని చుట్టుముడితే దుర్యోధనుడు కూడ వచ్చి వాళ్ళతో కలిశాడు. అప్పుడు ద్రోణుడు తృప్తిగా సేనాముఖానికి తిరిగి వెళ్ళాడు. ఐతే సాత్యకి అందరికీ అన్నిరూపులై యుద్ధం చేస్తూ దుర్యోధనుడి పతాకని కూల్చి సారథిని చంపి వింటిని విరిస్తే దుర్యోధనుడు కిందికి దూకి పరిగెత్తాడు. దగ్గర్లో వున్న చిత్రసేనుడి రథం ఎక్కాడు. దూరాన్నుంచి ఆ కోలాహలం విని కృతవర్మ వేగంగా అక్కడికి వచ్చాడు. సాత్యకి కూడ తన రథాన్ని అతనికి ఎదురుగా తిప్పించాడు. ఇద్దరూ ఘోరంగా రణం సాగించారు.

అప్పుడు సాత్యకి అతని గుర్రాల్ని, సూతుణ్ణి గాయపరిచి విల్లు తుంచి మిరుమిట్లు గొలిపే నారసాన్ని అతని ఒంట్లోంచి దూరిపోయేట్టు విసిరితే చచ్చినట్టు మూర్ఛపోయి పడ్డాడు కృతవర్మ. వాడు చచ్చాడని తృప్తిగా తన ప్రయాణం సాగించాడు సాత్యకి. ఐతే ఇంతలోనే కృతవర్మ తెప్పరిల్లి తన స్థానానికి పోయి భీమాదుల్తో తలపడితే ద్రోణుడతన్ని తన స్థానానికి పంపి తను తిరిగి సాత్యకి వెంట బయల్దేరాడు. మళ్ళీ ఇద్దరికీ ఘోరరణమైంది. ద్రోణుడతని వింటిని విరిచాడు, అతను గద విసిరేశాడు, ద్రోణుడు భల్లంతో దాన్ని పగిల్చాడు, సాత్యకి ఇంకో విల్లు తీసుకుని బాణవర్షం కురిశాడు. ద్రోణుడు తీవ్రంగా ఒక శక్తిని వేశాడు, అది విధివశాత్తు సాత్యకికి కాకుండా అతని రథానికి తగిలింది. సాత్యకి అతని భుజాన్ని గాయం చేశాడు. ద్రోణుడు కోపోద్దీపుడై అతని విల్లు తుంచి సారథిని మూర్ఛపుచ్చాడు. తనే రథం తోలుకుంటూ యుద్ధం చేశాడు సాత్యకి. ఇంతలో అతని సారథి లేస్తే నిశితబాణాల్తో ద్రోణుడి సారథిని చంపాడతను. గుర్రాలా రథాన్ని లాక్కుని పరిగెత్తినయ్. చివరికి ద్రోణుడు వాటిని స్వాధీనపర్చుకుని ఇక చేసేది లేక తన సేనల్ని కూడగట్టుకుని తిరిగి సేనాముఖానికి వెల్లి నిలిచాడు.

అర్జునుడున్న వైపుకి వేగంగా బయల్దేరాడు సాత్యకి. అతన్ని సుదర్శనుడనే రాజు అడ్డుకున్నాడు. ఐతే సాత్యకి చకచకా వాణ్ణి పరలోకాలకి ప్రయాణం కట్టించాడు. ఎదురుగా కిరాత, శక, బర్బర, పారద, యవన మ్లేచ్ఛసేనలు కనిపించినయ్. వాటిని నాశనం చేసి వెళ్తుంటే ఆగు సాత్యకీ ఆగు అని అరుస్తూ దుర్యోధన, దుశ్శాసన, చిత్రసేన, వివింశతి, శకుని, దుస్సహ, దుర్ధర్షణ, క్రథ ప్రభృతులు అతని వెంటబడితే తన సారథిని రథం కాస్త నిదానంగా తోలమని చెప్పి వాళ్ళు వచ్చేవరకు ఆగి తీవ్రశరాల్తో అందర్నీ నొప్పించి ఓ క్రూరాస్త్రంతో దుర్యోధనుడి విల్లు తుంచి సారథిని చంపితే అతని అశ్వాలు రథాన్ని దూరంగా లాక్కుపోయినయ్. మిగిలిన వాళ్ళంతా ఆ రథం వెంట పరిగెత్తితే తన దారిన తను సాగాడు సాత్యకి.

దుర్యోధనుడు క్రోధంతో పంపితే అంబష్ట, టేంకణ, పారద దేశాల సేనల్తో దుశ్శాసనుడు వేగంగా సాత్యకిని చేరుకుని చుట్టుముట్టాడు. సాత్యకి ఆ బలాల్ని చెల్లాచెదురు చేశాడు. దుశ్శాసనుడు తన సేన చేత అతని మీద రాళ్ళవర్షం కురిపించాడు. సాత్యకి వాటిని ముక్కలు చేసి వేసిన వాళ్ళకే తగిలేట్టు చేశాడు. ఆ తర్వాత తన బాణాల్లో దుశ్శాసనుణ్ణి ముంచితే అతనూ అతని సేనలూ ద్రోణుడి దగ్గరికి పరిగెత్తినయ్.

దుశ్శాసనుణ్ణి చూసి ద్రోణుడు “యువరాజులుంగారికి క్షేమమే కదా, సైంధవుణ్ణి అర్జునుడింకా చంపాడా లేదా? ఇప్పుడిలా సాత్యకి దెబ్బలకే పరిగెత్తే వాడివి రేపు అర్జునుడికో భీముడికో చిక్కితే ఇంక నీ గతేం కాను? అప్పుడు సభలో ద్రౌపది దగ్గర చూపించిన ప్రతాపం అంతా ఏమైందిప్పుడు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పాండవులకి వాళ్ళ రాజ్యం ఇప్పించు నీ అన్నతో చెప్పి. ఐనా నువ్వు ముందుంటే యుద్ధం చెయ్యటానికి సిద్ధంగా వున్న రాజుల్ని పెట్టుకుని సాత్యకితో యుద్ధం చెయ్యాలా ఇలా నా దగ్గరికి పరిగెత్తుకు రావాలా?” అని చీవాట్లు పెడితే వినపడనట్టు నటించి సేనల్తో తిరిగి సాత్యకి వైపుకి వెళ్ళాడు దుశ్శాసనుడు.

ద్రోణుడు పాండవసైన్యం మీదికి కవిసి చించిచెండాడాడు. ద్రుపదుడి కొడుకు వీరకేతుడు ఉగ్రుడై ద్రోణుణ్ణి తాకి అతని సారథిని నొప్పించి అతని ఒంటికి ఐదుబాణాలు నాటితే ద్రోణుడొక చండాస్త్రంతో వాణ్ణి నేలకూల్చాడు. వాడి అన్నలు తమ్ములు చిత్రకేతుడు, సుధన్వుడు, చిత్రవర్మ, చిత్రరథుడు ద్రోణుణ్ణి కమ్ముకుంటే అతను వెంటనే వాళ్ళందర్నీ పరలోకాలకి పంపాడు. దాంతో దుఃఖితుడై ధృష్టద్యుమ్నుడు క్రూరనారాచాల్తో ద్రోణుడి వక్షాన్ని కొట్టాడు. మన సేనలు హాహాకారాలు చేసినయ్. ద్రోణుడు మూర్ఛపోయాడు. పలకా వాలూ తీసుకుని అతని తల నరకటానికి ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి రథమ్మీదికి లంఘించాడు. ఐతే అంతలో తెలివొచ్చి ద్రోణుడు చేతికందుబాట్లో వున్న బాణాల్తోనే ధృష్టద్యుమ్నుడిని పొడిచాడు. ఊహించని ఈ ఎదురుదాడికి ఖంగుతిని బాణాలు గుచ్చుకున్న బాధతో విలవిల్లాడుతూ వెనక్కి తిరిగాడు ధృష్టద్యుమ్నుడు. ద్రోణుడు లేచి అతని సారథిని చంపితే గుర్రాలు ధృష్టద్యుమ్నుణ్ణి దూరంగా లాక్కుపోయినయ్. ద్రోణుడి ధైర్య స్థైర్య సాహసాలు చూస్తున్న పాండవసైన్యాలు అతన్నేమీ చెయ్యలేక చిందరవందరయినయ్.

ఇక ద్రోణుడి చేత చివాట్లు తిని వెళ్ళిన దుశ్శాసనుడు సాత్యకిని తాకాడు. అతనికి తోడుగా దుర్యోధనుడు త్రిగర్త బలాల్ని పంపాడు. ఆ సంశప్తకుల్లో మూడువేల రథాల మొనగాళ్ళు సాత్యకిని కమ్ముకుంటే అతను లాఘవంగా అందులో ఐదువందల మందిని అప్పటికప్పుడే యముడి దగ్గరికి పంపాడు. దాంతో త్రిగర్త సేనలు ద్రోణుడి నీడకి పారినయ్. దుశ్శాసనుడు మాత్రం నిలబడి సాత్యకి మీద బాణవర్షం కురిపించాడు. సాత్యకి అతని విల్లు విరిస్తే అతనో శక్తిని విసిరాడు. సాత్యకి దాన్ని ముక్కలు చేశాడు. ఇంకో వింటితో దుశ్శాసనుడు సాత్యకిని నొప్పించాడు. సాత్యకి కోపంతో అతని జెండాని, సారథిని, గుర్రాల్ని నాశనం చేసి, కేవలం భీముడి ప్రతిజ్ఞని మనసులో తలుచుకుని అతన్ని చంపకుండా వదిలి తన దారిన సాగాడు. ఇలా ఒకవంక సాత్యకి చేత, మరోవంక అర్జునుడి చేత మనసైన్యం, ఇంకోవంక ద్రోణుడి చేతిలో వాళ్ళ సైన్యం శలభాల్లా మాడిపోతున్నాయి.

ఇంతలో ద్రోణుడి యుద్ధం చూడటానికి దుర్యోధనుడు సేనాముఖానికి వచ్చాడు. పాండవసేనలు ఇంకా పోరాడుతుండటం చూసి ఒక్కడే వాళ్ళ వ్యూహం లోకి చొచ్చుకుపోయి ధర్మజ, భీమ, నకుల, సహదేవ, ద్రుపద, విరాట, ద్రౌపదేయ, కేకయ, ధృష్టద్యుమ్నుల మీద వరసగా బాణాలు వర్షించాడు. ధర్మరాజు కోపంతో అతని వింటిని నరికాడు. ఐతే ద్రోణుడు ఆ వెనకే వుండి పాండవవర్గం వారందర్నీ శరపరంపరల్లో ముంచితేల్చాడు. దుర్యోధనుడు తిరిగి సైంధవుడి సంరక్షణకి వెళ్ళాడు.

కేకయరాజు బృహత్క్షత్రుడు ద్రోణుడితో పోరాడి మరణించాడు. శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడప్పుడు ద్రోణుడితో తలపడ్డాడు. వాళ్ళిద్దరికి భీభత్స సమరం జరిగింది. ద్రోణుడొక వాలికనారసాన్ని ధృష్టకేతుడి హృదయంలో గుచ్చాడు. పెద్ద అరుపు అరిచి కింద పడి చచ్చాడు వాడు. అదిచూసి కోపోద్రిక్తుడై వాడి కొడుకు ద్రోణుణ్ణి కమ్ముకున్నాడు. ఐతే ద్రోణుడు వాణ్ణి అవలీలగా చంపాడు. ఆ వెనక జరాసంధుడి కొడుకు ఢీకొడితే వాణ్ణీ వేగంగా యమపురికి పంపించాడు. భీముడు ధృష్టద్యుమ్నుణ్ణి ద్రోణుడితో తలపడమని ప్రోత్సహిస్తే అతనా పని చేసే లోగా క్షత్రవర్మ అడ్డు వచ్చి ద్రోణుడి వింటిని విరిస్తే అతను వేగంగా మరో విల్లు తీసుకుని వాడి పేరు తుడిచేశాడు. దాంతో చేకితానుడు వందబాణాల్తో ద్రోణుణ్ణి నొప్పించి సూతుణ్ణి, గుర్రాల్ని బాధిస్తే ద్రోణుడు కళ్ళలోంచి నిప్పులు కురిపిస్తూ ఓ నిశిత బాణాన్ని అతని భుజానికి నాటి సారథిని చంపాడు. గుర్రాలతని రథాన్ని లాక్కుపోయినయ్.

ఇంతలో ధర్మరాజు “అర్జునుడికి తోడుగా సాత్యకిని పంపా, అతను లోపలికి వెళ్ళటం చూశా. మరి ఆ ఇద్దరూ ఎలా వున్నారో తెలియటం లేదు. తన తమ్ముడికి తోడుగా సాత్యకిని పంపాడు గాని మరి ఆ సాత్యకి ఏమయ్యాడో అన్న ఆలోచనే ఇతనికి లేదని చుట్టుపక్కల వాళ్ళు నన్నుకోవచ్చు. కాబట్టి భీముణ్ణి కూడ పంపటం ఉత్తమం” అనుకుని అతని దగ్గరికి వెళ్ళి అర్జునుడు, సాత్యకి ఎలా వున్నారో చూసి సింహనాదం ద్వారా తనకి తెలియజెయ్యమని కోరాడు. భీముడు ధర్మరాజు రక్షణని ధృష్టద్యుమ్నుడికి అప్పగించి కదిలాడు. నీ కొడుకులు అనేకమంది భీముడి మీదికి దూకారు. అతను ఆనందంగా లేళ్ళ గుంపుని చూసిన పులిలా వాళ్ళ మీద పడి ముందుగా ముగ్గుర్ని మృత్యువుకి బలిచ్చాడు. వాళ్ళు అభయుడు, రౌద్రకర్ముడు, దుర్విమోచనుడు. ఐనా పారిపోకుండా మిగిలిన వాళ్ళు పోరుతుంటే వాళ్ళలో విందుడు, అనువిందుడు, సుశర్ముడు, సుదర్శనుల్ని కూడ తోడు పంపాడు.

ఈ సంరంభం చూసి ద్రోణుడక్కడికి వచ్చి భీముడితో తలపడ్డాడు. వీడు కూడ అర్జునుడి లాగానే తప్పించుకుపోతాడేమోనని “నన్ను గెలిస్తే తప్ప నువ్వీ వ్యూహాన్ని ప్రవేశించలేవు. నీ తమ్ముడు కూడ నా అనుమతి తీసుకునే వెళ్ళాడు” అంటే భీముడు నిప్పులు రాలుస్తూ “అర్జునుడికి ఎవరి అనుమతీ అక్కర్లేదు. ఇంద్రాదులడ్డైనా తనెక్కడికి పోవాలంటే అక్కడికి పోగలడు. నీ మీద గౌరవం కొద్ది నిన్ను పొగిడి వెళ్ళాడు, అంతే. నేను అలాటివాణ్ణి కాను. నా విరోధికి జయం కూర్చటానికి కష్టపడుతున్న నిన్ను వదుల్తానా?” అని గదని తిప్పి విసిరే సరికి అంతటి వృద్ధుడూ ద్రోణుడు చెంగున రథం నించి దూకి తప్పుకున్నాడు. సారథి, గుర్రాల్తో సహా రథం నుగ్గునుగ్గయింది. భీముడు మన సైన్యం లోకి ప్రవేశించాడు. నీ కొడుకులు కొందరు అతన్ని ఆపటానికి ప్రయత్నించారు కాని అతని తీవ్రతకి తట్టుకోలేక తప్పుకున్నారు.

ఇంతలో ద్రోణుడు మరో రథం ఎక్కి భీముణ్ణి తరుముతూ వచ్చి భీముడి మీద బాణవృష్టి కురిపించాడు. భీముడు గభాల్న రథం దిగి ద్రోణుడి బాణాలు మొహానికి తగలకుండా తల కిందికి వంచుకుని వెళ్ళి ఒక చేత్తో ద్రోణుడి రథం నొగలు పట్టుకుని రథాన్ని గిరగిర తిప్పి విసిరేశాడు. రథం ముక్కలయింది. ద్రోణుడు మరో రథాన్ని వెతుక్కుని ఊసురోమని తన పూర్వస్థానానికి తిరిగెళ్ళాడు.

ఈ ఉదంతం చూసిన మిగిలిన సేనలేవీ భీముడి చాయలకి కూడ వెళ్ళలేదు. భోజబలాలు, కాంభోజసైన్యాలు, యవన, మ్లేచ్ఛ బలగాలు అతను ముందుకు వెళ్తుంటే పక్కలకొదిగి చూస్తూ నిలబడినయ్. అలా వెళ్ళి భీముడు సాత్యకి విక్రమాన్ని గమనిస్తూ సాగి కౌరవయోధానికాన్ని చెండాడుతున్న అర్జునుణ్ణి చూసి సింహనాదం చేశాడు. అతన్ని చూసి ప్రేమతో కృష్ణార్జునులు కూడ గర్జారవాల్తో గగనాన్ని నింపారు. ధర్మరాజు అవన్నీ విని తృప్తుడై ఆనందించాడు.

కర్ణుడు భీముణ్ణి ఎదిరించాడు. అతను నూటైయాభై బాణాలు భీముడి మీద వేస్తే భీముడు అరవైమూడు శరాలు పరిచాడు. భీముడు కర్ణుడి విల్లు తుంచితే అతను ఠక్కున మరోవిల్లు తీసుకుని భీముణ్ణి గాయపరిచాడు. భీముడు క్రుద్దుడై ఆ వింటినీ విరిచి సూతుణ్ణి గుర్రాల్ని కూడ చంపాడు. విరథుడై రాధేయుడు వృషసేనుడి రథం దగ్గరికి పరిగెత్తాడు. మన సేన కకావికలమైంది. దుర్యోధనుడు పట్టరాని దుఃఖంతో ద్రోణుడి దగ్గరకి రథం తోలుకు వెళ్ళాడు. “అక్కడ అర్జునుడు, సాత్యకి, భీముడు మనసేనని చంపుతున్నారు, సైంధవుడికి దగ్గరౌతున్నారు. అర్జునుణ్ణి పోనిచ్చావు సరే, మిగిలిన ఇద్దర్నీ వదిలెయ్యాలా? నిన్ను గెలవటం ఎవరి తరం? ఐనా సాత్యకి చేతిలో కూడ ఓడిపోయానన్న కీర్తి కోసం ఈ పని చేశావా? సరే, ఇదంతా ఎందుకు – ఇప్పుడు కర్తవ్యం ఏమిటో కూడ నువ్వే చెప్పు” అన్నాడు నిష్టూరంగా. “సైంధవుణ్ణి రక్షించుకోవటం తక్షణ కర్తవ్యం. నువ్వు కర్ణాదుల్తో కలిసి ఆ ముగ్గుర్నీ కదల్నివ్వకు. ఇక్కడ నేను సేనాముఖానే వుండి ఇంకెవరూ లోపలికి రాకుండా చూస్తా. వెళ్ళు” అని ద్రోణుడంటే నీరసంగా తనని తనే ప్రోత్సహించుకుంటూ కదిలాడు దుర్యోధనుడు.

అంతకుముందు కృతవర్మ అర్జునుడి చక్రరక్షకులైన యుధామన్యుడు, ఉత్తమౌజుల్ని ఆపాడని చెప్పా కదా, ఆ తర్వాత వాళ్ళు వ్యూహం బయటపడి పోరుతూ అర్జునుడు ఎక్కడున్నాడో కపిధ్వజాన్ని చూసి గుర్తించి మరోవంకగా వ్యూహాన్ని ఛేదించి అర్జునుడికి దగ్గరగా వెళ్తుంటే చూసి దుర్యోధనుడు వాళ్ళని అడ్డుకున్నాడు. రణం దారుణమైంది. ఉత్తమౌజుడు నీ కొడుకు వింటిని విరిచి అరిచాడు. విరిచి అతని వక్షానికి గురి పెట్టి నిశితాస్త్రాల్ని సంధిస్తే దుర్యోధనుడు మరోవిల్లు తీసుకుని వాడి గుర్రాల్ని, సారథిని చంపాడు. వాడు పరిగెత్తి యుధామన్యుడి రథం ఎక్కాడు. ఎక్కి వెంటనే నీ కొడుకు సారథిని, గుర్రాల్ని చంపితే దుర్యోధనుడది లెక్కచెయ్యకుండా గద తీసుకుని వెళ్ళి వాళ్ళ గుర్రాల్ని సూతుణ్ణి ముద్దలు చేశాడు. వాళ్ళు రథం దిగి పక్కకి తప్పుకున్నారు. శల్యుడు వచ్చి సుయోధనుణ్ణి ఎక్కించుకున్నాడు. ఆ చక్రరక్షకులు మన సైన్యంలో ఎవరో ఇద్దరు రథికుల్ని చంపి వాళ్ళ రథాలు తీసుకుని అర్జునుడి దగ్గరికి బయల్దేరారు.

అక్కడ సారథి చస్తే గుర్రాలు రథాన్ని పక్కకి తోలుకుపోయిన కర్ణుడు తిరిగి వచ్చి భీముణ్ణి కేకేసి పిలిస్తే అతను వెనక్కి తిరిగి వచ్చి కర్ణుడితో తలపడ్డాడు. ఇద్దరికీ ఘోరసమరం జరిగింది. భీముడు కర్ణుడి వింటిని ముక్కలు చేసి గుర్రాల్ని చంపి బొబ్బపెడితే దుర్యోధనుడు దుర్జయుణ్ణి భీముడి మీదికి పంపాడు. వాడు తీవ్రంగా భీముడితో తలపడి నిశితసాయకాల్తో అతన్ని నొప్పించి సారథికి గుర్రాలకి గాయాలు చేస్తే భీముడు క్రోధంతో వాడి గుర్రాల్ని, సూతుణ్ణి చంపి వాడి తల నరికాడు. ఇదంతా ఎదురుగా చూస్తున్న కర్ణుడు భోరుమని ఏడ్చాడు. ఇంకోరథం సిద్ధం చేసుకుని భీముడి మీదికి విజృంభించాడు. కర్ణుడేసిన ఒక పదునైన నారాచం భీముడి వక్షం చొచ్చుకు వెళ్ళి వెనక భూమిలో దిగబడింది. ఐనా తొణక్కుండా భీముడొక గదతో అతని తురగాల్ని చంపి కేతువుని సారథిని నేలకూల్చాడు. అలా విరథుడైనా రాధేయుడు భీముణ్ణి తన బాణపరంపరల్లో ముంచెత్తాడు.

దుర్యోధనుడు కర్ణుణ్ణి రక్షించటానికి దుర్ముఖుణ్ణి పంపాడు. వాడు వెళ్ళి భీముణ్ణి అడ్డుకుంటే భీముడో వంక కర్ణుడితో యుద్ధం చేస్తూనే తొమ్మిది అమ్ముల్తో వాడి ప్రాణాలు తీశాడు. అది చూసి కర్ణుడు కన్నీళ్ళు కారుతుంటే శోకాతురుడై చచ్చినవాడి రథం ఎక్కి భీమున్నెదుర్కున్నాడు. ఐతే భీముడు మూడు వాడినారసాల్ని అతని ఉరాన నాటితే భయంతో రథం తోలుకుని పారిపోయాడు కర్ణుడు. అతని పాటు చూసి సహించలేక నీ కొడుకులు దుర్మర్షణుడు, దుర్మదుడు, దుస్సహుడు, విజయుడు, విచిత్రుడు ఒక్కసారిగా భీముడి మీదికి దూకారు. వాళ్ళని చూసి కర్ణుడు కూడ తిరిగివచ్చి కలిశాడు. ఐతే ఒక్కొకరి మీద ఆరేసి మెరుగుతూపులు వేసి నీ ఐదుగురు కొడుకుల్నీ యముడికి బలిచ్చాడు భీముడు. కర్ణుడు “ఛీ, ఏమిటీ బతుకు? ఇక ఈ భీముడి అంతు చూడాల్సిందే” అని నిశ్చయించుకుని అతనితో ఘోరంగా తలపడ్డాడు. ఐతే భీముడు మళ్ళీ అతని సారథినీ గుర్రాల్నీ కూల్చితే విరథుడై నేల మీద నిలబడే యుద్ధం సాగించాడు కర్ణుడు.

దుర్యోధనుడు పంపితే నీ కొడుకులు చిత్రుడు, విచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, చిత్రధ్వజుడు, చిత్రాయుధుడు, చిత్రకర్ముడు భీముణ్ణి చుట్టుముట్టారు. యధాప్రకారంగానే భీముడు వాళ్ళని పరలోకాలకి ప్రయాణం కట్టించాడు. ఇంతలో మరోరథం తీసుకుని కర్ణుడు భీముడితో తిరిగి తలపడ్డాడు. మిగతా వాళ్ళంతా యుద్ధం చాలించి చూస్తున్నారు. ఒకరికొకరు తీసిపోకుండా పోరారు వాళ్ళిద్దరు. ఐతే మనవైపు వాళ్ళు కూడ భీముడి భీమవిక్రమాన్ని పొగుడుతుంటే సహించలేక దుర్యోధనుడు తన దగ్గరున్న యోధుల్ని, తమ్ముల్ని కర్ణుడికి సాయంగా పంపాడు. శత్రుంజయుడు, శత్రుసహుడు, సుదేహుడు, మదనుడు, ద్రుముడు, చిత్రబాహుడు, వికర్ణుడు అలా కర్ణుడి రక్షణకి వచ్చి అతన్ని దాటి వెళ్ళి భీముడితో తలపడి అంపవర్షం కురిపించారు. ఐతే భీముడు ఏడు తీవ్ర బాణాల్తో ఆ ఏడుగుర్నీ పరిమార్చి సింహనాదం చేశాడు. దూరాన్నుంచి అదివిని ధర్మరాజు అది భీముడి విజయానికి సంకేతం అని తెలుసుకుని ఆనందించాడు.

కర్ణ భీముల రణం మహాభీషణమైంది. బాణాలు ఒకొకదానికి మధ్య ఎడం లేకుండా కర్ణుడు వేస్తుంటే భీముడు అన్నిటినీ విరుస్తూ కర్ణుడి మీదికి శరాలు ప్రయోగిస్తున్నాడు. కోపమే తన రూపంగా కర్ణుడు భీముడి వింటిని తుంచి గుర్రాల పగ్గాల్ని తెగ్గొట్టాడు. అవి కాడితో పెనుగులాడసాగాయి. అంతలో భీముడి పతాకని కూల్చి సారథిని గాయపరిచాడు. సారథి రథాన్ని అర్జునుడి చక్రరక్షకుల వెనక్కి తీసుకుపోయాడు. భీముడు అధైర్యపడకుండా ఒక శక్తిని విసిరితే కర్ణుడు దాన్ని ముక్కలు చేశాడు. భీముడు వాలూ పలకా తీసుకుని దూకితే పలకని నరికాడు కర్ణుడు. కత్తితో కర్ణుడి విల్లు విరిచాడు భీముడు. కర్ణుడు మరో విల్లు తీశాడు. మహాక్రోధంతో కత్తి చేతపట్టి భీముడతని రథమ్మీదికి ఎగిరాడు. జెండా పడిపోకుండా వుంచటానికి వుంచిన పీఠం కింద నక్కి కూర్చున్నాడు కర్ణుడు. భీముడికి కనిపించలేదు. పారిపోయాడో లేక రథం కింద దాక్కున్నాడో అని భీముడు కిందికి దూకి చూడబోతే హఠాత్తుగా లేచి రథాన్ని చిత్రవిచిత్ర గతుల్లో తిప్పుతూ రకరకాల అస్త్రాల్తో భీముణ్ణి కొట్టసాగాడు కర్ణుడు. నిరాయుధుడిగా వున్న భీముడు అంతకుమునుపు అర్జునుడి చేతిలో చచ్చిన ఏనుగులు, గుర్రాలే ఆయుధాలుగా అతని మీద విసురుతూ తిరుగుతుంటే కర్ణుడు వాటన్నిటినీ తునకలు చేస్తూ అతని వెంటబడ్డాడు. భీముడు గుర్రాల శవాల గుట్ట వెనక నక్కి అలిసిపోయి రోజుతుంటే కర్ణుడతని దగ్గరికి వెళ్ళి కుంతికిచ్చిన మాట ప్రకారం అతని మీద బాణాలెయ్యకుండా నవ్వుతూ వింటికొనతో అతని పొట్టలో పొడుస్తూ “తిండిపోతువి నీకు యుద్ధమెందుకు, హాయిగా ఇంటికి పోయి తిని పడుకోరాదూ? యుద్ధం చెయ్యాలనిపిస్తే ఎవరన్నా తక్కువ వాళ్ళని చూసుకుని చెయ్యి గాని నాలాటి వాళ్ళతోనా నీకు యుద్ధం? అదుగో కృష్ణార్జునులు అక్కడ వున్నారు, అక్కడికి పోయి బతుకు” అని తిడితే ఇంతలో కృష్ణుడి సలహా మీద అర్జునుడక్కడికి వచ్చి కర్ణుడి మీద శరాలు పరిపిస్తే వాటిని అశ్వత్థామ ఖండించాడు. అర్జునుడు అశ్వత్థామ మీదికి వెళ్ళబోతే అతను ఏనుగుల గుంపు వెనక్కి తప్పుకున్నాడు. భీముడు పరాభవంతో ఖిన్నుడై అర్జునుడి దగ్గరకు వెళ్ళాడు. ఈలోగా అతని సారథి మరో రథం తెచ్చాడు.

సాత్యకి కూడ అల్లంత దూరాన కృష్ణార్జునుల్ని చూసి సంతోషంతో, అడ్డొచ్చిన మనసేనల్ని ఛేదిస్తూ వాళ్ళ వైపుకి సాగాడు. అతనొక్కడే అలా ద్రోణాదుల్ని దాటి క్షేమంగా అక్కడికి రావటం చూసి కృష్ణుడు గర్వపడ్డాడు. అంతలో అలంబుసుడనే రాజు సాత్యకికి అడ్డు తగిలి కొంతసేపు భీకరయుద్ధం చేశాడు. ఐతే అతను పదునైన బాణాల్తో వాడి తల నేల కూల్చాడు. త్రిగర్తు లనేకులు అతని మీద దూకారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపితే మిగిలిన వాళ్ళు పారిపోయారు. అలాగే శూరసేన సైనికులు, కళింగులు కూడ ఆపటానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

అలా అర్జునుడి దగ్గరికి చేరుతూ రొప్పుతున్న సాత్యకిని చూసి కృష్ణుడు “ధర్మరాజు నీ క్షేమం కోసం పంపితే వచ్చినట్టున్నాడు నీ శిష్యుడు. చూశావా, ఒక్కడే కృతవర్మాదుల్ని, చివరికి ద్రోణుణ్ణి కూడ ఎలా దాటుకుని వచ్చాడో !” అని ఆనందిస్తే అర్జునుడు “ఇది మంచిది కాదు, ఇతన్ని నేను ధర్మరాజు రక్షణకి ఉంచి వచ్చా. ఇప్పుడక్కడ ద్రోణుడు ధర్మజుణ్ణి పట్టబోతే అడ్డుకునేదెవరు? పైగా ఇతనింత సేపు యుద్ధం చేసి అలిసిపోయి వున్నాడు. అక్కడ చూడు, భూరిశ్రవుడు సాత్యకితో తలపడటానికి సిద్ధమౌతున్నాడు, వాడు సామాన్యుడు కాడు. సాత్యకికి గొప్పచిక్కే వచ్చిపడింది” అంటూండగా ఆ భూరిశ్రవుడు సాత్యకికి అడ్డంగా వచ్చి నిలబడు నిలబడమని అదిల్చాడతన్ని. “నిన్ను ఇక్కడి దాక పంపిన ఆ ధర్మరాజుకి తలవంపులు కలిగిస్తా. నువ్వు దార్లో చంపిన వాళ్ళ బంధువులకి ప్రీతి కలిగిస్తా. ఎదురుగా చూస్తూ వున్న కృష్ణుడికి దుఃఖం కలిగిస్తా. నీకు విద్య నేర్పిన కిరీటికి నా పోటుతనం చూపిస్తా. నీ అంతు చూస్తా, ఇంకెక్కడికి పోతావ్, రా” అన్నాడు రోషంగా.

సాత్యకి నవ్వాడు. “నాతో యుద్ధం చెయ్యటానికి కావాలని వచ్చే వాళ్ళంటే నాకు పండగే. నోటికొచ్చినట్టు పేల్తున్నావ్, నీ నాలిక్కోస్తా” అని బదులిచ్చాడు. ఇలా ఇద్దరూ తిట్టుకుంటూ యుద్ధం సాగించారు. రథాలు విరుచుకున్నారు. పలకలూ కత్తులూ తీసుకుని కిందికి దూకి కత్తియుద్ధం చేసి అలిసిపోయి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ రకరకాల విన్యాసాల్తో కొనసాగించారు. అదీ ఐపోయి చివరికి మల్లయుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో భూరిశ్రవుడిదే పైచెయ్యిగా వున్నట్టు గమనించాడు కృష్ణుడు.

“నీకోసం ఇక్కడి దాకా వచ్చిన సాత్యకి ఇప్పుడు అలిసిపోయి చిక్కుల్లో వున్నాడు. వాణ్ణి రక్షించటం నీ కర్తవ్యం. త్వరపడు” అని అర్జునుడితో చెప్పాడు. ఇంతలో భూరిశ్రవుడు సాత్యకిని కింద పడేసి పైనెక్కి గుద్దులు గుద్దుతున్నాడు. “ఇంకా ఆలస్యం దేనికి, నీ శిష్యుణ్ణి రక్షించుకో” అని తొందరపెట్టాడు కృష్ణుడు. “అలాగే చేస్తా. ఇక్కడా మనల్ని సేనలు చుట్టుముడుతున్నయ్, వాళ్ళని సంభాళించాలి. సాత్యకినీ కాపాడాలి. రెండూ సాధిస్తా చూడు” అన్నాడు అర్జునుడు. ఇంతలో భూరిశ్రవుడు సాత్యకి గుండెల మీద రెండు మోకాళ్ళు తొక్కిపట్టి తళతళ మెరిసే కత్తి తీసి పైకెత్తి వాడి మెడ నరకబోతుంటే కృష్ణుడు “వెయ్యి, వెయ్యి” అని హడావుడిపెడుతుంటే అర్జునుడు మహావేగంగా తొడిగి ఒక గొప్పబాణాన్ని బలంగా వేస్తే దానికి భూరిశ్రవుడు పైకెత్తిన కత్తిచెయ్యి మహాభుజంగంలా తెగిపడింది.

ఆరని కోపంతో వాడు తననలా చేసిన వాడు అర్జునుడని గ్రహించి “నీవంక చూడలేదు నేను, ఇంకొకడితో యుద్ధం చేస్తున్నా. ఇలాటి నీచపు పని నీలాటి వాడికి తగిందా? ఈ దురాలోచన నీకు చెప్పిందెవరు – నీ గురువా ఇంద్రుడా రుద్రుడా? కృష్ణుడింత పాపపు పని చెయ్యనిస్తాడా?” అని ఆక్షేపిస్తే “రాజులు పోరేప్పుడు వాళ్ళ బంధువులు వచ్చి సాయం చెయ్యటంలో తప్పేముంది? సాత్యకి ఎంతో శ్రమ చేసి వచ్చి అలిసిపోయి వుంటే అతని మీద కాలుదువ్వి చంపాలని చూశావ్, నేనుండగా అతన్ని చంపటం ఎవరి తరం? ఐనా అధర్మపరులై అభిమన్యుణ్ణి చంపిన నీలాటి వాళ్ళేనా ఇలాటి మాటలు మాట్లాడేది?” అని అతని నోరు మూయించాడు అర్జునుడు. నీ కొడుకులు, చుట్టుపక్కల వున్న రాజులు కూడ భూరిశ్రవుణ్ణి సమర్ధిస్తే వాళ్ళనీ అదే విధంగా సమాధాన పరిచాడు అర్జునుడు.

బాధపడుతున్న భూరిశ్రవుణ్ణి చూసి “క్షత్రధర్మం మూలాన నీలాటి మహాత్ముడికి ఇలాటి కష్టం కలిగింది. నా ప్రతిజ్ఞ నీకు తెలుసు. అసలు మనందరి కష్టాలకీ మూలకారణం దుర్యోధనుడు. వాడు నరకానికి పోతాడు, నువ్వు సద్గతి పొందు” అని ఊరడిస్తే అతను సాత్యకిని వదిలి ప్రాయోపవేశం చెయ్యటానికి ప్రాణాయామ పరాయణుడై యోగయుక్తుడయాడు. అంతలో సాత్యకి ఓపిక తెచ్చుకుని లేచి కత్తి తీసుకుని అందరూ వద్దు వద్దని అరుస్తున్నా వినక భూరిశ్రవుడి శిరస్సు ఖండించాడు. అభిమన్యుణ్ణి కౌరవులెలా అన్యాయంగా చంపారో అందరికీ ఉపన్యసించాడు. “అయ్యయ్యో ఎంత ఘోరం” అనే వాళ్ళు, “కోపంలో ఏం చేస్తామో మనకే తెలీదు” అనే వాళ్ళు, “అంతా విధి” అనే వాళ్ళు అయారక్కడి సైనికప్రేక్షకులు.

ధృతరాష్ట్రుడది విని ఆశ్చర్యపోయాడు. “అదేమిటి, ద్రోణుడు, కృతవర్మ లాటి మహారథుల్ని అవలీలగా దాటగలిగిన సాత్యకి భూరిశ్రవుడి చేతిలో ఇలా పరాజయం, పరాభవం పొందటం వింతగా లేదూ! ఎందుకిలా జరిగిందో” అంటే దానికి సంజయుడు “దానికో పెద్ద కథ వుంది – చంద్రవంశ వర్ధనుడు యయాతి. అతని కొడుకు యదుడు. అతని పరంపరలో పుట్టిన వాడు దేవమీఢుడు. అతని కొడుకు శూరుడు, అతనికి పుట్టినవాడు వసుదేవుడు. అతను రూప గుణాల్లో అందరి మన్ననలూ పొందుతూ పెరుగుతున్నాడు.

అప్పుడు దేవకుడనే రాజు తన కూతురు దేవకికి స్వయంవరం చాటించాడు. యదు వంశం వాడైన శిని వసుదేవుడి కోసం దేవకిని పరాక్రమంతో జయించి తెస్తుంటే అక్కడ కూడిన మిగిలిన రాజులంతా అతనితో యుద్ధంలో ఓడారు కాని బాహ్లికుడి కొడుకు ఒక్క సోమదత్తుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. వాళ్ళు పరస్పరం రథాల్ని విరుచుకుని కత్తులతో కింద దూకి యుద్ధం చేశారు. అప్పుడు శిని సోమదత్తుణ్ణి గెలిచి వాడి జుట్టు పట్టుకుని కింద పడేసి, బాగా తన్ని కనికరంతో చంపకుండా మాత్రం వదిలేశాడు. ఆ అవమాన భారంతో సోమదత్తుడు ఎవరికీ మొహం చూపించలేక అడవులకి పోయి ఈశ్వరుడి గురించి చాలా కాలం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయే నాటికి శిని, అతని కొడుకు కూడ కాలం చేశారు. కనక శిని మనవణ్ణి యుద్ధంలో కింద పడేసి తన్నే కొడుకు కావాలని వరం కోరుకున్నాడు సోమదత్తుడు. అలా పుట్టిన వాడు భూరిశ్రవుడు. అందుకే వాడి చేతిలో శిని మనవడైన సాత్యకి అవమానం పాలయ్యాడు” అని విశదీకరించాడు. భారతయుద్ధ కథా ప్రకారాన్ని మళ్ళీ అందుకున్నాడు.

అలా భూరిశ్రవుడు చావటంతో సైంధవుడి వైపుకి బయల్దేరాడు అర్జునుడు. అశ్వత్థామ, దుర్యోధనుడు, ఇతర మహారథులు అతన్ని అడ్డుకున్నారు. ఇక సాత్యకితో కర్ణుడు తలపడ్డాడు.

ఆ రోజు ముందు రాత్రి కృష్ణుడు తన సారథి దారుకుడికి తన రథం సిద్ధంగా చేసి వుంచమని, తను ఎప్పుడు పాంచజన్యాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో ఊదితే అప్పుడు తన దగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు, గుర్తుంది కదా. ఇక్కడ సాత్యకి భూరిశ్రవుడితో యుద్ధం చేస్తున్న సమయంలో సోమదత్తుడి వరం గురించి తనకి ముందే తెలుసు గనక అలా పాంచజన్యాన్ని ఊదాడు కృష్ణుడు. అది విన్న వెంటనే దారుకుడు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనే పేర్లున్న దివ్యాశ్వాల్తో కట్టిన రథాన్ని అక్కడికి తీసుకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడా రథాన్ని సాత్యకికి ఇచ్చాడు.

దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ రథం ఎక్కి అర్జునుడికి సాయంగా వెళ్ళబోతున్న సాత్యకిని కర్ణుడు వారించాడు. సాత్యకికి తోడుగా చక్రరక్షకుల్ని ఉంచి కృష్ణార్జునులు సైంధవుడున్న దిక్కుకి కదిలారు. కర్ణుడూ సాత్యకీ ఒకరికొకరు తీసిపోకుండా అతిఘోరరణం చేశారు. ఆకాశసంచారులు కూడ ఇలాటి యుద్ధం ఇదివరకెప్పుడూ చూడలేదని చెప్పుకున్నారు. అప్పుడు సాత్యకి ఒక భీకరశక్తితో కర్ణుడి ఒళ్ళు తూట్లు పొడిచి సూతుణ్ణి, కేతనాన్ని, గుర్రాల్ని, రథాన్ని నుగ్గు చేశాడు. దుర్యోధనుడు, అతని తమ్ములు బొమ్మల్లా చూస్తుండిపోయారు. అంతలోనే తెప్పరిల్లి ఒక్కసారిగా సాత్యకిని చుట్టుముడితే అతను తన దివ్యాశ్వాల్ని చిత్రవిచిత్ర భ్రమణాల్తో తిప్పుతూ అందరికి అన్ని దిక్కులా తనే అయి ముప్పుతిప్పలు పెట్టాడు.

అంతకుముందు కర్ణుడి చేత తిట్లు తిన్న భీముడు అవమానభారంతో కుంగిపోతూ అర్జునుడి దగ్గరికి వెళ్తే అర్జునుడది చూస్తూ సహించలేక కర్ణుణ్ణి కేకేసి “ఏరా కర్ణా భీముణ్ణలా నోటికొచ్చినట్టు తిట్టావే, ఇన్ని సార్లు ఓడావు నిన్నెవరమైనా తిట్టామా? యుద్ధంలో గెలుపోటములు సామాన్య విషయాలు. ఒక్కసారి గెలిచినంత మాత్రాన ఇంత గర్వం ఎందుకు నీకు? ఇంతకు ముందే సాత్యకి చేతిలో ఓడావు కదా, ఇంతలోనే మర్చిపోయావా? తులువా, నీ కులం, గుణం చూపించుకున్నావు కదా! నేను లేనప్పుడు అధర్మంగా అభిమన్యుడి విల్లు నరికావ్, నువ్వు చూస్తుండగనే ధర్మంగా నీ కొడుకు వృషసేనుణ్ణి చంపుతా చూస్తూ వుండు. అంతేకాదు, ఆ పాపంలో పాలున్న మిగిలిన వాళ్ళ గతి కూడ ఎలా వుండబోతుందో నువ్వే చూద్దువు గాని” అని అతని వెంట పడ్డాడు అర్జునుడు.

దుర్యోధనుడు కర్ణుడితో “పొద్దు వాలబోతున్నది. మనం ఎలాగోలా అర్జునుణ్ణి ఇంకాసేపు ఇక్కడే ఉంచగలిగామంటే చాలు, ప్రతిజ్ఞ ప్రకారం వాడు అగ్నిప్రవేశం చేస్తాడు, దాంతో మిగిలిన పాండవులూ ప్రాణాలు తీసుకుంటారు, రాజ్యం మనదే ఔతుంది. శల్యుడు, అశ్వత్థామ, దుశ్శాసనుడు, నేను నీకు తోడుగా వుంటాం, అర్జునుణ్ణి నిలబెట్టు చాలు” అని బతిమాలాడు. దానికి కర్ణుడు “భీముడి బాణాల దెబ్బలకి ఒళ్ళంతా గాయాలై ఎటుచూసినా నొప్పులే. ఐనాగాని నీ కోరిక తీర్చటానికి ఒళ్ళు దాచుకోకుండా పోరాడతా, నేనుండగా అర్జునుణ్ణి కదలనివ్వను” అని తలపడ్డాడు కర్ణుడు.

భీముడు, సాత్యకి చెరో వైపుండగా మధ్యలో అర్జునుడు గాలి తోడైన అగ్నిలాగా విజృంభించి మన సైన్యాల్ని కాల్చాడు. మన వైపు నుంచి దుర్యోధనుడు, కర్ణుడు, వృషసేనుడు, శల్యుడు, కృపుడు, అశ్వత్థామ పోరుతున్నారు. వాళ్ళ వెనక నుంచి సైంధవుడు కూడ అర్జునుడి మీదికి బాణాలు కురిపిస్తున్నాడు. అది చూసి అర్జునుడు సైంధవుణ్ణి పట్టుకోటానికి వెళ్తుంటే అతనికి కర్ణుడడ్డుపడ్డాడు. సాత్యకి, భీముడు అతని మీద శరవర్షం కురిపిస్తున్నారు. ఐతే కర్ణుడు తన బాణపరంపరల్తో ఆ ముగ్గుర్నీ ఆపాడు.

అర్జునుడు కర్ణుడి విల్లు విరిచి తొమ్మిది బాణాల్తో వక్షాన్ని కొట్టి అతని ప్రాణాలు తీసే ఘనవిశిఖాన్ని వేస్తే త్వరితంగా అశ్వత్థామ ఒక అర్థచంద్ర బాణంతో దాన్ని మధ్యలోనే తుంచాడు. దుర్యోధనుడు మన వాళ్ళందర్నీ కర్ణుడికి తోడుపడమని అరిచి చెప్పాడు. అందరూ చుట్టుముట్టేంతలో అర్జునుడు కర్ణుడి గుర్రాల్ని కూల్చి, సారథిని చావగొట్టి బాణపరంపరతో అతని అంగాలన్నీ తూట్లు పొడిస్తే కర్ణుడికి నీరసం వచ్చి తూలుతుంటే అశ్వత్థామ అతన్ని తన రథం మీదికి లాక్కున్నాడు. అశ్వత్థామ, శల్యుడు అర్జునుడితో తలపడ్డారు. కృపుడు, వృషసేనుడు కూడ వాళ్ళని కలిశారు. వెనక నుంచి సైంధవుడు కూడ బాణాలేస్తున్నాడు.

ముందున్న వాళ్ళందరికీ సమాధానాలిస్తూనే అర్జునుడు సైంధవుడితో యుద్ధం ప్రారంభించాడు. సైంధవుడు అర్జునుడి గుర్రాల్ని, జెండాని, గాండీవాన్ని బాణాల్తో కొట్టి అర్జునుడికి గాయాలు చేశాడు. అర్జునుడతని వరాహధ్వజాన్ని సారథి తలని ఒక్కసారే నేలకూల్చాడు. ఇంతలో కృప, అశ్వత్థామ, శల్య, వృషసేనులు ప్రాణాల మీద ఆశలు వదిలి సైంధవుడికి అడ్డం పడ్డారు. సైంధవుణ్ణి చంపే అవకాశం కనపడక అర్జునుడు పొద్దువంకా కృష్ణుడి వంకా చూస్తుంటే కృష్ణుడు “ఇక ధర్మయుద్ధం అని పెట్టుకుంటే కుదరదు, నేనో ఉపాయం చేస్తాను. సూర్యాస్తమయం ఐనట్లు చీకటి కమ్మిస్తాను. వాళ్ళంతా యుద్ధం మానేసి సంబరం చేసుకుంటుంటే నువ్వు వాడి తల నరుకు” అని చెప్పాడు. ” చివరికిలా పరాక్రమం అంతా వృథా ఐంది కదా” అని అర్జునుడు దిగులు పడ్డాడు.

కృష్ణుడు మాయాతిమిరంతో సూర్యబింబాన్ని కప్పాడు. మనసైన్యాలు ఆనందంగా కేకలు పెట్టినయ్. సైంధవుడు తల పైకెత్తి పడమర దిక్కుకి చూస్తున్నాడు. “అడుగో, రథమ్మీద నిలబడి పడమరకి చూస్తున్నాడు, వాడి తల వెంటనే నరుకు” అని అటు చూపుతూ తొందరచేశాడు కృష్ణుడు. గంధమాల్యాదుల్తో అర్చించి తెచ్చిన ఒక నిశితశరం అర్జునుడు సంధిస్తే అది పిట్టని పట్టే డేగలాగా వాడి తలని లాగేసింది. కృష్ణుడు త్వరితంగా “అర్జునా, ఆ తల నేల మీద పడటం ప్రమాదం. నేను చెప్పేవరకు దాన్ని ఆకాశంలోనే ఆడించు” అని అరిచాడు. అర్జునుడు దాన్ని బంతిలాగా ఆకాశంలో తిప్పటం సాగించాడు.

ఇంతలో మాయాతిమిరం తొలిగింది. సూర్యుడు మళ్ళీ కనిపించాడు.

మనవాళ్ళంతా అమితకోపంతో అర్జునుడి మీదికి దూకారు. అర్జునుడు వాళ్ళందర్నీ ఎదుర్కుని పోరాడుతూ సైంధవుడి తలని కింద పడకుండా కొడుతూ “కృష్ణా దీన్ని ఇంకా ఎంతసేపు ఇలా ఆడించాలి? ఎక్కడ పడెయ్యాలి?” అని అడిగితే కృష్ణుడు “వృద్ధక్షత్రుడనే సింధుదేశాధీశుడు సంతానం కోసం తపస్సు చేసి వీణ్ణి కన్నాడు. వీడు పెరుగుతుండగా ఒకరోజు అశరీరవాణి యుద్ధంలో వీడి తల నేలకూలుతుందని చెప్తే వృద్ధక్షత్రుడు తన తపోబలంతో వీడి తలని ఎవడు నేలబడేస్తాడో వాడి శిరస్సు వెయ్యిముక్కలయ్యేట్టు చాటి వీడికి పట్టం కట్టి తను అడవులకి పోయి ఈ శమంతకపంచకం చుట్టుపక్కల్నే తపస్సు చేసుకుంటున్నాడు. నువ్వీ తలని అతని తొడ మీద పడెయ్యాలి. ఆ పని ఒక్క పాశుపతాస్త్రానికే సాధ్యం, దాన్ని ప్రయోగించు” అని బోధిస్తే భక్తిపూర్వకంగా అర్జునుడా మహిమాన్వితాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం శరపరంపర ఆకారంలో వచ్చి ఆ తలని తీసుకుని వృద్ధక్షత్రుడి ఆశ్రమంలోకి చొరబడి అక్కడ జపం చేసుకుంటున్న అతని తొడ మీద పడేసింది. దానికతను దిగ్గున లేచి తలని కిందికి తోస్తే అతని తలా వెయ్యివక్కలైంది. తిరిగి వచ్చిన అస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించాడు.

అర్జునుడి ఆ అద్భుతచర్యకి అందరూ నివ్వెరపోయారు. నీ కొడుకులు కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చారు. భీముడు సింహనాదం చేశాడు. అది విని ధర్మజుడు విజయుడి ప్రతిజ్ఞ నెరవేరిందని ఆనందించాడు. పాండవబలాలు తూర్యనినాదాల్తో మారుమోగినయ్. సైంధవుడి చావుతో కృపుడు, అశ్వత్థామ అర్జునుడి మీద మహోగ్రంగా శరవర్షాలు కురిపించారు. అర్జునుడు వాటిని ఖండించి కోపం తెచ్చుకోకుండానే వాళ్ళని బాణపరంపరల్తో బాధించాడు. ఆ బాణాల ధాటికి కృపాచార్యుడు మూర్ఛపడితే అతని సారథి రథాన్నక్కడి నుంచి తోలుకుపోయాడు. అశ్వత్థామ కూడ పక్కకి తప్పుకున్నాడు. మిగిలిన రథికులెవరూ సవ్యసాచితో పోరుకి ముందుకి రాలేదు. ఐతే తన బాణాల్తో కృపాచార్యుణ్ణి మూర్ఛ పుచ్చినందుకు చాలా నొచ్చుకున్నాడు అర్జునుడు. కృష్ణుడు అతన్ని కౌగిలించుకుని ఆనాటి యుద్ధంలో అతని పరాక్రమాన్ని పొగిడాడు. శత్రువులెవరూ యుద్ధానికి కవ్వించక పోవటంతో ధర్మరాజు దగ్గరికి బయల్దేరారు అర్జునుడు, భీముడు, సాత్యకి, యుధామన్యుడు, ఉత్తమౌజుడు.

మనవాళ్ళు శోకాక్రాంతులై ఏడుస్తూ వెనుదిరిగారు.

(నాలుగవ భాగానికి…)