ఉదయం పదకొండున్నర.
సూర్యుడు మదన తాపంతో వేడెక్కి పోతున్నాడు. అతని నిట్టూర్పుల వడగాలులు భూమిని ఉడికిస్తున్నాయి. డాక్టర్ శేఖర్ పరిస్థితీ అలాగే ఉంది. ఐతే ఎనభై మైళ్ళ వేగంలో మెత్తగా కదుల్తున్న తన కొత్త మెర్సెడీస్ కారు అతనికి శరీర తాపం తగ్గించటానికి శాయశక్తులా పనిచేస్తున్నది. నిజానికి దాని పటిష్టమైన ఏ.సి. వల్ల అతనికి కొంచెం చలి వేస్తున్నది కూడా. “అర్మానీ” శ్రేణిలో కల్లా శ్రేష్టమైన చలవ కళ్ళద్దాలు కారు అద్దాలకు వున్న అత్యున్నతమైన “టింట్” తో కలిసి అంతటి సూర్యుడి ప్రభావాన్ని వెలాతెలా పోయేట్లు చేస్తున్నాయి.
అలాగని శేఖర్ మనసు ప్రశాంతంగా లేదు. ఒక వంక ఉద్వేగంతోనూ మరోవంక ఏదో అనిర్వచనీయమైన ఉల్లాసంతోనూ ఉద్రేకంతోనూ ఎగిరిపడుతోంది. ఇల్లు దగ్గర పడే కొద్దీ ఎంతో ఉత్కంఠ. తన వీధిలోకి మలుపు తిరగటం తోనే డ్రైవ్ వే లో ఏదైనా కారుందా అని అతని మనసు ఆత్రంగా వెదికింది. ఉంటుందని అనుకోక పోయినా ఉంటే బాగుండునన్న ఆశ. ఉంటే ఎంత బాగుంటుందో అన్న ఉల్లాసపు ఊహ! ఆ వెంటనే మళ్ళీ “కొంప దీసి ఆదిలోనే హంసపాదు కాదు కదా” అన్న చిన్న భయం కూడా కలిగింది. గెరాజ్ డోర్ ఓపెనర్ ని నొక్కాడు. వెంటనే తెరుచుకోలేదు. ఒక్క క్షణం పాటు పనిచెయ్యటం లేదేమో నని చాలా కంగారు పడ్డాడు. తన దగ్గర మెయిన్ డోర్ కీస్ కూడా లేవు. ఎంతో కష్టపడి సాధించినది అంతా ఓపెనర్ లో బేటరీలు ఐపోవటం వల్ల మట్టిగొట్టుకు పోతుంది. ఆతృతగా అలా నొక్కుతూనే యింకొంచెం దగ్గరయ్యే సరికి తలుపు తెరుచు కోవటం మొదలయ్యింది.దూరాన్నుంచే గమనించాడు గెరాజ్ ఖాళీగా వుండటం. “హమ్మయ్య కనీసం ఒక వైపు నుంచి లైన్ క్లియర్ గా వుంది” అనుకున్నాడు.గబగబా కారు గెరాజ్ లో పార్క్ చేసి గెరాజ్ డోర్ తెరిచే వుంచి లోపలికి పరిగెత్తాడు.
ఎందుకైనా మంచిదని “హల్లో యింట్లో ఎవరైనా వున్నారా” అని బిగ్గరగా అంటూ అన్ని గదులూ ఒక్క సారి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. “గుడ్డలు మార్చుకుంటే బాగుంటుందేమో” అనుకుంటూ వాక్ ఇన్ క్లాజెట్ లోకి వెళ్ళాడు. జాకెట్ హేంగర్ కి వేలాడదీసి టై తీస్తుంటే, స్నానం చేస్తే బాగుంటుందేమో అనిపించింది. “పోనీ యిద్దరం కలిసి చేస్తే” అన్న చిలిపి ఊహ ఒక్కక్షణం మెరిసి ఆ దృశ్యాన్ని ఊహించుకుని ఆనందలోకాల్లో విహరించాడు. మళ్ళీ వెంటనే, “అది మరీ అత్యాశ” అని సర్ది చెప్పుకున్నాడు. నిజంగా అలాటి అవకాశమే కలిగితే మళ్ళీ చెయ్యొచ్చు స్నానమేగా అని ఊరడించుకున్నాడు. గబగబా పిల్లల బాత్ రూం లోకి వెళ్ళి సరిగ్గా ఆరు నిమిషాల్లో గోరు వెచ్చటి నీటితో స్నానం చేశాడు. ఈ మధ్యనే యూరోపియన్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు తెచ్చిన అద్భుతమైన పెర్ ఫ్యూములవంక ఒకసారి చూసి, కొంచెం పూసుకుంటే? అనుకున్నాడు. అది రిస్కీ వ్యవహారం, జాగ్రత్తగా వుండటం అవసరమని హెచ్చరించుకుని ఫామిలీ రూమ్ లోకి పరిగెత్తాడు. ఇంట్లో వేడిగా వున్నట్టనిపించి థెర్మోస్టాట్ లో ఉష్ణోగ్రత చూశాడు. 81 డిగ్రీలు. 78 కి తగ్గించాడు. అంతలోనే తను కొని తెచ్చిన వస్తువులు కార్లో మరిచిపోయినట్లు గుర్తొచ్చి గెరాజ్ లోకి దౌడు తీశాడు.ఒక బాక్స్ చాకొలెట్ స్ట్రాబెరీలు, మరొక బాక్స్ మిక్స్డ్ ఫ్రూట్స్ ఒక పెద్ద ద్రాక్ష గుత్తి లోపలికి తీసుకు వచ్చి ఫ్రిజ్ లో పెట్టాడు.
టైం పదకొండూ యాభై ఐదు.ఒక వంక కలగబోయే అద్భుతమైన అనుభూతిని ఊహించుకుంటూ భావోద్వేగం. మరో వంక ఏదైనా అడ్డంకి వచ్చిందేమో నన్న ఆందోళన. కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టెన్లు కొద్దిగా తెరిచి రోడ్డు వైపుకు చూశాడు. నిర్మానుష్యంగా వుంది. మళ్ళీ వాచ్ వంక చూసుకున్నాడు. హఠాత్తుగా ఏదో బెల్ మోగిన శబ్దం. టెలిఫోన్ కోసం వెళ్ళబోయి మళ్ళీ శబ్దం వినిపించక పోవటంతో కాలింగ్ బెల్ ఏమో నన్న ఆశతో గభాల్న వెళ్ళి తలుపు తెరిచాడు.
చిరునవ్వుతో సుభద్ర, కూలింగ్ గ్లాసెస్ తీస్తూ. ఆమెనలా దగ్గరగా చూస్తూ నిశ్చేష్టుడై నిలబడి పోయాడు శేఖర్. సుభద్ర తనే వెంటనే లోపలికి వచ్చేసి తలుపు తాళం వేసింది.
పక్కపక్కనే యిద్దరూ! అడుగు కన్నా కూడా తక్కువ దూరంలో. శేఖర్ యింకా తేరుకో లేదు. సుభద్రే చొరవగా సున్నితంగా అతన్ని కౌగిలించుకుని పెదాల మీద ముద్దు పెట్టుకుంది. శేఖర్ కి శరీరం అంతా దూదిపింజలా తేలికై పోయి ఎక్కడికో ఆకాశంలోకి ఎగిరి పోతున్న అనుభూతి. జీవితంలో ఇంతకన్నా మధురమైన క్షణం యిప్పటి వరకూ రాలేదన్న భావన.ఆమె వెంటనే అతన్ని విడిపించుకుని గెరాజ్ వైపు వెళ్ళి గెరాజ్ డోర్ మూసి వచ్చింది. ఇంతలో శేఖర్ కూడా తేరుకున్నాడు.ఎదురుగా వెళ్ళి ఆమెని బలంగా కౌగిలించుకున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ చిలిపిగా చూస్తూ అతన్ని మళ్ళీ ముద్దు పెట్టుకుంది. కళ్ళే మాట్లాడుకుంటున్నాయి. ఆపలేని చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి. ప్రపంచంలో ఇంకెవరూ ఇంకేమీ లేని మనఃస్థితి. మనసుల్లోని కోరికల్ని స్పష్టంగా చదివేసిన కాళ్ళు చెప్పకుండానే బెడ్ రూంలోకి అక్కడి కింగ్ సైజ్ బెడ్ మీదికీ దారితీశాయి.
శేఖర్ కి కాలం స్తంభించిపోయింది. మనస్సంతా తన ఉనికి తనకే తెలియని అమేయ స్థితిలో పడింది. భావాల్లో ఇమడని ఆనందానుభూతి. ఇద్దరూ ఒకటై ఆ ఒకటీ గాలిలా శూన్యంలా అంతటా ఆవరించే పరిణామ గతి. కొంత సేపటికి తెప్పరిల్లాక యిద్దరయ్యాక ఒకరినొకరు వదలలేక వదిలాక కదలలేక కదిలాక కాలం కళ్ళు తెరిచాక పరిసరాలు మసకమసగ్గా ఆకృతులు ధరించాక సుభద్ర అడిగింది, “మళ్ళీ యిప్పుడు వర్క్ కి వెళ్ళాలా?” అని. “ఇంక యీ రోజుకు వెళ్ళే పని లేదు” అన్నాడు శేఖర్ ఆశగా చూస్తూ. “నేనింక వెళ్ళాలి” అన్నది సుభద్ర కదలకుండానే. “యింకొంచెం సేపు వుండకూడదా” అన్నాడతను. “నీకు కుదిరినట్టు నాకు కుదరదుగా; ఐనా మరీ ఎక్కువ సేపు వుండటం ప్రమాదం” “ఏం పర్లేదు అన్నీ నేను చూసుకుంటాగా సెలవు పెట్ట రాదూ యీ పూటకి? ఇదుగో సెల్ ఫోన్ మీ ఆఫీసుకి ఫోన్ చెయ్యి” అన్నాడతను ధీమాగా. “ఇంకెక్కడి సెలవులు ఇండియా ట్రిప్ లోనే అన్నీ ఐపోయాయి” “ఇన్నాళ్ళు ఎదురు చూశాక ఇప్పుడే వచ్చావు ఇంతలోనే వెళ్తానంటే ఎలా?…” గోముగా అడిగాడు. “ఇది మొదటి సారే కదా; మళ్ళీ మరో రోజు” అంటూ అతన్ని విడిపించుకుని మెల్లగా లేచి బాత్రూంకి వెళ్ళింది.
శేఖర్ గబగబా లేచి వెళ్ళి ఫ్రిజ్ లో పెట్టినవి తీసుకుని వచ్చి బెడ్ మీద పెట్టి కూర్చున్నాడు. సుభద్ర రావడంతోనే “ఆకలిగా లేదూ?” అనడిగాడు వాటి కేసి చూపిస్తూ. “ఉంది గాని యిలాటివి తింటే ఆకలి తీరుతుందా?” అంది చిలిపిగా. శేఖర్ కి ఆ మాటలోని అంతరార్థం తెలిసి ఒక్క ఉదుటున లేచి పట్టుకో బోయేంతలో బయటికి పరిగెత్తి షూస్ వేసుకుంటూ “ఇంటి దగ్గర్నించి తెచ్చుకున్న లంచ్ నా కార్లో వుంది. ఆఫీసు కెళ్ళి తింటాలే” అన్నది. “మరైతే రేపు యిదే టైంకి మళ్ళీ రావాలి” అన్నాడు శేఖర్ ఆమెని కౌగిలించుకుంటూ. “రేపు కుదరదు. పదకొండుకి ఒక మీటింగ్ వుంది. ఎల్లుండి శుక్ర వారం మా గ్రూప్ వాళ్ళందరం లంచ్ కి వెళతాం. ఈ సారి మా వైస్ ప్రెసిడెంట్ కూడా వస్తున్నాడు గనక వెళ్ళి తీరాలి. సోమవారం ఖాళీనే. ఆ రోజు కలుద్దాం ఐతే” అంది సుభద్ర. “సోమవారం నాకు కుదరదనుకుంటాను. ఏదో కాన్ఫరెన్స్ వున్న గుర్తు. అది కేన్సిల్ చెయ్యటానికి ఏ మాత్రం వీలున్నా చేస్తాను. లేక పోతే మంగళ వారం యిదే టైంకి రావటం మర్చిపోకు” అన్నాడు శేఖర్ ఆమెని వదల్లేక వదుల్తూ. “నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తావుగా. అన్నట్టు మనం యిలా ప్లాన్లు వేస్తున్నాం సరే, ఎవరికీ ఏవీ అనుమానాలు రావుగదా” అంది సుభద్ర. “అదంతా నేను చూసుకుంటాగా. పైగా యిలా అనుమానాలు ఎవరికీ రాకుండా కలుసుకోవటం లో ఎంత త్రిల్ వుందో నీకు తెలీదూ?” “త్రిల్ బాగానే వుంది గానీ మనం కాస్త జాగ్రత్తగా వుంటే తప్పు లేదుగా. పైగా దొరక్కుండా తప్పించుకోవాలి గాని అందరికీ తెలిసేట్టు చేశావనుకో, దాన్లో అంత మజా వుండదు”. “అది నిజమే”. “ఇంక నేను వెళ్ళాలి మరి” అంటూ చటుక్కున ఒక ముద్దిచ్చి గభాల్న తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళి పోయింది సుభద్ర.
తలుపు తాళం వేసి శేఖర్ లోపలికి వెళ్ళి ఒక క్షణం ఆలోచించాడు. ఇంట్లో వుండి చేసే పనేం లేదు. టీవీ చూస్తే ఏం వస్తుంది? పోనీ వర్క్ కి వెళదామంటే అక్కడా చేసేది పెద్దగా లేదు. ఈ మధ్య వైద్య రంగపు ఆర్థిక వాతావరణంలో వచ్చిన మార్పుల మూలాన చాలా మంది స్పెషలిస్టులకి పని బాగా తగ్గిపోయింది. శేఖర్ కూడా వారంలో నాలుగు రోజులు, అదీ 8 నుంచి ఒంటి గంట వరకు మాత్రమే పనిచేస్తున్నాడు. బయటికెళ్ళి ఏదన్నా సినిమా చూడాలని నిర్ణయించుకున్నాడు. గబగబా డ్రెస్ చేసుకున్నాడు. బెడ్ రూం అంతా ఒక సారి కలయ చూశాడు.వస్తువు లన్నీ ఎక్కడ వుండాల్సినవి అక్కడే వున్నాయి. బెడ్ తను వచ్చినప్పుడు ఎలా వుందో అలాగే సరిచేశాడు. బెడ్ మీద పెట్టిన పండ్లన్నీ తీసుకెళ్ళి కారులో పెట్టాడు. దార్లో ట్రాష్ కేన్ చూసి అవన్నీ పడేసెయ్యాలి. కారెక్కి ఆనందలోకాల్లో తేలిపోతూ దగ్గర్లోనే వున్న సినిమా థియేటర్ కి వెళ్ళాడు.
సుభద్ర భర్త సుబ్బారావు, శేఖర్ హైస్కూల్ రోజుల్నించి స్నేహితులు. గుంటూరు మెడికల్ కాలేజికి శేఖర్ వెళ్ళినప్పుడు సుబ్బారావు ముందు హిందూ కాలేజిలోనూ ఆ తర్వాత అక్కడి పి.జి. సెంటర్ లోనూ ఫిజిక్స్ చదివాడు. ఆ విధంగా అక్కడున్నన్నాళ్ళు వాళ్ళ స్నేహం అంతరాయం లేకుండా సాగింది. తర్వాత శేఖర్ అమెరికాకి వచ్చిన రెండేళ్ళకి సుబ్బారావు కూడా పోస్ట్ డాక్టొరల్ ఫెలోగా వచ్చాడు. ఆ తర్వాత ఐదేళ్ళకి సుబ్బారావు కూడా యిండస్ట్రీలో వుద్యోగం సంపాదించి అనుకోకుండా శేఖర్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న మెంఫిస్ కే చేరాడు. అలా వాళ్ళ స్నేహం మళ్ళీ రాజుకుంది. అప్పటికి ఇద్దరికీ పెళ్ళిళ్ళయాయి. సుబ్బారావు తెలివిగా అమెరికాలో సాంకేతిక రంగాల్లో వున్న అవకాశాల్ని గమనించి యింజనీరింగ్ చేసిన సుభద్రని సెలెక్ట్ చేసుకున్నాడు. శేఖర్ కి అమెరికాకి వచ్చేటప్పుడే వాళ్ళ వాళ్ళు పట్టుపట్టి రాధతో పెళ్ళి చేసి పంపించారు. రాధ ఎం.ఏ. చదివినా అవసరం లేక ఉద్యోగం గురించి చాలా కాలం ఆలోచించలేదు. ఇప్పుడు నలభయ్యో పడిలో పడుతున్నాక పిల్లలకి తన అవసరం చాలావరకు తగ్గిపోయాక యింట్లో ఏమీ తోచక కాలక్షేపానికి వారానికి మూడు రోజులు ఒక హాస్పిటల్లో వాలంటరీ వర్క్ చేస్తున్నది. సుభద్ర వచ్చిన దగ్గర్నించి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నది. రెండు కుటుంబాల్లోనూ దాదాపు ఒకేవయసు పిల్లలు యిద్దరిద్దరు. అందరూ మగపిల్లలే. ఆ విధంగా కూడా వాళ్ళ మధ్య సంబంధాలు బాగా దగ్గరయ్యాయి. సంపాదన విషయంలో తేడాలు ఎక్కువే వున్నా ఎంతో కాలం నుంచి కలిసి పంచుకున్న జ్ఞాపకాలూ సుబ్బారావు చతుర సంభాషణా చాతుర్యం కలిసి ఆ స్నేహాన్ని చాలా వరకు నిలబెట్టాయి.
క్రితం సంవత్సరం వరకు.
ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. సుబ్బారావుకి ఉద్యోగం పోవటం, ఎంత ప్రయత్నించినా మళ్ళీ దొరక్కపోవటం, శేఖర్ తో మాట్లాడేప్పుడు అతననే ప్రతి మాటకీ ఏదన్నా అంతరార్థం వున్నదేమో అని అనుమానిస్తూ వుండటం మొదలయ్యింది. దాంతో అతను శేఖర్ ఎదుట పడటం చాలా వరకు తగ్గించేశాడు. సుభద్రే పిల్లల్ని తీసుకుని అప్పుడప్పుడు వెళ్తుండేది. ఒక్కోసారి రాధ యింట్లో లేనప్పుడు కూడా.
…………………………..
ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రకారం సుభద్ర ఆపై వారం నాడు మళ్ళీ శేఖర్ దగ్గరికి వచ్చింది. మొదటి సారి వున్నంత ఆవేశమూ ఆతృతా ఉద్రేకమూ ఉధృతీ లేకపోయినా ఆ కలయిక కూడా ఉత్సాహంగానూ ఆనందంగానూ గడిచింది. ఈ సారి వాళ్ళు మొట్టమొదటి సారిగా ఒకరినొకరు ఎప్పుడు చూశారో ఆ సందర్భాల్లోని సన్నివేశాల గురించి కాసేపు మాట్టాడుకున్నారు. ఐతే యిద్దరూ జాగ్రత్తగా తమ తమ జీవిత భాగస్వాములగురించి వీలైనంత తక్కువ మాటలు వచ్చేట్లు చూసుకున్నారు. మరో పదిరోజుల తర్వాత మళ్ళీ కుదిరింది. ఇంకో వారానికి మళ్ళీ. ఇన్నాళ్ళకి ఇద్దరూ కలిసి జకూజీ టబ్ లో స్నానం చెయ్యటానికి వీలు దొరికింది.
ఆ రోజు రాధ మామూలుకన్నా కొంత ముందుగా యింటికి వచ్చేసరికి బాత్రూంలో ఏదో మార్పు జరిగి నట్టు అనుమానం కలిగింది. ఏమిటా అని కొంచెం నిదానంగా ఆలోచిస్తే ఎప్పుడో ఏడాది కొకసారి వాడే టబ్ ని అంతకు ముందే ఎవరో వాడినట్టు అనిపించింది.రాధకు అర్థం కాలేదు. తను ఎప్పుడూ దాన్లో స్నానం చెయ్యదు. పిల్లలు ఉదయాన్నే స్కూలుకు వెళ్ళారు. శేఖర్ కూడా వర్క్ కి వెళ్ళిన తర్వాతే తను బయటికి వెళ్ళటం జరిగింది. పిల్లలు తిరిగి వచ్చే అవకాశం లేదు.
దొంగలెవరైనా యింట్లో వున్నారేమో నని ఒక్క క్షణం భయం వేసింది. కాని వెంటనే ఆ పరిస్థితి చాలా త్రిల్లింగ్ గా అనిపించింది. నీరసంగా రోజులు గడుస్తున్న జీవితంలో ఉత్సాహం కలిగించటానికి అప్పుడప్పుడు ఇలాటి సంఘటనలు కావాలి మరి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ గెరాజ్ లోకి వెళ్ళి పిల్లల బేస్ బాల్ బేట్ తీసుకుంది.లోపలికి వచ్చి పిల్లిలా నడుస్తూ ఒక్కొక్క రూమే చూసింది. క్లాజెట్స్ మొత్తం వెదికింది. ఇంట్లో వున్న వస్తువులు గాని నగలు గాని ఏవైనా పోయాయేమో చూసుకుంది. అన్నీ ఎక్కడివి అక్కడే వున్నాయి. తలుపులు గాని కిటికీలు గాని తెరిచిన దాఖలాలు లేవు. పోనీ ఎలాగోలా గెరాజ్ డోర్ నే తెరుచుకుని వచ్చారనుకున్నా ఏమీ తీసుకోకుండా స్నానం మాత్రం చేసి వెళ్ళరు కదా!
మాసిన గుడ్డలు వేసే బుట్టలో రెండు కొత్త టవళ్ళు వాడి పడేసి నట్టు తెలుస్తోంది. ఇలా కనిపిస్తున్న ఆధారాలని అన్నిటిని అన్వయించి చూస్తే ఒకటే అవకాశం తేలుతుంది. అదేంటంటే, శేఖర్ తప్పకుండా ఇంతకు ముందే ఇంటికి వచ్చి వెళ్ళుండాలి.అంటే వర్క్ దగ్గర ఏదన్నా కారణం వల్ల స్నానం చెయ్యాల్సి వచ్చి వుండాలి. అంతవరకు బాగానే ఉన్నది గాని అలా జరిగినా సామాన్యంగా ఎప్పుడూ ఇంటికి రాడు. తన ఆఫీసులోనే స్నానం చేసి బట్టలు మార్చుకోవటానికి అన్ని సదుపాయాలు వున్నాయి. సరే, ఎందువల్లయినా యింటికే వచ్చి స్నానం చెయ్యాల్సినా, ఎదురుగా కనిపిస్తూ వున్న ఐదారు టవళ్ళు కాదని ఎక్కడో వున్న కొత్త టవళ్ళు వెదికి తీసి వాడాల్సిన అవసరం ఏమిటి? అది కూడా ఒకటి కాదు, రెండు?
మెల్లగా రాధ మనసులో అనుమానం ఆవులించి కూర్చుంది. ఈ మిస్టరీని ఎలాగైనా సాల్వ్ చెయ్యాలన్న కోరిక బలంగా కలిగింది.ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ కాలేజ్ రోజుల్లోని చలాకితనం, స్వతంత్రంగా సాహసంగా పనుల్ని సాధించే చొరవ పునరుజ్జీవనం పొందాయి. గాలిలో నడుస్తున్నట్టు అడుగులు పడుతూండగా చకచక బెడ్ రూంలోకి నడిచింది. జాగ్రత్తగా తడి గుర్తుల కోసం
చూస్తూ కార్పెట్ మీద వెదికింది. ఎక్కువ వెదకక్కర లేకుండానే తేలిపోయింది కాళ్ళు పూర్తిగా ఆరకుండానే బాత్రూంలోంచి బెడ్ రూంలోకి వెళ్ళినట్టు. అదీ నేరుగా బెడ్ మీదికే. బెడ్ కూడా అక్కడక్కడ తడిగా వుంది. అదికూడా బెడ్ మధ్యలో కొంత విశాలమైన స్థలంలో. కాబట్టి ఇద్దరు మనుషులై వుండటానికి బాగా అవకాశం కనిపిస్తున్నది. ఇప్పుడు బెడ్ ని బాగా పరిశీలనగా
చూసింది. తను బయటికి వెళ్ళేటప్పుడు సర్దిన దానికి ఇప్పుడు వున్నదాన్ని మనసులో పోల్చిచూసింది. చిన్న చిన్న ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిండ్లు కొంచెం కదిలాయి. మేట్రెస్ స్థానం లోను కొంత మార్పున్నది.
ఇవన్నీ చూశాక రాధకి పరిస్థితి చాలావరకు అవగాహన అయింది. శేఖర్ ఇంకెవరితోనో కలిసి టబ్ లో స్నానం చేసి అక్కడి నుంచి బెడ్ మీదికి వచ్చాడన్నది దాదాపుగా నిశ్చయం. కలిసి స్నానం అంటే ప్రాస్టిట్యూట్ అయే అవకాశం లేదు. పైగా అంత చనువు కలగాలంటే యిది మొదటిసారి అయి వుండదు. కాకుంటే ఎంత ప్రయత్నించినా గత కొద్ది నెలలలో యిలాటి అనుమానాస్పద దృశ్యాలు ఏవీ గమనించినట్టు లీలగా ఐనా గుర్తుకు రావటం లేదు. కనక ఇది ఈ మధ్యనే మొదలైన వ్యవహారం. మిగిలినవి ఎలా వున్నా శేఖర్ కొంత కాలంగా ఎవరినో తను లేనప్పుడు ఇంటికి తీసుకు రావటం మొదలుపెట్టాడు. అందుకు ఏ మాత్రం సందేహం లేదు.
ఇంక ఇప్పుడు వెంటనే నిర్ణయించుకో వలసింది దీన్ని గురించి ఏం చెయ్యటం అనేది. “నువ్వెవరితోనో సంబంధం పెట్టుకున్నావని నాకు తెలుసు” అని నేరుగా యుద్ధం ప్రకటించొచ్చు. ఐతే శేఖర్ ఒక వేళ ముందుగానే అలాటి సందర్భం వస్తే ఏంచెయ్యాలో ఆలోచించుకునివున్నట్టయితే అలాటిదేం లేదని ధైర్యంగా బుకాయించవొచ్చు. లేకుంటే, ఔను, నిజమే, ఏం చేసుకుంటావో చేసుకో అని ధిక్కరించనూ వచ్చు. అది చాలా రిస్కీ పద్ధతి. రెండో పద్ధతి మళ్ళీ యిలాటి సంఘటన జరిగే వరకు జాగ్రత్తగా ఆగి అప్పుడు రెడ్ హేండెడ్ గా పట్టుకోవటం.దాని వల్ల యింకో ఉపయోగం ఏమిటంటే అవతలి వ్యక్తి ఎవరో కూడా వెంటనే తెలిసి పోతుంది. కాకపోతే ఆ పద్ధతి పని చెయ్యటానికి చాలా ప్లానింగ్ అవసరం. ఆహా దొరికారని ఉత్సాహంగా ఇద్దర్నీ బెడ్ మీద పట్టుకుంటే అప్పుడు వాళ్ళ ప్రతిస్పందన ఎలా వుంటుందో చెప్పటం కష్టం. లేనిపోనిది యిద్దరూ కలిసి తనని చంపేస్తే? డిటెక్షన్ మాట దేవుడెరుగు, ప్రాణాలు పోవచ్చు. కామంలో నిండా మునిగిన వాళ్ళు ఏంచేస్తారో ఎవరు చెప్పగల్రు? పోనీ అంత దాకా రాక పోయినా, పట్టుకుని ఆ తర్వాత ఏం చేసేటట్టు? నీకు విడాకులిచ్చేస్తా అని బెదిరించొచ్చు. కాని దాంతో ప్రమాదం ఏమంటే, సరే అలాగే అంటే అప్పుడేంచెయ్యాలి? తనకి విడాకులిచ్చి వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుని కులుకుతూ వుంటే తనొక్కతే పిల్లల్ని పెంచుతూ బతకాల్సొస్తుంది. డబ్బు బాగానే లాగొచ్చు గాని ఈ వయసులో తనకి మళ్ళీ పెళ్ళంటే అందుకు అవకాశాలు బాగా తక్కువ. అదీ ఇద్దరు మగపిల్లలుండి డివోర్స్ తీసుకున్న తనకి. అన్నింట్లోకి మంచి పద్ధతి ఎలాగైనా దీన్ని ఉపయోగించుకుని అతన్ని తన కాలి కింద వుండేట్టు చేసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యటం. అందుకు మొదటి మెట్టు అవతలి వాళ్ళు ఎవరో తెలుసుకోవటం. అప్పుడైతే ఇద్దర్నీ ఒకరికి తెలియకుండా మరొకరిని బ్లాక్ మెయిల్ చేసే ఛాన్స్ వుంటుంది!
ఇలా నిర్ణయించుకోవటంతో రాధకి ఎంతో ఉల్లాసం వచ్చింది. వయసు ఒక్క సారిగా సగానికి తగ్గిపోయిన అనుభూతి. ఇక అప్పటి నుంచి శేఖర్ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టింది. ఏవైనా లవ్ లెటర్స్ దొరుకుతాయేమో నని రోజూ అతని జేబులు వెదుకుతోంది.అతను ఎవరికన్నా ఫోన్ చేస్తే అది తనకి తెలియనట్టు మరో ఫోన్ నుంచి ఒక క్షణం విని పెట్టేస్తోంది. తను ప్రతిరోజూ వాలంటరీ వర్క్ కి వెళ్ళాలని నిర్ణయించు కున్నట్టు నమ్మించి వర్క్ లేని రోజుల్లో కూడా వెళ్తున్నట్టు నటిస్తోంది. అనుమానకరమైన సూచనలకోసం అప్రమత్తంగా గమనిస్తోంది.
ఇలా ఒక నెల రోజులు గడిచాయి. మధ్యలో రెండు సార్లు కొంచెం అనుమానం వచ్చింది గాని పూర్తిగా తేలలేదు. ఒక వేళ శేఖర్ కి తనకి అనుమానం వచ్చిన సంగతి తెలిసి జాగ్రత్తగా ఉంటున్నాడేమో అనిపించింది. రెండో వ్యక్తి ఎవరో తెలిసే అవకాశమే కలగలేదు. ఆ రోజు సోమవారం. సాయంత్రం ఏడున్నర అయింది. పిల్లలు హోమ్ వర్క్ చేస్తున్నారు. రాధ భోజనం ముగించింది. శేఖర్ యింకా యింటికి రాలేదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పెద్ద కొడుకు మనోజ్ వెళ్ళి తలుపు తీసి “మామీ నువ్వో సారి అర్జెంట్ గా యిటురా” అని కేక పెట్టాడు. ఏమిటా అని రాధ వెళ్ళి చూస్తే ఎదురుగా పోలీసులు!
“ఏమిటి ఏం కావాలి?” అంటూ తడబడుతూ అడిగింది రాధ. “మీరు మమ్మల్ని చూసి భయపడాల్సిన పనేం లేదు. ఇది డాక్టర్ సెఖార్ గారి ఇల్లేనా?” అంటూ అతని గురించిన వివరాలు, ఎక్కడ పనిచేసేది, ఎలాటి కారు నడిపేది,ఆ రోజు ఎప్పుడు ఇల్లు విడిచి వెళ్ళింది, ఆ తర్వాత ఏమైనా ఫోన్ కాల్స్ చేశాడా … ఇలాటివి అడిగారు. రాధకి అర్థం కాలేదు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నది. అదే విషయం వాళ్ళని అడిగింది. అప్పుడు ఒక లేడీ పోలీస్ ఆమెతో లోపలికి వచ్చి ఆమె పక్కన సోఫాలో కూర్చుని మెల్లగా విషయం బయటపెట్టింది “డాక్టర్ సెఖార్ ఓ గంట క్రితం తీవ్రమైన కారు యాక్సిడెంట్ లో బాగా గాయాలు తగిలి మరణించారు. శవాన్ని చూసి గుర్తు పట్టేందుకు మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళటానికి మేం సిద్ధంగా వున్నాం.” అంటూ.
రాధకి మొదటిగా కలిగిన భావం ఇన్నాళ్ళ తన ఇన్వెస్టిగేటివ్ వర్క్ పూర్తి కాకుండానే ఇలా అర్థాంతరంగా ఆగిపోతున్నదే, అంత ఉల్లాసం కలిగిస్తున్న ఆ పని ఇంక లేకుండా పోతుందే అనే బాధ. కాని దాని గురించి ఇప్పుడు తను చెయ్యగలిగింది ఏమీ లేదు. హస్పిటల్ కి వెళ్ళి వెంటనే జరగాల్సిన కార్యక్రమాలు చూడటం ఒక్కటే తక్షణ కర్తవ్యం.
ఒంటి నిండా గాయాల్తో దాదాపుగా గుర్తు పట్టటానికి వీల్లేకుండా వున్నాడు శేఖర్. ప్రాణం పోయి చాలా సేపయినట్టుంది. కొంచెం సేపు ఆ బెడ్ పక్కన ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది రాధ. ఏం చెయ్యాలో తోచలేదు. ఏడుపు ఏమాత్రం రాలేదు. అసలు బాధ కూడా కలగలేదు. ఇద్దరూ కలిసి పంచుకున్న పదిహేనేళ్ళ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు మరిచిపోలేని సన్నివేశాలు ఏమున్నాయా అంటే ఏమీ గుర్తుకు రావటం లేదు.చూసే వాళ్ళకు బాగుండదని దుఃఖం కలిగినట్టు కొద్ది సేపు నటించింది. ఇంతలో మరో లేడీ పోలీస్ వచ్చి, “మీకు అభ్యంతరం లేక పోతే ఒక్క నిమిషం ఇలా రావలసింది” అని దగ్గర్లో వున్న ఇంకో బెడ్ దగ్గరికి తీసుకు వెళ్ళింది.
ఎవరో శ్వేత జాతి స్త్రీ. బహుశః ముప్పై ఏళ్ళ వయసు వుండొచ్చు. ఆకర్షణీయంగానే వుంది. స్పృహలో లేదు. ఒంటి నిండా రకరకాల వైద్య పరికరాలు అమర్చి వున్నాయి. “ఈమెను మీరు ఎప్పుడైనా చూశారా? ఈమె ఎవరో మీకు తెలుసా?” అని అడిగారు రాధని. లేదన్నది రాధ. అసలు ఆమెని తనకి చూపాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు. వాళ్ళే చెప్పారు, ” డాక్టర్ సెఖార్ కారుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈమె కూడా ఆ కారులోనే వున్నది. అతనితో పాటు పని చేసే వ్యక్తి అయుండ వచ్చని అనుకుంటున్నాం. వివరాలు తెలియగానే తెలియజేస్తాం” అన్నారు.
ఆ వివరాలు బయటికి రావటానికి ఒక వారం రోజులు పట్టింది. వచ్చిన వాటి సారాంశం ఇది : ఆ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో శేఖర్ హాస్పిటల్ నుంచి బయలుదేరి వస్తూ దారిలో ఒక సింగిల్స్ బార్ లో ఆగాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళిన వాడు ఆ అమ్మాయితో కలిసి హడావుడిగా బయటికి వచ్చాడు. ఆ అమ్మాయి అంతకు ముందే తన భర్తతో తగువు పడి కోపంగా బార్ కి వచ్చి వుంది. ఐతే ఆమెకి తెలియ కుండా బయటఆమె భర్త కూడా అక్కడికి వచ్చి బయట ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఆమె శేఖర్ తో కలిసి రావటం, వాళ్ళిద్దరూ శేఖర్ మెర్సెడీస్ కారులో ఎక్కటం అతని కంట పడింది. తనతో పోట్లాట పెట్టుకోవటమే కాకుండా ఎవడో బ్రౌన్ వెధవతో తన భార్య వెళ్ళటం చూసిన అతను పట్టరాని కోపంతో తన ట్రక్ లో వాళ్ళని వెంబడించాడు. శేఖర్ కారుని అతను కలుసుకునే సరికి వాళ్ళొక ఫ్రీవే మీద వున్నారు. అతను ఆ కారు పక్కగా ఆమె వున్న వైపునుంచి వచ్చి గన్ చూపిస్తూ ఆమెని ఏదో బెదిరించటం,ఆ వెంటనే శేఖర్ తన కారుని చాలా స్పీడ్ పెంచి నడపటం జరిగింది. ట్రక్ కూడ ఆ కారుని అందుకోవటానికి ప్రయత్నం చేసింది.అలా దాదాపు వంద మైళ్ళ వేగంతో వెళ్తున్న శేఖర్ హఠాత్తుగా ఒక పెద్ద ట్రక్ ని పాస్ చెయ్యాల్సి రావటంతో కారు కంట్రోల్ తప్పి మీడియన్ లో వున్న గోడని బలంగా కొట్టటం, అంతటితో ఆగకుండా ఎగిరి రెండో వైపుకు కారు పడటం, ఆ వైపు నుంచి వస్తున్న ఇంకో ట్రక్ దాన్ని యాభై గజాల దూరం గాల్లో విసిరెయ్యటం క్షణంలో జరిగిపొయ్యాయి.
డాక్టర్ల ఉద్దేశం శేఖర్ బహుశః ఆ ట్రక్కు గుద్దుకోకముందే మరణించి వుంటాడని. అతనితో వున్నామె మాత్రం అత్యాశ్చర్యంగా వెంటనే చనిపోలేదు; మరుసటి రోజు హాస్పిటల్ లో చనిపోయింది అప్పటివరకు కోమాలో వుండి.
శేఖర్ అప్పుడప్పుడు సూచాయగా చమత్కారంగా అన్నట్టుగా అంటుండే మాటలు రాధకు గుర్తుకు వచ్చాయి: “ఎలాగైనా తెల్ల ఆడవాళ్ళు శృంగారంలో బాగా ఆరితేరిన వాళ్ళు; వాళ్ళ అనుభవం ముందు మిగిలిన వాళ్ళంతా దిగదుడుపే. మనకు శృంగారశాస్త్రంలో రహస్యాలు తెలియాలంటే వాళ్ళతో కొంత అనుభవం సంపాదించటం ఒక్కటే మార్గం…” యిలాగా. దీన్ని బట్టి చూస్తే ఆ కోరిక తీర్చుకోవటానికే అతను బార్ కి వెళ్ళినట్టు, అక్కడ అనుకూలంగా అదే సమయానికి వచ్చి కసితోనూ కోపంతోనూ ఏదో విపరీతమైన పని చేసెయ్యాలని ఉద్రేకంలో వున్న ఆమెని తీసుకుని ఏ హోటల్ కో వెళ్ళటానికి ప్రయత్నించి నట్టు కనపడుతుంది. ఒక వేళ యీ మధ్య కాలంలో యింటికి తీసుకు వస్తున్నది కూడ యిలాటి వాళ్ళను కాదు కదా? అని ఆలోచనలో పడింది రాధ.
ఈ సమస్యని పరిష్కరించటానికా అన్నట్టు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పోలీసులు వచ్చి “డాక్టర్ సెఖార్ కారులో దొరికిన వస్తువులు” అంటూ యిచ్చిన వాటిలో ఒక డైరీ కూడా కనిపించింది. వాళ్ళు వెళ్ళటం తోనే రాధ ఆతృతగా దాన్ని తెరిచి చదివింది. ఆమె సందేహాలు చాలా వాటికి అందులో సమాధానాలు దొరికాయి కూడా.
రెండు నెలల క్రితం వున్న ఒక ఎంట్రీలో యిలా వుందిి: “జీవితం మరీ డల్ గా వుంటున్నది. చచ్చేటంత సంపాయించాను. నచ్చిన కార్లూ,హోమ్ థియేటరూ, ఇంటి నిండా రకరకాల గాడ్జెట్లు. ఛాన్స్ దొరికి నప్పుడల్లా క్రూజ్ ట్రిప్పులు ఇంటర్నేషనల్ వెకేషన్లూ. ఐతే వీటిలో వేటిలోనూ కలగాల్సిన ఉత్సాహం కలగటం లేదు. ఇంకేదైనా కొత్త దారి కావాలి. ఎంతసేపూ ఇంట్లో కూర్చుని టీవీ చూడటం,బయటికెళ్ళి సినిమాలు చూడటం, ఎప్పుడన్నా పార్టీల్లో కలిసి చూసిన మొహాలే చూడటం మాట్టాడిన విషయాలే మాట్టాడటం ఇంతేగా ఈ వెధవ జీవితం? ఇంక ఊరుకోకూడదు. ఏవన్నా సాహసాలు చెయ్యాలి. “యస్” వ్యవహారం చూస్తుంటే కొంచెం ప్రయత్నం చేస్తే దొరకొచ్చు అనిపిస్తుంది. చేసి చూద్దాం పోయిందేం వుంది గనక?” తరవాత కొన్నాళ్ళకి “ఈ రోజు మొదటి సారిగా యస్ ఇంటికి వచ్చింది. మరపు రాని మధురానుభూతుల్ని రుచి చూపించింది. ఈ ఐడియా ఇంత లేటుగానా రావటం? అయ్యయ్యో ఎంత కాలం వేస్టయి పోయింది!” దీని తర్వాత నెల రోజులకి మరోటి: “ఇప్పటికి యస్ తో ఐదు సార్లు అయింది. దీన్లో కూడా పెద్ద ఉత్సాహం కనపడటం లేదు. దానికి తోడు యీ మధ్య మంచి సమయం చూసుకుని రాధకి డివోర్స్ ఇచ్చి తనని పెళ్ళి చేసుకోమని చెప్పీ చెప్పనట్టు చెబుతుంది. రాధని వొదిలించుకుని ఇంకెవరినన్నా చేసుకునేట్టయితే
ఇంతకన్నా ఇంకెవరూ దొరకరా ఏమిటి మనకి? ఒక రొచ్చు గుంటలో నుంచి ఇంకో దాన్లోకి దూకే వెధవలా కనబడు తున్నానన్న మాట. ఇంతటితో యీ కధ ఆపి ఇంకెవరన్నా దొరుకుతారేమో చూడాలి. అసలు వీళ్ళెవరూ కాదు. ఈ సారి తెల్ల పిల్లల కోసం గట్టిగా ప్రయత్నం చెయ్యాలి. మన ముఖం చూసి ఎవరూ రారు గాని కారు చూసి రావొచ్చు. డబ్బు వెదజల్లితే దొరకొచ్చు. ఆఫీసులో పనిచేసే వాళ్ళని ఎవరినన్నా పట్టటం తేలిక. ఐతే ఒక సారి తగులు కుంటే అంత తేలిగ్గా వదలరేమో. పైగా యీ మధ్య సెక్సువల్ హెరాస్ మెంట్ అని ఇదో గోల హడావుడిగా కూడా ఉంది. కాబట్టి వర్క్ కి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళయితేనే హాయి.” ఆఖరుగా చావుకు ముందు రోజు యిలా రాసుకున్నాడు: “ఒక మంచి ఐడియా వచ్చింది నిన్న రాత్రి టీవీ చూస్తుంటే. ఇన్నాళ్ళు ఎందుకు రాలేదో ఆశ్చర్యం! హాయిగా సింగిల్స్ బార్లకి వెళ్ళి బీటేస్తే ఎవరో ఒకరు దొరకరా? వరసన ఓ నెల రోజులు ప్రయత్నిస్తే ఒక సారన్నా సక్సెస్ కావటం కష్టం అనుకోను. అక్కడికి వొచ్చే వాళ్ళందరూ వొచ్చేది అందుకోసమే కదా!”
ఇదన్న మాట విషయం. వెరైటీ కోసం, కొత్తదనం కోసం, సాహసం కోసం, త్రిల్ కోసం పడ్డ పాట్లు యివి. గమ్మత్తేమిటంటే యీ ప్రయత్నంలో చావు కూడా చాలా త్రిల్లింగ్ గానే జరిగింది. కాకపోతే తెల్లపిల్లతో సంబంధం కావాలన్న కోరిక తీరని కోరిక గానే మిగుల్చుకుని సరిగ్గా అది తీరబోయేముందే పోయినట్టున్నాడు.
ఈ విధంగా డైరీలో రాతల్ని బట్టి తన యింటికి వచ్చి శేఖర్ తో వుంటున్నది ఎవరో తనకి తెలిసిన వాళ్ళే నని రాధకి అర్థమయింది. కాకుంటే ఎవరో స్పష్టంగా తెలుసుకోవటం మాత్రం సాధ్య పడలేదు. ఔను మరి. ఎవరి పేరు చూసినా ఎస్ తో మొదలౌతూ వుంటే ఎలా! సరళ, శారద, సంధ్య, సుజాత, శోభన, సుభద్ర, సుమ, సౌమ్య, స్నేహ, సుచరిత,.. డామిట్ వీళ్ళలో ఎవరనేది
ఎలా తేలటం? అందరూ అందరే. ఛాన్స్ దొరికితే ఎవడితో లేచి పోదామా అని ఎదురు చూస్తున్నట్టు కనపడతారు. ఒక పక్క అందరూ ఉద్యోగాలు చేస్తూ సంపాయిస్తున్న వాళ్ళే గాని వీళ్ళ జీవితాల్లో ఏం వుంది చెప్పుకోటానికి? ఇంటా బయటా చచ్చేట్టు పనిచెయ్యటం, వీక్ ఎండ్ లో పార్టీలు వుంటే ఎప్పుడూ కలిసే వాళ్ళనే కలిసి అరిగిపోయిన రికార్డుల్లాగా అవే మాటలు మాట్టాడుకుని, మంచి తిండికి వాచిపోయి వున్నట్టు ఎంత చెత్తనైనా “డెలిషియస్, సో టేస్టీ” అంటూ లొట్టలేసుకుని తింటూ గుడ్డలూ నగలూ చూపించుకుని గర్వపడటం, యిదేగా రూటీన్? అయ్యుండచ్చు యీ చచ్చువెధవ మొగుడికి దొరికిన దండుముండ. ఎవరైనా ఏది ఏమైనా తను తొందర పడి డివోర్స్ తీసుకోవటం గాని అతనే అవతలి వాళ్ళ మీద మరీ మోజులో పడి తనని వదిలించుకోవటం గాని జరక్కముందే ఈ వ్యవహారం యిలా చాలా సంతృప్తికరంగా ముగిసినందుకు రాధ ఆనందంగా కృతజ్ఞతగా పిట్స్ బర్గ్ గుడికి వెళ్ళి పూజలు చేయించి వచ్చింది. ఇప్పుడు ఆస్తి అంతా తన చేతికి రావటమే కాకుండా శేఖర్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఒక మిలియన్ వచ్చింది. కార్ ఇన్సూరెన్స్ కూడా కొంత రాబోతుంది. శేఖర్ తో పాటు చనిపోయిన ఆమెకి అదృష్టవశాత్తూ భర్త తప్ప ఇంకెవరూ లేరు. ఆ భర్తని జైల్లో పడేశారు. కనక వాళ్ళకి ఏమీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం మీద శేఖర్ పోవటంతో రాధ నాలుగు మిలియన్లకి అధికారిణి అయింది. ఇంత కన్నా కావలసింది ఏముంది! ఈ డబ్బుతో యిక తను ఆడింది ఆట పాడింది పాట! ఇన్నాళ్ళుగా తీరని కోరికలన్నీ హాయిగా తీర్చుకోవచ్చు. ఆంక్షలు విధించటానికి గాని హద్దులు నిర్ణయించటానికి గాని ఎవరూ వుండరు. స్వేచ్ఛావిహంగంగా వినోద విహారాలు చెయ్యొచ్చు!
వెంటనే తన ఆలోచనల్ని అమలులో పెట్టింది రాధ. ఇండియా నుంచి తల్లిదండ్రుల్ని పిలిపించింది. వాళ్ళతో పాటు యింకా పెళ్ళికాని చిన్న చెల్లెలు కూడా వచ్చింది. వాళ్ళందరు తనతో పాటు వుంటూ పిల్లల విషయం చూసుకుంటున్నారు. తన ప్రైవసీ కోసం ఒక కాండొమీనియం కొనుక్కుని తోచినప్పుడు అక్కడికి వెళ్ళి వుంటున్నది. ఒక రోజు ఖరీదైన ఒక రెస్టారెంట్ కి లంచ్ కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి కండలు వస్తాదులా వున్న వైటర్ తో మెల్లగా మాటల్లోకి దిగి షిఫ్ట్ అయాక తనకి ఫోన్ చెయ్యమని తన నంబర్ యిచ్చింది. ఆమె ఖరీదైన గుడ్డలూ మెర్సెడీస్ కారూ చూశాక అతను అప్పటికప్పుడే ఆ ఉద్యోగం వొదిలేసి ఆమెతో కాండో కి వెళ్ళాడు. అతనికి పెళ్ళయి వుంది, రాధ కన్నా బహుశః ఓ పదేళ్ళన్నా చిన్న వాడయుంటాడు. కాని,ఇద్దరూ యిష్టపడ్డాక అలాటి చిన్న చిన్న విషయాలు ఎవరికీ అభ్యంతరం కావు కదా! అందులోను అతను అమెరికన్, తెల్లవాడు కావటంతో మిగిలిన తెలుగు వాళ్ళు చెవులు కొరుక్కోవటానికి కూడా అంతగా అవకాశం దొరకలేదు. కొన్నాళ్ళకి అతను వాళ్ళావిడకి డివోర్స్ చేసి రాధ కాండో లోకే తన మకాం మార్చేశాడు. ఆ తర్వాత రాధ ఎవరెవరో కొత్త కొత్త కుర్రవాళ్ళతో కనపడుతుందని అప్పుడప్పుడు వదంతులు వినిపించాయి గాని అలా అన్నది ఆమె శ్రేయోభిలాషులు కాదనే విషయం అందరికీ తెలుసు. ఐనా రాధ అతన్ని పెళ్ళి చేసుకోవటం జరిగేపని కాదని ముందుగానే స్పష్టంగా చెప్పిందనీ అలాగే తన మీద ఏమాత్రం పెత్తనం చెలాయించినా వూరుకోనని కూడా తెలియజెప్పిందనీ పుకార్లు. ఏది ఏమైనా రాధ మాత్రం తన కొత్త జీవితాన్ని పుష్కలంగా అనుభవిస్తున్నదన్న విషయం ఎవరూ కాదనలేక పోయారు.రాధ తల్లిదండ్రులు యీ వ్యవహారాలు చూసి మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు గాని తర్వాత మెల్లగా అలవాటు పడిపోయారు.మారుతున్న కాలంతో మారటానికి డబ్బుని మించిన ఇంధనం లేదు కదా!
పాపం, సుభద్ర పరిస్థితి మాత్రం దయనీయంగా మిగిలిపోయింది. తను శేఖర్ తో ఇంకొన్నాళ్ళ ముందే సంబంధం పెట్టుకుని పెళ్ళి కూడా చేసుకునివుంటే మిలియన్ల ఆస్తి ఆ వంట యింటి రాకాసి రాధకి కాకుండా తనకే వచ్చి వుండేది. అప్పుడు ఉద్యోగం లేని మొగుడి గొడవా డబ్బులు చాలీ చాలక ఎప్పటికప్పుడు వెదుక్కునే దుర్భర పరిస్థితీ లేకుండా ఆనందంగా తన మనసుకి నచ్చిన పనులు చేస్తూ జీవితాన్ని అనుభవిస్తూ వుండేది. పోనీ కనీసం యింకొన్నాళ్ళు అతను బతికివున్నా అతని చేత అధమం కొన్ని మంచి నగలన్నా కొనిపెట్టించు కునివుండేది. తను ఎంతో చక్కటి ప్లాన్ వేసి ఆడవాళ్ళంటేనే ఆ చాయల లేకుండా పరిగెత్తే ప్రవరాఖ్యుడి లాటి శేఖర్ ని దార్లోకి తీసుకు వచ్చి తనకోసం చొంగకార్చుకుంటూ రోజూ ఎదురుచూసేట్టు చేసి కొంగు చుట్టూ తిప్పుకోబోతూ వుండగా అతని తెల్లతోలు పిచ్చి చావుకి తెచ్చి కొంపదీసింది. ఇప్పుడు తనకి మిగిలిందేవిటి బూడిద తప్ప! పైగా దుఃఖోపశమనానికైనా ఇలా జరిగిందని ఎవరికీ చెప్పుకోవటానికి కూడా లేదు. ఎంత మంచి స్నేహితులైనా ఇలాటి విషయం చెవిలో పడితే ఊరు ఊరంతా బ్రాడ్ కాస్ట్ చెయ్యకుండా ఊరుకుంటారా? అదీ కాకుండా తను కూడా మళ్ళీ ఇంకెవడినన్నా బంగారు పిచికని పట్టాలి కదా! దానికి ఎంతకాలం పడుతుందో!
ఇలాటి దౌర్భాగ్యం పగవాళ్ళకి కూడా వద్దురా బాబూ!