మే 2003

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !

ఈ సంచికలో అనుబంధ కావ్యాలుగా శ్రీ ఇస్మాయిల్‌ “రాత్రి కురిసిన రహస్యపు వాన”, “కప్పల నిశ్శబ్దం”, శ్రీ గుఱ్ఱం జాషువా “గబ్బిలం” కావ్యం తొలిభాగం, ఇస్తున్నాం. ఇస్మాయిల్‌ గారి రచనల్ని చక్కగా టైప్‌ చేసి ఇచ్చిన శ్రీ గట్టు వినీల్‌ కుమార్‌ కి, శ్రీ ఇస్మాయిల్‌ గారి అనుమతి పొందిన శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్‌ కి కృతజ్ఞతలు. ఒక తరం కవితారసజ్ఞుల్ని ఉర్రూతలూగించిన శ్రీ జాషువా గారి గబ్బిలం, ఎంతోమంది యువకులకు మార్గదర్శకాలైన శ్రీ ఇస్మాయిల్‌ గారి రచనలు “ఈమాట” పాఠకులకు ఆలోచనామృతాలౌతాయని మా ఆకాంక్ష.

శ్రవ్య విభాగంలో శ్రీ రమణమూర్తి, జె. వి. సోమయాజులు, తదితరులు పాత్రపోషణ చేసిన “కన్యాశుల్కం” ఆకాశవాణి నాటికను, తెలుగునాట విస్తృత ప్రచారం పొందిన రంగస్థల నాటకం “చింతామణి” (అర్వపల్లి సుబ్బారావు, చీరాల సుబ్బయ్య, తదితరులు నటించినది) ని అందిస్తున్నాం.

శ్రీ విన్నకోట రవిశంకర్‌ రచన “కానుక” అనే నాటిక సరదాగా చదువుకోవటానికే కాకుండా చక్కగా ప్రదర్శించటానికి కూడ ఎంతో అనుకూలమైనది. ఔత్సాహిక కళాకారులు దీన్ని ఆదరిస్తారని, ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాం.

ఇక ఈ సంచికలోనూ కథలు, కవితలు, వ్యాసాలు మీకు నచ్చే స్థాయిలో అందించగలుగుతున్నామని భావిస్తున్నాం. ఐతే, రచయిత్రు(త)లు రాయనిదే, మాకు పంపనిదే, మంచి మంచి రచనలు వాటంతటవే పుట్టుకురావు కదా! ఈ పత్రిక వున్నది విదేశాంధ్రుల రచనావ్యాసంగాన్ని ప్రోత్సహించటానికి. ఈ అవకాశాన్ని వినియోగించుకొమ్మని మరొకసారి మా ఆహ్వానం!

రాసే శక్తి వున్న ప్రతివారికీ రాయవలసిన బాధ్యత కూడ వున్నది. వారు ఆ విషయం గుర్తించి తమ బాధ్యతని నిర్వహిస్తారని మా నమ్మకం. ఆ నమ్మకమే ఈ పత్రిక పుట్టుకకు, ఉనికికి పునాది.

ఇక్కడ కనిపించే ఒక కథ గురించి కొంత నేపథ్యం ఇవ్వటం అవసరం అని నేను అనుకుంటున్నాను. దాదాపు ఐదేళ్ళ క్రితం Syllables of Sky (Edited by David Shulman, in honor of Prof. Velcheru Narayana Rao) అన్న వ్యాస సంకలనం చూసినప్పుడు అందులో ఒక వ్యాసం నన్ను బలంగా ఆకట్టుకుంది. అది తొలినాళ్ళ యూరోపియన్ల దృష్టిలో తిరుపతిి గురించిన భావాలు ఎలా వుండేవి అనే విషయం మీద శ్రీ సంజయ్‌ సుబ్రహ్మణ్యం రాసినది. ఆ వ్యాసంలోని కొన్ని విషయాల్నిఓ కథగా తయారుచేస్తే బాగుంటుందన్న అప్పటి ఆలోచన ఇప్పటికి కార్యరూపం ధరించింది. ఐతే, నేను చేసింది కేవలం కొంత నాటకీయతను ప్రవేశపెట్టే ప్రయత్నం. పాత్రలూ, సంఘటనలూ అన్నీ వాస్తవాలే, కల్పితాలేవీ లేవిందులో!