సినిమా పాటలు – నవ్వులాటలు

నవ్వించబోయి నవ్వులపాలయ్యే నటభీకరుల్ని మన సమావేశాల్లో ఏటేటా చూస్తూనే వుంటాం. ఒక సన్నివేశం, ఒకరో కొందరో నటీనటుల హావభావాలు, సంభాషణలు – ఇన్ని కలిసినా నవ్వించటం ఇంత చచ్చే చావౌతుంటే ఇక ఒక చిన్న పాటతో శ్రోతల్ని నవ్వించగలటం మాటలుకాదు. అందుకే సినిమా పాటల్లో హాస్యం కోసం వెదుకులాట ‘తివిరి ఇసుమున తైలం తియ్యటం’ లాటిది. కెనడావాళ్ళ నడిగితే చెప్తారు ‘ఆయిల్శాండ్స్‌’ నుంచి ఆయిల్తియ్యటానికి ఎన్ని తిప్పలుపడాలో.

అయ్యవారిని చెయ్యబోతే కోతైనట్టు, ఇంకేదో రసాన్నభినయించబోయి ప్రేక్షకులకి విపరీతంగా నవ్వు తెప్పించెయ్యటంలో అగ్రగణ్యులు మన అగ్రనటులు(?). ఇదివరకు అనేక సినిమాల్లో కృష్ణ చేసిన డాన్సులు, విషాదగీతాల్లో యన్‌ టి రామారావు నటన ఇందుకు కొట్టొచ్చే ఉదాహరణలు. నాగేశ్వరరావు కాలరు నలిపేసుకుంటూ ఊగిపోవటాలు, శోభన్‌బాబు చేతులు అటూ ఇటూ వివరీతంగా ఊపెయ్యటాలు- వేరే దారిలేక భరించారు ప్రేక్షకులు, తన్నుకొస్తున్న నవ్వుల్ని ఆపుకుంటూ. కొత్తతరంలోనూ నటులుగా నటించేవాళ్ళు కొల్లలు. అలాటి (అప)హాస్యగీతాల్ని గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది. ప్రేక్షకులు/శ్రోతలు/పాఠకులకి నవ్వు పుట్టించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాల గురించి మాత్రమే.

ఓ పాతికేళ్ళక్రితం ‘‘తెలుగు హాస్యగీతాలు’’ అనే రికార్డ్‌ వచ్చింది. అందులో ఉన్న పాటలు ఇవి – అదియే ఎదురై వచ్చే దాకా పదరా ముందుకు పడిపోదాం, అహ నా పెళ్ళియంట ఒ నా పెళ్ళియంట, అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ, చీటికి మాటికి చిట్టెమ్మంటవ్‌, చిననాయుడుంటడు పెదనాయుడుంటడు, చిటారుకొమ్మన మిఠాయిపొట్లం చేతికందదేం నరుడా, గండుపిల్లి మేనుమరచి బండనిదుర పోయెరా, బలె బలె బలె బలె హిరణ్యకశిపుడరా నిన్ను ఇరసక తింటనురా, లంబో తళుకు బెళుకు చూడవయా, నాజూకైన గాడిద నా వరాల గాడిద, నీసొగసే లాగుతున్నాది, నీటైన పడుచున్నదోయ్‌ నారాజా నువ్వే నా లబ్జన్నదోయ్‌, నిన్నే నిన్నే ఏయ్‌ ఏయ్‌ వన్నెల చిన్నెల వయ్యారి, పడుచుపిల్ల వలచెనయ్యా పలుకవేమయా, సరసుడా నీవే నాకు గతి వెనుకా ముందు, శివశివమూర్తివి గణనాథా. ఇప్పుడు వింటుంటే వీటిలో ఒక్క పాట కూడ నవ్వు తెప్పించటం లేదు.పాతికేళ్ళక్రితం నవ్వించాయా అంటే అదీ అనుమానమే. కాకపోతే ఇందుక్కారణం అప్పటి వరకు తెలుగులో ఇంతకన్న హాస్యం కలిగించే పాటలు రాలేదని కాదు, హాస్యం గురించి వీటిని ఎంచికూర్చిన వాళ్ళ అభిప్రాయాలు అనుమానాస్పదాలని, ఆ రికార్డ్‌ తయారుచెయ్యటంలో వాళ్ళ ఉద్దేశ్యం నిజంగా మంచి హాస్యగీతాల్ని ఎంచటం కాకపోవచ్చని మాత్రమే. మరో అవకాశం కూడ వుంది- వీటిని ఎంచినవాళ్ళు వయసులో ఉన్న రోజుల్లో ఈ పాటలు హాస్యగీతాలుగా అను కుని వుండొచ్చు. మనసుల మీద ఎక్కువ ప్రభావం పడే వయసులో కలిగే అభిప్రాయాలు ఆ తర్వాత అంత తేలిగ్గా మారవని అందరికీ అనుభవంలో ఉన్న విషయమే.

కనక, ఈ వ్యాసం లక్ష్యం ఇప్పుడు, 2013లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఇన్నాళ్ళ తెలుగు సినిమాల్లో వచ్చిన పాటల్లో హాస్యం కోసమని తయారుచేసిన వాటిలో ఇప్పటికీ నవ్వు తెప్పించగలిగినవి ఏవా అని చూడటం. ఐతే, నాకు నవ్వు తెప్పిం చేవిలా అనిపించేవి మరొకరు ఎవరికైనా సరే నవ్వు తెప్పించాలని నియమం లేదు, ముఖ్యంగా నా తర్వాతి తరం వాళ్ళకి.అంచేత ఈ వ్యాసం నా సొంత అభిప్రాయాలకి సంబంధించింది మాత్రమే.

నాకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఇద్దరు రచయితలు- కొసరాజు, అప్పలాచార్య. కొసరాజుగారు తెలుగు సినిమాలకి జానపద గీతాలు రాసిన వాళ్ళలో ప్రముఖులు. అలాగే హాస్యానికి కూడ పెద్దపీట వేసిన రచయిత. ఇల్లరికం గురించి ఆయన రాసిన పాట ఎప్పటికీ మరిచిపోలేను (కొత్త తరాలకి అసలా పదమే అర్థం కాకపోవచ్చు, అది వేరే విషయం).ఆ సినిమా వచ్చేనాటికే ఇల్లరికం అంటే ఓ శిక్షలాటిదన్న అభిప్రాయం బలపడిపోయింది. అలాటి పరిస్థితుల్లో ఇల్లరికంలో ఉన్న ‘మజా’ గురించిన పాట అంటేనే నవ్వు తెప్పించాలన్నమాట. అయితే అంతటితో ఆక్కుండా నిజంగానే ‘ఫన్నీ’గా వుంటుందీ పాట.

భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాం లలలాం లకీ ఛాన్సులే
ఇల్లరికంలో వున్న మజా అది అనుభవించితే తెలియునులే

అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే
బావమరదులే లేకుంటే ఇంటల్లుడిదేగా అధికారం
జుట్టుబట్టుకుని బైటికీడ్చినా చూరుబట్టుకుని వేలాడి
దూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి

అణిగీమణిగీ వున్నామంటే అంతా మనకే చిక్కేది
మామ లోభియై కూడబెట్టినది మనకే కాదా దక్కేది…

మొదల్లో ఆంగ్ల పదాల్ని కూడ విశృంఖలంగా వాడి తర్వాతి తరాలకి బాటలు వేసిందీ పాట. చివర్లో ‘చిక్కేది’ అన్న పదంలో శ్లేషని కూడ ధ్వనించింది (అంతా మనకే చిక్కుతుందని ఒక అర్థం, అంతా మనకే కదా ఇందులో ఎలాటి చిక్కూ లేదని మరొకటి). ‘జుట్టుబట్టుకుని బైటికీడ్చినా చూరుబట్టుకుని వేలాడి’ అని ‘చుట్టమై వచ్చి దయ్యమై పట్టే’ వాళ్ళ గురించి వాడుకలో వున్న ప్రయోగం.దాన్ని ఇల్లరికం అల్లుడికి అన్వయించటం రసవత్తరం.

కొసరాజుగారే పేకాట గురించి, సిగరెట్ల గురించి కూడ పాటలు రాశారు. వాటిలో పేకాట పాట బాగా పేరు తెచ్చుకుంది. నాకు అంతకన్నా నచ్చుతుంది సిగరెట్టు పాట. ఇల్లరికం పాటలా కాకుండా ఇందులో రెండువైపుల నుంచి వాదన వినిపించటం మరో విశేషం. ఈ పాటలో కొన్ని భాగాలు –

సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్‌ తాగు బల్‌ సిగరెట్టు
పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికే ఇది తొలిమెట్టు

ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకాదహనం చేశాడు
(ఎవడో కోతలు కోశాడు)
ఈ పొగ తోటి గుప్పుగుప్పున మేఘాలు సృష్టించవచ్చు
(మీసాలు కాల్చుకోవచ్చు)
(ఊపిరితిత్తుల కేన్సరు కిదియే కారణమన్నారు డాక్టర్లు)
కాదన్నారులే పెద్ద యాక్టర్లు
(పసరు పేరుకుని కఫము చేరుకుని ఉసురుదీయు పొమ్మన్నారు)
దద్దమ్మలు అది విన్నారు

పక్కనున్న వాళ్ళీ సువాసనకు ముక్కులు ఎగరేస్తారు నీవెరుగవు దీని హుషారు
(థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే)
కలెక్షన్లు లేవందుకే…

‘దొరలు’ చేసే ఏ పనైనా గొప్పదే అన్న పాతభావాల మీద ఒక విసురు కూడ విసిరారు స్వాతంత్య్ర సమరయోధుడైన కొసరాజుగారు. అలాగే సినిమా థియేటర్లలో కలెక్షన్లు లేకపోవటానికి పొగతాగటం మీద నిషేధానికి ముడిపెట్టి చిరునవ్వు తెప్పిస్తారు. సిగరెట్టుతో ఆంజనేయుడి చేత లంకాదహనం చేయించటం కూడ. ఒక పక్క పొగతాగుడు కేన్సరుకి దారితీస్తుందని అప్పటికే బలవత్తరమైన ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ పెద్ద పెద్ద యాక్టర్ల బొమ్మల్తో ఎక్కడ చూసినా సిగరెట్‌ పోస్టర్లు కనిపించటం మీద కూడ చెణుకు విసిరారు.

పేకాట పాటలో నాకు బాగా నచ్చేది, డబ్బంతా పోయిం దని, పేకాట పొరపాటని గ్రహించి ఆ దబ్బుతో ఎన్నెన్ని పన్లు చెయ్యొచ్చో చెప్పుకున్నాక కూడ ఆ వ్యసనం ఎలా ఆశ చూపించి వెనక్కి లాగుతుందో చెప్పే భాగం-

గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు
మళ్ళీ ఆడి గెల్వవచ్చు ఇంకా పెట్టుబడెవడిచ్చు
ఇల్లు కుదువబెట్టవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు
పోతే? అనుభవమ్ము వచ్చు

కొసమెరుపు కొసరాజుగారికే తగింది.

అప్పలాచార్య కేవలం హాస్యగీతాలే రాశారనుకుంటా. నాకు నచ్చినవి మూడు- ఆకాశం నుండి నాకోసం వచ్చావా… (చిమటామ్యూజిక్‌ వారి ప్రకారం ఇది రాసింది ఆరుద్ర. నాకు గుర్తు అప్పలాచార్య అని), వినరా సూరమ్మ కూతురు మొగుడా, దయచూడవే గాడిదా… ఇందులో మొదటిది చాలామంది విని వుండకపోవచ్చు. సినిమా ముగ్గురమ్మాయిలు.

ఆకాశం నుండి నాకోసం వచ్చావా
పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా
నువు పక్కపక్కగా వుంటే నే స్వర్గం దున్నేస్తా
నువు కనపడకుండా పోతే బాల్చీ తన్నేస్తా
నీ జడపిన్ను నా తలరాతకు పెన్ను
నీ సిగపువ్వు – అదేవిటమ్మా – ఆ బుజబుజరేకుల లవ్వు
నీ చిలిపి బిడియం అమృతంలో వండిన వడియం
నీ పెదవులు రెండు నా ముక్కుకు దొండపండ్లు
ఓహో రోజా తెగ ఉక్కిరిబిక్కిరి ఔతున్నాడీ రాజా
నీ లేడికళ్ళు నాకు వేస్తాయి సంకెళ్ళు
నీ లేత ఒళ్ళు చూస్తే నాకు ఎక్కిళ్ళు
నీకు నేను ముద్దులబందీ నన్ను పెట్టకే ఇబ్బంది
నీకంతా చెలగాటం నాకెంతో ఇరకాటం
ఓహో రోజా తెగ ఉక్కిరిబిక్కిరి ఔతున్నాడీ రాజా
అందాల ఓ రామచిలక నేనౌతున్నా నెందుకే తికమక
ఈ దేవదాసు లైలా వేనా ఈ మజునూ పార్వతివేనా
అయ్యో బుల్‌ బుల్‌ నాకెందుకే ఈ ట్రబుల్‌…

ఈ పాట నాకు నచ్చటానికి దీన్ని బాలసుబ్రహ్మణ్యం పాడిన పద్ధతి కూడ ఒక ముఖ్య కారణం. ఇక వింత ప్రాసలు, నీ చిలిపి బిడియం అమృతంలో వండిన వడియం, నీ పెదవులు రెండు నా ముక్కుకు దొండపండ్లు… వంటి ప్రయోగాలు కూడ ఎప్పుడూ చిరునవ్వు రప్పించక మానవు.

ఇల్లు ఇల్లాలు సినిమాలో వినరా సూరమ్మ కూతురు మొగుడా… పాట సుప్రసిద్ధం, పదేపదే చెప్పాల్సిన పని లేదు. ఇలాటి ‘కథాగీతాలు’ మనకి అరుదు.అందునా కేవలం హాస్యం కోసం వున్నది మరో పాట ఇలాటిది లేదు, నాకు తెలిసినంత వరకు.

జాతకరత్న మిడతంభొట్లు సినిమా నుంచి` దయచూడవే గాడిదా… అన్న పాటలో కూడ ఆకాశం నుండి… లాటి లక్షణాలు కొన్నున్నయ్‌. అక్కడక్కడ –

దయచూడవే గాడిదా
పరువుకోసమని నిదుర మానుకుని
వెతికివెతికి వేసారినాను
దొరికితివంటే పెడతా పచ్చనిగడ్డి
దొరకకపోతే విరుగుతుంది నీనడ్డి
ఆహా ఎంతటి తీయనిగానం కోకిలకెక్కిడి దింతటి జ్ఞానం
సింహము కన్నా నీవే నయము
నిన్ను చూసిన కలుగదు భయము
వసుదేవుడు కొలిచిన గార్దభదేవా దొరికావంటే
కొడతా కొబ్బరికాయ…

కలెక్టర్‌ జానకి సినిమా కోసం సినారె రాసిన కుటుంబ నియంత్రణ హరికథ పౌరాణిక సంఘటనని సమకాలీనంగా చెప్తూ నవ్వించటానికి ప్రయత్నించి కొంతవరకు సఫలమౌతుంది.

ప్రసిద్ధమైన పరభాషా గీతాలకి హాస్యానుకరణలు సామా న్యంగా నవ్వు కలిగించవు. ఉదాహరణకి – మంగమ్మా నువు వుతుకుతుంటే అందం, అబ్బ వేశావె బంధం (హం తుం అన్న బాబీ పాటకి అనుసరణ). ముత్యాలూ వస్తావా అడిగింది ఇస్తావా… మరో నాసిరకం హాస్యగీతం.

ఇలా కాకుండా, తెలుగులోనే ప్రసిద్ధమైన పాటలకి రాసిన పేరిడీలు కొన్ని బాగానే వుంటయ్‌. ముఖ్యంగా ఇంటింటి రామాయణం సినిమాలో యంవీఎల్‌ రాసిన మోడరన్‌ హరికథ లో పాత దేవదాసు పాటలకి, తర్వాత వచ్చిన కొన్ని పాటలకి పేరడీలున్నయ్‌. ఉదాహరణకి-

పైబెట్ట లొలిసేసి మెడబట్టి గెంటేస్తే
ఏ దారి లేదాయెను బతుకు గోదారి పాలాయెను
దారే గోదారైతే పొరబాటు లేదోయ్‌ ఓడిపోలేదోయ్‌
(పంచె) ఊడిపోలేదోయ్‌

మందు లేక నిలవలేను మందుగొడితే కదలలేను
వల్లకాడు కుక్కతోడు చీమూనెత్తురులెండెరా
ఈ బొంది మందుతో నిండెరా

ఎరక్కబోయి మొక్కాను ఇరక్కపోయాను
సుతివుంటే మణిసి మణిసౌతాడు మంచోడే ఔతాడు
సుతిదప్పిన మణిసి కరుసౌతాడు మతిలేనోడౌతాడు

మరోరకం హాస్యం పాటలున్నాయి. వీటిని సరసప్పాట లనొచ్చు. అంటే పెళ్ళిళ్ళలోనో ఏదో సరదా సందర్భాల్లోనో ఒకర్నొ కరు సరదాగా ఆటపట్టించుకునేవన్నమాట. మల్లీశ్వరిలో కోతీ బావకి పెళ్ళంట కోవెలతోట విడిదంట… సుపరిచితమే. పెళ్ళిరోజు సినిమా కోసం రాసిన పాట` పెళ్ళివారమండి ఆడపెళ్ళి వారమండి మాబాధ వినేదెవరండి / పెళ్ళివారమండి మగపెళ్ళి వారమండి మా పాట్లు వినేదెవరండి… రెండువైపుల వాళ్ళూ వాళ్ళ బాధల్ని సరదాగా చెప్పుకునేది (వారంలో పెళ్ళి పెట్టుకుని వీళ్ళకీ పాటలే విటనీ, పెళ్ళిళ్ళలో ఆడపెళ్ళీ మగపెళ్ళీ అని వుంటాయా అని కొంటె కోణంగులు పెడర్థాలు తియ్యటానికి వీలున్న పల్లవి కూడ).

1995లో వచ్చిన పెళ్ళిసందడి సినిమా పాట- సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం / తకధిమితకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం…, అప్పట్లో సినీస్టారులున్న ఒక ఫ్లైట్‌ పొలాల్లో ఎమర్జెన్సీ లాండిరగ్‌ చెయ్యటాన్ని ప్రస్తావిస్తూ` పొలము లోపల కుప్పకుప్పలుగ కూలిపోవుటకె ఫ్లైటులున్నవి… అనీ పెళ్ళిళ్ళలో ఆడవాళ్ళ నగలపిచ్చి గురించి` నగలకోసమే మెడలు వున్నవి… అనీ చమత్కారాలు వేస్తుంది. ఇల్లరికంలో నేడు శ్రీవారికి మేమంటే పరాకా / తగని బలే చిరాకా… అనే పాట కూడ ఈ కోవదే.

హీరో హీరోయిన్ల ప్రేమపాటల్లో (అంటే పెళ్ళికి ముందు పాడుకునే వాటిలో) సరదా అరుదు. గత పదిపదిహేనేళ్ళుగా వస్తున్న సినిమాల్లో హీరోహీరోయిన్లకి తప్ప మరెవరికీ పాటలివ్వక పోవటంతో ప్రేమగీతాలు (ఎక్కడన్నా ఎప్పుడన్నా విరహగీతాలు) తప్ప మరోరకం పాట వచ్చే దారి మూసుకు పోయింది. ఎవరన్నా కొత్తరకంగా సినిమా తీద్దామనుకుంటేగాని భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరూ / భర్తగ మారకు బాచిలరూ… అనో, బాటనీ పాఠముంది మేటినీ ఆట వుంది / దేనికో ఓటు చెప్పరా… అనో దశాబ్దానికొకటి కాస్తోకూస్తో సరదాపాటలు దొరుకుతయ్‌.

అదివరకు సినిమాల్లో హాస్య నటీనటుల కోసం ఒక పాటన్నా పెట్టేవాళ్ళు. వాటిల్లో చాలాభాగం పాటల్లో హాస్యం లేక పోయినా ఆ నటీనటుల హావభావాల్తో ఎంతోకొంత నవ్వు తెప్పించటానికి తంటాలు పడేవాళ్ళు. ఇలా నవ్వు తెప్పించే పాటలు ఎప్పుడో ఒకటి- ముఖ్యంగా రేలంగి యుగంలో వచ్చి నవి తప్పితే ఆ తర్వాత బాగా తగ్గిపోయినయ్‌. సువర్ణసుందరి సినిమాలో ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా, పైన చెప్పుకున్న పేకాట, సిగరెట్టు, ఇల్లరికాల పాటలు ఇలాటి వాటికి ఉదాహ రణలు. (రమణారెడ్డి, బాలకృష్ణలాటి బక్కడొక్కల హాస్యనటులు ఆంజనేయుడికి అన్నదమ్ములం భీమసేనుడికి పెద్దకొడుకులం అంటుంటే చూసేవాళ్ళకి నవ్వురాక మానదు.) ఇకపోతే చాలా హాస్యనటుల పాటల్ని సందేశాలివ్వటానికో లోకంతీరుని విమర్శిం చటానికో వాడారు తప్ప ప్రేక్షకులకి నవ్వు తెప్పించటానిక్కాదు.

అప్పుడప్పుడు హాస్యప్పాటలని పేరుపెట్టి రెండర్థాల పాటలు గుప్పించేశారు మన సినీగీతకారులు. ఉదాహరణకి బడిపంతులు సినిమాలో ఓరోరి పిల్లగాడ వగలమారి పిల్లగాడ / నీ ఉరుకులు పరుగులు చూస్తుంటేఉండలేక పోతున్నారా… అనే పాటలో` వెలపటదాపట గిత్తలు రెండు బలిసి వున్నాయి / నీ చెయ్యి తాకితే చెంగుచెంగున ఎగిరే పడతాయి… అని అందరికీ అర్థమయే విధంగానే చెప్పేశారు. రెండర్థాల్నీ బహిరంగంగానే విప్పేశారు.

ఇవన్నీకాక మరోరకమైన హాస్యప్పాటలు కూడ వున్నయ్‌. ఇవి నిజంగా నవ్వించటానికి రాసినవి కావు. అయితే వాటిల్లో రచయిత చేసే చమత్కారాలు విని అవి గ్రహించిన శ్రోతలు వీడి దుంపతెగా, ఎంత గమ్మత్తుగా అన్నాడురా అని చిరునవ్వు నవ్వు కునే వన్నమాట. ముఖ్యంగా సెన్సార్‌వాళ్ళని తికమక పెట్ట టానికి చేసే చమక్కులివి. ఉదాహరణకి। అబ్బనీ తియ్యని దెబ్బ… తీసు కుందాం. వినని వాళ్ళుండరు. సందర్భం తెలీకపోతే బూతుపాటని అపార్థం చేసుకునే అవకాశం లేకపోలేదు. ఆ గండాల్ని దాటాక చరణంలోకి వెళ్తే అక్కడ తగుల్తుంది చిటపట నడుముల ఊపులో / ఒక ఇరుసున వరసలు కలవగా… అని. గుంభనంగా వేసిన ఆ పద గుంఫనలకి చిరునవ్వు మొలవక మానదు వద్దన్నా. ఆరేసుకోబోయి పారేసుకున్నాను… అన్నప్పుడు కూడ నీ ఎత్తు తెలిపింది కొండగాలి… అనటంలో వున్న శ్లేష అనుభవైక వేద్యం.

చివరిమాటలు: నవ్వించే పాటలకోసం నాలుగైదు తరాల తెలుగు సినిమాచరిత్రనంతా తిరగేసినా పట్టుమని పది దొరకటం కష్టం అయింది. ఇక ముందుముందు ఈపాటి కూడా ఉంటా యని నమ్మకం కనపట్టం లేదు. తమిళబాణీల వంకరటింకరలు ఒకవంకా పరభాషా గాయకుల పరిమార్పులు మరోవంకా తెలుగే తెలీని సంగీత దర్శకుల మూకదంచుడు మూడోవంకా కలగలిసి తెలుగు పాటలో తెలుగు మాటల కోసం అస్తినాస్తి విచికిత్సలు చెయ్యాల్సిన పరిస్థితుల్ని కలిగించటంతో ఇప్పుడిక పాటల అర్థాల గురించి విచారించటం శ్రోతల ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. ఈ ఆశావాదాన్ని అంటి పట్టుకుని ముందు ముందూ నవ్వుల విందు చేసే పాటలొస్తాయని ఎదురుచూద్దాం. వేరే దారే వుంది గనక?