ఈ మధ్య తేజా టెలివిజన్లో రాత్రి 11:30 నుండి 12:00 వరకు వచ్చే సినిమా వార్తలు చాలా సార్లు చూసేను. అందులో క్రొత్తగా విడుదల అయిన సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులని, తేజా టీ.వీ. వాళ్ళు, వారి వారి అభిప్రాయాల గురించి అడగటం చూసేను. ప్రతి ఒక్కడూ ఆ సినిమా సూపర్, గ్రేట్, వండర్‌ఫుల్, బ్రహ్మాండంగా ఉంది, పెద్ద హిట్. ఇలాగా అతిగా సూపెర్‌లేటివ్స్‌తో పొగడటం తప్పితే, వందలకొలదీ వెలిబుచ్చిన అభిప్రాయాలలో ఏ ఒక్కటైనా “ఇందులో ఇది బాగాలేదు. అది అసహజంగా ఉంది. ఈ ఘట్టం ఘోరంగా ఉంది, నైతిక విలువలు లేకుండా ఉంది” అని మీకు వినిపించదు. ఇందుకు కారణం ఏమిటి? మన తెలుగు సినిమా చూస్తున్న ప్రేక్షకులకు విచక్షణా జ్ఞానం లేకుండా పోయిందా? లేదా నిజంగా మన తెలుగు సినిమా ఏ మచ్చా లేకుండా వెలిగిపోతున్నాయా? ఇలా ఆలోచిస్తే నాకు వచ్చిన ఆలోచనలివి.
మంచి సినిమా చూడటం అంటే నాకెంతో ఇష్టం. మంచి పాటలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు (సహజమైనవి, కృత్రిమమైనవి కావు), హృదయాలని ఆకట్టుకొనే ఘట్టాలు, గుండెలని కదిలివేసే సన్నివేశాలు ఉంటే, ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నటీనటులు తమ నటనా చాతుర్యాన్ని, అతి సహజంగా ప్రదర్శిస్తే ఆ సినిమా మన హృదయాల్లో ముద్ర వేసుకుకూర్చుంటుంది. ఇతివృత్తం, మన దైనందిక జీవితానికి ప్రతిబింబంగా ఉంటే మన మనస్సుకి, ఒక రకమైన ఊరట కలుగుతుంది. అసలు సినిమా ఎందుకు చూస్తాం? జీవితంలో అనుక్షణం ఎదురవుతున్న ఒడిదుడుకులని ఎదుర్కుంటూ సతమతమవుతున్న మానవుడికి ఒక రకమైన అనుభూతిని కల్గించడానికి. ఆ అనుభూతి తీయగా ఉండవచ్చు. అప్పుడప్పుడు చేదుగా ఉండవచ్చు. లేదా పచ్చి నిజం కళ్ళకు కట్టినట్టు నాట్యం చేయవచ్చు. దానివల్ల మనకి ఒక రకమైన హాయిగాని, శాంతిగాని, ఊరటగాని, లేదా జీవితం ఇంతేలే అన్న నిర్లిప్తత గాని కలగవచ్చు. మంచి సినిమా అంటే మనలోని మానవత్వాన్ని మేలుకొల్పాలి. రాక్షసత్వాన్ని రగిలించగూడదు. లేదా సరదాగా మనస్సులో ఎటువంటి కల్లోలాలు కల్గించకుండా ఉండాలి.
పాత సినిమాలు చూస్తే ఇటువంటి మంచి సినిమాలు చాలా కనిపిస్తాయి. ఉదాహరణకు గుండమ్మ కథ తీసుకోండి. అందులో మంచి పాటలు, హృదయాన్ని ఆకట్టుకునే ఘట్టాలు, నటనా చాతుర్యం, అన్నీ కనిపిస్తాయి. పాటలు వింటే మంచి భాషతో మంచి అర్థంతో, రాగంతో మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి. ప్రయత్నం చేయకుండానే ఆ సినిమా గురించి తలచుకుంటే మనసంతా నవ్వుతో నిండిపోతుంది. బాలచందర్ గారు తీసిన “ఇది కథ కాదు” చూస్తే, గుండెలను పిండివేసే ఉదార ఘట్టాలు ఉన్నప్పటికీ ఆ ఇతివృత్తం, అందులోని పాత్రలు, సన్నివేశాలు, మనస్సుని ఆకట్టుకుంటాయి. అయ్యో పాపం అనిపిస్తుంది. ఆ సినిమా ముగిసిన తరువాత అందులో జయసుధ చేసిన పాత్రవంటి బ్రతుకులతో సతమతమవుతున్న ఆడవాళ్ళకు ఒక రకమైన ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, మనవూరి పాండవులు, స్వర్ణ కమలం, రుద్రవీణ. ఈ సినిమాలన్నీ ప్రబోధాత్మకమైన ఇతివృత్తంతో మనలో ఒక “పాజిటివ్ ఇమోషన్స్” కలిగేటట్టుగా ఉంటాయి. నవ్వులాటగా అయినా క్లాసిగా ఉండే “గోపాలరావు గారి అమ్మాయి” చూడండి. ఎంత హాస్యాస్పదంగా ఉన్నా ఆ సినిమాలో వెకిలి కనిపించదు. “అందాల రాముడు”, “ప్రేమించి చూడు” అంతే! ఎస్. వి. రంగారావు, నాగ భూషణం, గుమ్మడి, సూర్యకాంతం, రమణారెడ్డి, పద్మనాభం, రేలంగి, రాజబాబు వంటి అమోఘమైన నటనా చాతుర్యం ఉన్న నటులు, నటీమణులు ప్రతి సినిమాలోనూ తారసపడుతూ ఉండేవారు.
ఇప్పుడు వచ్చే తెలుగుసినిమాలలో ప్రత్యేకత ఏమిటి? గ్లామరు, గ్లిట్టెరు, బోలెడంత సెక్స్ ఎపీల్. పాటలన్నీ ఒకేలాగే అనిపిస్తాయి. మాట్లాడే వాళ్ళు ఒకేలాగ అనిపిస్తారు అన్ని సినిమాల్లో, డబ్బింగ్ వల్ల. మాటలు అర్థం కావు, పాటలు అర్థం కావు. అర్థం కాని, అర్థం లేని భాష, అర్థం లేని సెంటిమెంట్స్. అన్ని సినిమాల్లో అన్ని డాన్సులు చేసే వాళ్ళ పాత్రలు ఒకలాగే ఉంటాయి. తేడా కనిపించదు.
పూర్వం రోజుల్లో ఏ క్లబ్ డ్యాన్సరు ఒక్కతే అర్ధ నగ్నంగా డాన్స్ చేస్తూ ఉంటే చూడలేక చచ్చేవాళ్ళం. ఇప్పుడు హీరోయిన్లు కూడా అంతకంటే ఘోరమైన దుస్తులతో ప్రత్యక్షం. ఈ సినిమాల్లో R రేటెడ్ దృశ్యాలు అనుక్షణం మనకు ప్రదర్శనం. తెలుగు సినిమా పోర్నోగ్రఫీకి నిలయమై కూర్చుందేమో అని అనుమానం వస్తూవుంటుంది. ఇకపోతే తెలుగు సినిమా అన్నిటికన్నా కొట్టొచ్చినట్టు కనిపించేది హింస, చిత్రహింస. పసివాడని లేదు, ముసలి ముద్దని లేదు, అబల అని లేదు. ఆలోచన లేకుండా కొరడాలతో బెల్టుతో రక్తం చిమ్మేట్టు చిత్రవధ చేయ్యడం. పైరు ఊర్పులకు వాడే కొడవలి లాంటి కత్తితో దారుణంగా బలిపశువును నరికినట్లు మనుష్యులని నరకడం. గుండ్లతో ఉన్న తుపాకీని ఆట వస్తువుగా రెండో ఆలోచన లేకుండా ప్రయోగించడం. పసివాళ్ళు, ఎదుగుతున్న పిల్లలు ఇటువంటి విపరీతమైన హింసా దృశ్యాలు రోజూ చూస్తూ పెరుగుతూ ఉంటే వాళ్ళలో సహనం, కరుణ, దయ, అహింస ఇటువంటివన్నీ ఎలా పుట్టుకుస్తాయి? ఇవన్నీ చూస్తూ ఉంటే మన తెలుగు జాతి ఎంత దిగజారిపోతుందో అన్న బాధ కలుగుతుంది. జీవితం అంటే ఖరీదైన ఇళ్ళలో బ్రతుకుతూ ఖరీదైన బట్టలు, అర్ధ నగ్నంగా కట్టుకొని కారులో తిరుగుతూ బ్రేక్ దేన్స్‌లు చేస్తూ తిరగడం. నచ్చక పోతే కోపం వస్తే వాణ్ణి చావ బాదడం ఇదేనా మన తెలుగు సినిమాలో మనం చూపించగలిగేది?
ఈనాటి తెలుగు సినిమాలో తెలుగుతనం లేదు. తెలుగు సంస్కృతి లేదు. తెలుగు భాషకు ప్రత్యేకత లేదు. తెలుగు స్వరాలకు విలువ లేదు. తెలుగు ఆచార వ్యవహారాలు, పద్ధతులు, వేషభాషలు అన్నీ మరుగునబడ్డాయి. ఈనాటి తెలుగు సినిమాకి ఇంగ్లీష్ సినిమాకి పెద్ద తేడా లేదు. నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ సినిమాలల్లో కంటే మన తెలుగు సినిమాల్లో అన్ని విషయాల్లో వైపరీత్యం ఎక్కువ. మంచి సినిమా అంటే ఉన్నత భావాలను ప్రేరేపించేటట్టు ఉండాలి. కాని ఈ నాటి తెలుగు సినిమా ప్రేరేపించేది చాలా మట్టుకు నీచ భావాలే. మన సినిమా ఇదే ధోరణిలో కొనసాగితే మన సంస్కృతి, భాష, సమాజం దిగజారిపోవడానికి తెలుగు సినిమా ఎంతో కొంత కారణభూతం అని చెప్పక తప్పదు.