ముందు

చెలమ..లో నీరు చేతులతో ఎత్తిపోసినకొద్దీ,

చెమ్మ ఇసుకను విరుస్తూ ఊరతాయి.

విశ్రమించిన గవ్వలు సూర్యరశ్మిని పీలుస్తాయి.

అల్లరిపిల్లల మోకాళ్ళు దోక్కుపోయిన ప్రతిసారి,

దుమ్ముకలిసిన రక్తంతో వలవలా రోదిస్తాయి.

ఎగిరిపోయే చిత్తుకాగితాలు ఎవరినో పలుకరిస్తాయి.

రాత్రీ పగలు పేకముక్కల్లా కలుస్తాయి.

లాంతరు లేని గదులు వెలుతురుతో స్నేహాన్ని కోరుకోవు.

చీపుళ్ళు తెల్లవారగనే పరచిన చలువరాళ్ళ బుగ్గలను నిమురుతాయి

పిచ్చుకలు కాకులు మాత్రం,ప్రయాణం చేసి వచ్చిన బంధువుల్లా

పదే పదే వేకువను పిలుస్తాయి.

ఖాళీ గదులు సంభాషించే స్వరాలకోసం నిరీక్షిస్తాయి

చెప్పులు మాత్రం జతగా జీవిస్తాయి.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...