ముందు చూపు

ఎప్పుడో భవభూతి అన్నాడు “కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృథ్వీ” (కాలం అంతులేనిది. ప్రపంచం విశాలమైనది) అని. దాని అర్థం మార్చి కాలం నిరంతరమైనా క్షణికమైనది, ప్రపంచం విశాలంగా వున్నా అతిచిన్నది అని చూపెట్టారు “ఈ మాట” సంపాదకులు. నిర్దేశక సర్వనామం “ఈ” ఇంగ్లీషులో రాస్తే E, Electronic అనేమాటకి సంక్షిప్తరూపం అవుతుంది. అంచేత “ఈ మాట” కి రెండర్థాలున్నాయి. నెట్‌ మీద ప్రచురించిన మరుక్షణం సర్వప్రపంచానికీ అందుబాటు అవుతుంది కాబట్టి “ఈ మాట”కి దేశకాల పరిమితులు లేవు.

గత మూడున్నర ఏళ్ళుగా ఎల్లలు లేకుండా ప్రపంచంలో ఎక్కడున్నా కంప్యూటర్లు అందుబాటులో వున్న తెలుగువాళ్ళకందరికీ కళ్ళముందు కనిపించే ఈపత్రిక తెలుగుసాహిత్యంలో ఒక కొత్తమలుపుకి నిశ్శబ్దంగా, నిరాడంబరంగా కారణమయిందని నాకు ఇందులో ప్రకటించిన కథల్నీ, కవితల్నీ, వ్యాసాల్నీ ఒకచోట చేర్చి చూస్తేగాని తట్టలేదు. గడియారంలో చిన్నముల్లు కదలికలాగా, ఈమార్పు నిత్యం పత్రిక చూసేటప్పుడు కనిపించదు.

ఇది చిన్నమార్పు కాదనీ, తెలుగుసాహిత్యం వాస్తవంగా బహుళదేశీయతని పొందుతోందనీ, ఆ క్రమంలో తన స్వరూపాన్నీ, స్వభావాన్నీ మార్చుకుంటోందనీ ఇది తెలుగుసాహిత్య చరిత్ర గమనంలో గమనించదగిన మలుపు అనీ నాకు అనిపించిన మాట మీకు వివరించడానికి ఈవ్యాసం రాస్తున్నాను.

అందుకోసం ఈ సంకలనంలో ఉన్న రచయితల రచనల గురించి వేరువేరుగా చెప్పాలి. మరీ ముఖ్యంగా కనకప్రసాద్‌గారు రాసిన కథల గురించి చెప్పాలి. ఈయన తెలుగుకథకి ఒక కొత్త ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టే రచయిత. ఒక అరపేజీలో ఒక కొత్తప్రపంచాన్ని సున్నితంగా, అందులోని అన్ని కదలికల్తోటీ మెలకువగా మనకళ్ళముందు పెట్టగలరు. ఈయన చిత్రించిన మనుషులు మనం ఎరుగున్నట్టే వుంటారు. అయినా కొంచెం కొత్తగా వుంటారు. వాళ్ళ మాటలూ, చేతలూ, నవ్వులూ, నడవడికలూ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. వాళ్ళని కలుసుకోవాలనిపిస్తుంది. వాళ్ళని అలా ఇంకా ఊహించుకుంటూంటే కథ అయిపోతుంది. కాని వాళ్ళింకా మన కళ్ళముందు తచ్చాడుతున్నట్టే ఉంటుంది.

“బర్సాత్‌ మే బిల్లీ” అలాంటి కథ. ఈకథలో వాతావరణం మన్ని మనకి తెలియకుండానే ఆవరించుకుంటుంది. కథలో వర్షం మనం బయటికెళ్తే తడిసిపోతామేమో అన్నంత నిజంగా కురుస్తుంది. ఆ హోటల్‌ మేనేజరూ, వర్షంలో తడుస్తున్న పిల్లిపిల్ల కావాలని మారాం చేసే అమ్మాయీ, ఒరియా మాట్లాడే ఆపనిపిల్లా వాళ్ళు కథలో మనుషుల్లా దూరంగా ఉండరు. మనం కథ చదువుతున్నట్టు జ్ఞాపకం కూడా ఉండదు. అక్కడే, వాళ్ళ ఊళ్ళోనే, వాళ్ళ ఎదురుగానే మనం ఉన్నాం. ఈలోపున కథ అయిపోతుంది. ఈకథలో ఏంజరిగిందని ఎవరేనా అడిగితే ఏంచెప్తాం? ఏజరిగిందో చెప్పడానికి ఒక్క వాక్యం చాలు.

రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు “వర్షం” అని ఒక కథ రాసారు, ఆయన మార్క్సిస్టు కాకముందు. ఆకథా ఇలాంటిదే. కాని రావిశాస్త్రిగారి కథకన్నా తేలిగ్గా ఉంటుంది కనకప్రసాద్‌గారి కథ. అంతబరువైన మానసికగాఢతని మొయ్యాల్సినపని పెట్టుకోనక్కర్లేదు కనకప్రసాద్‌గారి ప్రపంచం.

కనకప్రసాద్‌గారి కథలన్నిట్లోనూ ఈ ప్రాణలక్షణం వుంది. అవి ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లూ కొత్తగానే వుంటాయి. ముగింపులో ఆశ్చర్యాలూ, కథలో మలుపులూ, గొప్ప సామాజిక సందేశాలూ ఇవే వాటిలో వుంటే అవి రెండోసారి చదవాల్సిన అవసరం వుండేది కాదు; చదివితే చప్పబడేవి కూడా. “పశ్చింగోదావరి జిల్లా తణుకుతాలూకా…” మరోసారి చదివిచూడండి. ఆకథలో లాగా ఒక వాతావరణాన్ని, నిజం మనుషుల్ని ఇతర బరువులు, బాదరబందీలు లేకుండా రాయగలవాళ్ళు ఏభాషలోనేనా తక్కువమందే వుంటారు.

కనకప్రసాద్‌గారి లాగా మాటల్ని వాటి వర్ణక్రమాల బరువునించి తప్పించి అచ్చంగా పలికించగలవాళ్ళు తెలుగులో ఇంకెవరున్నారా అనిచూస్తే మళ్ళా రావిశాస్త్రిగారూ, గురజాడ అప్పారావుగారే కనిపిస్తారు. కాని వాళ్ళకున్న సామాజికబాధ్యత కనకప్రసాద్‌గారు పెట్టుకోరు. అతని ప్రపంచానికి ఉన్నదున్నట్టుగా ఉండడమే గొప్ప. ఆసంగతి సునాయాసంగా చెప్పడం గొప్పవిషయం సుమా అని ఆయన కథలు చదివేదాకా నాకు బోధపడలేదు.

కనకప్రసాద్‌గారితో ఫోన్‌లో మాట్లాడడమే కాని, మనిషినెప్పుడూ చూడలేదు. ఆయన కథలు రాసేపద్ధతి నేను ఉబ్బితబ్బిబ్బై పోయేటంత గొప్పదని ఆయన్ని కలుసుకుని చెప్పాలని వుంది. ఆయన కథలకి ఆంగ్లమూలాలు నిజంగా అక్కర్లేదని కూడా చెప్పాలని వుంది.

కె.వి.ఎస్‌. రామారావుగారు రాసిన రెండు కథలూ “పందెం ఎలకలు”, “ప్రతీకారం” పూర్తిగా ఇంకో తరహాకి చెందుతాయి. ఇందులో వాతావరణం, మనుషుల మనస్తత్వం, అసలు ఇది మనుష్యప్రపంచమేనా, వీళ్ళు నిజంగా మనుషులేనా అన్నంత అలజడి కలిగిస్తాయి. వీటిలో “ప్రతీకారం” మరీ బరువైన కథ. ఇంకా ఎవరికేనా తెలుగుతనం, భారతీయజీవనసంస్కారం ఇలాంటి అమాయికమైన నమ్మకాలుంటే, ఆనమ్మకాలని నిర్దాక్షిణ్యంగా చితక్కొట్టేస్తుందీ కథ. మనుషులు డబ్బులో కలిసిపోయినప్పుడు వాళ్ళకి దేశకాలసంస్కృతుల తేడాలుండవని కొంచెం క్రూరంగానే బోధిస్తుందీ కథ. కాని, కథలో బలం ఈసందేశం కాదు. మనుషులు కొన్ని పరిస్థితుల్లో ఎలా మనుషులు కాకుండా పోతారో చెప్పే సందర్భం. రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు చిత్రిస్తున్నాననుకుని చిత్రించలేకపోయిన మనుష్యారణ్యం ఈకథలో కనిపిస్తుంది. ఎవరూ ఎవరికీ పట్టని, ఎవరూ ఎవరికీ తోడురాని ఈలోకంలో యంత్రాలూ, లెక్కలూ, మార్కెట్లూ, కంప్యూటర్లూ ప్రపంచాన్ని ఆక్రమించుకుంటే, డబ్బు ఆవేశంగా మార్పు చెందితే, ఎం జరుగుతుందో ఈకథ చెపుతుంది. ఇలాంటి కథ తెలుగు వాతావరణం నించి, తెలుగుదేశం నించి వొచ్చే అవకాశం లేదు. అందుచేత కావాలంటే ఇది డయోస్పోరా కథ అనొచ్చు. కాని ఈకథకి అలాంటి ఎల్లలు వున్నాయని నాకనిపించదు. పైగా, మధురాంతకం రాజారాం గారి కథలు చదివి మనస్సూ కళ్ళూ తడిచేసుకునేవాళ్ళకి ఈకథ చాలా దూరంగా ఉంటుంది.

“క్లబ్బులో చెట్టు కథ”లో వేలూరి వేంకటేశ్వరరావుగారు చూపిన వాతావరణం నాకు చిన్నప్పటినించీ పరిచయం. ఆకథలో పాత జ్ఞాపకాలని “నాస్టాల్జియా” అంటారు ఇంగ్లీషులో. కాని అదే ఈకథకి బలం అయితే చాలా బలహీనమైనకథ అయ్యేది ఇది. ఇందులో వున్న హాస్యం కథనీ దాని అర్థాన్నీ గడుసుగా మార్చి ఆవాతావరణాన్ని ఏ సరిహద్దులూ లేని మానవజీవితంతో ముడిపెడుతుంది. ఇస్మాయిల్‌గారి పద్యాన్ని ఒడుపుగా వాడుకుని ఈకథలో మనుషులందర్నీ మనతోపాటు నవ్విస్తుంది.

వేంకటేశ్వరరావుగారి కథలాగే పాత జ్ఞాపకాలని సున్నితమైన హాస్యంతో చెప్పిన కథ మాచిరాజు సావిత్రిగారి “తరవాణికేంద్రం”. దేశాలు మారాక వొచ్చే జ్ఞాపకాల దొంతర్లని గురించి ఈవిడ చెప్పేతీరులో మాటలతో ఆటలాడుకునే సరదాతనం వుంది. కథని మరీ బరువుగా కుంగదియ్యకుండా సుతారంగా చెప్పే ఒక ప్రాపంచికదృక్పథం వుంది. ఇది ఏదేశం నించి వొచ్చినా, ఆదేశపు చీటీ అక్కరలేని రచన.

చంద్ర కన్నెగంటిగారు రాసిన “మా అమ్మగదే”, అక్కిరాజు భట్టిప్రోలుగారు రాసిన “డాట్కామ్‌ మాయోపశమన వ్రతము” ఈరెండూ పైకి అలా కనిపించకపోయినా, చాలా పోలికలున్న రచనలు. ఒకటి చాలా సీరియస్‌గా రాసింది. రెండోది సుభ్భరంగా నవ్వుటాలకి రాసింది. కాని ఈరెండిట్లోనూ అంతర్లీనంగా ఒక వైపరీత్యం వుంది. చంద్ర కన్నెగంటి గారి కథ బరువుగా కనిపిస్తూ తేలికతనాన్ని దాచుకుంటుంది. అక్కిరాజు భట్టిప్రోలు గారి కథ తేలికగా కనిపిస్తూ బరువుని కప్పేస్తుంది.

ఇందులో కథలన్నీ ఉత్సాహంతో చదివిస్తాయి. కాని వెన్నెలకంటి వసంతసేనగారి కథ ఉత్కంఠతో చదివిస్తుంది. ఈవిడ రాసిన ” అనగనగా ఒక జైలు”లో బలం కథాచట్రానిది. ఈకథలో సందర్భాలు చెప్పకుండా మనస్సులో ఊహల్లాగా మారిపోతాయి. ఒక్క క్షణం సంబాళించుకుని మరోసారి వెనక్కి వెళ్ళి చదువుకోవాలి. ప్రతివాక్యం జాగ్రత్తగా రాసిన కథ ఇది. కథ అంతా చదివాక చివరిమలుపు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఓ హెన్రీ కథల్లో లాగ. అప్పుడు ఒక్కసారి కథలో ముందు చదివిన విశేషాలు మళ్ళా చూస్తే వాటి అర్థాలు చటుక్కున మారిపోయి కనిపిస్తాయి. ఈకథ బలం అంతా కథాచట్రానిదే అన్నాను కదా. ఈకథలో మనుషులూ, వాతావరణం ఏదేశానివైనా కావొచ్చు. అంచేత ఇది ఎవరికథో చెప్పడం కష్టం. ఒక రకంగా ఇది కథనబలం వల్ల నడిచే కథ. అంచేత కథనం అయిపోగానే అయిపోయే కథ కూడా.

ఈసంకలనంలో ప్రతికథ గురించీ ఏదో ఒక మాట చెప్పాలని నా ఉద్దేశం కాదు కాని, కలశపూడి శ్రీనివాసరావు గారి కథని గురించి నా అభిప్రాయం చెప్పాలి. ఈయన రాసిన “సంకల్పం” చదివి నేను చాలా కలవరపడ్డాను. కన్నీళ్ళు తెప్పించే కథలంటే నాకు వల్లమాలిన అపనమ్మకం. అవి నా సాహిత్యస్వేచ్ఛని దురాక్రమణ చేస్తున్నాయని నాకు అలాంటి కథల పట్ల ఒక అసహనం. మోతాదుకు మించిన కృతజ్ఞత చాలా భయంకరమైన బలహీనత అనీ, అది మనిషిని కొల్లగొట్టి గతానికి బానిసగా చేస్తుందనీ నేను పట్టుదలగా అనుకుంటాను. అంచేత శ్రీనివాసరావు గారి కథని చాలా జాగ్రత్తగా చదవాల్సి వొచ్చింది. చాలా పకడ్బందీగా చెప్పిన ఈకథలో శ్రీనివాసరావు గారు పైకి కనిపించేలా ఏర్పాటు చేసిన కథాచట్రంలో ఇరుక్కుపోకుండా పాఠకులు బయటికి రావడానికి కథలోనే ఇంకో దారి వుంది. పాఠకులు దాన్ని గమనించకపోతే ఈకథలో పడి కొట్టుకుపోతారు.

ఇంక కవిత్వం సంగతి. చాలాకాలం తరవాత మొదటిసారిగా కవిత్వం రాయడంలో సంతోషం కోసం రాసిన పద్యాలు చదివాననిపించింది ఈసంకలంలో పద్యాలు చదివాక. ఇందులో కవిత్వం రాసిన కవులందరికీ పద్యనిర్మాణం మీద వున్న శ్రద్ధ, మాటలు కూర్చడంలో వున్న మెలకువ నాకు మరీ నచ్చాయి.

నందివాడ ఉదయ్‌ భాస్కర్‌గారి “రోజూ చూస్తున్న దృశ్యమే” అన్న పద్యంలో పొడుగూతా ఒక గ్రెనేడ్‌లో దట్టించినంత మందుగుండు దట్టించారు. చివరి మూడులైన్లూ ముగించి, “నీలిమేఘాలు” తెలుగు స్త్రీవాదులు ప్రచురించిన కవితాసంకలనం అని గుర్తుకు తెచ్చుకునే సరికి ఆ గ్రెనేడ్‌ ఢామ్మని మొగమొహం మీద పేలుతుంది. కాని పద్యం మాత్రం అలవోకగా, ఇది పద్యం కాదు ఏదో రోజువారీ పనులజాబితా అన్నంత సునాయాసంగా నడిచిన కారణం చేత ఆ గ్రెనేడ్‌ పేలిన చప్పుడు గుట్టుచప్పుడు కానంత నిశ్శబ్దంగా ఉంటుంది.

విన్నకోట రవిశంకర్‌, తమ్మినేని యదుకుల భూషణ్‌గార్లు సందేశపు బరువులు లేని పద్యం రాస్తారు. కొంచెమో గొప్పో హృదయం కదలకపోతే ఎలా అని కాబోలు (ఉదాహరణకి చంద్ర కన్నెగంటి “ఊరుకోలేక…”, విన్నకోట రవిశంకర్‌ ” ఒంటరితనం”) రాసిన పద్యాలూ ఉన్నాయి. అయితే అవి కంట తడి పెట్టించేటంత బరువైనవి కాదు కాబట్టి వాటిలో కవిత్వం నీరసపడలేదు. చంద్ర కన్నెగంటి గారి పద్యం “మృత్యువుతో తొలిపరిచయం” బోలెడు చుక్కలతో నింపిన జాగాలతో మనని చటుక్కున పిల్లలప్రపంచానికి తీసికెళ్ళి బతికిస్తుంది. ఏమీ చెప్పినట్టు కనిపించకుండా ముగిసే ఈపద్యం అసలు పద్యమని గుర్తించడానికి కొంచెం ధైర్యం కావాలి.

ఈ కవులందర్లోనూ, ముఖ్యంగా ప్రత్యక్షంగా తమ్మినేని యదుకుల భూషణ్‌గారిలో ఇస్మాయిల్‌ తెలుగుభాషకీ, తెలుగుకవిత్వానికీ చేసిన ఉపకారపు పెట్టుబడి వడ్డీతో పెరిగి మనకి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు పట్టిందా తెలుగుకవులు ఇస్మాయిల్‌ వల్ల లాభం పొందడానికి అని అనిపించినా, ఇన్నాళ్ళకేనా, ఇంతదూరం జరిగాకనైనా ఆఫలితాలు కనిపించడం తెలుగుభాషలో కవిత్వం చచ్చిపోదనడానికి గుర్తు.

వాదాలతో, నినాదాలతో, రాజకీయాలతో, సిద్ధాంతపు పడికట్టు మాటలతో, పద్యం ఎలా కట్టాలో, ఎక్కడ ఆపాలో కొంచెంపాటు కూడా తెలియని రోకలిబండ వచనపద్యాలతో తెలుగుభాష విసిగిపోయింది. ఇప్పుడిప్పుడే అక్కడా ఇక్కడా కవులు కనిపిస్తున్నారు తెలుగుదేశంలో కూడా పద్యం మీద శ్రద్ధ వున్న వాళ్ళు. వాళ్ళు ఉత్సాహపడతారు ఈసంకలనంలో పద్యాలు చదివి.

ఆధునికకవిత్వంలో చందోబద్ధపద్యం పేరడీకి బాగా పనికొస్తుందని గుర్తించిన వాళ్ళు పాతరోజుల్లో మాచిరాజు దేవీప్రసాద్‌, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి. ఆసంగతి వచనపద్యం వచ్చాక తెలుగులో మరుగుపడిపోయి పద్యాన్ని మళ్ళా ఆధునికకవిత్వంలో సీరియస్‌గా నిలబెట్టాలని కొందరూ, అది చచ్చిపోయింది, దాన్ని పునరుద్ధరించలేమని మరికొందరూ రకరకాల వివాదాలు పడి, అవికూడా సమసిపోయిన నేపథ్యంలో కె.వి.ఎస్‌. రామారావుగారు పద్యాన్ని పేరడీగా ఉద్ధరించారు. పేరడీ చేసేపని మూలాన్ని ఆసరాచేసుకుని హాస్యం కల్పించడం మాత్రమే కాదు, అసలు మూలాన్నే హేళన చెయ్యడం. రామారావుగారి పేరడీ చదివాక జాషువా పద్యాలు మళ్ళా చదివి చూడండి. అవి విషాదంగా ఉండడం మానేసి నవ్వు తెప్పిస్తాయి. మూలానికీ పేరడీకి వున్న సంబంధం విలక్షణమయినది. ఒకసారి పేరడీ వొచ్చాక మూలం మూలంగా బతకలేదు. అయితే కొన్ని రకాల మూలాలకే ఈసాంక్రామిక లక్షణం వర్తిస్తుంది. నిజానికి అవే పేరడీకి అనువైన పద్యాలు కూడా. ఈసంగతి తెలుగుసాహిత్యంలో చాలాసార్లు రుజువైనా విమర్శకుల దృష్టికి వెళ్ళలేదు. వైతాళికులు లో ప్రేమ పద్యాలకి వొచ్చిన పేరడీలూ, వాటి మూలాలూ జ్ఞాపకం వున్నవాళ్ళకి ఈవిషయం అనుభవంలో వున్నదే.

పవనవీచికలందలి పరిమళమ్ము
మధుర చంద్రాతపములోని మార్దవమ్ము
మంజుల సుమామృతములోని మధురిమమ్ము
కలవు గోపాల! నీ వేణుగానమందు

అన్న వేదుల సత్యనారాయణ గారి పద్యాన్ని మాచిరాజు దేవీప్రసాద్‌గారు పేరడీ చేస్తూ, ఆపద్యం లోని మొదటి మూడు పాదాలూ అలాగే వుంచి చివరిపాదాన్ని
“కలవు బుచ్చమ్మ! నీ పచ్చిపులుసునందు”
అని మార్చారు.

అలాగే, నాయని సుబ్బారావుగారి

ఎవ్వడా విరసాత్మకుండెవడు సాంధ్య
రాగమంజుల రేఖా విరాజమాన
మంగళాకాశ సీమంత రంగమందు
కారుచీకట్ల రాసులు గ్రక్కినాడు

అనే పద్యానికి

ఎవ్వడా విరసాత్మకుండెవడు నా ప్రి
యా వియోగాన నే లిఖియించుకున్న
రమ్య ప్రణయినీ రూప చిత్రమ్ము పైని
నిండు నీల్‌కాలు బుడ్డి తన్నేసినాడు

అని పేరడీ చేసారు మాచిరాజు దేవీప్రసాద్‌ గారు. ఇప్పుడు ఆ మూలపద్యాలని పేరడీ జ్ఞాపకం వచ్చి నవ్వకుండా చదవలేం.

కాని శ్రీశ్రీ రాసిన “దేశచరిత్రలు” పేరడీ చేస్తూ “ఏదేశ చరిత్ర చూసినా / ఏమున్నది గర్వకారణం / నరజాతిచరిత్ర సమస్తం / పరపీడన పరాయణత్వం” అన్న పంక్తుల్ని మార్చి, “ఏరోడ్డు చరిత్ర చూసినా / ఏమున్నది గర్వకారణం / ప్రతిరోడ్డు చరిత్ర సమస్తం / పైజమాలు పాడుచేయడం” అని రాసారు దేవీప్రసాద్‌గారు. కాని ఈపేరడీ వచ్చినా, కవిత్వం జ్ఞాపకం వుండే వాళ్ళకి కూడా శ్రీశ్రీ పద్యం చదువుతూండగా పనిగట్టుకుని ప్రయత్నిస్తే కాని ఈపేరడీ గుర్తుకు రాదు. అంటే పేరడీ వచ్చినా శ్రీశ్రీ మూలం చెక్కుచెదరలేదు. పేరడీకి, మూలానికీ గల సంబంధం మూలాన్ని బట్టి నిర్ణయించాలనుకుంటాను. కొన్ని పద్యాలు పేరడీ కావు. కొన్ని అవుతాయి. కొన్ని మరీ సుళువుగా ఔతాయి. సుళువుగా పేరడీ అయే పద్యాలే పేరడీతో పాటు మారతాయి కూడా. ఈ ఆలోచనలకి బోలెడు అవకాశం ఇచ్చి ఇంకా ఇందులో విమర్శకులు చెయ్యాల్సిన పని చాలా వుందని సూచిస్తూ, జాషువా పద్యాలు పేరడీకి అనువైనవని గుర్తించిన రామారావుగారి గడుసుతనం మెచ్చుకోదగ్గది.

చివరగా ఈసంకలనంలో విశేషం సాహిత్యవిమర్శ ముఖ్యంగా విన్నకోట రవిశంకర్‌ గారు కవిత్వీకరణ గురించి రాసిన వ్యాసం. కవిత్వం చెయ్యడంలో వున్న మెలకువలని గురించి కవులు మాట్లాడడం, రాయడం తెలుగులో భావకవిత్వపు రోజులతో ఆగిపోయింది. ఆతరవాత విమర్శకులనే వాళ్ళు వేరే తయారయి సామాజిక, రాజకీయ సిద్ధాంతాలు వల్లించి అదొక్కటే కవిత్వపరమార్థం అనే స్థితి తీసుకొచ్చారు. పద్యంలో ఒడుపూ, కూర్పూ, ముగింపూ ఇలాంటివి ఎలా చర్చించాలో తెలిసి మాట్లాడగలవాళ్ళు కరువయ్యారు. దానికి తోడు అవి చర్చించడం తప్పు అనే వాదం కూడా మొదలయ్యింది. పద్యాన్ని పద్యంగా చర్చించడంలో కొన్ని పద్ధతులు అనుసరిస్తూ రకరకాల పద్యాల్ని గురించి నేను చేసిన పరిశీలనలు గాని, తరవాత చేకూరి రామారావుగారు చేరాతల్లో భాషానిర్మాణ మార్గాలలో పద్యాల్ని చూసిన తీరు గాని అనుసరించి కొనసాగించే దృష్టి విమర్శకుల్లో ఏర్పడలేదు. కవులు పద్యాలు ఎవరికి వాళ్ళు రాసి విమర్శకులు వాటిని మెచ్చుకుంటారని ఎదురుచూడ్డం, కొంతమంది తమకు అనుకూలంగా రాసే విమర్శకుల్ని (పొగిడేవాళ్ళని అన్నమాట) కవులే చేరదియ్యడం ఇలాంటి విచిత్ర వాతావరణం క్రమంగా ఏర్పడింది.

కవులు ఒకరి పద్యాలని గురించి మరొకరు మాట్లాడడం, అందులో విశేషాలు చర్చించుకోవడం రాతల్లో ఎలాగూ లేదు, మాటల్లో కూడా తగ్గిపోయింది. కవిత్వంలో ఒడుపుల్ని గురించి కవిచెప్పే రకమయిన మాటలు విమర్శకుల ఆలోచనా విధానాల కన్నా భిన్నంగా వుంటాయి. ఒక కొత్తరకమైన కవిత్వం వొచ్చే రోజుల్లో ఆకవిత్వం రాసే కవులే దాన్ని గురించి పాఠకులకి ఆసక్తి కలిగించి తమ పద్యాలు ఎలా చదవాలో చెప్పాలి. కవులు ఒకరికొకరు తోడుగా ఉంటే వాళ్ళ దృష్టి కవితానిర్మాణం మీద పదునుగా పనిచేస్తుంది. ఈపరిస్థితి తెలుగుసాహిత్య రంగంలో మళ్ళా వొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు గుర్తు విన్నకోట రవిశంకర్‌గారి వ్యాసం. ఆయన తన వ్యాసంలో తనతోటి కవుల పద్యాలు తన ఊహలకి ఉదాహరణలుగా చూపించడం ఒక కొత్త కవిసమాజం, అభిరుచుల వల్ల కలిసిన కవులబృందం ఏర్పడడానికి సూచకమని నానమ్మకం. ఈరకమైన కవిమిత్రబృందానికి దేశాల ఎల్లలు కాని, దూరాల పరిమితులు కాని అక్కర్లేని రోజుల్లో ఈవ్యాసం రావడం ఇంకా విశేషం.

ఈసంకలనంలో అన్నీ ఒకే ఉత్తమస్థాయి రచనలున్నాయని నేను అనను. కాని వీటన్నిటికీ ఒక అచ్చమైన సాహిత్యవాతావరణమూ, ఒక ఆరోగ్యకరమైన సాహిత్యబలమూ వున్నాయి.
2

తెలుగుప్రాంతంలో పుట్టిపెరిగిన వాళ్ళు దూరప్రాంతాలకి పోయి కథలూ, కవిత్వమూ రాయడం కొత్తకాదు. ఆకథల్లో కవిత్వాల్లో ఆయా ప్రాంతాల వాతావరణం, మనుషులూ తెలుగు ఆలోచనలతో కలిసి కనిపించడం మనం ఎరుగుదుం. కాని “ఈ మాట” వల్ల వస్తూన్న మార్పు అలాంటిదిలా కనిపించదు. ఇదికాక, తెలుగువాళ్ళు అమెరికా వెళ్ళి, అక్కడ కుటుంబాలతో స్థిరపడి రచయితలూ, కవులుగా తయారయి చేసిన సాహిత్యం “డయోస్పోరా సాహిత్యం” అనే కొత్త విభాగంగా తయారౌతోందని వేలూరి వేంకటేశ్వర్రావుగారు అంటున్నారు. ఈ డయోస్పోరా రచయితలు అమెరికా వెళ్ళకముందు రచనలు చెయ్యలేదు. వాళ్ళు అమెరికా వెళ్ళకపోతే బహుశా తెలుగులో రచయితలు అయివుండేవారు కాదు. వాళ్ళలో అంతర్గతంగా వున్న రచనాశక్తి విదేశీజీవనం వల్ల ఉద్బుద్ధమై వాళ్ళని రచయితలుగా తీర్చిదిద్దిందని వేంకటేశ్వర్రావుగారి సిద్ధాంతం.

గత నాలుగేళ్ళలో అట్లాంటా, చికాగోలలో జరిగిన రెండు సాహిత్య సదస్సులు డయోస్పోరా రచయితలకి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, నిబ్బరం కల్పించాయి, నిజమే. వంగూరి ఫౌండేషన్‌ వారు అమెరికా తెలుగుకథ సంపుటులు ప్రచురించడం, ఆవరసలో కొత్తసంపుటం తెలుగుదేశంలో చాలా వూళ్ళలో ఆవిష్కరించబోవడం, ఇప్పుడు డల్లాస్‌లో జరుగుతున్న ఆటా సభల్లో సాహిత్యసదస్సులో డయోస్పోరా భావం ప్రధానవృత్తం కావడం ఈసంఘటనలన్నీ అమెరికాలో స్థిరపడిన తెలుగువారి సాంస్కృతికస్థైర్యాన్ని బలంగా ప్రకటిస్తున్నాయి. దూరదేశంలో వున్న తెలుగువారి ఉత్సాహసామర్య్థాలు తెలుగువాళ్ళందరూ తమకున్న సహజ భాషాగర్వంతో ఆహ్వానిస్తారు. దేశం మారినా, తెలుగుతనం పోదనీ, అది మరోకొత్త వేషంలో తెలుగుతనాన్ని వృద్ధిచేస్తుందనీ సంతోషించి గౌరవిస్తారు.

ఈసంకలనంలో సంపాదకులు తమ పత్రికలోంచి ఎంచిన రచనల్ని చూస్తే ఇవి అలాటి డయోస్పోరా కోవకి చెందినవిలా కనిపించవు. ఇందులోని రచయితలు చాలామంది అమెరికాలో ఉన్నవాళ్ళే అయినా, అందరూ కారు. తెలుగుదేశంలో వున్న తెలుగువాళ్ళూ, ఏప్రదేశంలో వున్నారో ఆచూకీ ఇవ్వని రచయితలూ కూడా ఇందులో వున్నారు. రచయిత నివాసస్థానాన్ని కాస్సేపు అటుంచి ఈ రచనలు చదివితే ఇవి దేశకాలపరిమితుల్ని దాటిన ఒక ఆకాశవాతావరణంలో ప్రవర్తించే రచనల్లా కనిపిస్తాయి. ఎక్కడున్నాయన్న ప్రశ్నతో నిమిత్తం లేకుండా సాహిత్యంగా ఉండడమే ఒక లక్షణంగా నిలిచే రచనలు ఇవి.

ఇవి రాసినవాళ్ళు ఏ పరిమితులూ, షరతులూ, విశేషణాలూ అక్కర్లేని కవులూ, రచయితలూ. అమెరికా నించి రాసేరు కాబట్టో, అండమాన్‌ నుంచి రాసేరు కాబట్టో కాకుండా, నిర్నిబద్ధంగా వీళ్ళు కవులూ, రచయితలూ.

అయితే, రచన అనేది వస్తుతః దేశకాలసంబంధి; పరమార్థతః విశ్వకుతూహలి. ఏరచనకేనా అందులో వస్తువు ఏదో ఒక నిశ్చితకాలానికి, ఒక నిశ్చితప్రాంతానికి సంబంధించి, ఆకాలపు, ఆప్రాంతపు మనుషులు, మాటలు, ఊహలు, వాతావరణం చెప్పేదిగా ఉంటుంది. అలా తప్ప మరోదారి భౌతికంగా ఏరచనకీ ఉండదు. కాళిదాసు రచనల్లో ప్రాచీనభారత వాతావరణం, షేక్స్పియర్‌ రచనల్లో ఎలిజబెత్‌ రాణీగారి రోజుల ప్రపంచం, టాల్‌స్టాయి రచనల్లో పందొమ్మిదో శతాబ్దినాటి రష్యన్‌ ప్రపంచం, విశ్వనాథ సత్యనారాయణగారి రచనల్లో ఇరవయ్యో శతాబ్ది తెలుగుజీవితాన్ని ఆయన చూసిన తీరూ కనిపించక తప్పవు. కాని, ఆరచయితల సాహిత్యకృతులు ఆప్రాంతాలకే, ఆకాలాలకే పరిమితం కాకపోవడం ఎంచేతంటే వాటిలో సర్వప్రపంచానికీ తనదిగా కనిపించే ఒక విశేషం వుండడం. ఉదాహరణలు పెద్దవి. ఈ సంకలనంలో రచనలు ఇంత గొప్ప సాహిత్యస్థాయికి చెందినవని చెప్పడం కాదు నా అభిమతం. ప్రపంచస్థాయికి చెందిన రచనలలో వున్న మానవేతిహాస విశేషం ఈ రచనల్లో ముఖ్యంగా ఇందులో వున్న మంచివాటిలో స్పష్టంగా గుర్తించొచ్చు అని ప్రకటించడమే ఈ ఉదాహరణలివ్వడంలో నా ఉద్దేశం.

ఈ లక్షణానికి విశ్వజనీనతాగుణం అని పేరుపెడతారు విమర్శకులు. ఈగుణం గురించే ఆలంకారికులు కావ్యం త్రికాలాబాధితమని మన్ని బోలెడు పడికట్టుపదాలతో విసిగించారు కూడా. శక్తిమంతులు కాని రచయితలు ఆరునూరైనా గొప్పరచనలు చెయ్యలేరని, శక్తిమంతులైన వాళ్ళు తమ కాలానికీ, దేశానికీ పరిమితులైనా కూడా అనివార్యంగా వాళ్ళ రచనల్లో విశ్వజనీనతాగుణం వుంటుందనీ మనకి చాలాసార్లు విమర్శకులు చెప్పారు. మళ్ళీ పెద్ద ఉదాహరణలు చెప్పాలంటే షేక్స్పియర్‌ తనకాలంలోని ప్రేక్షకుల కోసమే, వాళ్ళ అభిరుచులూ, ప్రేమలూ, ద్వేషాలూ ప్రకటించే నాటకాలే రాసినా, అతని శక్తి కాలాతీతమయినది కాబట్టి అతని రచనలు కాలం గడిచిన కొద్దీ దేశాలు మారిన కొద్దీ ఇంకా గొప్పగా కనిపిస్తున్నాయనీ మనకి చాలామంది చెప్పారు. ఈమాటే గురజాడకి అన్వయించొచ్చు కూడా. తనకాలంలోని కన్యాశుల్కసమస్య, సానివాళ్ళ సమస్యా, మనకాలంలో లేవు కాని మనకి కన్యాశుల్కం ఇప్పటికీ బాగుంటుంది.

సరిగ్గా ఈభావాన్నే మరికాస్త పొడిగించి అసలు ఏరచయిత అయినా తన కాలపు సమస్యల్నే రాయాలనీ, తనది కాలాతీతరచన కావాలనే ఉద్దేశంతో రాస్తే అది ఏకాలానికీ రచన కాకుండా పోతుందనీ అన్న వాళ్ళున్నారు. ఆధునిక తెలుగుసాహిత్యంలో నిబద్ధసాహిత్యవాదులు ఈవాదనకి మరోమెలిక పెట్టారు. పీడితప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకోకపోతే అసలు అది సాహిత్యమే కాదనీ, రచయితకి సామాజికచైతన్యం కావాలనీ వాళ్ళు చాలామంది రచయితలచేత ఒప్పించారు. ఈభావాలు ఒప్పుకున్నవాళ్ళకి పందొమ్మిదో శతాబ్దానికి ముందువచ్చిన ప్రబంధకవిత్వం వొళ్ళుబలిసిన రాజుల కామతృప్తికోసం వాళ్ళ ఊడిగపుకవులు చేసిన స్త్రీ శరీరాంగవర్ణనలు తప్ప మరేమీ కాకుండా పోవడమూ, విశ్వనాథ సత్యనారాయణగారి లాంటి వాళ్ళ రచనలు ఫ్యూడల్‌ భావాల అవశేషాలుగా కనిపించడమూ మనం ఎరుగుదుం.

ఈ సామాజికచైతన్యదృష్టి బలపడి విప్లవవాద, స్త్రీవాద, దళితవాద, మైనారిటీవాద దృక్పథాలతో కవిత్వాలు, కథలు రావడమూ, ఏదో ఒక పురోగమనదృక్పథం ఉంటేతప్ప కవిత్వం కాకపోవడంతో పాటు, అలాంటి దృక్పథం వుంటే చాలు కవిత్వం అయిపోతుందనే దృష్టి ఏర్పడడమూ పరిణామక్రమంలా కనిపిస్తోంది. దాని ఫలితంగా గొప్ప శక్తిగల కవులూ, రచయితలూ కూడా చవకబారు నినాదాల కవిత్వమూ, కథలూ రాయడం ఈమధ్యకాలంలో తెలుగులో తరుచుగా జరిగింది. ఈ ప్రభావంతోనే శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి, కాళీపట్నం రామారావు లాంటి ఉద్దండులు కూడా నేలబారు రచనలు చేసారని వాళ్ళ భక్తులు ఒప్పుకోకపోయినా మిగతావాళ్ళు ఒప్పుకుంటారు.

ఇలాంటిభావాల ప్రభావం అంటే సాహిత్యం సామాజికప్రయోజనాన్ని నెరవేర్చాలనే తరహా భావాల ప్రభావం అమెరికానించి రాస్తున్న డయోస్పోరా రచనల్లో కూడా కనిపిస్తుంది. తెలుగుదేశాన్నీ, భారతదేశాన్నీ ఉద్ధరించాలనే సేవాదృష్టీ, తెలుగుదేశం వొదిలివొచ్చిన కుటుంబాల సమస్యల్ని పరిష్కారదృష్య్టా చిత్రించాలనే పురోగామి దృక్పథం, అమెరికాలో వ్యాపారనాగరికతని విమర్శించే భారతీయకాల్పనిక భావాలూ డయోస్పోరా రచనల్లో తక్కువగా ఏం లేవు. ఇవి ఉండడం తప్పు అనికాని, లేకపోవడం మంచిది అని కాని చెప్పడం లేదు కాని, అలాటి రచనల్లో రచనాశక్తికి ప్రోద్బలం ఈదృక్పథాలే అవడం తరచు నేను గమనిస్తున్నాను. ఇది డయోస్పోరా రచనలకీ, తెలుగుదేశపు రచనలకీ సమానలక్షణం అని కూడా గుర్తిస్తున్నాను.

ఇకపోతే ఈసంకలనంలో రచనలు చాలావరకూ అటు తెలుగుదేశపు సాహిత్యధోరణులకీ ఇటు డయోస్పోరా సాహిత్యమార్గాలకీ కొంత ఎడంగా, కాస్త భిన్నంగా, కొన్ని సందర్భాల్లో మరీ వేరేగా ఉన్నాయి. భావజాలాల పడికట్టులతో, అకాడమీ బహుమానాల భారాలతో తెలుగుసాహిత్యం వ్యక్తిగత ఉత్కర్షల ప్రచారాల ప్రభావంతో తెలుగుసాహిత్యం చితికిపోయి కొనవూపిరితో కాళ్ళీడుస్తున్న దశలో ఈసంకలనంలో రచయితలు దానికి కాస్త పోషకాహారం సమకూర్చి, విశ్రాంతి ఇచ్చి, సేద తీరుస్తున్నారు. ఇలాంటి సాహిత్యబలం వున్న రచయితలు తెలుగు దేశంలో అచ్చవుతున్న పత్రికల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. కాని వాళ్ళ గొంతుక స్పష్టంగా బయటికి వినిపించడం లేదు; చుట్టూ సాహిత్యం పేరిట జరుగుతున్న గోలలో వినిపించకుండా అణిగిపోతోంది. ఈ సంకలనంలోని కవులూ రచయితలూ మాత్రం స్వఛ్ఛంగా, హాయిగా, ఒక విశ్రాంతవాతావరణం లోంచి రాస్తున్నారు. ఇది తెలుగుసాహిత్యంలో రావాలని నేను కోరుకుంటున్న మార్పుకి తొలి అడుగు.

3

మనం మాట్లాడే మాటలకి ఒక్క మనమే కర్తలం కాదనీ, శ్రోతని బట్టి మాట మారుతుందనీ మన అనుభవంలో అందరికీ తెలుసు కాబట్టి ఒప్పుకుంటాం. అంటే మన మాటలు పైకి వచ్చే తీరులో, వినేవాళ్ళ పాత్ర చాలా వుందన్నమాట. ఇదే సాహిత్యానికి వర్తింపజేసి చూద్దాం. మన మాటలు రచనలయితే, వాటికి మనమూ, వినేవాళ్ళూ సహరచయితలమన్నమాట. శ్రోతలు లేదా పాఠకులు మారినప్పుడు సాహిత్యం మారుతుంది అని లోగడ నేనొక సందర్భంలో ప్రతిపాదించాను. ఈప్రతిపాదన “ఈ మాట”కీ వర్తిస్తుంది.

“ఈ మాట” E పత్రిక. అంటే ఇది ఒక అభౌతిక సమాజంలో ప్రకటించబడుతుంది. దీనిచుట్టూగాని, ఇందులో రచయితల చుట్టూగాని రాజకీయ, సాంఘిక, వైయక్తిక ప్రాబల్యాలతో పనిచేసే ఒత్తిళ్ళు గాని దాని ఆధికారికవర్గాల పెత్తందారీలు గాని లేవు. ఈపరిస్థితి ఇందులో రచయితలకి ఒక వెసులుబాటూ, ఒక స్వేచ్ఛా ఇచ్చింది. అయినా, ఇది తెలుగుపత్రిక. దీని పాఠకులు తెలుగువాళ్ళు. వాళ్ళ సాహిత్యచైతన్యం తెలుగుచైతన్యం. కాని అది భౌతికపరిమితులకి అతీతమైన చైతన్యం. పరిమితులూ, సరిహద్దులూ లేని అయినా సంస్కృతీస్వరూపం చెక్కుచెదరని ఈలోకం తెలుగుసాహిత్యానికి కొత్తది.

ఈసంకలనం కొత్తగా ఉండడానికీ, బరువులూ, బాదరబందీలూ లేకుండా హాయిగా గాలిపీల్చుకోడానికీ, ఈసంకలనంలోని కవులూ, రచయితలతో పాటు, “ఈ మాట” కొత్తపాఠకలోకానికి కర్తృత్వం ఉంది. ఈ ఉభయులూ కర్తలుగా సాహిత్యంలో ఒక కొత్త మార్పు మొదలై, తెలుగుసాహిత్యం కొత్తమలుపు తిరుగుతోందని నానమ్మకం. అయితే ఈ మార్పు స్ఫుటమై, ఆమలుపు స్థిరమవడానికి బాధ్యత “ఈ మాట” సంపాదకులదీ పాఠకులదీని.
వాదాలతో, నినాదాలతో, రాజకీయాలతో, సిద్ధాంతపు పడికట్టు మాటలతో, పద్యం ఎలా కట్టాలో, ఎక్కడ ఆపాలో కొంచెంపాటు కూడా తెలియని రోకలిబండ వచనపద్యాలతో తెలుగుభాష విసిగిపోయింది. ఇప్పుడిప్పుడే అక్కడా ఇక్కడా కవులు కనిపిస్తున్నారు తెలుగుదేశంలో కూడా పద్యం మీద శ్రద్ధ వున్న వాళ్ళు. వాళ్ళు ఉత్సాహపడతారు ఈసంకలనంలో పద్యాలు చదివి. ముఖ్యంగా


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...