విమర్శ: ప్రచురణకు ముందు, తర్వాత

తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ పాశ్చాత్య దిగుమతి. అంతకు ముందు మనకున్నది లక్షణ తర్క మీమాంస గ్రంథాల ఆధారంగా జరిగిన వివరణలేగాని విమర్శలు కావు. ఇప్పుడు జరుగుతున్న సాహిత్య విమర్శ కూడా ఒక రచన ప్రచురించిన తర్వాతేగాని ముందుగా జరుగుతున్న దాఖలాలు లేవు. ఒకవేళ అడపాదడపా జరిగినా రచయిత స్నేహితులో సంపాదకులో చేసే చిన్న చిన్న సవరణలేగాని, పాశ్చాత్య భాషా సంసృతిలో జరిగే విమర్శల లాంటివి కావు. విజ్ఞానశాస్త్ర రచనలపై జరిగే తార్కిక విశ్లేషణకు సంబంధించిన పద్ధతులు, అలవాట్లు, నియమాలు చాలవరకు పాశ్చాత్య (ముఖ్యంగా ఇంగ్లీషు సాహిత్యంలో) విమర్శల్లో కనిపిస్తాయి. విజ్ఞానశాస్త్ర రంగంలో జరిగే విమర్శా పద్ధతులననుసరించి తెలుగు సాహిత్య విమర్శకు అనువైన పద్ధతిని ప్రతిపాదించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

చరిత్ర, శాస్త్రీయ అంశాలపై రాసే రచనలు తప్ప మిగిలినవన్నీ రచయిత ఊహాజనితాలే, రచయిత సృజనలే. అంతమాత్రాన సృజనాత్మక రచనలన్నీ వాస్తవానికి దూరంగా ఉంటాయని కాదు. తన చుట్టూ ఉన్న సమాజం, జరుగుతున్న సంఘటనలు, మానవ స్వభావాలు, పరస్పర సంబంధాలు మొదలైనవన్నీ రచయిత కాల్పనిక శక్తికి తోడ్పడి కథ, నవల, కవిత, నాటకం వంటి సాహిత్య ప్రక్రియల రూపంలో ఉద్భవిస్తాయి. రచయిత ఊహాలోకంలో చిత్రించుకున్న ఈ రచన అక్షరరూపం దాల్చినప్పుడు ఆ వాక్య సముదాయాన్ని పాఠకులు తమ ఊహాశక్తితో తిరిగి సృష్టించుకుంటారు. తన కలం నుండి వెలువడిన రచనపై రచయితకున్న స్వాధీనం ప్రచురణతో పాఠకుల వశమౌతుంది. అది ఇహ తిరిగి రాదు. భిన్న రచయితలు ఒకే అంశాన్ని ఎలా భిన్న రీతుల్లో రాయగలరో, పాఠకులు కూడా తమ ఊహాశక్తితో అంత భిన్నంగానూ అన్వయించుకోగలరు, అన్వయించుకుంటారు కూడా. రచయితకు పాఠకులకు మధ్య జరిగే ఈ అన్వయింపు ప్రక్రియ (అక్షరరూప భావప్రసారం) సవ్యంగా జరిగేట్టు చూసేది, రచనకు బాహ్యప్రపంచానికి సమన్వయాన్ని సరిచూసేది, విమర్శ. ఉదాహరణకు, రచయిత ఒక ఆహ్లాదకర సంఘటనను సృష్టించదలుచుకున్నప్పుడు కారు మబ్బులను, చీకటిని వర్ణించుకుంటూపోతే పాఠకులకు విషాదానుభూతులేకానీ, ఆనందించడానికి కారణాలు కనపడవు. అలాగే, గుంటూరులో యమునా నది ఒడ్డున సీత నాట్యాన్ని వర్ణిస్తే, అది ఒక ఉన్మాదస్థితిని సూచిస్తుందే తప్ప, పౌరాణిక, సాంస్కృతిక అనుభూతిని కలగజేయదు. (ఇవి విపరీత ఉదాహరణలే కావచ్చు, కానీ వీటి పరమార్థం ‘చావుకు పెట్టి లంకణానికి’ తీసుకు రావడమే!) అంతమాత్రాన విమర్శ కేవలం తప్పుల పట్టిక అనుకుంటే పొరపాటు. రచయిత ఊహించి చిత్రించిన ఒక జగత్తు పాఠకులకు చేరేటప్పటికి జరిగే రూపాంతరాన్ని అధ్యయనం చేయడం, రచనలోని కార్యకారణ సంబంధాలు, వస్తు వివరాలు, వాస్తవంతో బేరీజు వేసి పరిశీలించడం విమర్శ బాధ్యత. ఈ బాధ్యతను ముందుగా నిర్వహించవలసినది రచయితే ఐనా, తన రచనా శక్తి మీద తనకున్న నమ్మకం వల్లనో, తన రచన మీద తనకున్న అభిమానం వల్లనో, అవగాహనా లోపం వల్లనో రచయిత తనకు తాను నిర్వహించుకోలేనప్పుడు విమర్శ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఒక నాటక ప్రదర్శన ఆ రచయిత ఊహించినట్టుగా జరగకపోతే అది రచనలో లోపం కావచ్చు లేదా ప్రదర్శకుల అవగాహనలో లోపం కావచ్చు. నాటక రచన మీద, ప్రదర్శన మీద అవగాహన ఉన్న విమర్శకులు జరిగిన లోపాల్ని గుర్తించి ఇద్దరికీ సమన్వయం చేకూర్చగలరు.

‘నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్’ అని గిరీశం అన్నట్టుగా, ఒక రచనను చదివి వెలిబుచ్చే ప్రతి అభిప్రాయమూ విమర్శేనన్న భావం ప్రబలంగా నాటుకుపోయింది. కానీ సాహిత్యం ఒక కళారూపం అయినప్పటికీ, విమర్శ మాత్రం వాస్తవం మీద, తర్కం మీద ఆధారపడి ఉంటుంది. అంటే, విమర్శలో వెలిబుచ్చేది అభిప్రాయాలే ఐనా, వాటికి కార్యకారణ సంబంధాలతోను, నిజజీవితంతోను అవినాభావసంబంధం ఉంటుంది. కానీ, శాస్త్ర, సాంకేతిక రచనల విమర్శ – విశ్లేషణలకు తోడ్పడే సూత్రాలూ నియమాలూ ప్రయోగపూర్వకమైన ఆధారాలూ సృజనాత్మక ప్రక్రియ అయిన సాహిత్యానికి తక్కువ. ఏవైనా కొన్ని సూత్రాలు, నియమాలు ఏర్పరచుకున్నా, అవి కాలాన్నిబట్టి, సాంఘిక పరిస్థితుల్నిబట్టి మారే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు, మంచి-చెడు, సామాజిక న్యాయం వంటివి చూసేవారి దృక్కోణంపైన, కాలంపైన ఆధారపడి ఉంటాయి (‘మేనమామ బిడ్డ మెరసి పెండ్లామాయె/ అరవలందు చెల్లెలాయెనదియె/ వలసిన పుణ్యంబు, వలదన్న దోషంబు’ – వేమన). అంతమాత్రాన భాష, వ్యాకరణాదుల పరంగా సాహిత్య విమర్శకు అనువైన సూత్రాలు ఉండవని కాదు. నిత్యం మారుతూ ఉండే సామాజిక పరిస్థితులను, అభిప్రాయాలను, విలువలను లెక్కచేయకుండా ఖరాఖండిగా మంచి చెడులను, తప్పొప్పులను రచనల్లో ఎత్తిచూపగల సార్వకాలీన విమర్శనా సూత్రాలు సాధ్యంకావని. ఐనా, సాహిత్య విమర్శకు శాస్త్రీయ పద్ధతికి మినహా వేరే దారి లేదు. అది తెలుగులో మనకు అలవాటూ లేదు!

శాస్త్ర విజ్ఞాన ప్రచురణలను పరిశీలించి, సవరణలను సూచించి, అవసరమైతే మార్పులు చేసి ప్రచురించే దశకు తీసుకు వెళ్ళేవారు Reviewers, Editors. ఇంగ్లీషులో వారి వృత్తి ధర్మాల నిర్వచనాలననుసరించి, తెలుగులో వారిని విమర్శకులు, సంపాదకులు అనడం భావ్యమే. ఒక రచనను పరిశీలించి, విశ్లేషించి, యుక్తాయుక్త విచారణచేసి, మార్పులు చేర్పులు సూచించేది విమర్శకులైతే; విమర్శకుల అభిప్రాయాల్ని బేరీజువేసి, రచన ప్రచురణార్హతలను నిర్ణయించేది సంపాదకులు. ప్రచురణకర్తలు వీరిద్దరిమీద ఆధారపడి ఉంటారు. కాస్త అటు ఇటుగా ఈ సంప్రదాయం ఇంగ్లీషు (కొన్ని ఇతర భాషలలోనూ) సృజనాత్మక ప్రచురణల్లో కూడా (దాదాపు అన్ని దేశాలలోను) కనిపిస్తుంది. ఇవన్నీ ఒక రచన ప్రచురణకు ముందు జరిగే పనులు. కారణాలేవైనప్పటికీ, తెలుగు సాహిత్యంలో ఈ సంప్రదాయం ఇంచుమించు లేదనిపిస్తుంది. ఒకవేళ ఉన్నా, విమర్శకులు, సంపాదకులు (చివరికి ప్రచురణకర్తలు కూడా) ఒకరే కావడం పరిపాటి. అంటే న్యాయవాది, న్యాయనిర్ణేత, నిర్ణయాన్ని అమలుపరచే అధికారి, ఒక్కరే కావడం లాంటిది! ఈ ‘రచయిత-విమర్శక-సంపాదక-ప్రచురణకర్త’లు ఒక రచనపై ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏకపక్షమే కాబట్టి భిన్నాభిప్రాయాలకూ, చర్చించడానికీ తావుండదు. ఇది ఒకరకంగా నియంతృత్వ స్థితి. దీనివల్ల సాహిత్య సృజనలో నాణ్యత లోపిస్తుంది. నాణ్యత కరువైన సాహిత్యం అభివృద్ధి చెందకపోగా, క్షీణించి, నశించే అవకాశం చాలా ఎక్కువ. అదృష్టవశాత్తు, నాణ్యత లేని సాహిత్యాన్ని పాఠకులు ఎక్కువకాలం ఆదరించకపోవడంతో ఒక తరం రచయిత-విమర్శక-సంపాదక-ప్రచురణకర్తలు మరుగున పడిపోతారు. ఒక తరం మరుగున పడిపోయినా, మళ్ళీ వచ్చేది అదే మూసలో తయారైన వారేగానీ, మౌలికమైన మార్పులు ఉండవు. ఈ స్థితి నుండి పాఠకులు కొంతవరకూ కాపాడగలిగినా, మొత్తం పాఠకుల్లో (ఏ భాషలోనైనాసరే) కూలంకషంగా విశ్లేషించి చదివేవారు తక్కువ. ఎక్కువ మంది పాఠకులు ఒక కథనో, కవితనో, లేదా వేరే ఏ సాహిత్య ప్రక్రియనైనాసరే ఒకరు పరిచయం చేయగానో, రచయిత పలుకుబడి మూలంగానో, చివరికి అట్ట బాగుందనో, అచ్చు బాగుందనో ఎన్నుకుంటారే గానీ చదివి విశ్లేషించాలని కాదు. ఏ కొద్దిమందో తాము చదివిన రచనల పూర్వాపరాలు చర్చిస్తారు. కానీ, ఇవి ప్రచురణ తర్వాత జరిగే ‘విమర్శ’లు. మౌలికంగా ఇవి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాంటిది. ఇక్కడ ఉద్దేశం ప్రచురణానంతర విమర్శ అనవసరమని కాదు. ఇవి కేవలం పాఠకులను ఆప్రమత్తం చేయడానికి, చదివించడానికి ఉపయోగపడే ప్రచారసాధనాలు. రచయితలకు, ప్రచురణకర్తలకు ఈ ప్రచారం ఉపయోగపడవచ్చునేమోగానీ రచయిత సృజనాత్మక శక్తిని ఇనుమడింపజేయగల సాధనాలు కావు. ప్రచురణానంతర విమర్శ ప్రతికూలంగా ఉంటే, అది ఎంతటి సద్విమర్శ అయినా మంచి రచనను చేసే అవకాశాన్ని చేజార్చుకున్న రచయితను నిరుత్సాహపరుస్తుందే తప్ప ప్రయోజనం తక్కువ. (ఇదేదో ఆ రచయిత తర్వాత వ్రాయబోయే రచనలకోసం అనుకుంటే, ‘ఆలూ చూలూ లేదు, కొడకు పేరు సోమలింగమన్నట్లే’.) కాబట్టి, వైవిధ్యభరితమైన, నాణ్యమైన, తెలుగు సాహిత్య సృజన చిరకాలం నిరంతరంగా సాగే అవకాశం రావాలంటే ప్రచురణకు ముందే సాహిత్య విమర్శ జరగడం అవసరం. ప్రచురణ క్రమంలో రచయితను, విమర్శకుని, సంపాదకుని, ప్రచురణకర్తను వేరుచేసి అందరిని విడివిడిగా అభివృద్ధి చేయడం అనివార్యం. ముఖ్యంగా ఈ నాలుగింటిలో విమర్శకుని బాధ్యత వేరే ఏ బాధ్యతలతోనూ కలపరానిది, కలపకూడనిది.

విమర్శ లక్షణాలు

ఏ రచయితకైనా తను చెప్పదలుచుకున్నది (వస్తువు), చెప్పే పద్ధతి (శైలి), దానికి తగిన భాష ఎన్నుకోవడంలో పూర్తి స్వాతంత్ర్యం ఉంటుంది. ఈ స్వాతంత్ర్యం రచయితకు ఎంతో స్వేచ్చనిస్తుంది. ఈ స్వేచ్చను వినియోగించుకోవడంలో రచయిత చూపించే నిబద్ధత, విషయపరిజ్ఞానం, రచయిత స్థాయిని నిర్ణయిస్తాయి. వీటితోపాటు రచనలో అంతర్గతమైన సంగతత్వం (internal consistency) కూడా అవసరం. అంటే రచయితలు ఎంత నిబద్ధతతోను, విషయపరిజ్ఞానంతోను, అంతర్గత సంగతత్వంతోను, ఎన్నుకున్న వస్తువుకు తగిన భాషతో, అంతకు తగిన శైలితో రచన చేశారా అని అంచనా వేసి నిర్ణయించేదే విమర్శ.

పరిపూర్ణమైన రచయితలు లేనట్లే, అన్నీ అర్థంచేసుకోగల పాఠకులు, సర్వజ్ఞానులైన విమర్శకులూ ఉండరు. అలాగని, అందరు పాఠకులకు అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్టుగా వ్రాయడమూ రచయితకు సాధ్యంకాదు, అవసరమూ లేదు. రచయిత ఏ స్థాయి పాఠకులను దృష్టిలో ఉంచుకుని తన రచనను చేశారో అంతవరకు న్యాయం చేశారా లేదా అన్నది ముఖ్యం. దానికి తగిన ప్రక్రియను, శైలిని, భాషను, పరిభాషను వాడి వస్తువును తగినంతగా దర్శింపజేశారో లేదో నిర్ణయించవలసింది విమర్శకులు. రచనకు భాష్యం చెప్పడం, పరిచయం చేయడం అవసరాన్నిబట్టి విమర్శలో భాగం కావచ్చునేమోగానీ, ఉద్దేశం మాత్రం కాదు.

అన్ని ప్రక్రియల్లోనూ సృజనాత్మక రచనలు రచయిత భావోద్రేకాలమీద, అనుభవాలమీద, కృషిమీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల విమర్శకులు కేవలం తాము గుర్తించే విలువలకంటే, రచయిత ప్రతిపాదించిన లేదా ప్రతిపాదించదలచిన విలువల ఆధారంగానే రచనలను విశ్లేషించాల్సి ఉంటుంది. అలా చేసిన విమర్శ, రచనను రచయితకు అద్దంలో చూపెడుతుంది. ఆ ప్రతిబింబం అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా, అది రచయిత జనితమే గనుక సమంజసమూ అవుతుంది, మార్పులకూ చేర్పులకూ అనుకూలంగానూ ఉంటుంది. ఉదాహరణకు, చాతుర్వర్ణ వ్యవస్థను సమర్థిస్తూ చేసిన రచనను సామ్యవాద దృక్పథంగల విమర్శకులు పరిశీలించినా, ఆ రచన పరిధిలోనే రచనలోని సంగతాసంగతత్వాలను, భాషను, శైలిని, వస్తువును గురించి విమర్శ జరిపినప్పుడు రచయిత తన తప్పొప్పులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా, విమర్శకులు తమ సామాజిక దృక్పథంతో చేసే విమర్శ కేవలం సాంఘిక-రాజకీయ అభిప్రాయ చర్చ అయి కూర్చుంటుంది కానీ సాహిత్య విమర్శ కాజాలదు. (రచనలను కాకుండా, రచయిత నమ్మకాల్ని, చరిత్రను, జీవితాన్ని, ఆకారవికారాల్ని చర్చించదల్చుకున్న వారికి, రచన పై చేసిన విమర్శను రచయిత పై వ్యక్తిగత దాడిగా పరిగణించే వారికీ ఓ నమస్కారం!)

సృజనాత్మక సాహిత్యం మానవ ప్రవృత్తులకు అక్షరరూపం. సమాజంలో అంతర్గతమైన ఆర్థిక, సాంఘిక, రాజకీయ విలువలకు, జీవన విధానాలకు అద్దం. నిర్దిష్టమైన నిర్వచనాలకందని స్వభావాల సమాహారం. ఇంత క్లిష్టమైన సాహిత్యంలో విమర్శ ద్వారా ఖరాఖండిగా తేల్చి చెప్పగలిగేది భౌతిక వాస్తవానికి సంబంధించిన అంశాలపై మాత్రమే. రచనల్లోని సిద్ధాంత ప్రతిపాదనలను, భావాలను, అభిప్రాయాలను, తీర్మానాలను, చివరికి ఊహాగానాలను సైతం తార్కికంగా చర్చించి, యుక్తాయుక్తాలను విమర్శలో నిగ్గు తేల్చవచ్చు. కానీ అభిప్రాయ భేదాలను, ప్రత్యామ్నాయ వివరాలను, శైలిని విశ్లేషించేటప్పుడు విమర్శలో సంయమనం పాటించక తప్పదు. ఇక్కడ ఉపయోగించే భాష, శైలి, అనునయపూర్వకంగా ఉండాలే గానీ, ఎద్దేవా చేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, అభిరుచులు, వారివి. ప్రత్యామ్నాయాలు సాధ్యమైనప్పుడు, వేరొక అభిప్రాయమో, పంథానో సమంజసంగా ఉండొచ్చునని సలహా ఇవ్వడం సబబే కానీ, నా పద్ధతే సరైనదని వాదించడం మూర్ఖత్వం.

విమర్శ ఒకరకంగా రచనను గురించిన అభిప్రాయమే అయినా, రెంటికీ ఒక మౌలిక భేదం ఉంది. విమర్శలో రచనపై వ్యక్తీకరించిన అభిప్రాయాలకు కారణాలు, ఆధారాలు వివరించాలి. నచ్చిందనో, నచ్చలేదనో చెప్పేస్తే సరిపోదు, ఎందుకో కూడా చెప్పాలి. ఒక రచన మనకు నచ్చడానికి మాటలకందని భావోద్వేగాలు కారణం కావచ్చు. కానీ ఆ భావాలేవో వివరించడానికి ప్రయత్నించడంలో మన అవగాహన పదునెక్కుతుంది, ఇతరులకు ఉపయోగకరంగానూ ఉంటుంది. కాకపోతే, నచ్చడానికి వివరణ ఇవ్వలేకపోతే నష్టం మాత్రం లేదుగానీ, అది ఎవరినీ నొప్పించని ఒక అభిప్రాయం మాత్రమే అవుతుంది, విమర్శ కాదు (ఇది విజ్ఞానశాస్త్ర, చారిత్రక రచనల విమర్శలకు వర్తించదు. ఆ రచనల్లోని ప్రత్యేకతలను వివరిస్తేగానీ ప్రచురణార్హాలు కావు). కానీ, ఒక రచనపై ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యదలచుకున్నప్పుడు, తార్కికతతో కూడిన వివరణ తప్పనిసరి. లేకపోతే సభ్యతను విస్మరించి చేసే నిందలే అవుతాయి గానీ విమర్శలు కాజాలవు. రచనలోని లోపాలను వివరించకపోతే, రచయితకు సరిదిద్దుకునే అవకాశం ఉండదు, ఎవరికీ ఉపయోగమూ ఉండదు.

విమర్శకులు ఎవరై ఉండాలి అంటే “వినదగు నెవ్వరు జెప్పిన/వినినంతనె వేగ పడక వివరింపదగున్” అని సుమతీ శతక పద్యాన్ని వల్లించవచ్చు. కానీ, రసాయన శాస్రానికి సంబంధించిన సాంకేతిక రచనలోని సమంజసాసమంజసాలు నిర్ధారించగలిగేది, రసాయన శాస్త్రజ్ఞులు లేదా రసాయన శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినవారే గానీ, జీవ శాస్త్రజ్ఞులో, లెక్కల పండితులో కారు కదా! సృజనాత్మక కళ అయిన సాహిత్యాన్ని విమర్శించడానికి ఇంత ఖచ్చితంగా అనుభవజ్ఞులను నిర్ధారించడం కష్టం కావచ్చునేమో గానీ, స్థూలంగా కొన్ని అర్హతలను, నియమాలను సూచించవచ్చు:

  1. విమర్శకులకు తాము విమర్శించబోయే సాహిత్య ప్రక్రియపై ఎంతో కొంత అభినివేశం ఉండాలి. ఆయా ప్రక్రియల్లో నిష్ణాతులైతే మరీ మంచిది. ఇది రచయిత సమానులు చేసే విమర్శ. (దీన్ని ఇంగ్లీషులో peer review అంటారు. తెలుగులో ‘సాపత్య విమర్శ’ అనవచ్చునేమో). ఉదాహరణకు, ఛందోబద్ధ కవితను విమర్శించదలుచుకున్న వారు అదే తరహా కవులైతే క్షుణ్ణంగా విశ్లేషించగలిగే అవకాశం ఎక్కువ. ఐతే, కవితా సృజన చేయగలిగే శక్తి లేకపోయినా, కనీసం పది కవితలు చదివి ఆకళింపుజేసుకున్న అనుభవమూ, ఛందస్సూత్రాలూ తెలియాలిగదా. అలాగే, నాటక ప్రక్రియను విమర్శించే వారు నటులు కాకపోయినా, నాటక ప్రదర్శన మీద పట్టులేకపోతే విమర్శ భాష, సంభాషణలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.
  2. ఎంతటి విమర్శకులైనా ఒక రచనలోని అన్ని అంశాలపైనా నిష్ణాతులు కాకపోవచ్చు. తమకు తెలియని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే విమర్శకు ఉపక్రమించాలిగానీ ఊహాగానాలతో కాదు. అనుభవజ్ఞుల సలహా సంప్రదింపుల సహాయంతో విమర్శకు పూనుకుంటే చిన్నతనమేమీ కాదు. శాస్త్ర విజ్ఞాన రచనా విమర్శకు, వస్తువును బట్టి ఇద్దరు లేక ముగ్గురు విమర్శకులను ఆశ్రయించడం సంపాదకులకు పరిపాటే. (భిన్నాభిప్రాయాలను లెక్కలోకి తీసుకునే ప్రయత్నంలో ఒకరికంటే ఎక్కువ విమర్శకులతో రచనను పరిశీలింపజేయడం అవసరం కూడా).
  3. సహేతుకంగా జరిపే విమర్శలో విమర్శకులు నిరపేక్షతో సమతుల్యత పాటించడంలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఇది శాస్త్ర విజ్ఞాన రచనా విమర్శలలో కంటే, సృజనాత్మక సాహిత్య రచనలకు ఎక్కువ అవసరం. శాస్త్ర విజ్ఞాన రచనా విమర్శకులను ప్రయోగాత్మక వివరాలే క్రమశిక్షణలో బంధిస్తాయి. సంపాదకులకు విమర్శకుల అభిప్రాయాలను బేరీజు వేయడం కూడా తేలిక. సృజనాత్మక సాహిత్య విమర్శకు ఈ వెసులుబాటు తక్కువ. అయితే, సమతుల్యతను పాటించే ప్రయత్నంలో సహేతుకమైన అభిప్రాయాలను వివరించడానికి వెనుకాడకూడదు. రచయితలు నొచ్చుకుంటారనో, విమర్శకుని జ్ఞాన పరిధిని శంకిస్తారనో, రచన-విమర్శ పరిధిని దాటి విమర్శకులపై నిందలు వేస్తారనో లేదా మరే సాంఘిక రాజకీయ కారణాలవల్లనో విమర్శకులు తమ అభిప్రాయాలను నియంత్రించుకుంటే, అది సాహిత్యానికి మేలు చేయదు సరికదా, రచయితకూ ఉపయోగకారి కాదు.

చివరిగా, రచయితలు విమర్శను, ముఖ్యంగా ప్రతికూలంగా వచ్చిన విమర్శను, తమ ప్రతిభను పెంపొందింపజేసుకోవడానికి కలిగిన అవకాశంగా చూడడం అలవాటు చేసుకోవాలి. నిజానికి, ‘నీ రచన చాలా గొప్పగా ఉంది’ అని వచ్చే విమర్శ వల్ల (నిజంగానే ప్రతికూల విమర్శకు అందని రచనైనా సరే) రచయితకు తాత్కాలికానందం తప్ప వేరే ఏ ఉపయోగమూ ఉండదు. రచయితలు అదే కావాలనుకుంటే భజన సంఘాలనేర్పరచుకోవడం తేలికే! విమర్శకుల అభిప్రాయాలతో ఏకీభవించడం, ఏకీభవించకపోవడంలో రచయితకు పూర్తి స్వాతంత్ర్యం ఉంది. ఈ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుని, విమర్శను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుని తగిన సమాధానాలు వెతుక్కోవడంలో రచనకు పరిపక్వత సిద్ధిస్తుంది. విమర్శ సహేతుకం కాదనుకున్నాసరే, అవి ఎందుకు సహేతుకంకావో వివరించగలగాలి. రచనలో మార్పులు చేసుకోవడానికి, అవసరమైతే తిరిగి వ్రాసుకోవడానికి వెనుకాడకూడదు. ఒకసారి వ్రాసుకున్న రచనను తిరిగి చూసుకోవలసిన అవసరంలేని రచయితలుండవచ్చునేమో గానీ, ఇంచుమించు అందరూ తమ రచనలను ప్రచురణకు ముందు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.

(డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)

మద్దిపాటి కృష్ణారావు

రచయిత మద్దిపాటి కృష్ణారావు గురించి: పుట్టింది పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా రామన్న గూడెంలో. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కెమిస్ట్రీలో డాక్టరేట్. ప్రస్తుతం డెట్రాయిట్ లోని వేన్ స్టేట్ యూనివర్సిటీలో రిసర్చ్ ప్రొఫెసర్‌. తెలుగు సాహిత్య, సంగీత, నాటకాది కళలంటే ఎంతో అభిమానం. డిటిఎల్‌సి అని అందరూ పిలుచుకునే డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడిగా సాహిత్యకార్యక్రమాలలో చురుకుగా పని చేస్తున్నారు. ...