ఎవరేమి చెప్పినా వినదలుచుకోలేదు. ఎన్నిసార్లు వాయిదా వేసుకొన్నానో నాకే తెలియదు. ప్రతిసారీ ఇండియా వచ్చినప్పుడల్లా అమర్ నాథ్ చూడాలనిపించడం, చివరికి చూస్తుండగానే రోజులు తరిగిపోవడం, మళ్ళీ అమెరికా ప్రయాణం .. విమానంలో అందరూ కునికిపాట్లు పడుతుంటే నేను మాత్రం వెళ్ళలేకపోయానే అని విచారించడం. ఒక్కసారి లండన్ కో ,పారిస్ కో వచ్చిపడగానే ఇండియా అలోచనలు చెదిరిపోయి, దిగగానే చేయాల్సిన పనులగూర్చి ఆలోచించడం పరిపాటి ఐపోయింది. ఈ సారి పట్టుదలగా ఢిల్లీలో పెద్దన్నయ్య ఇంట్లో లగ్గేజి పడవేసి శ్రీనగర్ బయల్దేరాను. రమణీ ,బాబూ హైద్రాబాద్ వెళ్ళిపోయారు. రమణి ఒక్కటే సణుగుడు. “సుతీ మతీ లేక పోతే సరి.తగుదునమ్మా అని బయల్దేరడం..పెళ్ళెందుకు చేసుకొన్నట్టు..గోసాయిల్లోనే కలవచ్చు కదా?” అంటూ. రమణికి నా బాధ అర్థం కాదు. తనకే నాకంటే ఎక్కువ భక్తి; ఉపవాసాలు, నిష్ఠలు,నియమాలతో నన్ను వేధించుకొని తినేది మొదట్లో. బాబు పుట్టాక నన్ను వదిలేసి వాడితోటే లోకంగా వుంటోంది. ఈ ఆడవాళ్ళు నాకు అర్థం కారు.. నాన్నగా మారటంలో నాకు చాలా ఇబ్బంది అనిపించింది. వాడు ఊడిపడగానే తను చటుక్కున అమ్మగా మారిపోయి వాడి బాగోగులన్నీ తనే చూసుకొనేది. ఆలోచనల్లో పడిపోయి దగ్గరికొచ్చేదాకా మిలిటరీ శాల్తీని చూడలేదు..
“ఖండేల్వాల్ ” అని తన్ను తాను పరిచయం చేసుకొని, “మేజర్ సాబ్ ఆప్ కేలియే ఇంతజార్ కర్ రహే హై” అని కరకు గొంతుతో చెప్పాడు. “హమ్మయ్య” అనుకొని అతన్నే అనుసరించా. ఏర్ పోర్ట్ బయట ఎక్కువ వాహనాలు లేవు. పెద్ద చప్పుడుతో బయల్దేరింది మిలిటరీ వాహనం. రావుకు ప్రతిసారి నేను ఇండియా వచ్చేముందు కాల్ చేయడం, కాశ్మీర్ రావాలన్న కోరిక వెలిబుచ్చడం.. “మళ్ళీ వీలుపడలేదురా సారీ” అని తిరుగు ప్రయాణం ముందురోజు ఫోన్ లో చెప్పేయడం.. వాడికి చాలా సంతోషంగా వుంది. వాడు ఏర్ పోర్ట్ కు ఎందుకు రాలేదబ్బా?
నా మనసులోని ఆలోచనలు పసికట్టిన వాడల్లే ఖండేల్వాల్, “రావ్ సాబ్ అర్జెంట్ మీటింగ్ మే హై,ఇసీలియే మురేX భేజ్ దీ” అన్నాడు.
రావు మా కోసం ఆత్రంగా చూస్తున్నాడు. దిగగానే వాటేసుకొని లోనికి తీసుకు వెళ్ళాడు. వేణ్ణీళ్ళ స్నానం చేసేసరికి చలిదిగిపోయి వెచ్చగా శరీరంలోకి కొత్త రక్తం ప్రవహిస్తున్నట్టనిపించింది. తలతుడుచుకొంటుంటే “వేద్దామా ఒక రౌండు ” అన్నాడు రావు. నౌఖరు అన్నీ అమర్చి పెట్టిపోయాడు. నేను తెచ్చిన బాటిల్స్ అన్నీ టేబుల్ మీద పెట్టా. బ్లూ లేబిల్ తప్ప తతిమావన్నీ అలమరాలో సర్దేశాడు. రాత్రి పన్నెండు ఒంటిగంట దాకా కష్టసుఖాలు చెప్పుకొన్నాం.
చిన్నప్పటినుండీ నేను, నరహరి,రావు ఒక జట్టు. ఎక్కడికి వెళ్ళినా కలిసికట్టుగా వెళ్ళే వాళ్ళం. నేను ఇంజనీరింగ్ చేసి states వెళ్ళి అక్కడే స్థిరపడటం, రావు NDA కు సెలెక్టయి అంచెలంచెలుగా ఎదుగుతూ మేజర్ అవడం.. తలచుకొంటే ఎంత జీవితం గడిచిపోయింది అనిపించింది. నరహరిని గుర్తు చేసుకోవాలని ప్రయత్నించా.. బాగా పొడవుగా వుండేవాడు. అంత ఎత్తు మీద లావు కనిపించేవాడు. కనుబొమలు కలిసిపోయి ఎదుటివారిని భయపెట్టే పెద్ద కళ్ళు. తన లోని తీవ్రత అంతా కళ్ళల్లోనే వుంది అనిపించేది నాకైతే. అంత తీక్ష్ణంగా వుండేవి.
ఫోన్ మోగుతోంది నిరవధికంగా. నేను పట్టించుకోలేదు. రావు గట్టిగా గురకపెడుతున్నాడు. విసుగ్గా ఫోనెత్తి “హలో” అన్నా. “శ్రీనగర్ వెళ్ళాక ఫోన్ చేయాలన్న బుద్ధీ జ్ఞానం వుండక్కర్లా?” నేను ఎక్కువగా డ్రింక్ చేయలేదు. ప్రయాణం చేసివచ్చిన వెంటనే తాగే అలవాటు నాకు లేదు. కొంచెం మత్తుగా వుందంతే. “కనీసం రావు ఫోన్ నంబర్ ఇవ్వాలన్న అలోచన కూడా లేదు” ఫోన్ లో గర్జిస్తోంది రమణి. మత్తు పూర్తిగా దిగిపోయింది.
2.
ఆడవాళ్ళతో ఇదే లడాయి. నిద్రపోనివ్వరు. ఎక్కడా సుఖంగా వుండనివ్వరు.
“రమణీ ఈ టైమ్ లో ఫోన్ ఏమిటి పడుకో” అన్నా.
విసురుగా ఫోన్ పెట్టేసిన చప్పుడు.
” ప్రొద్దునే శంకరాచార్యకు వెళ్ళాలి ,నాకు అతి కష్టం మీద ఆఫ్ దొరికింది,నీవు త్వరగా పడుకొని,త్వరగా తెములు ” రావు నిద్రకుపక్ర మించేటప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ముసుగు తన్ని పడుకొన్నా.. నరహరి గురించి ఆలోచిస్తూ. వాడు మా అందరికంటే ఆలోచనల్లో పదేళ్ళు పెద్ద వాడు అనిపించేది. ఎంత తీవ్రంగా ఆలోచిస్తాడో ..అంతకు మించి ఆవేశపరుడు. ఒక పట్టాన కొరుకుడు పడే వాడు కాడు. ఇంటర్మీడియట్ లో జరిగిన సంఘటన నాకు ఇంకా నిన్న మొన్న జరిగినట్లుంటుంది. Maths లెక్చరర్ కు మేము ముగ్గురం ఆయన దగ్గరికి ట్యూషన్ వెళ్ళడం లేదని గుర్రు. నరహరే మా ఇద్దర్నీ వెళ్ళనివ్వలేదు, కంబైండ్ స్టడీస్ అంటూ. ఒకసారి కావాలని మా ముగ్గురికి ఆయన అత్తెసరు మార్కులు వేశాడు. నేను ఏడుపు మొహం పెట్టాను. కన్నీళ్ళు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. భుజం మీద చేయి వేసి స్థిరంగా చెప్పాడు నరహరి “భరించలేని దుఃఖం లో గాని,మితిమీరిన ఆనందం లో గాని కన్నీరు కార్చకు,అది నాకు అసహ్యం.” తన మొహంలోకి చూశా , ఏమీ జరగనట్టుగానే వుంది. రావు గుటకలు మింగుతున్నాడు. అసలు సంఘటన ఇదికాదు. ఆ తర్వాత ఒకరోజు Maths క్లాసు లో Advanced probability చెబుతున్నారు మేష్టారు.ఆయనకు చెప్పే విషయం మీద అంత శ్రద్ధ ఉండదు. ఏదో మొక్కుబడి తంతు. నరహరి అసహనంగా కదులుతున్నాడు. “సార్ ,డౌట్ ” చేయెత్తాడు. కొంచెం చులకనగా ఏమన్నట్టు నరహరి వైపు చూశాడు. “5th line” స్థిరంగా వుంది నరహరి స్వరం. మేష్టారు బోర్డు మీద వేసినవి నోట్స్ లోకి ఎక్కించుకోవడం, అంతే అదీ నాకు తెలిసిన పని. కుతూహలంగా 5th line నుండీ మళ్ళీ చూశాను.అప్పుడు గాని నాకు బోధ పడలేదు, పొరపాటునే అలవాటుగా చేసుకొన్న ఆ ప్రబుద్ధుడు చేస్తున్న తప్పేమిటో.. నరహరి జేవురించిన మొహంతో ఒక్కసారి లేచి మాష్టారు ని చాచి ఒక లెంపకాయ కొట్టాడు. గుమ్మం దాకా ఎగిరి పడి ముక్కలయి పోయింది ఆయన కళ్ళజోడు. ఎవరికీ నోటమాట రాలేదు నిశ్చేష్టులై పోయారందరూ. కానీ అందరికీ లోలోపల ఆనందంగానే ఉంది. నరహరిని ఒక్కనెల సస్పెండ్ చేశారు. ఆ నెల కాలంలో మాష్టారి స్వభావం లో గొప్ప మార్పు వచ్చింది.
3.
“ఎక్కడి శంకరాచార్యుడు..ఎక్కడ కాశ్మీరం..” నాకు ఆశ్చర్యం కలిగింది. కొండ మీద గుడి. యాత్రికులు బాగానే వచ్చారు. పై నుండి చూస్తుంటే శ్రీనగర్ చాలా అందంగా కనిపిస్తుంది. సరస్సులు,జీలం నది ,పడవలు,షికారాలు అంతా అందంగా అనిపించింది. అందం వెనుక తెలియని భయం .. మంచు కప్పిన కొండలా.. ఫోటోలు తీసుకొందామని కెమెరా తీస్తే రీల్ లోడ్ చేయని విషయం గుర్తుకు వచ్చింది. రావు నవ్వాడు. దేవాలయం బయట.. సన్నగా.. కానీ బలంగా ఉన్న శాల్తీ .. శుభ్రమైన సంప్రదాయ వస్త్రాల్లో కనిపించాడు.”వేంకటాచార్యుల్లా లేడు?” రావు కదిపాడు.
“ఏ వేంకటాచార్యులు.. హంపీ ..” నా మాటలు మధ్యలో తుంచి , “అమెరికా వెళ్ళినా ఏమీ మరచిపోలేదు..” మెచ్చుకోలుగా చూశాడు. కాశ్మీరీ స్నేహితుడి ఇంటికి తీసుకు వెళతానన్నాడు. “సరే” అన్నాను. వాన్ కదిలింది.
వేంకటాచార్యులు .. మేము ముగ్గురం హంపీ వెళ్ళినప్పుడు తారసపడ్డాడు. శిథిలాలను చూసి మురిసిపోతుంటే ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఏదో లోకంలో ఉన్నట్టు కనిపించాడు.
తెల్లగడ్డం.. మీసం..ధోవతి ..పైన ఉత్తరీయం..నిలువెత్తు గంభీరమైన రూపం !
పాడుతున్నాడో తెలియదు, గొణుక్కుంటున్నాడో తెలియదు. శిల్పాలను తడిమి చూస్తాడు…
మతి భ్రమించి చాలా ఏళ్ళుగా ఇక్కడే వుంటున్నాడని పూజారి చెప్పాడు. తుంగభద్ర.. ఎగిరెగిరి పడుతోంది. మా శక్తి మేరకు నడిచి వెను తిరిగాము. ఉగ్రనరసింహుడి దగ్గర మళ్ళీ కనిపించాడు. ఈ సారి పద్మాసనంలో .. నరహరి ధైర్యంగా “తాతా” అని పిలిచాడు. రావూ, నేనూ దౌడు తీయడానికి సిద్ధంగా వున్నాము..
“నాయనా! అంతా చూసినారా?” సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. ఆయన పిచ్చివాడు కాదని రూఢి ఐపోయింది. వడివడిగా నడక మొదలుపెట్టాడు. మేము ఆయన్ని అందుకోలేక పోతున్నాం.. తుంగభద్రా తీరం వెంబడి చాలా సేపు నడిచాము. విచిత్రం ! మాకు భయం వేయలేదు. ఆయన పూరిపాకలో ప్రవేశించినదే తడవుగా దీపం వెలిగించాడు.
ఒక వైపు తుంగభద్రా నది హోరు. . ఇంకో వైపు హంపీ శిథిలాలు..”సంధ్యాదీపం నమోస్తుతే” అని చేతులు జోడిస్తుంటే దీపం వెలుతురు లో జేగీయమానంగా కనిపించాయి ఆయన విశాల ఫాలం, పొడవాటి నాసికలు. స్నానం చేసివచ్చి పాక ముందు కూచున్నాం కడుపునిండా భోజనం పెట్టాడు. “నాయనా, ప్రొద్దునే లేపుతాను, నిద్రకొచ్చినారు, పండుకోండి” అని పక్కలు పరిచి తను విడిగా చాప మీద పడుకొన్నాడు.
4.
రాత్రి ఏవేవో కలలు. నరహరి గుర్రం మీద స్వారి చేస్తున్నాడు. మేము ఇసుకలో ఆడుకొంటున్నాము. నరహరి పొడవాటి ఖడ్గాన్ని ఇసుకలో దిగవేసి, గుర్రాన్ని రెండుకాళ్ళ మీద లేపి సకిలింపచేశాడు. కలలో ఉండగా, నాలుగింటికే లేపేశాడు. స్నానం చేస్తుంటే వళ్ళు జిల్లుమంది. రావిచెట్టుకింద అందరినీ ధ్యానానికి కూచోబెట్టాడు. ధ్యానంలోనే నేను నిద్రలోకి జారుకొన్నాను. రావు కూడా. మేము లేచే సరికి తూర్పు రేకలు పూర్తిగావిచ్చుకొన్నాయి. నరహరి నిశ్చలంగా ధ్యానంలో.. కనులు తెరవలేదు.. వేంకటాచార్యులు ఆత్రంగా నరహరినే గమనిస్తున్నాడు. నరహరి కళ్ళు తెరిచాడు. “ఏమి చూసినావు నాయనా”
“శ్వేత వస్త్రాల్లో అశ్వారూఢుడైన యోధున్ని చూసినాను” నరహరి ఏదో చెబుతున్నాడు.
వేంకటాచార్యుల కళ్ళు చెమర్చాయి. ఆయన గొంతు గాద్గదికమైంది.
“నా కృష్ణరాయడే.. నా కృష్ణరాయడే..” కలవరిస్తున్నట్టుగా ఉంది.. దీర్ఘ మౌనం.
కంపించే ఆయన స్వరం ఉన్నట్టుండి గంభీరమైపోయింది.
కృష్ణదేవరాయలకు అతినమ్మకమైన దండనాయకులు ఈయన పూర్వీకులట. హంపీ పతనానంతరం పెనుగొండకు తరలిపోయినా, తిరిగి మమకారం చావక ఈయన ఇక్కడికి వచ్చాడు. తన పాకలోంచి ఎర్రని నూలుదుస్తులు తీసి కచ్చ పోసి గోచి బిగించాడు. మేము ఊపిరి బిగబట్టి చూస్తున్నాం. తలక్రిందులుగా శీర్షాసనంలో బాణం సంధించాడు గాలిలోకి.. తటాలున యథాప్రకారం నిలబడి అది నేలరాలే లోగా ఇంకో బాణం వేసి మళ్ళీ దాన్ని గాలిలో నిలబడేలా చేశాడు. వేంకటాచార్యులు అంత వేగంగా కదులుతారని మేము ఊహించలేదు. రెండుచేతులా ఖడ్గ ప్రహారం చేస్తుంటే ఆ మెరుపులకు మాకు కళ్ళు బైర్లు కమ్మాయి. నది ఒడ్డున పెద్ద పెద్ద బండరాళ్ళను ఎత్తి అవతల విసిరేశాడు. ఆరున్నర అడుగుల నరహరి అంత భారీకాయుణ్ణి దూదిపింజలా గాలిలోకి లేపి జాగ్రత్తగా ఇసుకలో దొర్లించాడు. నరహరి పంతం మీద ఆయన దగ్గర కొన్నిరోజులు గడిపాము. మేము వచ్చేస్తుంటే అందరి నుదుట కుంకుమ దిద్ది ఉచ్చైస్వరంలో ఏదో అన్నాడు. తుంగభద్ర హోరులో కలిసిపోయాయి ఆయన మాటలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. దూరాన ఉగ్రనరసింహుడు మమ్మే చూస్తున్నాడనిపించింది. నరహరి ఆయనకు నమస్కరించి “క్షాత్రం ” అని ఇందాక ఆయన చెప్పినదేదో ఉచ్చరించాడు.
“బెల్లం కొట్టిన రాయిలా ఏమిట్రా ఉలుకూ పలుకూ లేదు. అమెరికా విశేషాలు చెప్పు.” నేనేదో చెప్పబోతుంటే సర్రుమని ఆపాడు వాన్ . స్నేహితుడి ఇల్లు వచ్చినట్టే వుంది. విశాలంగా వుంది. ఇద్దరం వెళ్ళి స్నేహితుడి ఇంట్లో చాయ్ లాంటిదేదో తాగాము. గతంలో ఆ ఇల్లు పండిట్ లదట. వారు లోయను వదిలి వెళ్ళిపోయాక స్థానికులు చవగ్గా కొనేసు కున్నారు. అట్టే ఎక్కువసేపు గడపకుండా నన్ను ఇంటిదగ్గర దింపి వెళ్ళిపోయాడు రావు.
5.
ఖండేల్వాల్ కు అమరనాథ్ యాత్ర గురించి కూలంకషంగా తెలుసు. యాత్ర శ్రీ నగర్ లో పంచమి రోజు మొదలయి ,పహల్గావ్ ,చందన్వారి ,శేషనాగ్ ,పంచతర్నీ ల మీదుగా కాలినడకన వెళితే శ్రావణపూర్ణిమ నాడు లింగదర్శనంతో ముగుస్తుంది. లేదంటే పహల్గావ్ కు కారు లో వెళ్ళి , అక్కడినుండి అమర్ నాథ్ నాలుగురోజుల్లో వెళ్ళిరావచ్చు. ఖండేల్వాల్ తనకు తెలిసిన మహంత(పూజారి)ని కలిసి వస్తానని వెళ్ళాడు. ఖండేల్వాల్ వచ్చేసరికల్లా ఓ నాలుగురోజులకు సరిపడా బట్టలు సర్దుకొన్నానంతే. “సాబ్ హమ్ చలేంగే” హారన్ మోగించాడు.
శ్రీనగర్ నుండి పహల్గావ్ సరిగ్గా అరవై మైళ్ళు . ఎన్నడూ చూడని చెట్లు..లోయ అందాలు.. ఖండేల్వాల్ ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. కొంపదీసి నన్ను భారంగా భావించడం లేదు కదా. నా ఊహ తప్పని అతను నన్ను గౌరవించే తీరే చెబుతోంది. రావు మాటలు గుర్తుకొచ్చాయి..” మా మొత్తం బెటాలియన్ లో ఖండేల్వాల్ తరువాతే ఎవరైనా “. అతని తీరు అంతేనేమో అని సరిపెట్టుకొన్నా. సరిగ్గా ఈ తరహా మౌనాన్నే ఆశ్రయించేవాడు నరహరి. ఎంతో అవసరమైతే గాని నోరు విప్పేవాడు కాదు. అందరూ వెక్కిరించేవారు. లెక్కచేసేవాడు కాదు. ఒకసారి నేను నిర్ఘాంత పోయే ఘటన ఒకటి జరిగింది. ఉగాది పండుగ వారి ఊరిలో బాగా జరుగుతుందని నన్ను తీసుకువెళ్ళాడు నరహరి.
ఆ కుగ్రామంలో స్తంభాకృతిలో వెలిశాడు నరసింహ స్వామి. విజయనగర కాలం నాటినుండి పూజాదికాలు జరుగుతున్నట్టు దాఖలాలు ఉన్నాయి. యుద్ధానికి పోయేముందు దండనాయకులు నరసింహ స్వామిని కొలిచి బయల్దేరే వారట. చాలా మహిమ గలవాడని చెప్పుకొనే వారు. మేము వెళ్ళే సరికి పూజారి మంత్రాలు వినిపిస్తున్నాయి. ఊరికి కొంచెం దూరంగా రైల్వేట్రాక్ అటూ ,ఇటూ పొలాలు. రాయలసీమ పల్లెయినా ఆ యేడు వర్షం బాగా అయినట్లుంది, పొలాలు పచ్చగా ఉన్నాయి. ఉండుండి ఒకటీ అరా రైలు కూతలు చప్పుడు వినిపిస్తున్నాయి. నరసింహ స్వామి చుట్టూ భక్తులు నిలబడుకొనే ఉన్నారు. పూజారి గడస్తంభంలా వంగిపోక పొడవుగా వున్నాడు. హారతి తీసుకు వచ్చాడు. కళ్ళకద్దుకొన్నాము. పూజారి మొహంలో ఏదో పరితృప్తి. తాను పుట్టిన చోటే స్వామి సేవలో గడిపి.. అదే మట్టిలో కలిసి పోతానన్న ఒక ఎరుకవల్ల వచ్చిన ప్రశాంతత .. ఒక మహాసామ్రాజ్య పరంపరలో తాను ఒకడినన్న లోలోపలి గర్వం వల్ల కావచ్చు. పూజముగిసింది. జనంలో కలకలం రేగింది. ఎవరో బొబ్బరిస్తూ ,జబ్బలు చరుచుకొంటూ లయబద్దంగా నర్తిస్తున్నారు. నా పక్కన చూద్దును కదా నరహరి లేడు. జనాలు తొక్కిసలాడుతున్నారు ” నర్సిమస్వామి వళ్ళు లోకి వచ్చినాడు” అని. పూజారి తటాలున దిగి జనాలను “శాంతం శాంతం” అని వారించాడు. అందరూ దూరంగా వైదొలగి నేలమీద మోకరిల్లారు. నా కళ్ళను నేను నమ్మలేక పోయాను నరహరి!! ఆలయ మార్దంగికుల తాళానుగుణంగా కళ్ళు, చేతులు తిప్పుతూ నర్తిస్తున్నాడు. జనాలందరినీ కోపంగా ,ఛీత్కారంగా చూస్తూ. భుజాలదాకా ఉన్న జుట్టు ఎగిరెగిరి పడుతోంది. టెంకాయలు ఫటా ఫటా మని పగిలాయి. పూజారి నృసింహస్తవం చేస్తూ కర్పూర హారతి మళ్ళీ తీసుకు వచ్చారు.”నర్సిమ స్వామిని రా! నలుచుకు తింటాన్రా!! ” అన్నట్టు ఎగురుతున్న నరహరి నుదుట నామం దిద్దాడు. ఇంతలో నరహరి లయ తప్పింది. దాసరులు “తండ్రీ” అని నరహరి పాదాలు మొక్కి నాగులకట్ట దగ్గర చామరాలు వీస్తూ విశ్రమింప చేశారు. అందరూ వెళ్ళి పోయారు. పూజారి తీర్థప్రసాదాలు తీసుకు వచ్చి “నాయనా ఏమి భక్తిరా నీది ఎన్నడో విన్నాను స్వామి వారు ఆవహించడం.. ఈ నాడు చూసినాను.” అని నిండుగా ఆశీర్వదించాడు.
“సాబ్ చాయ్ పీయేంగే”. ఖండేల్వాల్ వాన్ ఆపేశాడు. చల్లని వాతావరణంలో వేడి వేడి పానీయం లోనికి దిగుతుంటే.. ప్రాణానికి హాయిగా అనిపించింది. “సగందూరం వచ్చేశాం” అన్నాడు ఖండేల్వాల్ వాన్ స్టార్ట్ చేస్తూ. నాకు మగతగా నిద్ర పట్టింది. పహల్గావ్ లో లేచాను. సహ యాత్రికులు చాలామందే వున్నారు. ఈ పదేళ్ళుగా నాలో పేరుకుపోయిన ఒంటరితనం పారిపోతుందనిపించింది. కొందరు విదేశీయులు కూడా ఉన్నారు గుంపులో. నాలుగు రోజుల తర్వాత కలుస్తానని చెప్పి సెలవుతీసుకొని వెళ్ళిపోయాడు ఖండేల్వాల్ . ఎక్కడా బయట తిరగ వద్దని గట్టిగా హెచ్చరించాడు రావు. రమణికి ఫోన్ చేసే ఆలోచన విరమించుకొన్నాను. నైపాల్ నవల ఒకటి బాగ్ లో వుండాలి. మళ్ళీ ఉత్సాహం వచ్చింది. నవల చదువుతూ ఎప్పుడో నిద్రపోయాను.
6.
అంత రద్దీ ఉంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నడవలేని వారిని డోలీల్లో మోస్తూ యాత్రలో సాయంగా స్థానిక ముస్లిమ్ లు చాలా మంది వెనుకే వస్తున్నారు. లిడ్డర్ నదిమీదుగా పచ్చని చెట్లను చూస్తూ పరవశంతో నడుస్తున్నాం. కొంతమంది గొంతెత్తి పాడుతున్నారు. గుంపులో ఎవరిదో గొంతుక అప్పుడప్పుడు గంభీరంగా వినబడుతోంది. ఎవరో జర్మన్ విలేఖరి, పేరు కాఫ్ మన్ నాతో మాటలు కలిపాడు. నా ఫీలింగ్స్ ఎలా వున్నాయో చెప్పమన్నాడు. ” నాకంత భక్తి లేదు. నాలో కుతూహలం చాలా ఎక్కువ. చాలా కాలం నుండి చూడలేకపోతున్నా. ఈ సారి పట్టుదలగా వచ్చాను.”అని చెప్పాను. అతను స్టాలకైట్ , స్టాలగ్మైట్ ల గురించి వివరించి గుహలో లింగం స్టాలగ్మైట్ అని చెప్పాడు. ఆశ్చర్యంగా తనకు శివుడిలో భక్తి వుంది అని చెప్పాడు. తన తల్లితండ్రులు ఇద్దరూ చనిపోయారట. తను కొంత కాలంగా వార్తా పత్రికలకు రాస్తూ కాలం వెళ్ళ బుచ్చుతున్నానని చెప్పాడు. “చదువుకోవచ్చు కదా” అంటే తనకు academics లో ఆసక్తి నశించింది అన్నాడు. చందన్ వారీలో నైట్ కాంప్ . మనసెందుకో ప్రశాంతంగా అనిపించింది.
7.
చీకట్లో కలిసిపోతున్న వృక్షాలను చూస్తూ ఉండిపోయాను. నాకెందుకో సాయంత్రమంటే ఎక్కడో భయం.. దానికి రెండు బలమైన కారణాలే ఉన్నాయి. పిల్లలందరం ఒకసారి కోనకు వెళ్ళాం. మేడిపళ్ళు కోశాం. అంత లోతులేని కొలనుల్లో ఈదాం. చేపలు పాదాల చుట్టూ చేరి చక్కిలిగిలి పెడుతుంటే కేరింతలు కొట్టాం . మేము తింటూ, వాటికి ఆహారం వెదజల్లాం చుట్టూ ఉన్న పూదోటలను చూసి మురిసిపోయాం. తలో దిక్కుకు పోయారు. మాలో ముగ్గురికి మళ్ళీ కొలనులో ఈదాలనిపించింది. నరహరి తాను గట్టున కూచుని “మీరు ఈదండి ” అన్నాడు. కొలనులో ఒకవైపుకు వెళ్ళే కొద్దీ లోతు ఎక్కువవుతోంది. ధారపాతంగా పైనుండి కొత్త నీరు వచ్చి పడుతూనే ఉన్నాయి. నేనూ, రావు నీళ్ళు జల్లుకొంటూ వినోదిస్తున్నాం. మేము ఎంతసేపటికి బయటికి రాక పోయేసరికి నరహరికి విసుగొచ్చి మేము ఈదుతున్న కొలనుకు ఇరవై అడుగుల ఎత్తులో చరియ మీదికి ఎక్కి ప్రశాంతంగా కూచున్నాడు. నేను రావును భయపెడదామని కొలనులో ఒకమూలకు వెళ్ళాను. అంతే బుడుంగుమని మునిగిపోయాను. ఆకులు నీటిలో చెడతడిస్తే వచ్చే వాసన. ఒక్కసారి నాకేమీ తోచలేదు. స్కూలు, రేగిపళ్ళు ,జతగాళ్ళు అందరూ కళ్ళముందు కదిలారు. శక్తిమేరకు .. నేలను కాళ్ళతో తన్ని పైకి వచ్చాను. నరహరి చరియ దిగుతున్నట్లున్నాడు. కానీ నన్ను చూడలేదు. రావు నన్ను చూసే అవకాశం లేదు. మళ్ళీ మునిగిపోయాను. ఇంకో సారి మొత్తం శక్తినంతా కూడగట్టుకొని పైకి ఎగిరాను. నా బలం చాలలేదు. లాగేసుకొన్నాయి నీళ్ళు. అప్పుడు చూశాడు నరహరి. నిలుచున్న ఫళాన దూకాడు.. పెద్దశబ్దంతో! ఎడంచేత్తో నా మొలతాడు దొరకబుచ్చుకొని బరాబరా లాక్కొచ్చి బండరాళ్ళమీద కూచోబెట్టాడు. సాయంత్రం ఎండలో వణుకు తగ్గలేదు.. ఆ దెబ్బకి ఓ వారం రోజులు వళ్ళు స్వాధీనం తెలియకుండా జ్వరం వచ్చింది.
8.
ఇంకో సాయంత్రం నేనే కాదు. ఎవరూ మరచిపోలేరు. ఎంసెట్ రిజల్స్ట్ వచ్చాయి. నాకు వందల్లో రాంకు వచ్చింది. నరహరి పేరు ఊరంతా మార్మోగిపోయింది, తనకు స్టేట్ ఫస్ట్ రాంక్ వచ్చింది. నరహరి ఏడీ? కనిపించడే? నరహరి ఇంట్లో అందరూ ఆనందం పట్టలేక వాడికోసం చూస్తున్నారు. వాడిని కలవాలన్న ఆరాటంలో వారింటికి వెళ్ళాను. అప్పుడే వాళ్ళ నాన్నకు నరహరి రాసిన ఉత్తరం దొరికింది. తను ఇల్లు వదిలి వెళ్ళి పోతున్నట్టు. ఒక్కటే వాక్యం.
నరహరి ఎప్పుడో అన్న మాటలు ఒక్కసారి నా మనసులో మెదిలాయి. “భరించలేని దుఃఖం లో గాని, మితిమీరిన ఆనందం లో గాని కన్నీరు కార్చకు, అది నాకు అసహ్యం”
9.
మరుసటి రోజు యథాప్రకారం ఇనుమడించిన ఉత్సాహంతో బయల్దేరాం, శేషనాగ్ వైపు. దూరంగా ఏడు శిఖరాలు ఆదిశేషుణ్ణి పోలి; అందుకే వాటికాపేరు. అడుగు వేయటానికి కొంచెం శ్రమ పడుతున్నాం అనిపించింది. ఆవల అందంగా పారే నీరు. ఏదో పూవుల సుగంధం.. నాసాపుటాలకు సోకుతోంది. కాఫ్ మన్ పత్రికల కోసం చక్కని ఫోటోలు తీసుకొన్నాడు. నాకు కొన్ని ఫోటోలు తీశాడు. జర్మనీ వెళ్ళాక నా అమెరికా చిరునామాకు పంపుతానని మాట ఇచ్చాడు. శేషనాగ్ చేరుకొనే సరికి సాయంత్రం కావచ్చు. కాఫ్ మన్ తన ప్రియురాలు సారా గురించి ప్రేమగా తలచుకొన్నాడు. నేను రమణీ గురించి ప్రస్తావించాను. తనకు ఇలా ప్రపంచాన్ని చుడుతూ జీవించాలని వుందట. సారాకేమో జర్మనీలో స్థిరపడాలన్న కోరిక. కానీ కాఫ్ మన్ చక్కని బహుమతులు తీసుకువెళ్ళి , ఎప్పటికప్పుడు తన కోపాన్ని తొలగిస్తుంటాడట. నాకు షాపింగ్ పరమ బోర్ అని చెప్పాను. సాయంత్రం నాలుగవుతోంది. ఒక గంటలో శేషనాగ్ చేరుకొంటాం. మా ముందు యాత్రీకులు మామూలుగా నడుస్తున్నారు. వెనుక ఎవరో గానం చేస్తున్నారు. కాఫ్ మన్ తన కెమెరా లెన్స్ అడ్జస్ట్ చేసుకొంటున్నాడు.
కొండచరియలు దిగి మా వైపే పరిగెత్తుకొంటూ వస్తున్నారు కొందరు. యాత్రికుల్లా లేరు.. పహరా ఇచ్చే సైనికులు కారు.. ఒక్కసారి నా పై ప్రాణాలు పైనే పోయాయి. కాఫ్ మన్ ను హెచ్చరించేలోగా ధన్ ధన్ మని కాల్పులు. బాగా దగ్గరికి వచ్చేశారు. మాకు ముందున్న యాత్రికులు నేల కూలారు కాఫ్ మన్ కూలిపోయాడు భుజాన్ని అదుముకొంటూ. వారి మొహాలు నాకు కనిపిస్తున్నాయి.ఒక బుల్లెట్ నా చెవిని రాసుకొని వెళ్ళింది. ఇంకొకటి నా భుజాన దిగబడింది. నా వెనుక వున్నవారు గానంలో పడి ప్రమాదాన్ని గమనించలేదు. ఉన్నట్టుండి.. కాల్పులు ఆగాయి. టెర్రరిస్టుల గుంపులోకి దూకాడు ఎవరో ఏడడుగుల సాధువు ఎర్రని మొలనూలు! దుండగుల మొహాల్లో ఒక లిప్తపాటు ఆశ్చర్యం!!
శూలంతో వారి ఆయుధాలు ఎగురగొట్టాడు. వారు ఆశ్చర్యం నుండి తేరుకొనేలోగా ఊహించని రీతిలో కుత్తుకల్లో శూలాన్ని దింపి ఆరుగురిని చంపాడు. ఒకడు తప్పించుకొని యాత్రికుల వైపు ఉరికాడు. వాడిని వదలకుండా వెంబడించాడు. రక్తం చింది వక్షస్థలం ఎర్ర వారింది. భుజాలను దాటిన జుట్టు. నల్లని గడ్డం, మీసం తమ తోటి సాధువు నిటాలేక్షణుడిలా విరుచుకుపడటం చూసి కహ కహ మని శంఖాలు పూరించారు సాధువులందరూ. పర్వతసానువులన్నీ శంఖధ్వనితో వణికాయి.
యాత్రికుల వైపు ఉరికివస్తున్న దుండగుడు హఠాత్తుగా నిలిచి ఛురికతో పొడిచాడు సాధువుని. మరుక్షణం వాడిని బంతిలా ఎగరేసి ,మోచేతులతో పొడిచి, తొడమీద వేసుకొని అదిమిపట్టి, వక్షస్థలం చీల్చి నెత్తురు తాగాడు. కాఫ్ మన్ స్పృహ తప్పి పడిపోయాడు చూడలేక. నెత్తురోడుతున్న చేతులను తన జుట్టుకు తుడిచాడు. శూలం చేతబూని ఊగిపోతూ, హిమాలయాలు దద్దరిల్లేటట్టు సింహనాదం చేశాడు.. ఆగని శంఖ ధ్వని.
ఎవరో భక్తి పారవశ్యంతో సదాశివుణ్ణి స్తుతిస్తున్నారు.
“జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా కదంబ కుంకుమ ద్రవప్రలిప్త దిగ్వధూముఖే”
సాయంత్రం వెలుతురు అతని కళ్ళల్లో పడుతోంది.. ఒక తూష్ణీభావం .. ఛీత్కారం..
యాత్రికులు “భోలేనాథ్! మహా శంభో!!” అంటూ మూకుమ్మడిగా సాష్టాంగ పడ్డారు.ఎవరో సన్యాసి తన గానం ఆపలేదు.
జయత్వ దభ్ర విభ్ర మభ్ర మద్భుజంగ మస్ఫురా
ధగద్ధగద్ధగద్వినిర్గమత్ కరాళఫాల హవ్యవాట్
ధిమిధ్ధిమిధ్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళా
ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః
ఎవరో మహంత హారతి ఇస్తున్నారు సాధువుకు దగ్గరగా వెళ్ళి. హారతి వెలుతురులో అతని రక్తసిక్త కపోలం.. భయంగొలుపుతోంది.. తీక్ష్ణ నేత్రాలు.. భయమెరుగని నేత్రాలు ..నా వెన్నెముక చివరి నుండి జనించింది ఆశ్చర్యం..నరహరి !!
నా పెదాలు నాకు తెలియకుండా తెరచుకొన్నాయి.”నృసింహ స్తవం! నృసింహ స్తవం!” అని అరిచాను. నలుగురు దాక్షిణాత్య బ్రాహ్మణులు గుంపులోనుండి తోసుకొని వచ్చి శ్రావ్యంగా మంగళ వచనాలు మొదలుపెట్టారు.
10.
కళ్ళు తెరచి చూసేసరికి మిలిటరీ హాస్పిటల్లో నేను. పక్కనే కాఫ్ మన్ . రావు ,ఖండేల్వాల్ ఆత్రంగా చూస్తున్నారు. “హమ్మయ్య చచ్చి బ్రతికావురా శుంఠా” ప్రేమగా తల నిమిరాడు రావు. చాలా రక్తం పోయింది. దగ్గరికి పిలిచి రావుతో రహస్యంగా చెప్పాను. “నరహరిని చూశాను” అని. వాడు నవ్వి “నాకు తెలుసు” అన్నాడు. “అదెలా” అంటే ఖండేల్వాల్ ని చెప్పమన్నట్టు భుజం తట్టాడు రావు. “షేర్ బాబా ఖూన్ పీతే హై..సబ్ డర్తే హై ఉన్ సే” అన్నాడు ముక్తసరిగా.
రమణి వచ్చి వెళ్ళింది. ఐతే ఈ సారెందుకో తిట్టలేదు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. రావును పొగిడింది. రావు భరోసా మీద ఆంధ్రా తిరిగి వెళ్ళింది. గాయం మాను పట్టేదాకా అక్కడే వున్నాను. కాఫ్ మన్ నాకు తోడు. సారా జర్మనీ నుండి రాలేక పోయినా ఫోన్ చేస్తుండేది. ఇద్దరి గాయాలు మాను పట్టాయి. చేయి కదిలించ గలుగుతున్నాము. రావు క్వార్టర్స్ కు వచ్చేశాం. కాఫ్ మన్ నాతో పాటు హైద్రాబాద్ వస్తున్నాడు. నరహరి వృత్తాంతం జర్మన్ పత్రికల్లో రాయడానికి ఉబలాట పడుతున్నాడు. తనకు ఒకఫోటో, నరహరిది కావాలన్నాడు. శేషనాగ్ దగ్గర తను నరహరిని ఫోటో తీయలేక పోయినందుకు ఎన్నిసార్లు తన్ను తాను తిట్టుకొన్నాడో లెక్క లేదు. ఎట్టకేలకు మా ఇద్దరి న్యూ ఢిల్లీ ఫ్లైట్ టికెట్లు వచ్చేశాయి.ఆ సందర్భంగా చిన్న పార్టీ. కొత్తవారు ఎవరూ లేరు. మా నలుగురే.
11
రావు బ్లూ లేబిల్ తెరచి సోడా కలిపి నాలుగు గ్లాసులు నింపాడు.
అందరూ చీర్స్ చెప్పి తాగబోయేముందు నేనే ఆపాను one minute అంటూ.
రావు,ఖండేల్వాల్ ,కాఫ్ మన్ ప్రశ్నార్థకంగా చూశారు నా వంక.
“రావ్ , నరహరి ఈ పరిసరాల్లో ఉన్నాడని తెలిసికూడా నీవెందుకు కలవలేదురా?”
రావు నా వైపు చాలా ఇబ్బందిగా చూశాడు. అసలు విషయం చెప్పాలంటే ఈ గ్లాసు తాగవలసిందే అన్నాడు. go ahead అన్నాను.మేము చప్పరించడం మొదలు పెట్టాము. ఒక్క గుక్కలో ఖాళీ చేసి చెప్పాడు.
“వాడు పిరికివాళ్ళతో కలవడట” నాకు పొలమారింది.
రావే కొనసాగించాడు. “ఇంతవరకు వాడు మాట్లాడింది ఒక్క ఖండేల్వాల్ తోటే ” అప్పుడర్థమైంది నాకు, రావు ఖండేల్వాల్ ని నాకు నీడగా ఎందుకు వుంచాడో. ఖండేల్వాల్ లో ఏ భావం లేదు. ఎప్పటిలా మౌనంగా వున్నాడు. రావే అన్నాడు
“ఖండేల్వాల్ లెక్కలేనన్ని సార్లు ప్రాణాలకు తెగించి పోరాడాడు. జంకు లేదు” కాఫ్ మన్ నరహరిని కలవాల్సిందే అని తీర్మానించాడు. నాకూ కలవాలనే వుంది. రావు నవ్వుతూ అన్నాడు ” అయితే వచ్చే ఏడాది ఇద్దరూ రండి యాత్రకు అప్పుడు కలుద్దురు గానీ, కానీ జంకులేకుండా రావాలి!” ఏదో చెప్పబోతున్నాడు. కిటికీ అద్దం భళ్ళున పగిలింది. మా ముగ్గురి మొహాలు కళ తప్పాయి. ఖండేల్వాల్ వదనంలో ఏ మార్పు లేదు. నింపాదిగా తాగుతున్నాడు.. ఏ క్షణాన్నైనా పేలడానికి సిద్ధం అన్నట్టుగా అతని చేతిలో ప్రత్యక్షమైంది రివాల్వర్! నల్లపిల్లి అటుదూకి పారిపోయింది. పెద్ద పెట్టున నవ్వుకొన్నామందరం !