కవిత్వాన్ని ప్రోత్సహించే బాధ్యత మనందరిది.ఈ నడుమ సిద్ధాంతాల ముంతపొగ కొంత తగ్గినా ,ఇప్పటికీ ఇంచుక రసజ్ఞతగల రాతలు తక్కువే అని చెప్పాలి.అడపా దడపా పత్రికల్లో వచ్చే విడి కవితలు ఒకటి రెండు బావున్నా ,కవులు దీర్ఘకవితల దిగుడుబావుల్లోనో current affairs ల కందకాల్లోనో నానా అవస్థలు పడుతూనే ఉన్నారు.
“నయన్ హీన్ కో రాహ్ దిఖా ప్రభూ ” అని సూర్ దాస్ హృదయాన్ని పట్టుకొని గుండెను పిండివేస్తాడు సైగల్.మన కవుల్లో అధిక సంఖ్యాకులు రోజూ పాడుకోవలసిన పాట ఇది..లేదంటే మనం ‘ఛాయీ హై ,ఘన ఘోర్ యంధేరా” అని వాపోవలసి వుంటుంది..ఒక వైపు చలి ..దారి తోచని చిమ్మ చీకటి .. మనసంతా అతలాకుతలం… మరచిందేదో… తలచిందేదో తెలియదు.. ఎదను చీల్చివేసే ఉద్వేగ పరంపర… అదిగో కొన్ని తారలు ప్రకాశిస్తూనే ఉన్నాయి. హృదయానికి రవ్వల వెలుగు… కాసింత ఆశను ప్రసాదిస్తూ… మసకగానైనా దోవను పోల్చుకొని… సంపూర్ణ ధైర్యంతో… గమ్యం చేరుకోవడానికి.
కవిత్వ దేశికుడు మహాకవి ఇస్మాయిల్ మరణించి రెండు వసంతాలు.ఆయన పేరిట ఒక పురస్కారాన్ని నెలకొల్పి ఒక యువకవికి ఇవ్వాలన్న ఆలోచన వుంది..అందులో భాగంగా వారి కవిత్వాన్ని పుస్తకంగా తీసుకురావడానికయ్యే ఆర్థికభారం మాది.ఈ తరహా పురస్కారం చాలా దేశాల్లో ,భాషల్లో చాలా కాలంగా వున్నదే..
మనదేశంలో సర్కసులు, సినిమాలకే ప్రజాదరణ. ఆ ప్రజలకోసం కవిత్వాలు రాస్తున్నామని తొడ చరచుకొనే తోడర్మల్లులు, సర్వత్రా. ఇదొక పెద్ద ప్రహసనం. కవిత్వం లలితకళలకు తలమానికం. దాన్ని చలివేంద్రం సరుకుగా మార్చే ప్రయత్నాలు బెడిసికొడతాయి. కవిత్వాలు ఎవ్వరికీ అవసరం లేదు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఇదే వరస…
అమెరికాలో మంచి కవిత్వాన్ని అచ్చువేసే Copper Canyon Press తరపున ఉత్తరం రాస్తూ Peter Pereira అన్న కవి, కవిత్వాన్ని ఏ ప్రెస్సు ఎందుకు ప్రచురించదో చక్కగా చెబుతాడు నాలుగు మాటల్లో:
“Profit-driven publishing houses have all but abandoned poetry because of that often proven equation: sales of poetry cannot support the infrastructure required to create them” కవిత్వం అమ్మకాలు ప్రచురణ కయ్యే వ్యయభారానికి సరితూగవు. అయినా సరే, తెలుగునాట, కవిత్వ ప్రచురణ సప్తవ్యసనాల్లో ఒకటిగా చేరిపోయింది కాబట్టి, కవిత్వమో కాదో వివేచించుకొనే ఓపికలేని తెలుగు కవి ఏటికేడాది రాశులుపోస్తున్నాడు దీర్ఘమో హ్రస్వమో, పగ్గమో చేంతాడో ఏదో ఒకటి, తక్షణం చేబూని.
ప్రథమ ప్రచురణకయ్యే ఆర్థికభారాన్ని వహించడం ద్వారా యువకవులకు చేయూతనిచ్చి తద్ద్వారా కవిత్వాన్ని ధిమ్మసా కొట్టిన హైరోడ్డు మీదికి మళ్ళించే యత్నం.దీనివల్ల తెలుగు కవిత్వానికి ఏ మాత్రం స్వస్థత చేకూరినా అదే చాలు పదివేలు.
పార్థివనామ సంవత్సరం ఇస్మాయిల్ అవార్డ్ కు ప్రతిభగల కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి రచించిన ‘వానకు తడిసిన పూవొకటి” పుస్తకాన్ని ఎంపిక చేశామని తెలపడానికి సంతోషిస్తున్నాము.
తమ్మినేని యదుకుల భూషణ్