గతంలో, ‘ఈ రచన నా సొంతం, కాపీ, అనువాదం, అనుసరణ కాదు’ అని సంతకం చేసి హామీపత్రం జత చేసి పంపడం ఆనవాయితీ. కంప్యూటర్లు లేని కాలంలో రాయడం, సాఫు చేసి తిరగరాయడం అంత సులువు కాదు. రచయితకు ఎంతో ఓపిక కావలసిందే. అంతేకాదు, ఒక కథను లేదా వ్యాసాన్ని కాపీ కొట్టి పంపడం కూడా కష్టంతో కూడుకున్న వ్యవహారమే. కాపీ రచయిత కావాలన్నా కొంత ఓపిక అవసరం. అప్పట్లో అందరూ బాగా చదివే వారు, కాపీ రచనను గుర్తు పట్టడం సులభంగా ఉండేది. ఇప్పుడు తలచుకున్న మాత్రంగా కాపీ చేయగలరు. పత్రికలకు పంపగలరు. అచ్చు పత్రికలు ఇంచుమించు అన్నీ మూత పడ్డాయి. తరతమ స్థాయిలో ఉన్న సాహిత్య పత్రికలన్నీ మార్జాల అంతర్జాల పత్రికలే. పత్రికలు నడపడం, సంపాదక బాధ్యతలు నిర్వహించడం కంచిగరుడ సేవలో భాగమే. ఒక రకంగా రచనా వ్యవసాయంలో ఇది ట్రాక్టర్ యుగం. కష్టించే పాత ఎద్దులు లేవిక్కడ. ఎవరూ, అంత శ్రద్ధ పెట్టి చూడరు. ఈ రకంగా, కాపీ రచయితలకు ఇది స్వర్ణయుగం.
ఎవరైనా ఎందుకు కాపీ కొడతారు? తమవి కాని భావాలను తమవిగా ఎందుకు ప్రచారం చేసుకుంటారు? పేరు కోసం, గొప్ప కోసం. అభివృద్ధి చెందిన దేశాల్లో పేరు పొందిన రచయితల ధనార్జనకు లోటు లేదు.
ఎన్ని రకాలుగా కాపీ కొట్టవచ్చు అంటే: కొందరు మొత్తం వ్యాసాన్ని ఎత్తి రాస్తారు. అది మరీ ప్రాథమిక స్థాయి. మరికొందరు తెలివిగా అక్కడక్కడా మార్పుచేర్పులు చేసి ధీమాగా ప్రకటిస్తారు. కొంతమంది తమకు నచ్చిన వాక్యాలను మొహమాటం లేకుండా ఎత్తి రాస్తారు.
ఇతరుల వాక్యాలను, అభిప్రాయాలను మన రచనల్లో వెల్లడించినప్పుడు ఆ విషయాన్ని పాదపీఠికల్లో ఉటకించాలి. అది వ్యాసకర్త కనీస ధర్మం. ఎవరి దగ్గరైతే మనం నేర్చుకున్నామో వారికి శఠగోపం పెట్టరాదు. గురువుకే పంగనామాలు పెట్టడం న్యాయం కాదు.
ఇటీవలి కాలంలో (2012), జోనా లెరర్ (Jonah Lehrer) అన్న ప్రముఖ రచయిత గ్రంథ చౌర్యం (plagiarism) వివాదాల్లో చిక్కుకున్నాడు. కొలంబియాలో న్యూరో సైన్సెస్, ఆపై ఆక్స్‌ఫర్డ్‌లో సాహిత్యం, ఫిలాసఫీ చదువుకున్నాడు. నేచర్, సైంటిఫిక్ అమెరికన్ మైండ్, ది న్యూ యార్కర్, వాల్‍స్ట్రీట్ జర్నల్, వైర్‍డ్.కామ్ – ఇలా పేరెన్నిక గల పత్రికల్లో విరివిగా రాసేవాడు. మూడు పదుల పిన్న వయసు దాటకుండానే, మూడు మంచి పుస్తకాలు [Proust Was a Neuroscientist (2007), How We Decide (2009), and Imagine: How Creativity Works (2012)] రాశాడు. ఇమాజిన్ అన్న పుస్తకంలో బాబ్ డిలన్ మేధ (Bob Dylan’s Brain) అన్న అధ్యాయంలో – సృజనాత్మకత మీద బాబ్ డిలన్ అభిప్రాయాలుగా తనకు తోచిన వాక్యాలు ఉటంకించాడు రచయిత. మరో సంపాదకుడు మైఖెల్ మోయ్‍నహాన్‌కు (Michael Moynahan) అనుమానాస్పదంగా తోచి, ప్రశ్నలు సంధించే సరికి – చివరికి తీగ లాగితే డొంకంతా కదిలినట్టు – వ్యవహారం బట్టబయలైంది. ప్రచురణకర్తలు బాగా అమ్ముడు పోతున్న అతని రెండు కొత్త పుస్తకాల అమ్మకాలను నిలిపి వేశారు. చేసేదేమి లేక జోనా, ప్రపంచ ప్రఖ్యాత వారపత్రిక ది న్యూ యార్కర్‍లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, క్షమాపణలు చెప్పుకున్నాడు: “The lies are over now. I understand the gravity of my position. I want to apologize to everyone I have let down, especially my editors and readers.”
తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ (Knight Foundation) ఉపన్యాసంలో తన తప్పులను ఒప్పుకుని క్షమాపణ వేడుకున్నాడు.
మరో ప్రముఖ పాత్రికేయుడు ఛాల్స్ సీఫ్ (Charles Siefe) ప్రచురించే ప్రతి పదాన్ని పట్టి పట్టి చూసే ఒకప్పటి సంపాదక వ్యవస్థ లేకపోవడమే ఈ దిగజారుడుతనానికి కారణం అని అభిప్రాయపడ్డాడు: “I’m 10 years older than Lehrer, and unlike him, my contemporaries and I had all of our work scrutinized by layers upon layers of editors, top editors, copy editors, fact checkers and even (heaven help us!) sub editors before a single word got published.”
“సరిగ్గా, ప్రచురణలో సంపాదకుల పాత్ర తగ్గుముఖం పడుతున్న కాలంలోనే డిజిటల్ రంగం తలెత్తడం జరిగింది. వీటి మధ్య కార్యాకారణ సంబంధం ఉందా, లేదా అన్న విషయం ఆలోచించ వలసిందే” అని మరొక్క రచయిత, సంపాదకుడు స్టూవర్ట్ కెలీ (Stuart Kelly) అభిప్రాయపడ్డాడు.
మన పత్రికారంగంలో గ్రంథ చౌర్యం అనాదిగా ఉన్నదే. పెద్ద పెద్ద రచయితలు అనువాదాలు చేసేటప్పుడు సదరు కవి రచయితల మీద ఇతర విమర్శకుల అభిప్రాయాలను తెలుగు చేసి ఆ ఘనతను తమ ఖాతాలోకి వేసుకుంటారు. కవైనా, అనువాదకుడైనా, విమర్శకుడైనా మన దగ్గర స్వయంభువు – వారికి ఎవరి సాయం అవసరం లేదు. ఇతరుల కృషిని, మేధాశక్తిని మనం గుర్తించము. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, ఇతరుల సాయంతో తెలుసుకున్నాము అని పత్రికాముఖంగా తెలిపితే మన వాసి ముక్కబోదు. పుస్తక ప్రచురణలో ఎవరు మనకు ఏవిధంగా తోడ్పడ్డారో స్పష్టంగా పేర్కొనడం సాహిత్యమర్యాద. ఇది ఇలా ఉండనిస్తే, ఈమాటలో సరిగ్గా ఐదేళ్ళ క్రింద, అక్టోబర్ 2017 సంచికలో, సి. ఎస్. రావ్ (చేపూరు సుబ్బారావు) రాసిన వ్యాసం: తిలక్ కవితా మూలాలు – ఆయన సాధించిన సౌందర్యం గ్రంథచౌర్యానికి లోనయింది. ఇదెవరో అనామకుడు సోషల్ మీడియాలో కాపీ పేస్ట్ చేసుకోవడం వంటిది కాదు.
రెండేళ్ళ క్రితం, 2020లో యోగి వేమన విశ్వవిద్యాలయం తరపున తిలక్ శతజయంతి సందర్భంగా ఐదు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఆపైన ఆ సదస్సులో సమర్పించిన పత్రాలను తిలక్ సాహిత్యం – సందేశం అన్న పేరున ఒక సంకలనంగా ప్రచురించారు. అందులో ఎస్. పి. యూసుఫ్, ఎం. సి. జె. అన్న రచయిత ‘సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం తిలక్ కవిత్వం’ అన్న శీర్షికన (పే. 197-203) ఈమాటలో వచ్చిన సుబ్బారావుగారి వ్యాసాన్ని కొన్ని మార్పుచేర్పులు చేసి ప్రకటించారు. సదరు వ్యాసపు శీర్షిక రావ్‍గారి వ్యాసంలోని చివరి వాక్యం! అందులో వెల్లడించిన విషయాలు సుబ్బారావుగారు తప్ప మరెవ్వరూ రాయలేరు. తెలుగులో సి. ఎస్. రావ్‍గారు ప్రముఖ తిలక్ కవితాధ్యాయి. ప్రతి రచయితకు తమదైన శైలి ఉంటుంది. అక్కడక్కడ, పదప్రయోగాలు ఇతరుల కన్నా భిన్నంగా ఉంటాయి. కవిత్వం ‘కంఠస్థమవుతుంది’ అనడం మామూలు ప్రయోగం, ‘కంఠవశమవుతుంది’ అన్న లలితమైన ప్రయోగం రావుగారి వ్యాసాల్లోనే కనిపిస్తుంది.
“కంఠవశమయే గుణం కవిత్వం యొక్క అతిముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాపేక్షంగా చెప్పాలంటే ఛందోబద్ధమైన కవిత్వానికి కంఠవశమయే గుణం ఎక్కువగా వుంటుంది. ఆ కవి గొప్పవాడు కావచ్చు, కాకపోవచ్చు. ఆ పద్యం గొప్ప పద్యం అవొచ్చు, అవకపోవచ్చు. ఛందోభంగం కాకుండా వ్రాయబడితే చాలు కంఠవశమవుతుంది. ఇది పద్యం గొప్పదనం, ఈ ఛందోరీతులను రూపొందించిన ఆదికవుల, ఆలంకారికుల గొప్పదనం. కాని వచన కవిత కంఠవశమవడానికి వచన కవి అద్భుతమైన ప్రతిభ కలవాడై వుండాలి.”
ఇవేవీ పట్టించుకోకుండా, అందింది అందినకాడికి దొరకబుచ్చుకుని సదస్సులో వ్యాసాన్ని సమర్పించారు సదరు యూసుఫ్‍గారు. అంతేగాదు సదరు వ్యాసం, గ్రంథ చౌర్యం చేసిన రచయిత పేరు మీద వేమన విశ్వవిద్యాలయంవారు వేసిన ప్రత్యేక సంచికలో చోటు చేసుకుంది. తిలక్ కవిత్వ రహస్యాలను అవగతం చేసుకుని , ఆంగ్లంలోకి అనువాదం చేసిన తిలక్ పండితుడి రచనలే గ్రంథ చౌర్యానికి లోనవుతున్నాయి అంటే మన సాహిత్య వాతావరణం బాగు పరచలేనంతగా అఘోరించింది అన్న విషయం తెలుస్తోంది. అంతేగాక, ఈ సంఘటన, సంపాదక వ్యవస్థలోని లోపాలను బయట పెడుతోంది. గ్రంథచౌర్యానికి పాల్పడ్డ రచయిత సి. ఎస్. రావ్‍గారికి పత్రికా ముఖంగానో, కనీసం ఒక ఉత్తరమ్ముక్క రాసి తప్పు ఒప్పుకుని ఉంటే ఎంత హుందాగా ఉండేది?