అపారదర్శకం

తీపి పదార్థాలకు నోరూరదు

షోకేసు అద్దాలు నిస్వార్థంగా బ్రతుకుతాయి

జలపాతంలా దుమికే మౌనం చెక్కనావై పగిలిపోగలదు

భూమి గదిలో కునుకుతీసే కబోది లావాసర్పం ఏమీ గుర్తించలేదు

బైపాసు దారి కిక్కిరిసిపోతే వాహనాలకు విశ్రాంతి లేదు

ఇంధనంకోసం యాచిస్తూ సాగితే ప్రయాణం తెల్లారిపోతుంది

నివ్వెరపరిచే సూది చినుకులు కురుస్తూ వెలుస్తూ అదృశ్యమైపోతాయి

పసిపిల్లల కలల్లో పల్లకీ బోయీల పాదాల చప్పుళ్ళు వినిపిస్తాయి

వలపు చూపులు పొదుపు చేస్తే కోరికల పగ్గాలు తెగుతాయి

రాళ్ళు విసిరితేనే తినగల ఈతపళ్ళు రాలతాయి.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...