నాయనలేని ఊరు

నాయన లేని ఊరిలో
భయభయంగా అడుగు పెడతాను
ఏ యాడికో అనంతపురమో కాదు
ఖాయంగా నాయన ఇక రాడు.
లెక్కలేనన్ని గూళ్ళతో
ఎక్కి దిగిన వేపచెట్టు
ఒక్క రాత్రిలో
పక్కకు వాలిపోయింది.
ఈ ఉగాదికి
పూవులు లేవు
మృదువైన పూతా లేదు.
చేదు పచ్చడే మిగిలింది.
మీ అమ్మ జాగ్రత్త!!
ఒరేయ్‌!
నీవు రావడం నిజంగా
ఆలస్యమయిపోయింది.
లేవలేనురా, ఇక-
నలుగురి సాయం
కావలసిందే మరి.
నవ్వించి చంపేవాణ్ణి
నవ్వలేను, నాయనా!
శరీరం కొంత విశ్రాంతి
కోరుకుంది, అంతేరా
నాయనా!
మీయమ్మ జాగ్రత్త !!

(చిరకాల మిత్రుడు రాజుకు)


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...