బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ 2013

బ్రౌన్ పురస్కారం – 2013

నల్లగొండలో జననం (1923), సంస్కృత విద్యాభ్యాసం, తెలుగులో ఉన్నత విద్య, పరిశోధన, విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిపాలన, ఇటీవలే మహామహోపాధ్యాయ బిరుదాంకితులైన రవ్వా శ్రీహరి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణల విభాగానికి సంపాదకులుగా గురుతర బాధ్యత వహిస్తున్నారు. ఉభయ భాషా పాండిత్య ప్రౌఢితో అనేక ఉద్గ్రంధాలు రచించిన వీరు, పూనుకున్న పనులు ఒంటి చేత్తో పూర్తి చేయగల ప్రజ్ఞా ధురీణులు. అన్నమయ్య పదకోశాన్ని నిర్మించారు. సూర్యరాయాంధ్ర నిఘంటు శేషాన్ని ప్రకటించారు. విశేషించి నిఘంటు నిర్మాణంలో వీరి కృషికి గుర్తింపుగా విజయ నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వీరికి ప్రకటిస్తున్నాము. వీరి ప్రస్తుత నివాసం తిరుపతి.

ఇస్మాయిల్ అవార్డు – 2013

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు బండ్లమూడి స్వాతికుమారి ఎంపికైంది. నిండైన భావ ప్రవాహం, దానికి సరితూగే భాషా సంపద, ప్రయోగ ప్రియత, కవితా నిర్మాణంలో పరిణత శిల్పం నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు, పద్మలత, తులసీ మోహన్‌లకు ఈ అవార్డ్ లభించింది.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...