నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ?

కాంతి కిరణాలు చిమ్మబడ్డాయి.

నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ?

చీకటి సాలెగూళ్ళలా వేలాడుతున్న ఈ ఇంట్లోనేనా?

కిటికీ చువ్వలు..ప్చ్‌. కాలం తినేసింది.గాలి తినేసింది.నీరు తాగేసింది.

నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ?ఉన్నఫళాన ఇల్లు ఖాళీ చేయాల్సిన

అవసరమేమొచ్చింది?

ఆలోచనలు గట్టిరబ్బరులా సాగకుండా నిలిచిపోతున్నాయా?

మాటలు మంచులా గొంతుకండరాలను ఒరుసుకొని థగ్గు థగ్గున

రాలి పడుతున్నాయా?

ఇంతకీ నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ?

ఇదేమిటి ? విరిగిన ఈజీఛెయిర్‌.అలోచనలు..పడుకొని ఉంటాయి..

కదిలించకూడదు.విరిగినా, సరే దీర్ఘాలోచనలో అలోచనలు పడుకొని

ఉంటాయి.

ఈ వెలగని టేబుల్‌లాంపు..ఈ తిరగని ఫాను..సరిగా పడని కిటికీ

తలుపు..

నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ?

ఈ ఫానుకు.. రాత్రులు చీరల్లా చుట్టుకొన్నాయి

ఈ లాంపుకు.. ఎవరివో జతలకళ్ళు అతుక్కున్నాయి

ఈ కిటికీ రెక్కకు నిడుపాటి నిట్టూర్పులు కొట్టుకున్నాయి.

తలుపుకు గొళ్ళెం లేదా ? అసలు తలుపెక్కడ? ఈ నల్లని

తలుపులు..

ఎప్పుడూ మూసుకొనే ఉంటాయి.చల్లగాలి ..వేడిగాలి వేడుకొన్నాసరే..

కొద్దిగా వెళ్ళనిస్తాయంతే..

అసలు నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ?ఆశ్చర్యంగా.. అరవంలా ఉందే !


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...