రవాణా…

భారీ వాహనాలను అనుమతించకు

కూలే వంతెనల మీద..

బలహీనంగా ఊగే వంతెనల మీద

భారీ వాహనాలకు ఎదురు నిలువకు..

వేగ నిరోధాలు మరీ అన్ని ఎక్కువ కారాదు..

ఇక ప్రయాణమేముంది నిరోధాల మధ్య?

హారన్‌చప్పుళ్ళకు బెదిరి

ఆరాలు తీయడం మానకు..

కదిలేదే వాహనం..ఎన్నో వాహనాలు

ఎన్నో గొంతులు..ఎన్నో మోతలు

దూసుకుపోయే వాహనాలు

మోసుకుపోయే వాహనాలు

రాసుకుపోయే వాహనాలు..

లోయలలోకి జారిపోయే వాహనాలు

మంచులో కూరుకుపోయే వాహనాలు..

పల్టీలు కొట్టే..బోల్తాలు పడే వాహనాలు

మెరిసే రహదారి మీద..ఎరుపు రంగు

చిత్రించడం నేర్చిన వాహనాలు..

పట్టించుకోకు..మరచిపో..

చీకటిలో ప్రయాణం తప్పనిసరి

నొసట రెండు..వీపున రెండు

కళ్ళు తప్పనిసరి..

ఫ్లడ్‌లైట్‌లేని వాహనాలు

తరచు ప్రమాదాలకు

గురవుతుంటాయి


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...