దూరం వెళ్ళే కొద్దీ
దూరపు బంధుత్వాలు కూడా
దగ్గరగా తోస్తాయి
ఈ మహావృక్షంలో
ఏ పిల్లవేరు నీళ్ళులేక అల్లాడినా
నా కళ్ళల్లో నీళ్ళు నిలుస్తాయి
బాదరాయణ సంబంధాలు కూడా
ఈ పథ్యం నోటికి
పులపుల్లగా రుచి కలిగిస్తాయి
ఎవరెవరో విడిచిపెట్టారనిపిస్తుంది
ఆకాశంలో నెలవంక
రెక్కలు రెపరెపలాడిస్తూ కొంగలగుంపు ఎగిరిపోయాక
మిగిలిపోయిన కొంగలా కనిపిస్తుంది
కలుసుకోవాలనుంటుంది
రక్తనాళాల గజిబిజి దారుల్లో
తప్పిపోయిన ఒక రక్తపుబొట్టుని
తరాలుగా అందిన అంశలో
నూరోవంతైనా కలిసిన ఒక చేతిని
ప్రేమగా స్పృశించాలనుంటుంది