Transition

ఒక ఊరితో సంబంధం

హఠాత్తుగా తెగిపోతుంది.

ఆప్యాయం గా ఒక వ్యక్తి చుట్టూ అల్లుకున్న బంధం

స్ప్రింగులా విడిపోతుంది.

అనుకోకండా ఆకాశం రంగులు మార్చినట్టుగా,

అంతవరకు కళ్ళముందున్న దృశ్యం

ఒక్క తృటిలో తొలగిపోతుంది.

మనం ఏం చేస్తాం ?

కొత్త చోట మళ్ళీ వేళ్ళూనడానికి ప్రయత్నిస్తాం.

ప్రేమాస్పదంగా మరో కొత్త మొక్కని నాటి,

రోజూ నీళ్ళు పోస్తాం.

తెరమీద తరువాతి దృశ్యం కోసం

మన కళ్ళని సమాయత్తం చేస్తాం.

ఎన్నాళ్ళక్రితమో కన్న కల ఎప్పుడో మళ్ళీ

నీ కళ్ళని వెదుక్కొంటూ వస్తుంది.

చిన్నప్పుడు పాడి మర్చిపోయిన పాట

ఎక్కడో ఒక అపరిచిత స్వరం నుంచి వినిపిస్తుంది.

ఒకో జ్ఞాపకమైతే,

రోజూ వాడిపోయి,

రోజూ చిగురిస్తుంది.

కానీ, కొన్ని తిరిగిరావు.

కొన్ని ఎప్పటికీ పునరావృతం కావు.

వయస్సులా వాటి కలవాటు పడటం తప్పించి

కొన్నిటిని వెనక్కి మరల్చ లేవు.