ఒకొక్కరం ఒకో విధంగా
రంగ ప్రవేశం చేసినా,
మా బృందనృత్యం ఒక పద్ధతిగానే సాగింది.
ఒకరు ప్రపంచాన్ని సమ్మోహింప చెయ్యాలని,
ఒకరు ప్రజల మత్తు సంకెళ్ళని విడదియ్యాలని,
ఒకరు ఆశ్చర్యంతో చూసే లోకపు కళ్ళలోంచి
నిర్భయంగా నింగికెగయాలని
రకరకాలుగా ప్రయత్నించినా,
అంతగా గుర్తించలేని అంతస్సూత్రం ఏదో
మా ప్రదర్శనల్ని ఏకీకృతం చేసింది.
కాని, క్రమక్రమంగా ఒకరొకరు చెదిరిపోయారు.
అది విశ్రమించడమో, విరమించడమో తెలియని
విచిత్ర భంగిమల్లోకి కదిలిపోయారు.
జీవితం నిశ్శబ్దంగా పరచిన బాధ్యతల వలలో
ఒకో మూల ఒకరుగా పట్టుబడిపోయారు.
కలిసి నృత్యం చేసేటప్పుడు
ఒక తాళానికి, లయకి కట్టుబడినా,
ఆ కదలికల్లో ఎంత స్వేచ్ఛ ఉండేది!
పాదాల పరిధి మించని వృత్తంలో
బొంగరంలా గిర్రున తిరగడంలో
ఎంత విశృంఖలత్వం ఉండేది!
ఇప్పుడు నిర్మించుకుంటున్న నిబద్ధత వేరు.
అప్పటి కదలికల జ్ఞాపకాలు
మా కాళ్ళకి యింకా మరపురాక ముందే,
సన్నటి తీగెలా అల్లుకొనే ఈ బంధాలకి
సున్నితంగా తలవంచడమే లోక పద్ధతి.
ఒకొక్కరు ఒకో విధంగా
తెరమరుగైనా మా బృందనృత్యం
అందరూ అనుకొనే విధంగానే ముగిసింది.