ఈ గాయం స్రవిస్తూనే ఉంటుంది, డాక్టర్ !
నీ మౌనం చేసిన గాయం,
నా ప్రాణప్రదమైన వ్యక్తిని
నా నుంచి దూరం చేసినప్పటి గాయం,
అనంతకాలం అవిశ్రాంతంగా
స్రవిస్తూనే ఉంటుంది.
కాలం బాణం దెబ్బకి
ప్రాణం విలవిల్లాడినప్పుడు,
అచేతనంగా నిలబడిచూసిన
నీ కళ్ళలోని కాఠిన్యం
నన్నెంత దెబ్బతీసిందనుకున్నావు !
ఎన్ని మరుపుకుట్లు వేసినా
మళ్ళీ అది నోరు విప్పుతూనే ఉంటుంది.
చెమర్చని కళ్ళకి,
చలించని మనసుకి మందులేదు.
మానవత్వాన్ని మార్పిడిచేసి
నువ్వమర్చుకున్న అలసత్వానికి
విరుగుడులేదు.
డాక్టర్ , నీ వ్యాధి ఎప్పుడూ నయం కాదు.
నవనాగరికతారణ్యంలో
నువ్వు పొందుతున్న శిలీకరణానికి
తిరుగులేదు.
నువ్వు రోజూ ఎవరో ఒకర్ని గాయం చేస్తూనే ఉంటావు.
నీలో నిన్ను ప్రశ్నించే సమస్తాన్నీ మాయం చేస్తూనే ఉంటావు.
ప్రపంచం నిన్ను గౌరవిస్తూనే ఉంటుంది.
ఈ గాయం మాత్రం స్రవిస్తూనే ఉంటుంది.