అనావిష్కృతం

నేననుకోవడమేగాని,

ఈ మంచుగడ్డని నేను పగలగొట్టలేను.

మన మధ్య మాటల వంతెన కట్టలేను.

ఇవ్వి నేను ప్రేమతో పెంచుకొన్న పువ్వులు

మరిమరీ ముడుచుకుపోవటమే తప్ప సువాసనలై

విరజిమ్మడం వీటికి తెలీదు.

అమాయకంగా అన్నింటినీ పోగుచేసి పెడతాను.

నా పిచ్చిగాని,

నేనెవరితోనూ వీటిని పంచుకోలేను.

ఆలోచనలతో ప్రాంగణమంతా

అందంగా అలుకుతాను.

ఉత్సాహంతో ఊహల తోరణాలు కడతాను.

ఎవరెవరు వస్తారా అని

ఎంతగానో ఎదురు చూస్తాను

నా ఆరాటమేగాని,

నేనెవర్నీ లోపలికి ఆహ్వానించలేను.

నా మాటలు నాలోనే కరిగిపోతాయి.

నా చిత్రాలు నాలోనే చెరిగిపోతాయి.

నేనెన్నో ప్రకటించాలని

ఎన్నుకొన్న సన్నివేశాలు

అతి ఉదాసీనంగా ముగిసిపోతాయి.

నా వెర్రిగాని,

ఈ తెర నేనెప్పటికీ తీయలేను.