దామెర్ల రామారావు – బావిదగ్గిర (1925)
ఎక్‌ఫ్రాసిస్ (Ekphrasis) అనే ఈ ప్రక్రియ తెలుగు పద్యసాహిత్యానికి కొత్తది. ఇంగ్లీషు సాహిత్యంలో పాతదే! తేలిగ్గా చెప్పాలంటే ఒక బొమ్మకు వివరంగా మాటలు కట్టడం ఇది (a vivid description). గూగిలించడంలో చెయ్యితిరిగిన పాఠకులకి కీట్స్ (John Keats: Ode on a Grecian Urn), బ్రౌనింగ్ (Robert Browning: My Last Duchess) ఈ ప్రక్రియని చాలా రసవంతంగా వాడుకున్నట్టు కనిపిస్తుంది. అయితే నా ప్రయోగం కోసం ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్‌కి ఇంతకు ముందున్న నిర్వచనాన్ని నా అవసరం కొద్దీ నాకు నచ్చినట్టుగా మార్పు చేసుకున్నాను. నేను కవిని కాను. కాబట్టి నేనెరిగిన లబ్ధప్రతిష్టులైన కవుల కవితల నుంచి కొన్ని పాదాలు సందర్భోచితంగా సంగ్రహించి, అవసరమైనచోట్ల చిన్న సవరణలు చేసుకున్నాను.
A man’s reach should exceed his grasp
Or, what’s a Heaven for?
అన్నాడు బ్రౌనింగ్. అది ముమ్మాటికీ నిజం.
అమ్మ రాలేదేమే పిల్లమ్మా?
జరం.
మరి పెద్దక్క రావచ్చుగా?
పెద్దక్క బయటికి రాకూడదు.
చేదలో నీళ్ళు బిందెలోకి పోస్తూ,
నువ్వు ఇకనించీ ఓణీలు వేసుకోవాలి.
మరి, రెండు బిందెలు తెచ్చావు, మొయ్యగలవుటే?
‘ఆహా. ఇంచక్కా ఎత్తుకొపోతా.’
చోద్దెం చూస్తావేంట్రా నారిగా? పిల్లమ్మ నెత్తిన బిందెలెత్తి పెట్టు.’
మంచి కుర్రాడు, నారిగాడు. అందరికీ తలలో నాలిక.
నీళ్ళు తోడి పెడతాడు. నిండిన బిందెలెత్తి నెత్తిమీద పెడతాడు.
చంద్రమ్మ గారి చిన్న కోడలు
ఊరికి కొత్త కోడలు, బిందెడు
నీళ్ళూ వలక పోసుకుంది
ఇంకా అలవాటు పడలేదు
నీళ్ళ బిందె నిండుగా నింపి ఎత్తడం
చంటి పిల్లని చంకనెత్తడం
చేతకాదుగా!
పెద్ద కోడలు చూస్తున్నది
లేదు. ఏదో చెపుతూన్నది
ఖాళీ బిందె పట్టుకొని.
నీలం చీరలో నిలబడి
కబుర్లాడుతోంది కామాక్షి,
చీర కుచ్చెళ్ళు ఎత్తిపెట్టి
ఏమీ పట్టించుకోకండా.
బిందె వళ్ళో పెట్టుకొని
అమ్మ పేరమ్మ చప్టామీద
తీరిగ్గా.
చిన్న కూతురు చూస్తున్నది
చిన్న బిందె వయ్యారంగా పట్టుకొని
‘పదవే, పోదాం అన్నట్టు.’
రెండు బిందెలూ నిండుగా నింపుకొని
ఇంటికి పోతున్న ఇద్దరు మగువలు.
చుట్టాలొచ్చారు గాబోలు
తొందర తొందరగా
పోతున్నారు, ఇవ్వాళ.
నూతిచుట్టూరా చెట్లు.
పాతవానల రహస్య నిద్రల్ని తట్టి
పాతస్మృతుల సుడిగుండాల్ని గాలించి
ఆ తపించే వర్తమానం కోసం
శైతల్యాన్ని తెస్తాయి, చెట్టూ, బావీ.
పొద్దు ‘పొడిచేవేళ’ కడవలనిండా చీకట్లతో బిలబిలమంటూ
అమ్మలక్కలు చేరేవాళ్ళు. పిచ్చాపాటీ మాట్లాడుకునేవాళ్ళు.
అది ఆనవాయితీ.
ఏ రోజన్నా ఎవళ్ళన్నా బావినీళ్ళకోసం రాకపోతే అందరికీ ఆదుర్దా.
వాళ్ళు వెళ్ళేటప్పుడు హాయిగా చీకట్లని ఒంపేసి తిరిగి పోయేవారు.
అవి చెరగని స్మృతులు.
భళ్ళున తెల్లారకముందే
క్యూలో బిందెలు బిందెలు
అదే బావిగట్టుమీద.
బావులన్నీ ఎండిపోయాయి
ఊళ్ళల్లో కొళాయిలు
ఉన్నాయి కోకొల్లలు;
కొళాయిలన్నీ నాయుళ్ళకి
రాయుళ్ళకి కాకుల లెక్కకోసం.
ఒక అమ్మడు బిందె
అర ఇంచీ ముందుకు
జరిపితే మరొక అమ్మడు
అరుపులూ, సొరుపులూ
జుట్టూ జుట్టూ పట్టుకొని
కొట్లాటలు ఇప్పుడు.
పడిగాపులు పడగా పడగా
ఎప్పుడో ఒకప్పుడు
లారీలో నీళ్ళొస్తాయి
బిందెల్లో నీళ్ళు పడతాయి,
ఇప్పుడు.
నూతిలో తాబేలుందంటే
పరిగెత్తరు పిల్లలెవరూ!
పాడుబడిన బావి
తడి ఆరిన నేల
అడుగున తాబేలు లేదు
విడిపించటానికి.
And voices singing
out of empty cisterns
and exhausted wells అంటాడు ఎలియట్.
అది పాడుపడిన బావి
ఆ నూతిలో గొంతుకలు
అరిచి చచ్చినా వినిపించవు.
ఇప్పుడు
రోజు రోజుకీ
మరీ అరుదైపోతున్న
మరొక రామారావో,
వేరొక శివాజీ, భూపతో
కరుణించి దయాకరుడో
వారేవా వీరభద్రుడో
బ్రాహ్మీమయస్సామియో
ఎవ్వరయినా సరే!
‘బావిదగ్గిర నీళ్ళకోసం’
మరొక కొత్త బొమ్మ గీయాలి.
లేకుంటే, ఏ ఆస్కార వైలుడో
రాజరాజనగరంలో పాతబొమ్మని
చీరి చింపేయచ్చు.