నీ క్షణికానందాన్ని
ఆమె తొమ్మిది నెలలు మోసింది.
వీడైతే దానిని
నూరేళ్ళూ మోయవలసినవాడు.
ఇంకా నీ బెల్టు చారల్ని,
వేళ్ళ ఆనవాళ్ళని కూడా
ఎక్కడ మొయ్యమంటావు చెప్పు !
నీకోసం ఆమె
తన నవ్వులన్నీ మూటగట్టి ఇచ్చేసింది.
వీడైతే, తన బాల్యాన్నే బొమ్మ చేసి
నీ చేతుల్లో పెట్టాడు.
ఇంకా ఏం ఇమ్మంటావు చెప్పు !
ఇంత జరుగుతున్నా,
ఇంకా నీ జీవితపు మోళీ
అద్భుతంగా ఉందని
లోకాన్ని నమ్మించడానికి,
ఆమె బాధల తాటి మీద
పడిపోకుండా నడిచి చూపించాలి.
వీడు కోతిలా గంతులేసి,
కిచకిచలాడాలి.
ఇందులో ఏదో మోసం ఉంది.
నీ అధికారపుటంధకారంలో జరుగుతున్న ఆటలో
ఎక్కడో క్షమించరాని దోషం ఉంది.