రంగు

ఏదో ఒక రుతుబలహీనతకి లోబడి
వేరు పడుతుందేగాని
పచ్చగా కలిసి ఉండటమే
చెట్టుకి హాయి.

అందుకే రంగుమారిన మరుక్షణం నుంచి
రాల్చటం మొదలెడుతుంది.

కలవని రంగెపుడూ బరువౌతుంది.
(రాల్చలేని రంగు మరింత భారం.)

అంతా ఒకే రంగైనప్పుడు
అంతగా ఇబ్బంది ఉండదు.
ఎవరూ ఎదుట నిలబడి
వింతగా పరికించరు.
తన సహ అచరులన్నిటి మధ్య
తానూ ఒకటి.

పలురకాల పరిణతులతో
నింగిదాకా ఎదిగిన చెట్టుకి
రంగిచ్చే గుర్తింపుతో పనిలేదు.

మెల్ల మెల్లగా ఆకులన్నీ రాల్చి
మళ్ళీ ఒకటయ్యే రోజుకోసం చూస్తుంది.
ఏనాటికైనా,
ఆకుపచ్చ మేఘంలా వచ్చే వసంతమే
దాని కోరిక తీరుస్తుంది.