గాయం

ఆ పూట గాయాలు ముందు పోసుకుని కూచున్నాడు తాత. మనవడికి ఒక్కోటీ చూపెడుతూ.

చిన్నప్పుడు గడప తగిలి బోర్లా పడి తగిలించుకున్నదీ. వెంటపడి కరిచిన కుక్క పంటి గాట్లూ. గోడ దూకీ, చెట్టు మీదనుంచీ పడినప్పటివీ. ఆటల్లోవీ. ఏదో పోటీ పడీ. ఓడీ. ఎవరితోనో గొడవ పడీ. కొన్ని దురాశ పడీ. నవ్వుతూ మనవడికి వర్ణించి చెబుతున్నాడు. గర్వంగా సాధించిన పతకాలు చూపినట్టూ. సిగ్గుపడుతూ రహస్యాలు చెప్పుకుంటున్నట్టూ.

చివరికి మిగిలిన గాయాన్ని చూపుతూ అడిగాడు మనవడు ‘దీని గురించి చెప్పవేమిటి? ఇంత లోతు గాయం ఎట్లా అయింది? ఇంకా మానలేదేమిటి?’

తాత కాసేపు ఏమీ మాట్లాడలేదు. కళ్ళలో వెలుతురూ, చీకటీ. మెరుపూ, మబ్బూ. నవ్వూ, ఏడుపూ. జీవితమూ, మృత్యువూ. స్వర్గమూ, నరకమూ.

చివరికి నోరు పెగుల్చుకుని చెప్పాడు. ‘ఎవరిని అమితంగా ప్రేమిస్తామో వాళ్ళే చేయగలరు ఇంత లోతైన గాయం! ఎంత దగ్గరయితే అంత లోతుగా. ఇది మానేది కాదు. మానాలనీ అనుకోను.’

‘ఇంకా మోసుకు తిరుగుతున్నావా? పారేయాల్సింది కదా! ఈ బాధ ఉండేది కాదు.’

తల అడ్డంగా ఊపుతూ గాయాన్ని తడుముకుంటూ తాత అన్నాడు ‘ఈ గాయానికి దుఃఖించకపోవడం కంటే దుఃఖకారకం మరొకటి ఉండబోదు.’

గాయం మరి కాస్త పెద్దదయింది. కొత్తగానూ అయ్యింది. ఎర్రెర్రని జీరలుగా మెరుస్తూ.


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...