కదిలే కథ మధ్య
కదలకుండా నిలిచేదానా !
కదలని మనసుల్ని కూడా
కదిలించేదానా !
పొలం గట్టున పొరపాటున
మొలిచినట్టున్న గులాబీ మొక్కా !
ఎంత వయారంగా విరబూసావు నువ్వు !
అయినా, ఈ సన్యసించిన వాడి కథలో
నువ్వెలా ఇమడగలిగేవు ?
రాళ్ళమధ్య రెక్కలార్చిన రాజహంసా !
నువ్వు విడదీసేది ఘట్టాల్ని కాదు;
కథ నుంచి దాని అసలు సారాన్నే
అవలీలగా వేరు చేస్తున్నావు.
అడవికి బయల్దేరిన గౌతముడు
నిన్ను చూడగానే ఎందుకు ఆగిపోలేదో !
నీకు శోకం లేదు, మృత్యువు లేదు,
ముసలితనం లేదు;
శతాబ్దాల తరబడి చెరగని రూపంతో
మెరిసే శిల్పమా !
ఏ సిద్ధార్థుడూ నిన్ను ఎందుకు గుర్తించలేదు ?
వేదన ప్రక్క నువ్వు; వైరాగ్యం ప్రక్క నువ్వు;
వెలిగే జ్ఞానం ప్రక్క నువ్వు
చిరునవ్వువై, మండే కోరికవై,
మహత్తరమైన అందానివై కనిపిస్తావు
జీవితంలో వైరుధ్యాలన్నిటికి
నువ్వే సరైన భాష్యంగా అనిపిస్తావు.
నువ్వు మా జీవితపు విలువల పునాదుల్ని
తుదకంటా కదిలించే ప్రశ్నవి.
మేం ప్రదర్శించే నిర్లిప్త వదనాల మీద
అందమైన మచ్చవి.