మిత్రులు లేకపోయినా ఫరవాలేదు
కాని, శత్రువు లేకుండా బ్రతకటం కష్టం.
అజాత శత్రువంటే ఇక్కడ
జీవన్మృతుడని అర్థం.
ఇంతాజేసి, ఇదంతా ఒక ఆట.
ప్రతి ఆటలోనూ సహచరులకంటే
ప్రత్యర్ధి పాత్రే ముఖ్యం.
ఎన్ని బంధాలు తెంచుకున్నా,
చివరికి జయాపజయాల
వలలో చిక్కుతాడు మనిషి.
గెలుపును మించిన మాదక ద్రవ్యాన్ని
మనమింకా కనుగొనవలసే ఉంది.
అడవిని జయించి కూడా
దాని న్యాయానికే తలవంచిన
వింత జంతువు మనిషి.
కొత్త సమీకరణాలెన్ని సృష్టించినా,
శత్రుత్వం స్థిర సంఖ్య
శత్రువే మారుతూ ఉంటాడు.