ప్రవాస జీవితంలో ఒక చిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. మాతృదేశం నిరంతరం మనసులో మెదులుతూనే ఉంటుంది. ఇది మన నేల కాదని, ఇది మన సంస్కృతి కాదనే విషయం అనుక్షణం తెలుస్తూనే ఉంటుంది. ఐనా, అంత పరాయిగా అనిపించే వాతావరణానికి కూడా ఒకరకంగా అలవాటుపడిపోతాం. అలా అలవాటు పడటం వల్ల కొంత అలసత్వానికి లోనయ్యే అవకాశం ఉంది. అటువంటి సమయంలో బయటనుంచి వచ్చినవారెవరో ఇక్కడున్న భిన్నత్వాన్ని, సహజసిద్ధమైన అందాల్ని కొత్తగా చూసి వ్యాఖ్యానిస్తే అది ఆసక్తికరంగా ఉంటుంది. దానివల్ల, అలవాటైపోయిన మన పరిసరాలు, వాతావరణం మళ్ళీ విభిన్నంగా కనిపిస్తాయి. యాత్రా సాహిత్యానికున్న ప్రయోజనాల్లో ఇది కూడా ఒకటి.
ఖండాంతర కవిత్వం
పర్యటన కోసమో, చుట్టపుచూపు గానో అమెరికా వచ్చిన వారు రాసిన రెండు పుస్తకాలు ఇటీవల వెలువడ్డాయి. వాటిలో మొదటిది శ్రీ వి. ఆర్. విద్యార్థి రాసిన కవితా సంకలనం “ఖండాంతర కవిత్వం”. రెండవది ప్రసిద్ధ నవలా రచయిత శ్రీ “అంపశయ్య” నవీన్ రాసిన యాత్రానవల “అమెరికా, అమెరికా”. దేశమంటే మట్టా, లేక మనుషులా అన్న ప్రశ్న ఎప్పట్నించో ఉన్నదే. బహుశ రెండూ ముఖ్యమే ననుకుంటాను. శ్రీ విద్యార్థి కవితలు ఈ మట్టిని పరిచయం చేసుకొంటూ కవి తనలోతాను జరుపుకొనే అన్వేషణగా సాగితే, శ్రీ నవీన్ నవల ఇక్కడ తనకు పరిచయమైన మనుషుల జీవితాల్లో ఉన్న చీకటి వెలుగుల అన్వేషణగా సాగింది.
శ్రీ విద్యార్థి సంకలనంలో ఇక్కడి అడవులు, సరస్సులు, గుహలు మొదలైన పర్యాటక ప్రదేశాల్ని వర్ణించే కవితలనేకం ఉన్నాయి. ఐతే, ఈ వర్ణనలో ఎక్కడా పర్యాటక దృష్టి కనబరచకుండా, కవి తనకై కలిగిన అనుభూతిని, ఆలోచనని, తన్మయత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అందుకే, వాటికి కవిత్వ విలువ ఏర్పడింది. అంతే కాకుండా, ఈ కవికున్న లోతైన సౌందర్య దృష్టి కూడా పలు కవితల్లో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. పూసిన చెట్టు సద్దుల బతుకమ్మ కావటం, మంచు కురిసే కాలంలో ఊరే ఒక కత్తుల కార్ఖానా కావటం, జెట్ విమానాలు ఆకాశంలో పొగ ముగ్గులు పెట్టి సంక్రాంతి సంబరాలు జరపటం వంటి అనేక పదచిత్రాలు ఈ కవితల్లో మనకు అడుగడుగునా ఎదురౌతాయి.
పర్యాటక ప్రదేశాల్నే కాకుండా, వింత గొలిపే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్ని వర్ణించే కవితలు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు, నేలంతా మంచుతో కప్పబడి ఉన్నప్పుడు, వెలుగులు నిండి కనిపించే రాత్రి గురించి రాసిన కవితను తీసుకోవచ్చు. ఆ రాత్రిని వర్ణిస్తూ
ఆకాశం
అవనికి ప్రతిబింబమై,
అవని
ఆకాశానికి ప్రతిమానమై
భూమి నుండి
ఆకాశం దాకా
చంద్రుడు లేని
వెన్నెల వెలుగులు
అని చెప్పటం బాగుంది. అటువంటి రాత్రిని “స్నోవెల్” అని పిలుస్తారని ఎక్కడో విన్నట్టు రాశారు. ఆ పదం నాకెక్కడా దొరకలేదుగాని, కవిత మాత్రం అందంగా వచ్చింది.
ప్రకృతిని ప్రేమించే, దానితో చెలిమికట్టే కవితలనేకం ఈ సంకలనంలో ఉన్నాయి. ఐతే, ఎక్కడెక్కడో ఉన్న అడవులు, సరోవరాల గురించి రాసినప్పటికంటే, వారి ఇంటి పెరట్లో ఉన్న చెట్టు గురించి రాసిన కవితలో కవిత్వం బాగా పలికింది (పెరటి చెట్టు వైద్యానికి పనికి రాకపోవచ్చుగాని, కవిత్వానికి బాగానే పనికివస్తుందన్నమాట). ఇందులో, దాదాపు నాలుగు వందల సంవత్సరాల వయసున్న ఓక్ వృక్షం వివిధ రుతువులలో, వివిధ సందర్భాలలో ఎలా కనిపించిందో చాలా హృద్యంగా వర్ణింపబడింది.
“పొద్దు పొడుపులో
జ్యోతిర్ నర్తకి
సంజ వెలుగులో
హోమకీలాతాండవం
వర్షం కురుస్తున్నప్పుడు
ఇదో శబ్దసాగరం
కవితా జలపాతం”
… ….
“అక్టోబర్ లో ఇది
కుంకుమకొండ
నవంబరొస్తే
పసుపురాశి
డిశంబర్ నుండి మార్చి దాకా
నగిషీల వెండి రేకులతో మలచిన
ఒక మహా కలశం”
కవి ఈ చెట్టుని ఆ ఊళ్ళో తననెరిగిన ఒకేఒక్క మనిషిగా భావించటం,”ఎన్నో నిద్రారహిత రాత్రులకు ప్రత్యక్ష సాక్షి”గా అనుకోవటం కవి అనుభవించిన ఒంటరితనానికేగాక, ప్రకృతితో ఏర్పరుచుకున్న సాన్నిహిత్యానికి కూడా ప్రతీకగా భావించవచ్చు.
అందమైన దృశ్యాల్ని చూసి, మైమరచి ఆనందించటమే కాదు, ఆ అనుభవాన్ని కవిత్వంగా మలచే నేర్పు కూడా ఈ కవికుంది. కవితా నిర్మాణంలో ఆయనకున్న నైపుణ్యాన్ని సూచించటానికి ఒక చిన్న పద్యం ఉదహరిస్తాను. ఈ కవిత పేరు “వల-చేప”.
ఈ ఉదయం శిశిరారణ్యపు వలలో
చిక్కుకున్న చంద్రవంక
చేపపిల్లలా కొట్టుకొంటు
వలసబోయిన వసంతం
తిరిగివచ్చేదెప్పుడో
వలలన్నీ ఆకులెనుక
వొదిగిపోయేదెప్పుడో
ఇందులో ఎండిన చెట్లతో ఉన్న వనాన్ని వలగా భావించటం మళ్ళీ వసంతం వచ్చేసరికి ఆ వలే ఆకుల వెనకాల చేరిందని చెప్పటం ఎంతో హృద్యంగా ఉంది. ఇలా కవితలో ముందువాడిన ఒక పదచిత్రాన్ని పొడిగించి రెండవ భాగంలో చెప్పటం శిల్ప రీత్యా విశేషమైనది. ఈ సందర్భంలో ఇస్మాయిల్ గారు రాసిన ఒక కవిత గుర్తుకు వస్తుంది. రాలిన ఆకులు వీపుల మీద మ్యాపుల సహాయంతో మళ్ళీ వృక్షాగ్రాన్ని చేరి, చలిని చావుదెబ్బ తీస్తాయని రాస్తారందులో. ఆ కవితలో ఉన్న ఊహా వైచిత్రి వంటిదే పై కవితలో కూడా మనం గమనించవచ్చు.
ప్రకృతిలోని సౌందర్యాన్ని చూసి ఆనందించటం, దానికి స్పందించటం ఒక స్థాయి అనుభవం. దీనిని మించిన ఒక అనిర్వచనీయమైన, బహుశ అలౌకికమైన అనుభవాన్ని వర్ణించే పద్యాలు రెండు శ్రీ విద్యార్థి రాశారు. ఆ అనుభవం – సృష్టిలో అంతర్గతంగా ఉన్న చైతన్యంతో ఒక లిప్తకాలం పాటు అనుసంధింపబడినప్పుడు కలిగే విశిష్టమైన అనుభవం. “ఆ లోకం” అన్న కవితలో, తనకు ఎక్కడెక్కడ అటువంటి అనుభవం ఎదురయిందో చెబుతూ
మా ఊరి తాటి వనంలో
‘సిమ్లా’ పర్వత పంక్తుల్లో
‘షిల్లాంగ్’ లోయల గుంపుల్లో
‘జియాన్ నేషనల్ పార్కు’ లో
‘ఆల్ప్స్ పర్వతాల్లో’
ఇలా ఎక్కడైన కావచ్చని సూచిస్తారు. వీటిలో మేఘాలయాలోని ఒక లోయలో కలిగిన అనుభవాన్ని విపులంగా వివరిస్తూ రాసిన కవిత “స్మరణ మందిరం”. అక్కడ తనకు కనిపించిన వెలుగు ఉభయ సంధ్యల్లో లేని, ఎండా వెన్నెలా కాని దివ్యతేజస్సని చెబుతూ ఆ అనుభవాన్ని
క్షణం పాటు
విస్మయం
జీవితకాలం
తన్మయం
అని సూత్రీకరిస్తారు. సామాన్యమైన,అందరికీ తెలిసిన అనుభవాన్నిగాక, ఇటువంటి అరుదైన, ఎంతో వ్యక్తిగతమైన అనుభవాన్ని కవితగా చెప్పటం, తద్వారా దాన్ని మనకు దగ్గరగా తీసుకురావటం అభినందించదగిన విషయం.
ఈ సంకలనంలో నాకు అసంతృప్తి కలిగించిన విషయాలు ఒకటి రెండు లేకపోలేదు. మొదటిది – కొన్ని కవితలలో శైలి కాస్త పాతగా అనిపిస్తుంది. ఎదుటి మనిషితో సంభాషిస్తున్నట్టుగా కవిత సాగినప్పుడు అక్కడక్కడ బిగువుని కోల్పోయే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా, కేవలం ఆలోచనలగురించి చెప్పే “అంతర్ యానం” వంటి కవితల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. అలాగే, అతిమంచితనం వల్ల, కొన్ని కవితలు మొహమాటానికి రాశారేమో ననిపిస్తుంది. ఉదాహరణకు, పూర్తిగా రిపోర్టు లాగా సాగిన అట్లాంటా డైరీ, డెట్రాయిట్ డైరీ వంటి కవితలు. వీటిలో ప్రస్తావించిన వివరాలు కవి ముందుమాట వంటిది రాసి, అందులో ప్రస్తావించి ఉంటే బాగుండేది. ఐతే, ఇదే సందర్భంలో అట్లాంటాలో నివసించే పెమ్మరాజు దంపతుల గురించి రాసిన “మిధునం” కవిత మాత్రం చక్కగా ఉండి, వీరిద్దరినీ ఎరిగున్నవారికి ఆహ్లాదం కలిగిస్తుంది.
ఈ సంకలనానికి శ్రీ నవీన్ చాలా విపులమైన ముందుమాట రాశారు. అందులో ఈ కవితల్లో ఉన్న కవిత్వం గురించేగాక, అసలు కవిత్వమంటే ఏమిటన్న విషయం మీద తనకున్న అభిప్రాయాలను బాగా వివరించారు. శ్రీ విద్యార్థి ఈ కవితా రచన చేస్తూ అమెరికాలో ఉన్న సమయంలోనే ఆయన అమెరికా పర్యటనకు రావటం కూడా ఈ కవితల సందర్భాన్ని అవగాహన చేసుకోవటంలో తోడ్పడి ఉండవచ్చు. ఈ ముందు మాట మాత్రమే కాదు, ముందే చెప్పినట్టు, శ్రీ నవీన్ తన పర్యటన అనుభవాల ఆధారంగా ఒక యాత్రా నవలనే రాశారు. దాని వివరాలు ఈ సమీక్ష తరువాయి భాగంలో ప్రస్తావిస్తాను.
(ఖండాంతర – వి.ఆర్.విద్యార్థి, Dec 2007, వెల:Rs.60, $5.99, కాపీలు: విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి లేదా రచయిత vrvidyarthi@hotmail.com)