ఉత్పల మాలికల కన్నింటికి యతి గణ ప్రాసలు ఒక్క విధంగానే ఉంటాయి. కానీ, ఆ మాలిక యెత్తుగడలో, ముగింపులో, విరుపులో చూపించే వైవిధ్యము, వైచిత్రి చేత అది ఒకొక్క విశిష్టశక్తిని సంతరించుకుంటుంది. సీసములు, కందములు కూడా ఇట్లాగే పెంపొందింపబడ్డాయి. సంస్కృత సమాస కల్పనమే శిల్పం కాదు. సందర్భ స్వభావానుకూలంగా ప్రదర్శించే ఉత్కృష్ట నిర్మాణ చాతురీ విశేషమే శిల్పం అవుతుంది.
ఇది శ్రీ గుంటురు శేషేంద్ర శర్మగారు తన సాహిత్యకౌముదిలో పద్య శిల్పం గూర్చి ఇచ్చిన వివరణ. పద్య శిల్పం అన్న పదానికి ఇది చక్కని నిర్వచనం. అందులోనే వారంటారు, “పద్య శిల్ప లక్షణాల నన్నింటినీ క్రోడీకరించి, వ్యాకరణ ఛందోలంకార శాస్త్రాలు సృష్టింపబడినట్లే ఒక పద్య శిల్ప శాస్త్రం సృష్టించాలి.” అవును నిజమే! వెయ్యేళ్ళ చరిత్రగల తెలుగు పద్య వైశిష్య్టాన్ని పట్టిచ్చే పద్య శిల్పాన్ని గూర్చి, ఒక సమగ్రమైన శాస్త్రం ఇంతవరకూ రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇది ఇటు పద్య ప్రియులైన పాఠకులకీ, అటు పద్య కవులకీ కూడా తీరని లోటు. పద్య కావ్యానుశీలనలో భాగంగా ఆ కావ్యంలోని పద్య శిల్పాన్ని గూర్చిన విశ్లేషణ మనకు కనిపిస్తుంది. అలాగే మహాభారతం వంటి కావ్యాలలోని ఛందశ్శిల్పాన్ని గురించిన పరిశోధనా గ్రంథాలు కూడా వెలువడ్డాయి. కానీ, వివిధ కవులు, విభిన్న ఘట్టాలలో విశిష్టంగా నిర్మించిన పద్య రచనా శిల్పాలను అనుశీలించి, కొన్ని సూత్రాలుగా ఏర్పరచి, ఆయా నిర్మాణ వైఖరుల సార్ధక్యాన్ని రసభావ పోషణ కనుకూలంగా సమన్వయించి చెప్పిన ఒక సమగ్రమైన శాస్త్రం గానీ సిద్ధాంత గ్రంథంకానీ యింతవరకూ తెలుగులో రాలేదు. ఈ దిశగా ఔత్సాహికుల దృష్టిని మళ్ళించడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఈ వ్యాసం. ఇందులో, తెలుగు పద్యాలలో కనిపించే వివిధ శిల్ప విశేషాలను స్థాలీపులాక న్యాయంగా (అంటే నాకు తెలిసున్నంత వరకూ అన్న మాట) రుచిచూపించడానికి ప్రయత్నిస్తాను.
చెప్పాలనుకున్న విషయానికి అనుకూలమైన ఛందస్సుని ఎన్నుకోవడం ప్రతి పద్య కవికీ తెలియవలసిన ప్రాథమిక పద్య శిల్పం. దీనికి మొట్టమొదటి కొలబద్ద పద్యప్రమాణం. ఉదాహరణకి, ఒక పెద్ద వర్ణనని చెయ్యాలంటే, అందుకు కందం, ఆటవెలది వంటి చిన్న పద్యాలు సరిపోవు. ఏ ఉత్పలమాల వంటి వృత్తమో, ఇంకా పెద్దదయితే సీసపద్యమో వ్రాయాలి. అలాగే ఒక చక్కని సూక్తిని చెప్పాలంటే, దానికి క్లుప్తత సూటిదనాన్నిస్తుంది కాబట్టి, ఒక కందం కానీ, ఆటవెలది కానీ బాగుంటుంది. ఇక పద్యప్రమాణం దాటి మరొక అడుగు ముందుకు వేస్తే, ఒక ఛందస్సుకుండే ప్రత్యేకమైన నడక లేదా గతి, లేదా మరేదైనా విశిష్టత ఆధారంగా, చెప్పే విషయానికి అనుగుణంగా ఛందస్సు నెన్నుకోవడం మరొక శిల్పం. దీనికే వృత్తౌచిత్య మని పేరు. ఈ వృత్తౌచిత్యాన్ని గూర్చి, సంస్కృతంలో క్షేమేంద్రుడు తన “సువృత్తతిలకము”లో చర్చించాడు. వీర రౌద్రాది రసాలకు “వసంత తిలకము”, సర్గాంతమున “మాలిని”, ఠీవి,ఓజస్సు, శౌర్యము వర్ణించడానికి “శార్దూలము” ఇలా మొత్తం ఇరవైనాలుగు వృత్తాలగూర్చి అతను చర్చించాడు. మన తెలుగు కవులు ఈ విషయాలను కొన్నిటిని గ్రహించి తదనుగుణంగా రచన చేసిన సందర్భాలున్నాయి. అయితే స్వతంత్రించిన సందర్భాలు అంత కంటే చాలా ఉన్నాయి!
భారత కవులు, ముఖ్యంగా నన్నయ్య, తిక్కన్న, కంద పద్య విశిష్టతను గుర్తించి దానిని భారతంలో విరివిగా వాడుకున్నారు. కందం కేవలం పదహారుగణములు మాత్రమే ఉన్న చిన్న పద్యం. అంతే కాక త్వరిత గతి కలిగినది. కథాకథనంలో వేగం అవసరం కనుక దానికి యీ కందం చాలా అనుకూలమైనది. ఈ రహస్యం తెలుసు కనుకనే భారతకవులు కందాన్ని తఱచుగా వాడి ఉంటారు. ఇలాగే, పద్యపు నడకని ఆధారం చేసుకుని కొన్ని విశేష వృత్తాలను, కొన్ని విశేష సందర్భాలలో ప్రయోగించడం కూడా కొంత మంది కవులలో చూడవచ్చు. ఉదాహరణకు, “లయగ్రాహి” విశిష్టమైన ఖండగతి లయతో, ప్రాసయతి వల్ల వచ్చే శబ్దసౌందర్యంతో అలరారుతుంది. ఇది మనోజ్ఞమైన వర్ణనలకు అనుకూలమైనది. నన్నయ్య చేసిన వసంత వర్ణన బహుళ ప్రసిద్ధం. అలాగే, పేరుకు తగ్గట్టు, “ఉత్సాహ” వృత్తం ఉత్సాహంతో ఉరకలువేస్తూ ఉంటుంది. ఉత్తేజాన్ని కలిగించవలసిన సందర్భాలలో దాన్ని ప్రయోగించడం సముచితం. “మధ్యాక్కర” సాధారణ సంభాషణలకు సహజంగా ఉంటుంది.
ఇక, పద్యం “ధారాశుద్ధితో” చెప్పడ మన్నది మరొక ప్రసిద్ధమైన శిల్పం. ఈ శిల్ప నైపుణ్యంలో నన్నయ్య ఆద్యుడేకాదు, అనల్పవేద్యుడు కూడాను. “ధారాశుద్ధి” అంటే చేంతాడంత సమాసాలను ప్రయోగించడమని కాదు. పద్యానికి ఒక ప్రవాహ గూణం చేకూర్చడం.
వీడొక మంత్రసిద్ధుడగు విప్రుడసాధ్య బలున్ బకాసురున్
నేడని జంపెనట్టె యతనిం జని చూతమ యంచు జెచ్చెరం…
ఇందులో పెద్ద పెద్ద సమాసాలులేవు. కానీ ఆశ్చర్యోద్వేగాలకు తగిన ఒక చక్కని ధార ఉంది. పద్యాన్ని ధారా శుద్ధితో వ్రాయడం అంత సులువైన పని కాదు. కవి మనసులో ఆలోచనలు సరాసరి పద్యరూపంలో రూపుకడితేనే, అసాధారణ ధార సాధ్యమవుతుంది. అంతేకాని వచ్చిన ఆలోచనలని గణ యతిప్రాస బద్ధం చెయ్యాలని ప్రయత్నిస్తే మాత్రం అది అంత చక్కగా సాధ్యపడదు. నన్నయ్య తర్వాత “ప్రసిద్ధ ధారా ధుని” అనిపించుకున్న కవి శ్రీనాథుడు. ఆధునిక కాలంలో అవధానాలలో పద్య ధారకు విశేష ప్రాథాన్యం వచ్చింది. ధారవల్ల పద్యానికి వచ్చే ప్రవాహగుణం శ్రోతలకు మనోహరంగా ఉండడమే ఇందుకు ముఖ్య కారణం. అయితే యీ ధార వల్ల ఒక చిక్కుంది. పద్యాన్ని “ధారవంతంగా” వ్రాయాలంటే, అది “సారవంతంగా” ఉండడానికి కొంత కష్ట మేర్పడుతుంది. ఎందుకంటే, ధార చెడకుండా ఉండడం కోసం కొన్ని వ్యర్థ పదాలని వాడవలసి రావచ్చు. దానివల్ల కవిత్వం పలచబడుతుంది. పద్యం రసవంతంగానూ ధారాపూర్ణంగానూ వ్రాయాలంటే, నన్నయ్య వంటి వాగనుశాసనునికే సాధ్యం. అందుకే కాబోలు తిక్కన్న దీనికి అంతగా ప్రాథాన్యాన్ని ఇవ్వలేదు.
ఇక, మరొక ముఖ్యమైన పద్య శిల్పం, విషయానుకూలమైన వాక్యనిర్మాణం. ఇక్కడ వాక్యనిర్మాణమంటే, నా ఉద్దేశ్యం, కేవలం సమాస ప్రయోగం మాత్రమే కాదు. పద్యంలోని ఛందస్సుకీ, వాక్యాలకీ మధ్యనుండే సంబంధం. ఉదాహరణకి ఉత్పలమాల ఛందస్సు “భ ర న భ భ ర వ”. అయితే అందులోని పదాల, వాక్యాల విఱుపు ఆ గణాలనుబట్టీ ఉండనక్కరలేదు. ఈ క్రింది రెండు ఉత్పలమాల పాదాల మధ్యనున్న తారతమ్యం గమనించండి
ఈ చిగురాకు నీ ప్రసవ మీ పువుదేనియ యెంత యొప్పెడున్
సారథి ఛాందసుండు బడి సాగదు చక్ర యుగంబు ప్రార సం
ఇలా ఒక పాదాన్ని తీసుకుంటే కొన్ని వేల రకాల గతులతో కూర్చవచ్చు. ఒకొక్క గతికి ఒకొక్క విశిష్టత ఉంటుంది. అన్ని గతులకూ విశిష్టత ఉండకపోవచ్చు. ఏ సందర్భంలో ఎలాంటి గతి సరిపోతుందో తెలుసుకుని ఆ గతిలో పద్యాన్ని నడిపించడం ఒక గొప్ప శిల్పం. అయితే ఇది అంత సులభంగా పట్టుబడేది కాదు. దీనిని గూర్చి ఎంతో కొంత పరిశోధన జరిగితే బాగుంటుంది. ఒకో ఛందస్సులో వ్రాయబడిన రకరకాల పద్యాలని తీసుకుని, వాటిలోని వాక్యనిర్మాణాన్ని తులనాత్మకంగా పరిశీలించ వచ్చు. ఇందుకొక చిన్న ఉదాహరణ, ఈ క్రింది పద్యాన్ని పరిశీలిద్దాం
సంతోషంబున సంధి సేయుదురె, వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ
కాంతం జూసిననాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ
పొంతన్ నీ సహ జన్ము రొమ్ము రుధిరమ్మున్ ద్రావునాడైన ని
శ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించు నాడేనియున్
ఈ పద్యం మొదటి పాదం గతి “తానానానన తాన తాననన”. ఇందులో పెద్ద ఉద్వేగమేమీ ధ్వనించడం లేదు. అదే చివరి రెండు పాదాలూ “తానా తా ననతాన…” అని మొదలౌతుంది. ఇందులో ఒక ఠీవి, ఔద్ధత్యం ధ్వనిస్తున్నాయి. అది అక్కడ యెంతో అవసరం కూడా! “జెండా పై కపిరాజు” నడక కూడా యిదే! ఇలా ఒకొక్క పద్య గతికున్న విశిష్టతనూ పరిశీలించ వచ్చు. ఇక సమాస ప్రయోగం గూర్చి చూద్దాం. పద్యాలలో పెద్ద పెద్ద సమాసాలను ప్రయోగించడం కవులు తమ పాండిత్య ప్రకర్షని ప్రదర్శించడానికే చేస్తారని ఒక అభిప్రాయం ఉన్నది. చాలా మంది సాధారణ కవుల విషయంలో ఇది నిజం కూడానూ. అయితే ఒక మంచి కవి యెప్పుడూ సందర్భోచితంగానే సమాసగ్రథనం చేస్తాడు. ఈ శైలి సాధారణంగా వర్ణన సందర్భాలలో గాంభీర్యతని సంతరించడానికి ఉపయోగపడుతుంది. సంభాషణలలో ఇది అంత సముచితం కాదు. అయినా చెప్పవలసిన విషయం గంభీరమైనదైతే, ఒక తీవ్రత కలదైతే సముచితమైన సమాస ప్రయోగం చెప్పే విషయానికి గురుత్వాన్ని చేకూరుస్తుంది. తిక్కన్న గారి ప్రసిద్ధ పద్యం, “దుర్వారోద్యమ బాహు విక్రమ…” అందరకూ తెలిసినదే. ఇందులో ఒక సమాసం రెండు పాదాలను ఆవరిస్తుంది. ఇక్కడ ద్రౌపది ఎంత తీవ్రంగా కీచకుని హెచ్చరించినదో చక్కగా ధ్వనిస్తోంది. ఒక దీర్ఘ సమాసాన్ని, పై చెప్పిన రస భావపోషణకు మాత్రమే కాక, ఒక విశేషాన్ని స్ఫురింప జెయ్యడానికి కూడా వాడవచ్చు. మచ్చుకి యీ విశ్వనాథ వారి పద్యాన్ని చూడండి
నిశినిశి యెల్ల నింద్రునకు నీల సరోరుహ లోచనా వచో
నిశిత మనోహరార్థ విపణీ కృత ధీకునకున్ మనోనుగా
విశదతనూ సమార్ద్ర వినివేశన దర్శన ధీఝరీ సహ
స్ర శకలితాక్షి గోళునకు సాగియు సాగదు కోడికూయదున్
ఇది ఇంద్రుడు అహల్యాసంగమం కోసం రాత్రంతా నిరీక్షిస్తున్న సందర్భం. చెప్పవలసిన సారాంశ మేమిటయ్యా అంటే, ఇంద్రునికి ఆ రాత్రి చాలా దీర్ఘంగా గడుస్తోంది అని. ఈ పద్యములో, రెండు చాంతాడు సమాసాలతో ఇంద్రుని విశేషణాలు ఉన్నాయి. సరే ఆ సమాసములలోని అర్థౌచిత్యాన్ని ప్రస్తుతం ప్రక్కన పెడదాం. అంత పొడుగు సమాసా లిక్కడ వెయ్యడములోని ఔచిత్యమేమిటి? జాగ్రత్తగా గమనిస్తే “నిశి నిశి యెల్ల సాగదు” అన్న వాక్యానికి మధ్యలో రెండు పద్య చరణా లాక్రమించాయి, ఈ సమాసాలు. రైలు చాలా మెల్లగా వెళుతోందని చెప్పాలనుకోండి; సాధారణముగా “రైలు చాఆఅ….ల మెల్ల్ల్..లిగ” వెళుతోంది అంటాం. అలా సాగదీయడం వల్ల మనము స్ఫురింపజేసేదేమిటి, అది అంత మెల్లిగా సాగుతోందని. ఇక్కడ ఈ చాంతాడు సమాసాలు సరిగ్గా అలాటి పనే చేస్తున్నాయి. పైగా అవి సందర్భోచితమైన విశేషణా లవడం చేత మరింత భావవ్యంజకముగా ఉన్నాయి!
ఇటువంటి దీర్ఘ సమాసప్రయోగం మన తెలుగు పద్యాలలోనే సాధ్యం. ఎందుకంటే, మనకు “యతి”, విరామ నిర్దేశం చెయ్యదు కాబట్టి. అలాగే పాదాంత విరామం, అంటే, పాదాంతంలోని పదం రెండవ పాదంలోకి వెళ్ళకూడదు అన్న నియమం, మనకు లేదు. ఇది తెలుగు పద్యాలలో లయ రాహిత్యానికి దారితీసిందన్న అపవాదు ఉంది. అయితే దీనివల్లనే తెలుగు పద్యానికి ప్రవాహ గుణం వచ్చిందని నా అభిప్రాయం. సందర్భాన్ని బట్టి ప్రవాహగుణం కన్నా లయే ప్రథానమని కవి భావిస్తే, పద్యాన్ని అలాగే నడిపించడానికి కవికి స్వాతంత్య్రం ఉండనే ఉంది కదా! ఇలా, కవి సందర్భోచితంగా నిర్మించిన ఈ క్రింది పద్య శిల్పాన్ని గమనించండి
అది రమణీయ పుష్పవన, మా వనమందొక మేడ, మేడపై
నదియొక మారుమూల గది, ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లు మీదుగాన్
ఇది కూడా చాలమందికి తెలిసినదే, కరుణశ్రీ కుంతికుమారి లోని పద్యం. ఇందులో ఒక చలనచిత్రం లాగా కవి దృశ్యాన్ని సాక్షాత్కరింప చేసాడు. కేవలము దృశ్యం తరువాత దృశ్యం చూపెడుతూపోతే అది మంచి photography అయిపోదు. ఒక దృశ్యాన్ని చూపించడానికి కొంత సేపు దాని మీద focus చేసి ఉంచాలి. మెల్లగా తరువాతి దృశ్యాన్ని చూపించాలి. ఇది పద్యంలో ఎలా సాధ్యం? ఒకొక్క దృశ్యాన్ని వర్ణించే వాక్యం, యతి స్థానం ముందరో, పాదాంతములోనో ఆగిపోతుంది. దీనితో చూపిన ప్రతి దృశ్యము పాఠకుని మనస్సులో focus అవుతుంది. కవి తీర్చిన శిల్పం ఇదీ. అంతేకాక మూడవ పాదంలోని “జంకు” అన్న పదం, సగం మూడవ పాదంలోనూ, మరో సగం నాల్గవ పాదంలోనూ పడింది. ఇది ఆ జంకు వల్ల కలిగే అడుగుల తడబాటును ఎంత చక్కగా స్ఫురింప జేస్తోంది!
వాక్యనిర్మాణమే కాక, మొత్తముగా ఒక ఛందస్సు స్వరూపాన్ని ఆకళించుకొని ఒకొక్క ప్రత్యేకమైన రీతిలో ఒకొక్క విశేషాన్ని తెలియజేయడానికి ఉపయోగించడ మన్నది మరొక గొప్ప శిల్పం. ఉదాహరణకు ఆటవెలది ఛందస్స్వరూపాన్నీ, అందులోని విశిష్టతనూ గుర్తించి దానిని సమగ్రముగా, సమంజసముగా వాడుకున్న కవి, వేమన! ఆటవెలదిలోని చివరి చరణాన్ని మకుటము చేసి, మిగిలిన మూడు పాదాలలోనూ చక్కని సూక్తులను సూటిగా చెప్పడం అతనికే సాధ్యమయింది. మొదటి రెండు పాదాలలో విశేషాన్ని చెప్పి, మూడవ పాదంలో ఒక సామాన్య విషయముతోనూ, లేదా రెండు పాదాలలో సామాన్య విషయాన్ని చెప్పి మూడవ పాదములో విశేషముతోనూ అర్థాంతరన్యాసము చేసిన తీరు అనితరసాధ్యం!
కందాన్ని సర్వ లఘు కందంగా తీర్చడం కూడా ఇటువంటి శిల్పమే. ఇది కేవలం చిత్రకవిత్వమని చాల మంది అభిప్రాయం. నిజమే, సందర్భోచితము కానప్పుడు అటువంటి రచన చిత్రకవిత్వమే అవుతుంది. సందర్భౌచితి కలిగి ఉంటే? అది శిల్పమౌతుంది. ఉదాహరణకి ఈ పోతన కందాన్నే చూడండి
హరి హరి! సిరి యురమున గల
హరి హరిహయు గొఱకు దనుజు నడుగగ జనియెన్
పరహిత రతమతి యుతులగు
దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్
దీనిగూర్చి నా మాటలుకన్నా విశ్వనాథవారి మాటలలో చెప్పడమే సమంజసం. “కవిత్వము తొలుత శబ్దము నాశ్రయించును. తరువాత భావము నాశ్రయించును. ఆ తరువాత అలంకారములు ఔచిత్యము ధ్వని రసము ఇట్లు పెరుగుచు పోవును. ఈ పద్యములో నన్నియు లఘువులు, రెండు పాదముల చివళ్ళ గురువులు తప్ప. ఇట్లు వ్రాయుచు మహాకవి ఆ రచన ప్రయోజనమును చూపించును. ఇది వామనావతారములోని పద్యము. చాల గొప్పవాడొక చిన్న పని చేసినప్పుడు మనము తక్కువ గొంతుతో దానినిగూర్చి మాటాడుదుము. ఇది మానవ స్వభావము. అందుచేత లక్ష్మీదేవి, ఱొమ్ము మీద కల భగవంతు డెక్కడ! తానెవ్వని కొఱకో యాచించుటకు పోవుటెక్కడ! దానిని కొద్ది గొంతులో చెప్పవలయును. కావ్యములో గొంతులేదు. అక్షరములు శబ్దములు నున్నవి. కనుక నా యక్షరములు శబ్దములు గొంతు ననుకరించినట్లు చేయుట శిల్పము.“
ఇక, సీస పద్యంతో మన తెలుగు కవులు ఎన్ని లయలని మరెన్ని హొయలని సాధించారో వివరించాలంటే, అదొక పెద్ద వ్యాసమే అవుతుంది. మచ్చుకి ముచ్చుటగా మూడు
దైతేయ మదవతీ ధమ్మిల్లములతోడ
విరుల నెత్తావికి వీడుకోలు
దనుజ శుద్ధాంత కాంతా కటాక్షములతో
గలికి కాటుకలకు గాని వావి
దానవ మానినీస్తన కుంభముల తోడ
బసుపు బయ్యెదలకు బాయు
తెరువు దైత్యావరోధన దయితాధరములతో
సొబగు వీడెములకు జుక్క యెదురు
చేసి సురసుందరీ కరోశీరతాల
వృంత చలితాంత కుంతల విలసదింద్ర
కులవధూటీ లలాటికా కుంకుమంబు
బదిల పఱుప చక్రంబ నీ భరము కాదె.
ఇది సీస పద్యపు తూగుని సాంతం చూపించే రమణీయమైన పద్యం; నాచన సోమన రచించిన ఉత్తరహరివంశము లోనిది. ఇందులో సీసపాదం మొదటి భాగం సంస్కృత పదాలతోనూ, రెండవ భాగం తెలుగు పదాలతోనూ కూర్చడం వల్ల మంచి సొగసు వచ్చింది! అందులోనూ, రాక్షస స్త్రీల వర్ణనకు ప్రౌఢ సంస్కృత పదములు, వాటినుండి విముక్తమయ్యే సుకుమార అలంకారాలను గూర్చి జాను తెలుగు పదములు ప్రయోగించడం రస వ్యంజకంగా ఉంది. సీసమంతా, చక్రం రాక్షస వనితల సౌభాగ్యాన్ని పోగొట్టే విధానం వర్ణించి, చివరి ఎత్తుగీతిలో దేవ వనితల మాంగల్య రక్షణ గూర్చి చెప్పడంతో పద్యము మంగళాంతమయింది!
ఇటువంటి సీసపద్యాలను వ్రాయడంలో, తరువాత శ్రీనాధుడు ప్రసిద్ధి కెక్కాడు. ఈ పద్యమే బహుశా అతడికి మార్గం చూపెట్టి ఉండవచ్చు!
అయితే సీసపద్యానికి ఉన్న ఇంత చక్కని హొయలుని కాదని, వేరే విథంగా కూడా వ్రాయవచ్చు. అది సందర్భానికి తగినదైతే, భావ వ్యంజకమైన మంచి శిల్పంగా భాసిస్తుంది. ఉదాహరణకి తిక్కన రచించిన యీ ద్రౌపదీ మనోద్వాగాన్ని పరిశీలించండి
ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
దొలుతగా బోరిలో దుశ్శస్తేను
తనువింత లింతలు తునియలై చెదిరి రూ
పఱి యున్న గని యుడుకాఱు గాక
యలుపాల బొనుపడునట్టి చిచ్చే యిది
పెనుగద వట్టిన భీమస్తేను
బాహుబలంబును బాటించి గాండీవ
మను నొక విల్లెప్పుడును వహించు
కఱ్ఱి విక్రమంబు గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మ నందనుండు
నేను రాజరాజు పీనుంగు గన్నార
గాన బడయ మైతి మేని గృష్ణ.
దీనిని గునుగు సీసమని అంటారు. ఇందులో ముందు చెప్పిన సీసంలో చూసిన నడక లేదు. ఏ చరణానికా చరణం ఆగదు. ఇది ఇలా వ్రాయడంలోని ఔచిత్యమేమిటి? ఇవి ద్రౌపది ఒక మహోద్వేగానికి లోనయి పలుకుతున్న పలుకులు. తన సహజ గాంభీర్యాన్ని వదలి, అతి కోపాన్ని వెల్లడిస్తున్న సందర్భం. ఈ ఉద్వేగాన్ని ఏ శార్దూల మత్తేభాలలోనో వర్ణించ వచ్చు. అయితే, ఇది కేవల కోప వర్ణన కాదు. అవి ద్రౌపది పలికే మాటలు. వృత్తములలో ఇమడవు. అందుకే బహుశా తిక్కన సీసము నెన్నుకున్నాడు. ద్రౌపది తన సహజ గాంభీర్యాన్ని వదలుకున్నట్టే, సీసం తన సహజమైన హొయలుని వదలుకుంది! ఆగని ఉద్వేగం దీనివల్ల మరింత వ్యంజకమౌతోంది. ఇది ఒక మహా శిల్పం!
ఇక, సీస పద్యంలోని పాద విభజనను ఆధారం చేసికొని, శ్రీ విశ్వనాథవారు చమత్కార భరితముగా ఒక విషయాన్ని స్ఫురింప జేసిన పద్యం చూడండి
పితృవాక్య పాలనా వ్రతనిష్ఠుడవు నీవు
పితృవాక్య పాలనా వ్రతుడ నేను
ఏకపత్నీ వ్రతాహీన భావుడవీవి
ఏకపత్నీ వ్రతాహీను డేను
వివిధాస్త్ర శస్త్రాది వేతృతా ఖని వీవు
వివిధాస్త్ర శస్త్రాది వేత్త నేను
అల్పులతో యుద్ధమాడ వింతయు నీవు
అల్పులతో యుద్ధమాడ నేను
క్షోణి భృత్ ప్రమాణుడనేను గోణిదె డీవు
బడలి లక్ష్మిని బాసిన వాడవీవు
బడలి లక్ష్మిని బాయని వాడనేను
పోల్కి యున్నది మనకును బోల్కి లేదు
అతికాయుడు ఉదాత్త లక్షణాలుగల మహావీరుడు. తన ఉదాత్త లక్షణాలు తెలిసిన అహంకారి. అతడు రామచంద్రునితో యుద్ధానికివచ్చి, గొప్పలకుపోతూ, తనకూరామునికీ మధ్యనున్న పోలికలూ, తేడాలూ వివరిస్తున్న సీసపద్యమిది. సీసములో ప్రతిపాదమూ రెండు ఖండాలుగా ఉంటుంది. రెండు ఖండాలలోనూ గణ సంఖ్య సమానమే. అయినా గణాల స్వరూపాన్ని బట్టి మొదటి ఖండం పెద్దది. రెండవది చిన్నది. మొదటి దానిలో పదహారు నుండి ఇరవై మాత్రలదాకా ఉండవచ్చు. రెండవదానిలో పధ్నాలుగునుండి పదహారు మాత్రలు మాత్రమే ఉండటానికి వీలు. అంతేకాక, మొదటి ఖండంలోని గణాలన్నీ ఒకే జాతివి అన్నీ ఇంద్రగణాలే. రెండవ ఖండంలోని గణాలు సగం ఇంద్రగణాలు, మరో సగం సూర్య గణాలు. అంటే మొదటిదానిలో సమత్వం, రెండవదానిలో విషమత్వం ఉన్నది. ఈ ఛందస్స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యాన్ని చదివితే, ఇందులోని చమత్కారం, ఔచిత్యం అవగతమవుతాయి. అతికాయుడు ఎంత రామచంద్రునితో తనను పోల్చుకుందామనుకున్నా, అతనికి అజ్ఞాతంగానే రాముని ఆధిక్యం అంతరాంతరాలలో యెక్కడో స్ఫురిస్తున్నది. దానికి పర్యవసానంగా, రాముని గుణాలను పెద్ద ఖండాలలోనూ, తన గుణాలను చిన్న ఖండాలలోనూ చెప్పుకున్నాడు! ఇలా చెప్పడంలో రాముని ఆధిక్యతే కాకుండా, అతని సమత్వ గుణమూ, తన విషమత్వమూ కూడా వెల్లడవుతున్నాయి. ఆధిక్యత కేవలం మాత్రల సంఖ్యలోనే కాక చెబుతున్న భావంలో కూడా వ్యక్తమయింది, జాగ్రత్తగా గమనిస్తే! సామాన్యమనిపించే సీసపద్యాన్ని సందర్భోచితంగా, పూర్వోత్తరాంశ సంవాదకంగా, మనస్తత్వ స్ఫోరకంగా నిర్మించటం ఒక మహత్తరమైన శిల్పం!
ఆధునికకాలంలో, పద్యనిర్మాణంలో కనిపించే మరొక శిల్పం, పద్యాన్ని వచన కవితలా వ్రాయడం. ఇది కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ కవితలలో కొన్నిచోట్ల కనిపిస్తుంది. శ్రీశ్రీ కవితలైతే కొన్ని ఛందోబద్ధమైనవని చాలామందికవి తెలియనే తెలియవు! విశ్వనాథవారి “శ్రీకృష్ణ సంగీతము”లో కూడా చాలా పద్యాలు ఈ కోవకి చెందినవే. అందులో చాలా కవితలు గోపికల సంభాషణలే కాబట్టి, సహజత్వం కోసం ఆ విధంగా వ్రాసి ఉండవచ్చు. అంత సహజత్వమే కావాలనుకుంటే వచన కవితలే వ్రాయవచ్చు కదా అని కొందరంటారు, నిజమే. బహుశా అలా వ్రాయడం నియమబద్ధమైన స్వేచ్ఛకు ప్రతీక కావచ్చు! ఆ విషయమలా ఉంచి, ఈ వచన రీతిలో ఉన్న ఆధునిక పద్యాలను, అదే ఛందస్సులో ఉన్న ప్రాచీన పద్యాలతో తులనాత్మకంగా పరిశీలిస్తే, పద్యానికి ధారా శుద్ధిని కలిగించే మాత్రల సంయోజనం ఏమిటన్నది కొంతవరకు సూత్రీకరించవచ్చునేమో. ఇటువంటి పద్యాలు కందం, తేటగీతి ఛందస్సులలో మాత్రమే వ్రాయబడ్డాయి, నాకు తెలిసినంతవరకు.
ఇక, యతి ప్రాసలను భావ రస వ్యంజకంగా అతకడం మరొక పద్య శిల్పం. చెప్పే విషయాన్ని వ్యంజింప చెయ్యడానికి, ప్రాసస్థానాన్ని రెండు పదాల సంధి స్థానంగా చెయ్యడం ఒక శిల్పం. ఉదాహరణకు, “సింగంబాకటితో…” అన్న పద్యం చివరి పాదంలో “వచ్చెంగుంతీసుత మధ్యముండు” అని ఉంటుంది. ఇక్కడ “వచ్చెన్ కుంతీ” అన్న సంధి జరిగిన చోటు ప్రాసస్థానమైంది. క్రియపూర్వమూ కర్త తరువాత వస్తే (“వచ్చాడు వాడు” అన్నట్టుగా) వచ్చిన వాని ప్రాథాన్యం వ్యక్తమవుతుంది. దానిని ఈ ప్రాసలోని విఱుపు మరింత వ్యంజింపజేస్తోంది. అలాగే నన్నయ్యగారి “నిండుమనంబు…” పద్యం చివరిపాదంలో “ఓ పండతి శాంతుడయ్యు” అని ఉంటుంది. “ఓపండు అతి శాంతుడు” అన్న విఱుపు ప్రాసస్థానంలో ఉంది. నరపాలుడు ఎంత శాంతత తెచ్చుకుందామనుకున్నా అలవాటులేని శాంతత వాడు సమకూర్చుకోలేడన్న విషయం ఇక్కడ వ్యంజక మవుతోంది. ప్రాస నియమం మహాకవులకు, ఒకొక్క సారి మహావిషయాలను స్ఫురింప జేస్తాయనడానికి కూడా కొన్ని ఆధారాలున్నాయి. “మెత్తని పులి” అన్న తిక్కన్న ప్రయోగం ఇందుకు ప్రథమోదాహరణ! యతిని కూర్చడంలో కూడా యెన్నో అందాలను చూపవచ్చు. ఉదాహరణకు “చిక్కని పోటుమానిసి విసీ!” అనడంలో యతి స్థానంలోని ఈ ఛీత్కారం యెంత భావ వ్యంజకంగా ఉన్నదో గమనించండి! అలాగే “తేరు బృహన్నలావశ గతిన్ జరియింప” అన్నప్పుడు, రథం బృహన్నలకు ఎంత వశమై చరిస్తుందో హృదయానికి హత్తుకోటంలేదూ!
ఇలా, వెతకాలేకానీ, తెలుగు సాహిత్య రత్నాకరంలో, అనేకానేకమైన పద్యశిల్ప మణి మాణిక్యాలు మనకు లభ్యమౌతాయి. అందులోనూ, తిక్కన్న భారతమూ, విశ్వనాథ కల్పవృక్షమూ పద్యశిల్పారామాలు.
పద్యాన్ని ఎంత శిల్ప సుందరంగా వ్రాయవచ్చో, ఎలా వ్రాయకూడదో సూచించే రెండు ఉదాహరణలతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
తిక్కన్న భారతంలోని పద్యం
హా! యను, ధర్మరాజ తనయా! యను, నన్నెడబాయ నీకు జ
న్నే! యను, దల్లి నేప జనునే! యను, గృష్ణుడు వీడెవచ్చె రా
వే! యను, నొంటివోక దగవే! యను, నేగతి బోవువాడ నే
నో యభిమన్యుడా యను, బ్రియోక్తుల నుత్తర దేర్పవే యనున్
రామాభ్యుదయము లోని అలాంటి పద్యమే
హా యను, గాధినందన మఖారి నిశాట మదాపహారి బా
హా యను, గ్రావజీవదపదాంబురుహా యను, రాజలోక సిం
హా యను, బోషి తార్యనివహా యను, గానల కేగితే నిరీ
హా యను, నిర్వహింప గలనా నిను బాసి రఘూద్వహా! యనున్