ఉదయపు గాలి తాకిడికి
కలల గాలిపటం తెగడంతో
చటుక్కున లేచి కూచుంటాం.
తెగిన గాలిపటం
ఏ మరుపు పొరల చింతగుబురుల్లోనో చిక్కుకొని,
మరి కనిపించటం మానేస్తుంది.
అక్కణ్ణించి యిక మామూలే
ఎవరో తాళ్ళు పట్టి లాగుతున్నట్టుగా
అన్ని పనుల్లోకి క్రమం తప్పక హాజరవుతాం.
అంతవరకు మరోలోకం చూపెట్టిన
అందమైన ఆలోచనలన్నీ,
వేషాలు విప్పదీసిన కళాకారుల్లా
వికృత రూపాలతో దర్శనమిస్తాయి.
లాంతర్లా వెలిగిన ఆశ
మసిబారుతుంది.
మనం కల్పించుకున్న ఆనందం
మంచుతెరలా కరుగుతుంది.
ఉదయాలు
గారడీవాడు విసిరిన కత్తుల్లా దూసుకువస్తాయి.
చలించకుండా నుంచునేందుకు ధైర్యం
చాలకపోతే ?
ఉదయాలు
మత్తు పక్కల మీంచి మనల్నిలేపి,
ఎత్తుగా జీవితపు సర్కస్ తీగమీద నిలబెడతాయి.
ఎక్కడైనా అడుగు తడబడితే ?!