వెనుదిరిగి చూడకు

రక్తసిక్త వదనాలు రాబందుల శిల్పాలు

చీకటి మేడలు అంతుచిక్కని కూపాలు

వెనుదిరిగి చూస్తావేం ?

పగిలిన గాజును తాకకు

గాజు కన్నును పెకలించకు

చీలిన దారులు కలిసేచోట

నిలబడకు..

విరిగిన కిరణాన్ని వికృత వెలుగును

సరిదిద్దకు..

బీటలు వారిన నేల

కన్నీరే కార్చకు

చిదమకు చీకటి మోము

వెలగవు ఏ దీపాలు

నిదురించే కొండల్ని

కోటి కోటి సెలయేటి

గలగలతో లేపకు..

వెనుదిరిగి చూడకు!!


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...