రెక్కల్ని తాటిస్తూ
నిరంతరం గగన సముద్రంలో ఈదే
పక్షికి
ఖండాంతరాలన్నీ
సుపరిచితాలే గదా!
దానికో ఇంటి దిగులా?
దేశం బెడదా?
జనం మెడలకు
రక రకాల ‘కట్టడి’ ముడులు బిగించి
నమ్మకాల మత్తులో ముంచి
రాజ్యం చేయాలనే తపనా?
సాగిలింపించుకోవాలనే కుత్సితమా?
ప్రపంచంలో ఏ మూలా
తనకు పరాయిది కాదుగదా!
పలుక బడే ప్రతి భాషా
తనకు మాతృభాషే
వికసించిన ప్రతి సంస్కృతీ
తనకు ఆహార్యమే
లిఖించ బడిన చరిత్రల
సారాంశం మాత్రం
తనకు తెలీదా?
సాకార నిరాకార దేవతలూ,
ప్రార్ధనలూ, ప్రవచనాలూ
లోకశాంతి పూజ్యం కోసమని
అది ఎరుగకనా?
దాన్ని దేశదిమ్మరనండి
వెర్రి బాగులదనండి
మరెలాగయినా పిలవండి
దాని దారి మాత్రం దానిదే!
అది ఎగురుతూ ఎగురుతూ
వో శూలమై దూకి
సముద్రాల లోతును తాకగలదు
వో గుళక రాjైు పొరలి
పర్వతాల ఎత్తును కొలవగలదు
వో కాగడాjైు
గుహల రహస్యాల్ని ఛేదించగలదు
ధ్యాన ముకుళమై మొలచి
అనంతపు ఆత్మగా వికసించగలదు
అది వెన్నెల రాత్రుల్లో పయనిస్తూ
శశాంకుడి చెల్లెలు కాగలదు
ఉభయ సంధ్యల్లో విహరిస్తూ
సూర్యుడి రథచక్రమై పరుగెత్తగలదు
పట్ట పగలు పరుగెడుతూ
మబ్బుల్ని పోగుచేసి
పుడమి తల్లికి జీవం పోయగలదు
చీకటంటే మాత్రం దానికి గిట్టదు
అది ఎటు తీసుకెళ్తుందోనని అనుమానం
పక్షెప్పుడయినా
గుక్కెడు నీళ్ళ దాహాన్ని మీరిందా?
గుప్పెడు గింజల ఆకల్ని దాటిందా?
అసలెప్పుడైనా
అది ప్రాణధర్మాన్ని విస్మరించిందా?
బావి మాత్రమే ప్రపంచమనుకుని
తాను మాత్రమే ప్రవక్తనని
హెచ్చులు పలకడం ఆపి
విర్రవీగడం మాని
ఆత్మలోకన గావిస్తే
నూతిలో బతికే మండూకం
నింగిలో ఎగిరే తానూ
ఒక్కటేనంటుంది పక్షి
సృష్టి అంగాలమేనంటుంది మెచ్చి.
(18 ఏప్రిల్, 2006 నాడు వాకేశా, విస్కాన్‌సిన్‌లో రాసిన కవిత)