ఆర్తి

మళ్ళీ ఏమైంది?
ఎవరో పిలిచారు నేలపైకి.

ఒక్క నిముషం,
నిన్నొకసారి సర్దేసి వెళ్ళనీ.
మిగిలిన రెండు జాజిపూలనీ
దిండుమీదే వదిలేసి ఉంచనీ.

కుంకుడు వాసన మబ్బుల్ని
మొహమంతా విసిరి
చెదురుమదురుగా నన్ను
కూనిరాగమై కురవనీ.

ఆగిపొమ్మని అడిగిన ప్రతిసారీ
గుండెచాటున నిన్ను దాచుకుంటాను
ముద్దిస్తే ఏడుపెందుకో మాత్రం
ఎన్ని ముద్దులిచ్చినా చెప్పను.

సగం దాహం ఎలానూ సరిపెట్టుకోనీదు,
ఒక్క నిముషం నీలో ఊపిరి ఆపేసుకోనీ.