బతుకు

స్వప్నించే కవి రాలిపోతాడు
స్వపించబడినవాళ్ళూ నిష్క్రమిస్తారు
స్వప్నాలు మాత్రం …
సుస్మితించిన మోవి వాడిపోతుంది
విస్మయించిన చూపు ఇంకిపోతుంది
సుస్మితలు మాత్రం …
పరిమళించిన పువ్వు వాడిపోతుంది
ఆఘ్రాణించిన నాసిక కృశిస్తుంది
పరిమళాలు మాత్రం …
బలివితర్ది పై అతడు అంతమౌతాడు
విలపించే గుండె అవిసిపోతుంది
వేదనలు మాత్రం …
పచ్చని వసంతం నిష్క్రమిస్తుంది
పాడిన కోకిల ఎగిరిపోతుంది
మాధుర్యాలు మాత్రం …
రంగస్థలం మీద తెరవాలుతుంది
నటీనటులు వేషం విప్పుతారు
నటనానుభూతులు మాత్రం …
యుద్ధరంగం రక్తసిక్తమౌతుంది
యోధులు వీరస్వర్గాలు అలంకరిస్తారు
వీరోచితగాధలు మాత్రం …
ఒక్కో శకం ఒక్కో ఇతిహాసం
ఒక్కో నాగరికత ఒక్కో షాన్
బతుకు మాత్రం