ఓ స్వేచ్ఛగా ఎగిరే పక్షి
గాలి వీపున దుమికి
జోరు తగ్గిందాకా
వాలుగాలిలో తేలుతుంది
సూర్యుడి నారింజరంగు కిరణాలలో
తన రెక్కని ముంచి
ఆకసాన్ని తనదిగా చెప్పే
ధైర్యం చేస్తుంది
కానీ తన ఇరుకు పంజరాన
అసహనంగా బతుకీడ్చే ఓ పక్షి
తన కోపపు చువ్వలగుండా తరచూ చూడలేదు
రెక్కలు తుంచబడి
కాళ్ళు కట్టివేయబడి వున్నాయి కదా
అందుకే పాడేందుకు
గొంతు విప్పుతుంది
పంజరపుపక్షి
భయోద్వేగంతో
తెలియనివైనా
ఇంకా తాను మనసుపడుతున్న విషయాల గురించే
పాడుతుంది
ఆ పాట
దూరంగా కొండ కొమ్మున
వినిపిస్తుంది
ఎందుకంటే
ఆ పంజరపు పక్షి
స్వేచ్ఛను గురించి పాడుతుంది మరి
స్వేచ్ఛగా ఎగిరే పక్షి
మరో మెల్లని గాలి గురించో
నిట్టూర్చే చెట్ల నుండి వీచే ఆ మెత్తని ఈశాన్య పవనాల గురించో
వేకువలోని వెలుగుల పచ్చికపై వేచిన బలిసిన పురుగుల గురించో
ఆలోచిస్తూ ఆకసాన్నంతా తనదిగా భావిస్తుంది.
కానీ పంజరపు పక్షి స్వప్నాల సమాధిపై నిలుస్తుంది
తన నీడ ఒక పీడకల కేకపై అరుస్తుంది
రెక్కలు తునిగి కాళ్ళు కట్టబడి వున్నాయిగదా
అందుకే పాడేందుకు గొంతు విప్పుతుంది
పంజరపుపక్షి
భయోద్వేగంతో
తెలియనివైనా
ఇంకా తాను మనసుపడుతున్న విషయాల గురించే
పాడుతుంది
ఆ పాట
దూరంగా కొండ కొమ్మున
వినిపిస్తుంది
ఎందుకంటే
ఆ పంజరపు పక్షి పాట
స్వేచ్ఛను గురించి
పాడుతున్న పాట
(మూలం: మాయా ఏన్జెలో (Maya Angelou) Caged Bird అన్న కవిత.)