పీఠిక:
శ్రీకారము సిరి నొసఁగును,
శ్రీకారము మతి నొసఁగును, జిత్సమ్ముదమున్,
శ్రీకారము శాంతి నొసఁగు,
శ్రీకారము మంగళకర శృంగార మగున్ 1
కందమ్మనఁగా మేఘము,
కందమ్మన నొక్క దుంప, కందము ముడియౌ,
కందమ్మన వెల్లుల్లియు,
కందము కర్పూరము, రసకందము కవితౌ 2
కందము విరిసిన మల్లెల
గంధ, మ్మిందుకిరణసమకాంతము, రసమా-
కందమధురఫల, మ్మత్యతి
సుందరభూషణము వాణి సోయగమునకున్ 3
చందనచర్చిత పవనము,
సుందరయామినుల రమ్య శుభ్ర జ్యోత్స్నల్,
మందమనోహర గానము
లందించెడు సుఖము కందమందుండునుగా 4
కందము సుస్వరభరితము,
కందము వినగను లలితము, కందము పదమే
కందము బాడగ మధురము,
కందము వ్రాయగ సుకరము, కందము ముదమే 5
దాసుఁడను, నేనొక కళా
దాసుఁడను, గవితలదేవి దాసుఁడను, వచో
హాసుఁడను, సుసౌందర్య పి
పాసుఁడను, పదప్రసూనవాసుఁడ నిలపై 6
మది యొక గగన, మ్మట నీ-
రదములు ముసిరెన్, మెలమెల రాలెన్ జినుకుల్,
మును దలఁపుల వాసన లే-
చెను, తోచెను హరిధనుస్సు జెలువమ్ములతో 7
వాసన తడిసిన మన్నుల,
వాసన విరిసిన సుమముల, వాసన గుడిలో,
వాసన భోజన మమ్మది,
వాసన లెన్నో మనసున వదలక నుండెన్ 8
ప్రకృతి
లేవండో యుష వచ్చెను
లేవండోయ్ సుప్రభాతరేఖలఁ దెచ్చెన్
లేవండోయ్ ముద మిచ్చెను
లేవండో యెఱ్ఱదమ్మి రేకులు విచ్చెన్ 1
సంబరమున శశి తాకఁగఁ,
గ్రొంబసిమి వెలుంగు తార కూరిమి మురిసే
నంబరము వీడె నపుడు స్వ-
యంబుగ రాగవతి సంధ్య, యామిని వచ్చెన్ 2
(రామాయణములోనిదని చెప్పబడే ఒక సంస్కృత పద్యము దీనికి ఆధారము.)
పుట్టిన రోజేది రవికి,
పుట్టిన రోజేది శశికి, భువనమ్ములకున్,
పుట్టిన రోజేది నదికి,
పుట్టిన రోజేది విశ్వమోహన నీకున్ 3
జననియు ధర, యాకాశము
జనకుఁడు, నది సోదరియవ, ఛవియే దైవం,
బనిలము సోదరుఁడు, సఖుం
డనయము ప్రకృతియు, భవమ్మునందున నాకున్ 4
మధుమాసము వర్షమ్మున
మధురత నింపు నొక పఱియె మహిలో నెపుడున్
మదనుని మాస మ్మధరపు
సుధవలె శోభిలుఁ బ్రతి నెల సుందరతరమై 5
కదలవు తరువుల నాకులు,
కదలవు చెరువున పశువులు, కదలవు పులుగుల్
కదలఁడు సూర్యుఁడు నింగిని,
కదలెడి జీవమ్ము లేదు కడు వేసఁగిలో 6
సందడి యెచ్చట చూచిన
వందలుగా కాకు లఱచెఁ బలు నగరములో
నెందో తెలియదు వీనుల
విందుగఁ బాడె నొక పికము వేసవి యందున్ 7
నల్లని మేఘము లెల్లెడఁ
దెల్లని విహగముల బారు దేలెను నింగిన్
జల్లని చినుకులు బడగా
నుల్లము సంతసముతోడ నుఱికెను త్వరగా 8
గొప్పగ వానలు గురువఁగఁ,
గప్పలు వేదముఁ జదువఁ గఁ, గప్పయెఁ జిల్లుల్
నిప్పచ్చరమున గృహమున
నెప్పుడు బహు జలతరంగ నిస్వనములెగా! 9
(తిరుపతిలో వర్షాకాలంలో కప్పునుండి నీరు కారుతున్నప్పుడు నేల తడవకుండా పాత్రలను ఉంచింది ఇంకా నాకు బాగా జ్ఞాపకమే.)
అక్కడ నల్లని మేఘము,
లిక్కడ గాలికిఁ జలించె నీ తరులతికల్
జక్కగ వర్షము వచ్చును
లెక్కలు వేయంగ వేళ లేదిపుడు గదా! 10
గొడుగులు గాలికిఁ దిరిగెన్,
బుడగలతో నీళ్ళు పారెఁ బురవీధులలోఁ,
బడవల విడిచిరి పిల్లలు,
తడిసిన బట్టల నడచిరి తడబడుచు జనుల్ 11
మెల్లగఁ గదలెడు యలలన్
దెల్లని నురుగులఁ బ్రశాంతతేజోమయమై
యుల్లము రంజిలజేసెడు
కల్లోలిని నిన్న జేసె కల్లోలమునే 12
జలమున వ్రాసెను గాలియు
లలితముగా రంగవల్లి రచనల నెన్నో
వెలిఁగెడు తరంగవల్లిగ
మెలమెల సాగినవి వెల్గు మిలమిలలోనన్ 13
ఒకపఱి నొంటెగఁ గనపడు,
నొకపఱి గజముగఁ గనపడు, నొకపఱి కొండౌ,
నొకపఱి మొగముగఁ గనపడు,
సకలాకారములు మేఘశకలములు గనన్ 14
(చిన్నప్పుడు ఆకాశంలో మేఘాలను చూచి ఆకారాలను ఊహించుకోవడం గొప్ప సరదాగా ఉండేది.)
బంగరు వన్నెల యాకులు
నింగిని దాకెడు తరువుల నిగనిగ లాడెన్
శృంగము లందున హిమములు!
రంగుల మాయామయమగు రచన యెవరిదో? 15
పాలసముద్రపుటలలో,
తూలికతో వ్రాసిన మణితోరణతతులో,
తేలిన ముద ఫేనములో,
రాలిన హిమరాశులు కడు రమ్యము మహిపై 16
రంగులు యెడారి లేవని
రంగుల నింపిరి యుడుపుల రమణులు, మఱి పల్
రంగుల వెలుంగు యార-
ణ్యాంగణమున వెల్గిరి ధవళాంబరములతో 17
(కేరళలో తెల్లటి బట్టలు, రాజస్థానములో రంగురంగుల బట్టలు కట్టడానికి అక్కడి ప్రకృతి ఒక కారణమని ఒకామె చెప్పినది ఈ పద్యానికి స్ఫూర్తి.)
ముసిముసి నవ్వులతోఁ బలు
పసి పిల్లలు సంతసానఁ బాడుచు తా మా
యిసుకలపై యాడిరి పెను
రసరత్నాకరము ముందు రాజిలుచుండన్ 18
(ఇలాటి ఒక కవిత టాగూరు గీతాంజలిలో ఉంది.)
గ్రహణము సూర్యున కాయెను,
రహదారుల బస్సు లేదు, రజనియె దినమున్,
గృహమున బందీ గర్భిణి,
యహ జలముల స్నానమాడి రా రవి గనుచున్ 19
(1980లో సంపూర్ణ సూర్యగ్రహణము వచ్చినప్పుడు మదురైలో నా అనుభవము.)
విరహాంకు నంకె లవి యా
విరించి జేసిన వినూత్న వీక్షణ మగుఁగా
చిరమగు నిసర్గ సుందరి
ధరించు యాభరణ కాంతి ధగధగ లగుఁగా 20
(మనము ఇప్పుడు పిలిచే Fibonacci numbersని విరహాంకుడు సుమారు ఏడవ శతాబ్దములో కనుగొన్నాడు. ఇది ఒక జ-గణ కందము.)
ప్రేమ
దేవినిఁ గనుచుండెడు యొక
దేవినిఁ గనుచుండె నొక్క దేవీప్రియుఁ డా
దేవాలయమున నవ్వుచు
దేవియు రాల్చె నొక పూవు దీవెన యనగా 1
యువతియు చూచెను యువకుని,
యువకుఁడు జూచెను యువతిని, నుత్పన్న మయెన్
నవముగఁ గవితయు మదిలో
నవతల బస్సదియు వెళ్ళె నతి వేగముగన్ 2
విరుల నలంకృత మయి రా
విరిబోణులు, విరుల చుట్టు బిరబిర సడులన్
దిరుగాడెను భ్రమరమ్ములు,
విరిబోణులు తిరిగిరి వడి వెఱపున నపుడున్ 3
(ఇక్కడ భ్రమరాలు అంటే అమ్మాయిల చుట్టు తిరిగే అబ్బాయిలని కూడా అనుకోవచ్చు.)
తరుణము సాయంసమయము –
ధరణికి రాలినవి మెల్ల తరువుల విరులున్,
దరుణుల సిగలో విరులున్,
దరుణుం డేరెను కరమునఁ దరుణుల విరులన్ 4
వేసవి యెండకు బడలి పి-
పాసకుఁ ద్రాగఁగఁ దొడఁగెను బానీయముఁ, బల్
యాసల రేపుచు నామెయు
నాసక్తినిఁ జూపఁ దడిపెఁ బానక మతనిన్ 5
వేసవినిఁ గళాశాలల
మూసిరి, గ్రంథాలయమునఁ బుస్తకములఁ దా
నాసగ చదువఁగ లేదిక
మూసిన పుస్తక మయె మది మోదము లేకన్! 6
(కాలేజీ లైబ్రరీలో ప్రేమికులు కలిసేవారు.)
ఎదురుగఁ గూర్చున్నా, రా
యధరములో, కదలకుండె నక్షులు గలిసెన్!
మదిలోఁ దలపులు వేడయె
నెదురుగఁ జల్లారెఁ గాఫి, యీగలు నవ్వెన్! 7
కంట నలుసు బడెఁ దామర
కంటికిఁ, దుంటరి యువకుఁడు గమనించెను, వె-
న్వెంటనె యాయమ చెలువపు
కంటికి నూదెను రమించి గాలినిఁ ద్వరగా 8
(రాధ కళ్ళల్లో దుమ్ము పడితే కృష్ణుడు అలా చేసాడని ఒక గాథ ఉన్నది.)
నుడు లర్థము కావామెకు,
నుడు లర్థము కావతనికి, నుడు లవసరమా
కడగనుల చూపులకుఁ, బ్రే-
ముడికిని, గుండెల దడకును, ముద్దుల జడికిన్ 9
నీ పేరిని నే వ్రాసితి, నా
పేరిని నీవు వ్రాసినావు ప్రియముగా,
నా పెద్ద యల తటాలున
నా పేరులఁ దడిపి కలిపె నంబుకణములన్ 10
చినుకులు బడుచున్నవొ యని
జనె డాబా కపుడు యువతి చట్టనఁ దానున్
గనె బట్టలచెంత నతనిఁ,
జినుకులొ చెమటయొ యువతికిఁ జెంపలమీదన్ 11
సరములు జల మౌక్తికములు
ధరఁ బడెఁ జికురములనుండి, దైవముఁ గన సుం-
దరి స్నానమాడి వెడలన్,
సరసర యువహృదయము జనె సరములవెంటన్ 12
సెల్లును సఖి యింటను దా
నల్లదె మఱచితిని, దాని నదె తెత్తు ననున్
దల్లికిఁ దనయయు, నప్పుడె
గల్లున మ్రోగే నదియునుఁ గడు సంభ్రమమున్ 13
నీవును నేనునుఁ బ్రేమయుఁ
బూవులు, రాగానురాగములు సఖ్యతయున్
భావానుభవము మోద మ్మా-
వేదన లెన్నఁగ నిజ మాఱగుఁ గాయల్ 14
(మూడు పువ్వులు ఆరు కాయలు అనే దానికి ప్రేమికుల ఆపాదన.)
పాటైన గాయకుండవు,
యాటకు దర్శకుఁడు నీవు, యది కవితైనన్
మేటిగ రచించు సుకవివి,
వేటైన కిరాతకుఁడవు, ప్రియ బ్రదుకందున్ 15
గాలి నెగురు రేకులవలెఁ
దేలుచు వచ్చెదవు నీవు తృషఁ దీర్చంగన్
గాలి నెగురు రేకులవలెఁ
దేలుచు వెళ్ళెదవు నీవు తృషఁ గల్గించన్ 16
నినుఁ జూడగ మన సయెఁ, ద-
క్షణ మెక్కితి రైలుబండి, కలత నిదురలో
స్వనములఁ జేసెను బండియు
వినఁబడెఁ బ్రియ నీదు పేరె విడువక నాకున్ 17
(రైలుబండి వెళ్ళేటప్పుడు జనించే శబ్దాలు మనం ఎలా ఊహించుకొంటే అలాగుంటాయి.)
ఆరి వెలిఁగె నొక దీప,
మ్మారెను వెలిఁగెను మరొండు, యామిని వేళన్
జేరగ రమ్మని బిల్చెనొ?
యా రెంటినిఁ గనుచు నవ్వె నంబరతారల్ 18
(దీపాలను ఆర్పి మళ్ళీ వెలిగిస్తుండేది ప్రేమికుల సంకేతం.)
లోచనములఁ దెఱువక నా
లోచన లేమిటొ సరోజలోచనకున్, సం-
కోచమ్మయెనో కజ్జల
లోచనములు, వెదకుచుఁ బ్రియలోచనయుగమున్ 19
ఒక పుట నంతయు నింపెను
రకరకముగ నాదు పేరు రంగు సిరాతో
నిక నెన్ని మార్లు చదువుట
సకియా యీ ప్రేమలేఖ సాయంసంధ్యన్? 20
ననుఁ దాకిన చోటులలో
ననలే విరిసిన నిజాన నందన వనమౌ
తను వియ్యది, యేమందును ?
వినవే వాని కనులు గను వింతలు వేడ్కల్! 21
సాగును త్వరగా సమయము
రాగముతో నీవెదురుగ రాజిలుచుండన్
సాగని సాపేక్షస్థితి
రాగవతీ నీవులేని రాతిరి గడియల్ 22
నామము తెలియదె, సఖి, చిరు
నామా తెలియదె, యతఁడు వినా యీ మహిలో
నా మనికి లేదె, నిజ మిది
నామ మ్మేమైనఁ బ్రేమ నామ మ్మొకటే 23
మంత్రము – పేరు జపించుట,
తంత్రము – మురిపించి నిన్ను దనియుట గాదా!
యంత్రము – నీ యడుగులు, హృది
తంత్రుల మీటెదను బ్రేమ తానము లెసగన్ 24
మెలికల ముగ్గుగ వ్రాసెను
కళాస్వరూపుఁడు నను నినుఁ గనులకు విందై
జలజల కురిసిన వర్షము
కలిపెను ముగ్గుల నొకటిగఁ గలిసితి మటులన్ 25
అమ్ము లయిదు కురియఁగఁ, గను
దమ్ములు నాలుగు విరియఁగఁ, దాళిముడులు మూ-
డిమ్మనువుల రెంటిఁ గలుపఁ
గమ్మని బ్రేమయు నొకటగుఁ గడు చెలువముతో 26
ప్రేమయె రెండవ దైవము,
ప్రేమయె యేడవ ఋతువగుఁ, బ్రేమయె భవమౌ
ప్రేమయె యైదవ వేదము,
ప్రేమయె పదియవ నిధియగుఁ, బ్రేమయె శివమౌ 27
పెళ్ళి
అతిథికి నన్నముఁ బెట్టెను
గుతుకముతో నామె తనదు కూతురితోడన్
మెతుకుల వెండ్రుక నగపడ
నతి త్వరలో బంధు వగుదు వనుచును నవ్వెన్ 1
(ఇక్కడ వచ్చిన అతిథికి తన కూతురిని పెండ్లి చేసికోమని తల్లి పరోక్షముగా చెప్పుతుంది. భోజనములో వెండ్రుకలు వస్తే బంధువులు అవుతారనే ఒక నమ్మకం ఉంది కొందరికి. )
రెపరెప లాడెడు చీరలు,
సుపరిమళముతోఁ జెమటలు, సుమముల తావుల్,
విపరీతమ్మగు సందడి,
జపమంత్రపు సడి వివాహసమయమునందున్ 2
మంగళకరుండు బ్రేమను
మంగళముగఁ దల్చు నంచు మహిళయు ప్రీతిన్
మాంగల్యము గళమున న
య్యంగజసముచే ధరించె నతి కుతుకముతో 3
(కుజదోషంవల్ల జాతకాలు సరిపోలేదనే ఆచారాన్ని ఎదిరించి పెళ్ళి చేసికొన్న సంఘటన ఇది.)
మేడనుగల మల్లెతీగ,
దూడల కొనగనుల చూపు, త్రుళ్ళెడి కుక్కల్,
గోడనుగల యా యద్దము,
వీడిన వధువును గృహమున వెదకుచునుండెన్ 4
ముదితనుఁ గని భర్తయుఁ దా
ముదమున ముద్దాడ నెంచె మోహముతోడన్
ముదితయుఁ దమ శిశువునుఁ గని
ముదమున ముద్దాడెఁ బ్రేమపుష్ప మ్మలరన్ 5
గదిలో కంప్యూటరుతో
మెదిలెడు పతిఁ గని మిటారి మిటమిట లాడెన్
మది నే దైవము గనెనో
యిదె విద్యుచ్ఛక్తి యాగె నిక సుకరమ్మే 6
కట్టిరి మాటల యిటుకల
గట్టిగ నొక గోడఁ గొన్ని క్షణములలోనన్
బెట్టులు చలిలోఁ గరుగఁగ
గుట్టుగ నిసిఁ గౌగిలించి కూల్చిరి గోడన్ 7
మిణుగురు పురుగులు తారక
లనఁ జీకటిలోన వెల్గె నద్దమరేయిన్
సునయన తారకలు వెలిఁగెఁ
బ్రణయపు గాఢాంధకార పర్యంకమునన్ 8
హారములు నింగిఁ దారలు,
హారములు ధరణిని దివ్వె, లందముగను నీ-
హారములు దరులతల, నీ
హారము లురమున వెలింగె నన్నిటికంటెన్ 9
అనగనగా నొక రాజని
వినవినఁగాఁ దలల నూపి ప్రియమగు కథలన్
విని నిదురించెడు పిల్లలఁ
గని తల్లియుఁ దల్లిఁ దలచెఁ గళ్ళు జెమర్చన్ 10
అలిగిన భార్యాభర్తల
చెలగెడు పోరాటమందుఁ జెలగెను దూతై
యల చిన్నిపాప యొక్కటి
గలగల నవ్వుచు నడచును గలతల మధ్యన్ 11
అందముగా ముగ్గులఁ దా
వందల చుక్కలను బెట్టి వ్రాయుచునుండెన్
ముందర పాపడి గీతల
యందపు వక్రతను దల్లి యభినందించెన్ 12
రంగులు మారెన్ బలుపలు
భంగుల నా సంధ్యవేళ వఱలుచు నింగిన్
రంగు లదృశ్య మవంగన్
రంగుల దెమ్మనుచుఁ బాప రయ్యని యేడ్చెన్ 13
(మా పెద్దబాబు మూడేళ్ళప్పుడు నిజంగా జరిగిన సంఘటన ఇది.)
నీళ్ళను దెచ్చుట కేగఁగ
నీళ్ళాడు సమయ మెపుడని నెలతలు నవ్వన్
గాళ్ళంత నీరసమయెన్
దేళ్ళు భుజంగములు బ్రాకు తీరయె గాదా 14
ఇక్కడ తన్నెను చూడని
యెక్కువ సంతోష మొంది యెదుటను గల యా
చక్కని పతిరాజును గని
మిక్కిలి యాతురతఁ బిల్చె మెండగు ప్రీతిన్ 15
(గర్భవతియైన భార్య పలికిన పలుకులు ఇవి.)
ఎంతయొ బాధల యనుభవ
మింతింత ముదము నొసగిన దెటులని దలచెన్
గాంతయు బిడ్డను గని దా
సంతస మొందినది క్రొత్త స్వర్గ మనంగన్ 16
సందడిలో విడిచే నొక
సుందర శిశువు దన తల్లి చూపుడు వ్రేలిన్
సుందరముఖులను గని యా
నంద మవని ముఖము నవ్వె నమ్మ గనంగన్ 17
(ముల్క్‌రాజ్ ఆనంద్ వ్రాసిన Lost Child అనే కథలోని ఇతివృత్తము ఇదే.)
నను నీవు వీడుచుంటివి
పనికై దేశమును, నన్ను వదలుచు నిటులన్
జనకున్న బాగు రాతిరి,
కనబడెనే రవి, మరొక్క కౌగిలి నీవా 18
తప్పని క్షమించ గోరుచు
నెప్పుడు చెప్పెదరొ యంచు నిర్వురు పడకన్
జప్పుడు లేక బిగించే
రప్పుడు శ్వాసను క్షణమ్ములయె యుగములుగా 19
విరహము
ఆనాటి యనుభవమ్ముల
నీనాడు మఱచుచుండె నీ దేహము నీ
వేనాడు వత్తువొ యెఱుఁగ
నీ నవ్వు మొగము మసకయె నిను మఱచితినో? 1
(పెళ్ళవగానే భర్త విదేశాలకు వెళ్ళిపోయాడు. రోజులు గడిచేకొద్ది అతని ముఖం కూడా ఆమె మనోదర్పణంలో మసకబారుతూ ఉంది.)
అరుణము సంధ్యా సమయ,
మ్మరుణము వనిలో సుమమ్ము, లరుణము చైత్రం,
బరుణ విఘడియ న్నినుఁ గని
మరణముఁ గనుచుంటి నిపుడు మఱిమఱి నీకై! 2
రెండవ చైత్రము వెళ్ళెను
మెండుగ పున్నములు గడిచె మిక్కిలి బాధన్
రెండేళ్ళాయెను పాపయుఁ
దండిరి గుర్తించునొ యికఁ ద్వరగా రావా 3
(విదేశాలకు వెళ్ళిన భర్తకోసం తపిస్తూ తమ పాప రెండేళ్ళ తరువాత తండ్రిని గుర్తిస్తుందో లేదో అని భార్య అనుకొంటుంది.)
నాకే ఱెక్కలు వచ్చిన
నీకయి యెగురుదును నింగి నిముసములోనన్
నాకీ యుద్ధము లెందుకు
నీ కవుఁగిలి యొకటి చాలు నెమ్మది నీయన్ 4
అక్కడినుం డాతఁడు మఱి
యిక్కడినుం డీమెయు కథ లెప్పుడు విడకన్
మక్కువతోఁ బలుకంగన్
జక్కగ ముద్దిడ శిశు వది జనియించదుగా 5
(ఫోనులో మాట్లాడుకొని సంతోషించవచ్చు కాని ఒకరిని ఒకరు తాకడానికి వీలుండదుగదా!)
మోహన యనుటే పని యో
మోహన నను జంపు లేక ముద్దాడగ రా
మోహన సరిగా పదముల
నే హర్షించుచు నుడివెద నినుఁ దలచి సదా 6
(మోహనరాగానికి స్వరాలు సరిగపధ.)
దేవుండైనను, నీవును
నావలె విరహాగ్నిలోన నలుగుచు నలుసై
పోవలె, నతనుడు తనుడై
రావలెఁ, గావలె నను నిను రతిరాజ్యములో 7
(మొదటి రెండు పాదాలు ఇరాకీ కవయిత్రి రబియాను అనుసరించి వ్రాసినది.)
పిడికెడు హృదయములో నొక
బడబాగ్నిని బెట్టినావు బాలా యేలన్
గడగళ్ళనుఁ జూడగ నినుఁ
గడగండ్లే మిగిలె గాదె కడు దారుణమై 8
చిత్తము రంజిలఁజేయగ
క్రొత్త టపా వచ్చెనంచుఁ గుతుకముతోడన్
దత్తరపడి వెదుకఁగ నట
చెత్త టపా యుండుఁ గాని చెలి వ్రాయదుగా 9
మఱచుటకై నే సినిమా
కరుగఁగ తెరమీద నడచు కథయును మనదౌ
తెఱగునఁ దోచెను, వదలితి
సరసరయని మధ్యలోన సతమతమగుచున్ 10
మఱల నదే సాయంత్రము
మఱల నదే రంగులవల మాయల ఛాయల్
మఱల నదే మధురస్మృతి
మఱల నదే గతపు గాథ మదిలో నిండెన్ 11
మధు విమ్మనె మధుర మ్మనె
మది రమ్మనెఁ జేర నిన్ను మఱువక నెపుడున్
మధు విమ్మనె మధుర మ్మనె
మదిర మ్మనెఁ జేర లేక మఱువఁగ నిపుడున్ 12
నను తానన్నది నవ్వుచుఁ,
దను నేనన్నది తొడుగుచుఁ దన యా నగలన్,
దన వస్త్రములను నాకున్,
జనె రేయి యటులఁ, బ్రియసఖి జనె నెచ్చటికో? 13
మిక్కిలి పెద్దగఁ గనబడె
చిక్కిన చేతుల గాజులు చినదానికిఁ దాఁ
జెక్కిలిపైఁ జేయుంచుచు
నెక్కడొ శూన్యమున వెదకె హృదయేశునికై 14
జీవితము
వాడిన మల్లెల గంధము,
వీడిన బట్టల ముడుతలు, ప్రియతర మద్యం,
బాడిన ముద్దుల మాటలు,
నేడీ ప్రొద్దున రగిల్చె నిర్దయగను నన్ 1
వదలని యత్తరు వాసన,
పెదవుల రంగుల మఱకలు, ప్రియతమ నీ యా
నిదురను వీడిన కన్నులు
మదికిన్ సందియ మొసగెను, మానిని యెవరో? 2
తెలియని ఖర్చుల ఖాతా,
మెలమెల సెల్లున గుసగుస, మిక్కిలి మౌనం,
బలసట నిండిన దేహము –
తెలిసెను ద్రాగినది పిల్లి తెక్కలి పాలన్ 3
కలిగెన్ గోపము, తదుపరి
జలజల రాలినవి యశ్రుసరములు నదియై,
చల మొక చిచ్చుగ మారెను,
కలిగెన్ నాపైన నాకె కరుణయు మదిలో 4
మురిసి మురిపించితివి నను,
మురిసితి మురిపించితి నిను ముద్దుల వానన్,
సరస వసంతము నేడు శి-
శిరమయెఁ గురులు హిమము లయెఁ, జెదరవె యాశల్! 5
భగ్గున మండుచు నుండెడు
యగ్గినిఁ బుట్టించితి మని యలరితిమి గదా
యగ్గికి ముందుగ నుంటిమి
సిగ్గయె నేడో ప్రియతమ శిశిరములోనన్ 6
మ్రింగక మ్రింగే నొక నా
డంగజహారియు విషమ్ము నతి నైపుణితో
మ్రింగుచు జీర్ణించుకొనే
నంగన బ్రతిరోజు విషము నతి నైపుణితో 7
శ్వాసను వదలకు తల్లీ!
మోసము మగవాని పేరు ముందుగ వచ్చున్,
దోసము నీలోఁ గనబడ
దా సీతయె నీవు,జీవ మాశల దివియే! 8
ప్రతి రోజొక దైత్యుఁడు కుల-
సతి నొకతుకనుఁ జెఱుపంగ సాహస మూనన్
ప్రతి వీధికి రావణుఁడే!
ప్రతినల నిలుపంగ లేడు రాముండెందున్ 9
కందం గిందం నహినహి
మందుంటే చాలు భాయి మహ హ్యాప్పీగా
చిందులు వేస్తాం చాల ప-
సందుగ పాడ్తాం కవితలు చక్కగ రాస్తాం 10
నిను నేఁ బ్రేమించితి మనసున,
మన యీ యిఱువురి మార్గము మాఱెన్
విను నీదు రుమాలు విరులు
పెను నిధిగా దాచియుంటి ప్రియ యీ నాడున్ 11
చనిపోయినావు ప్రియతమ
మనసున నీవుంటివి నిను మఱువను నిజమై
మన సిది సంన్యాస మనెను
తను విది కోరెను సుఖములఁ దత్తరపడితిన్ 12
ఉరములపై సరములతోఁ,
గరములపైగాజులఁ బలు కంకణములతోఁ,
జరణములన్ మువ్వలతో
నిరతము గొలుసులఁ దొడిగిరి నెలతలకు నిలన్ 13
పంజరమున మృష్ఠాన్నము,
సంజలలో జామకాయ చవులే బయటన్,
పంజర మందు సుభద్రత,
రంజిల స్వేచ్ఛయు గగనపు రహదారులలో 14
ప్రపంచము
ఏ భాషకుఁ గల యంద
మ్మా భాషకు నుండుఁ గాదె మఱి యెందుకొ యి
ట్లీ భాషా కలహానల
మా భాషాజనని గార్చె నశ్రుకణమ్ముల్ 1
ఒకఁ డాడెను వెలుపల మృచ్ఛ-
కటికతో సంతసమున సరసర యంచున్
ఒకఁ డాడె లోన విద్యుచ్ఛ-
కటికతో సంతసమున సరసర యంచున్ 2
(చిన్న పిల్లలు ఏ వస్తువుతోనైనా ఆడుకొంటారు. అది మట్టిబండిగా ఉండవచ్చు లేకపొతే electric toy trainగా ఉండవచ్చు. మంచి ఆటవస్తువులు కొని ఇవ్వలేదే అనేది పెద్దవాళ్ళ తపన. శూద్రకుని మృచ్ఛకటిక నాటకపు కథావస్తువు కూడా ఇదే.)
రాధామాధవ కేళుల,
శ్రీదేవీస్తుతులయందు, చిత్రమ్ములలో
నా దేవదేవు గీతా-
రాధనలో వర్ణన రుచిరాంగములేగా! 3
తారల జూతురు గదిలో
దారలతో టీవియందు ధనికులు దృప్తిన్
దారల జూతురు నింగిని
దారలతో గుడిసెనుండి ధరణినిఁ బేదల్ 4
(మొదటి తారలు సినిమా తారలు, రెండవ తారలు ఆకాశంలోని నక్షత్రాలు.)
యోగవియోగమ్ములకునుఁ
గౌగిళ్ళకు నశ్రువులకుఁ గలలకుఁ దావుల్
సాగు విమానమ్ములకును
సాగెడి బ్రదుకుకు విమానసదనము దావుల్ 5
చుట్టును గొండలు పక్షులు
చుట్టును వనములు తరువులు సుందర సుమముల్
జుట్టును నాడు జలమ్ములు –
చుట్టును నగరాటవి యయె సుప్రగతి యిదా! 6
(చాలాకాలం తరువాత ఉన్న ఊరికి వెళితే మన స్మృతుల చిహ్నాలు ఎక్కడ కనబడవు. వాటికి బదులుగా ఇళ్ళు, ఆఫీసులు ఇత్యాదులు ఉంటాయి.)
లేదీ గాలి సుగంధము,
లేదీ నదిలోన జలము, లేవు వనమ్ముల్,
లేదీ నగరిన్ గానము,
లేదీ నగరిన్ బ్రశాంతి, లేవివ్వెవియున్ 7
హితుఁడై, పలికించెడు స్నే-
హితుఁడై, యలరించు సన్నిహితుఁడై నిలిచెన్
బతనమయెన్ గొడ్డలితో
నతి వేదన నేడ్చుచుంటి నా తరుగిరికై 8
(నగరాలు వ్యాప్తి చెందుతూ ఉంటే ఎన్నో చెట్లను నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తున్నారు. ఒకప్పుడు హొమీ భాభా సమూలంగా ఒక వృక్షాన్ని పెరికించి దానిని మరోచోట నాటించారట.)
నల్లనివానినిఁ గొల్తురు
మల్లెలతోఁ బద్మనయన మహిళలు భక్తిన్
నల్లనివానినిఁ బ్రియుడై
యొల్లరు ప్రేమించ రెందు కుర్వినిఁ జెల్వల్ 9
సోనా ముగ్గు
పది విష్ణువు రూపము లగు,
పదినొక్కటి రుద్రదేవుఁ బలు యంశములౌ,
పది పదినొక్కటి రెంటినిఁ
బదిలముగాఁ జేర్చవచ్చు వదలక ముగ్గై 10
(ఇది సోనా అనే నా ఒక ముగ్గు ప్రస్తావన.)
భారతదేశము వదలుట
నే రమియించుటకొఱకని నిందింతురు నన్
భారతదేశము నాతో
నీ రాష్ట్రములకరుదెంచె హృదయములోనన్ 11
ఎక్కడ నున్నను నేనొక
చక్కని దక్షిణపు వాఁడ సందేహము లే
దిక్కడ కూడ భుజింతును
మక్కువతో నావకాయ మామిడిపండున్ 12
నవలాలు లేక నవలలు,
కవ లేక కవనములు మదిఁ గవ్వించవుగా
నవ లేకను నవరోజులు,
రవ లేక రవణములు గడు రాజిల్లవుగా 13
(పారసీకుల ఉగాదిని నవరోజు అంటారు.)
మినమిన మెరిసెడి తారలు,
తెనుఁగున వ్రాసెడి కవితల తీయదనమ్ముల్,
మునగల చారు సువాసన,
తొనకెడి నీడలు వెలుగులు తొలగని ముదముల్ 14
(ఇందులో ప్రాసాక్షరమైన న-కారానికి బదులు ల-కారము ఉపయోగిస్తే అర్థము మారదు.)
చివరి మాట:
తప్పులు లేవని గొప్పలఁ
జెప్పుట తప్పని యెఱుఁగుదు శ్రీపాఠక నా
దప్పుల మధ్యన ముత్యపు
చిప్పను గని మోదమొంది చెలగుమ దయతో 1