రెండు ప్రశ్నలు

సంగ్రహము

రేచన వ్రాసిన కవిజనాశ్రయము మొదటి తెలుగు గ్రంథము కాదని శాసనముల, తదితర ఆధారముల ద్వారా నిరూపించబడినది. కొన్ని శతాబ్దములకు ముందు ఛందోనియమముల కొఱకు వాడబడిన హలంతములైన పదములను అజంతములుగా ఉచ్చరించేవారని శాసనముల ద్వారా నిరూపించడమైనది. అట్టి పద్ధతిని నేడు కూడ ఆచరించిన బాగుండునను సూచనను కొన్ని ఉదాహరణముల మూలముగా చేసినాను.

పరిచయము

శాసనము రాతిపైన చెక్కబడినా అది అద్దములాటిది. దేశ చరిత్రను, ప్రజల ఆచార వ్యవహారాలను, వారి సంస్కృతిని, వారి భాషను ప్రతిబింబిస్తుంది. భారతదేశములో అన్ని ప్రాంతాలలో ఉండే శాసనాలు చరిత్రపుటలలోని రహస్యాలను దాచి ఉంచుకొన్నాయి. ప్రాచీన శాసనములు దేవాలయాలలో గోడలపైన, స్తంభాలపైన ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగులో శాసనాలు సుమారు 1500 సంవత్సరాలనుండి ఉన్నాయి. వాటిలోని పదాలు, వ్యాకరణము, ఛందస్సు తెలుగు భాష ఎలా మార్పు చెందుతూ ఉన్నాయో అన్న విషయాలను కూడ తెలుపుతాయి. తెలుగు శాసనాలనుండి నేర్చుకొన్న రెండు పాఠములను మీకు ఈ వ్యాసములో తెలియజేస్తున్నాను.

రేచన కవిజనాశ్రయము తెలుగులో మొదటి గ్రంథమా?

ఇప్పటివఱకు తెలుగులో మనకు లభించిన ఛందోలక్షణ గ్రంథములలో కవిజనాశ్రయము (క.జ.) పురాతనమైనది. దీనిని కొందఱు వేములవాడ భీమకవి వ్రాసెనని చెప్పుతారు. ఆ కారణమువలన ఈ గ్రంథమునకు భీమనఛందము అనే మఱొక పేరు కూడ ఉన్నది. ప్రస్తుతము దీని రచయిత మల్లియ రేచన అని చాలమంది అంగీకరించినారు. జయంతి రామయ్యపంతులు పరిష్కరించిన ఒక ప్రతి[1], నిడుదవోలు వేంకటరావు వ్రాసిన ముందుమాటతో వావిళ్ళవారు ప్రచురించిన మఱొక ప్రతి[2] వాడుకలో ఉన్నాయి. ఇటీవల వైద్యం వేంకటేశ్వరాచార్యులచే పరిష్కరించబడిన ఒక ప్రతిని తెలంగాణా సాహిత్య పరిశోధన కేంద్రము వారు ప్రచురించినారు. ఈ ప్రతిని నేను చూచియుండలేదు. కాని పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి మల్లియ రేచన-మొదటి తెలుగు రచయిత[3] అని ఒక వ్యాసమును ప్రచురించినారు. దీని సారాంశము ఏమనగా: 1. కన్నడములో విక్రమార్జున విజయ లేక పంపభారతమును[4] వ్రాసిన పంపకవి తమ్ముడు జినవల్లభుడు, మల్లియ రేచన మిత్రులు. 2. అవతారికలోని నాలుగవ పద్యములో చెప్పబడిన వాచకాభరణుడు జినవల్లభుడే. 3. కవిజనాశ్రయ కర్త మొట్టమొదటి తెలుగు రచయిత. 4. రేచన రెండవ అరికేసరి వేములవాడ ప్రాంతమును పరిపాలించిన కాలము క్రీ.శ. 930-950 నాటి వాడు.

అసమాన దాన రవితన-
య సమానోన్నతుఁడు వాచ-కాభరణుఁడు ప్రా-
ణసమాన మిత్రుఁ డీకృతి
కి సహాయుఁడుగా నుదాత్త – కీర్తి ప్రీతిన్ (కవిజనాశ్రయము – 4)

మధ్యాక్కర

నా ఉద్దేశములో ఛందస్సు పరముగా పై ఊహకు ఆధారములు తక్కువ. వాటిని క్రింద వివరిస్తున్నాను

సుమారు క్రీ.శ. 930 ప్రాంతములో యుద్ధమల్లుని బెజవాడ శాసనము చెక్కబడినది. ఇది జయంతి రామయ్యపంతులచే పరిష్కరించబడినది[5]. ఇందులో మూడు మధ్యాక్కర పద్యములు ఉన్నాయి. వీటినిగుఱించి నేను అక్కరలు అనే వ్యాసములో చర్చించియున్నాను. ప్రస్తుత చర్చకై ఇక్కడ శాసనములోని రెండవ పద్యమును ఉదాహరిస్తున్నాను –

పరగంగ బెజవాడఁ గొమరసామికి – భక్తుఁడై గుడియు
నిరుపమ మతి నృపధాముఁ డెత్తించె – నెగిదీర్చె మఠము
గొరగల్గా కొరులిందు విడిసి బృందంబు – గొనియుండువారు
గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన – పాపంబు గొండ్రు … – (యుద్ధమల్లుని బెజవాడ శాసనము 2. మూడవ పాదములో గణ భంగము)

ఈ పద్యములలోని ముఖ్యాంశము ఏమనగా: అక్షరసామ్య యతి మధ్యాక్కర (ఇం/ఇం/సూ/ఇం – ఇం/సూ; ఇం = ఇంద్ర గణము, సూ = సూర్య గణము) పాదములోని ఐదవ గణముతో చెల్లుతుంది. రేచన వ్రాసిన కవిజనాశ్రయములో మధ్యాక్కర లక్షణ పద్యము క్రింద ఇచ్చాను –

సురరాజు సురరాజు గూడి – సూర్యుతో నొడఁబడి మఱియుఁ
గర మొప్ప నిప్పాట నాఱు – గణముల మధ్యాక్కరంబు
విరచింపఁ బంపెఁ బ్రావళ్ళు – వెలయఁ గవిజనాశ్రయుండు
సురుచిరంబుగను సుశబ్ద – శోభితం బగునట్లు గాఁగ – (కవిజనాశ్రయము, జాత్యధికారము, 26)

ఇందులో అక్షరసామ్య యతి నాలుగవ గణముతో చెల్లించినాడు రేచన. రేచన యుద్ధమల్లుని శాసనమును నిరాకరించి స్వంతముగా ఈ మార్పు చేసినాడనుకొందామా? నన్నయ భారతములో 39 మధ్యాక్కరలు ఉన్నాయి[6]. నన్నయ వడిని యుద్ధమల్లుని శాసనమునందు వలె ఐదవ గణముతో నుంచినాడు. నన్నయ భారతము ఈ శాసనాలు వ్రాయబడిన వంద సంవత్సరాల పిదప వ్రాయబడినది. రేచన క్రీ.శ. 950 ప్రాంతములో క.జ. వ్రాసి ఉంటే, ఆ ప్రతి వంద సంవత్సరాల తఱువాత నన్నయకు లభ్యమై ఉంటుంది. మఱి నన్నయ ఎందుకు యతిని క.జ.లో చెప్పినట్లు ఉంచలేదు అనే ప్రశ్న మనకు జనిస్తుంది. కాని అరణ్యపర్వ శేషమును రచించిన ఎఱ్ఱన వ్రాసిన మధ్యాక్కరలో వడి కవిజనాశ్రయకారుడు చెప్పినట్లు ఉన్నది. అనగా క.జ. నన్నయ ఎఱ్ఱనల మధ్యకాలములో వ్రాయబడినదని మనము ఊహించ వీలగును. నన్నయ ఎఱ్ఱనల భారతమునుండి మధ్యాక్కరకు ఉదాహరణములు –

క్షమయందు చిత్తంబు నిల్పి నిర్గత – కల్మష బుద్ధి
గ్రమమున ధర్మువునంద వర్తిల్లు – కరుణాత్ము నిన్ను
నమర ధర్మంబు రక్షించుఁ బ్రీతితో – నని శత్రులందు
సమబుద్ధి సేయంగఁ జనునె నీకు న-జాతశత్రుండ – (నన్నయ భారతము, అరణ్య పర్వము, 1.225)

అసదృశతేజుఁడు బ్రాహ్మ-ణానీక సహితుఁడై కడఁగి
వసుమతియందు నధర్మ-వర్తులై యున్న మ్లేచ్ఛులను
మసలక నిజశక్తిఁజేసి – మడియించి ధర్మంబు నిలిపి
వసునిభుం డొనరించుఁ బేర్మి – వాజిమేధము నిష్ఠ యొప్ప – (ఎఱ్ఱన భారతము, అరణ్య పర్వము, 5.310)

కందము

నేను కందపద్యపు పుట్టు పూర్వోత్తరాలపై వ్రాసిన రెండు వ్యాసములలో మొదటి దానిలో జినవల్లభుని కుర్క్యాల శాసనమునందలి మూడు పద్యములను తెలిపియున్నాను. అందులో మూడవ దానిని క్రింద మళ్ళీ వ్రాసినాను –

ఒక్కొక్క గుణంబు కల్గుదు
రొక్కొడగా కొక్కలక్క – లేవెవ్వరికిం
లెక్కింప నొక్కొ లక్కకు
మిక్కిలి గుణపక్షపాత – గుణమణి గుణముల్

ఈ పద్యములో యతి స్థానములో (-గుర్తు) అక్షరసామ్య యతి తప్పినది. రేచన, జినవల్లభులు ఆప్త మిత్రులైయుంటే రేచనకు తాను వ్రాసిన శాసన కంద పద్యములను జినవల్లభుడు చూపించి ఉంటాడని ఊహించడము అతిశయోక్తి కాదు. ఎందుకంటే శిలాశాసనాలు కలకాలము నిలిచి యుండేవి. అలా చూపించి ఉండిన పక్షములో లక్షణకారుడైన రేచన యతి దోషమును జినవల్లభునికి చూపి సరిదిద్ది ఉంటాడు కదా? దోషభూయిష్ఠమైన పద్యమును చెక్కి ఉండడు కదా? ఇంకొక విషయము–రగడలవంటి పద్యశాసనములు తెలుగులో నున్నవి. పంపకవి విక్రమార్కవిజయములో, ఆదిపురాణములో రగడలను ఉపయోగించెను. కాని రగడల లక్షణములు క.జ. లో లేవు. జినవల్లభుడు తన అన్నగారు వ్రాసిన పద్యముల లక్షణములను క.జ. లో చేర్చమని ఉండడనుటకు అవకాశము లేదు. కావున రేచన జినవల్లభుల మైత్రి ఒక కట్టు కథ, ఊహాగానము, నిజము కాదు.

మానినీ కవిరాజవిరాజితములు

మానినికి ప్రతి పాదములో ఏడు భ-గణములు, ఒక గురువు. మానినియందలి మొదటి భ-గణమును న-లముగా చేసినప్పుడు మనకు కవిరాజవిరాజితము లభిస్తుంది. రెంటికీ లయ ఒక్కటే. మానినిని సంస్కృతములో మదిరా, లతాకుసుమ, సంగతా అని అంటారు. ఇది సంగతా అనే పేరితో విరహాంకుని వృత్తజాతిసముచ్చయములో ప్రాకృత వృత్తముల అధ్యాయములో పేర్కొనబడినది. కవిరాజవిరాజితమును హంసగతి, మహాతరుణీదయిత, సుధాలహరి అంటారు. కవిరాజవిరాజిత వృత్తమును ఆదిశంకరులు మహిషాసురమర్దిని స్తోత్రములో వాడినారు. ఛందోంబుధిలో మానినిని వనమంజరి అనియు, కవిరాజవిరాజితమును హంసగతి అనియు నాగవర్మ పేర్కొన్నాడు. కావున ఈ మానిని కవిరాజవిరాజిత వృత్తముల నామములు తెలుగు ఛందస్సులో మాత్రమే ఉన్నది. నన్నెచోడుడు తన కుమారసంభవములో ముద్రాలంకారముతో ఒక మానినీ వృత్తమును వాడినాడు. నన్నెచోడుడే ఈ వృత్తమునకు ఈ పేరిని ఉంచినాడా లేక ఉన్న పేరును తన వృత్తములో వాడినాడా అన్నది చర్చనీయాంశము. అదే విధముగా నన్నయభట్టు దుష్యంతుడు కణ్వాశ్రమమును సమీపించినప్పుడు ఒక మానినీవృత్తమును వాడినాడు. శకుంతల అనే మానినిని చూచు సంఘటనను ఈ వృత్తము పేరితో కవి సూచిస్తున్నాడని మనము అనుకొనవచ్చునా? అదే సమయములో కవిరాజవిరాజిత వృత్తమును కూడ నన్నయ వాడినాడు. ఆ పద్యములు క్రింద ఇవ్వబడినవి.

మానిని:

ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల – నిమ్మగు ఠావుల జొంపములం
బూచిన మంచి యశోకములన్ సుర-పొన్నలఁ బొన్నల గేదఁగులం
గాచి బెడంగుగఁ బండిన యా సహ-కారములం గదళీతతులం
జూచుచు వీనుల కింపెసఁగన్ విను-చున్ శుక కోకిల సుస్వరముల్ – (నన్నయ భారతము, ఆది పర్వము, 4.20)

ఆననలీల సుధాకరబింబ న-వాంబురుహంబుల చెల్వగుటన్
వేనలి కృష్ణభుజంగకలాపి స-విస్తరభాసురమై చనుటం
దా నతి బాలకి యయ్యుఁ దపం బుచి-తస్థితిఁ జేయుచునుండుట నీ
మానిని రూపచరిత్ర లుదారస-మం బగుచున్నవి చిత్రగతిన్ – (నన్నెచోడుని కుమారసంభవము, 7.9)

జూదము నప్పుడు సర్వజనంబులు – చూచి భయంపడి యిప్పని యి-
మ్మేదిని సేనలకుం గురుకోటికి – మృత్యువు గాని నిజం బలఁతిం
బోదని యాడరె యమ్మెయి నాదగు – బుద్ధికిఁ దోఁచిన సత్యము దా-
మోదర పాటిలదే కొడుకంచుఁ బ్రి-యోక్తులు వల్కిన బెంపు సెడున్ – (తిక్కన భారతము, స్త్రీ పర్వము, 2.31 ఒక యతితో)

కూలియుఁ గాంతి యి-గుర్పఁగఁ దేజము – గుందక వహ్నులు – క్రూర శిఖా
జాల మడంగియుఁ – జాయ వెలింగెడు – చందము నొందిరి – శల్యుఁడుఁ బాం-
చాలుఁడుఁ గర్ణుఁడుఁ – జాపగురుండును – శాంతనవుండు ని-జంబున కీ
బాలుఁడు వీరి ప్ర-భం గడచెన్ గుణ-భద్రుని గంటె సు-భద్రసుతున్ – (తిక్కన భారతము, స్త్రీ పర్వము, 2.12 మూడు యతులతో)

మానినికి క.జ. లోని లక్షణ పద్యము –

కారకముల్ క్రియఁ గన్గొన నేడు భ-కారము లొక్క గకారముతో
గారవమై చనఁగా యతి పండ్రెటఁ – గల్గిన మానిని కామనిభా

లక్షణ పద్యములో ఒక్క యతిని చెప్పినా, లక్ష్యములో మూడు యతులు వాడబడినవి, గమనించండి.

కవిరాజవిరాజితము:

చనిచని ముందట నాజ్య హవిర్ధృత – సౌరభ ధూమలతా తతులం
బెనఁగిన మ్రాఁకుల కొమ్మలమీఁద న-పేత లతాంతము లైనను బా-
యని మధుపప్రకరంబులఁ జూచి జ-నాధిపుఁ డంత నెఱింగెఁ దపో
వన మిది యల్లదె దివ్య మునీంద్రుని – వాసము దానగు నంచు నెదన్ – (నన్నయ భారతము, ఆది పర్వము, 4.21)

మనునిభ చారుచరిత్రుఁ బవిత్రు న-మానుష పౌరుషవర్తి జగ
జ్జననుత నిర్మలకీర్తి రమావిభు – శాశ్వత యోగ పదస్థిరు, స
న్మునిజన ముఖ్యు శివాగమవేది న-మోఘవచోనిధి ధీనిధిఁ బా
వనతరమూర్తి సమస్త జగద్గురు – వంద్యు ననింద్యు, సదాత్మవిదున్ – (నన్నెచోడుని కుమారసంభవము, 11.214)

గురుని శరంబులు దాఁకిన మేదినిఁ – గూలి విరాటుఁడు పేరిన నె-
త్తురుల మునింగిన మేనును దానును – ధూళి సమీరుఁడు మోముపయిం
బొరిఁబొరిఁ జల్లఁగ నున్కి గనుంగొని – పొడ్మఁగ నశ్రులు హా యనుచుం
బుర పురఁ బొక్కెద లెమ్మెయిఁ జోపినఁ – బోవక మూఁగెడుఁ బక్షితతుల్ – (తిక్కన భారతము, స్త్రీ పర్వము, 2.85 ఒక యతితో)

అనవుడు నిట్లను – నన్నరపాలున – కాతఁడు మోక్షము – నర్థి జగ-
జ్జనులకుఁ బెట్టున – సన్మతిఁ గోరి వి-శారదు లాదర – సంభృతులై
యనఘ సుదుస్తర-మైన భవంబున – కచ్చగు నీ యితి-హాసము బో
వన మహనీయవి-ధంబునఁ జెప్పి రు-దాత్త గుణాశ్రయ-తా మహితా – (తిక్కన భారతము, స్త్రీ పర్వము, 1.61 మూడు యతులతో)

కవిరాజవిరాజితమునకు క.జ. లోని లక్షణ పద్యము –

క్రమమున నొక్క నకారము నాఱు జకారములుం బరగంగ వకా
రమును నొడంబడి రాఁ గవిరాజవిరాజిత మన్నది రామనిభా

ఇక్కడ గమనించదగిన విషయము ఏమంటే ఇద్దరు నన్నయలు రెండు వృత్తాలకు ఒకే యతిని వాడినారు. కాని క.జ.లో మానినికి లక్షణములలో ఒక్క యతిని చెప్పినా, లక్ష్యములో మూడు యతులను రేచన వాడినాడు. కవిరాజవిరాజితమునకు కూడ లక్ష్యములో మూడు యతులు గలవు. నన్నయ వ్రాసిన ఈ రెండు వృత్తములలోని పద్యములకు ఒక్క యతియే. కాని తిక్కన వ్రాసిన నాలుగు మానినీ వృత్తములలో మూడింటికి ఒక్క యతి, ఒక దానికి మాత్రము మూడు యతులు. అదే విధముగా తిక్కన వ్రాసిన మూడు కవిరాజవిరాజితములకు ఒక్క యతి, ఒక దానికి మూడు యతులను ఉంచెను. అనగా తిక్కన అప్పుడే క.జ. ను పఠించినాడేమో? అనగా క.జ. నన్నయతఱువాత తిక్కనకు ముందు వ్రాయబడినది అని నిర్ధారణ చేయ వీలగును. మానినీ కవిరాజవిరాజితముల యతినిగుఱించి దొరసామిశర్మ విపులముగా వేఱొక చోట చర్చించియున్నారు[7].

క్రౌంచపదము

ఇది సంస్కృతములో పాదమునకు 25 అక్షరములు ఉండే అభికృతి ఛందమునకు చెందినది. చివరి మూడు అక్షరాలను స-గణముగా భావించవచ్చును. కన్నడములోని నాగవర్మ ఛందోంబుధిలో, జయకీర్తి ఛందోనుశాసనములో ఈ పేరితో ఈ లక్షణములతో క్రౌంచపదము ఉదాహరించబడినది. కాని తెలుగులో చివరి స-గణమునకు బదులు రెండు గురువులు ఉంటాయి. ఒక అక్షరము తక్కువైన 24వ ఛందమైన సంకృతిలో ఇది పేర్కొనబడినది. దీనిని మొట్టమొదట నన్నెచోడుడు వాడినాడు. ఈ విషయాలను ఇంతకుముందే చర్చించియున్నాను. లక్షణములను మార్చి ఈ వృత్తమును రేచన క.జ.లో చెప్పినాడంటే దానికి నన్నెచోడుని లక్ష్యము కారణము అని భావించ వీలగును. అంటే క.జ. నన్నెచోడుని పిదప వ్రాయబడినది అనుకొనవచ్చును.

చంద్రగణములు

ఉపగణములను వివరించునప్పుడు రేచన ఈ రెండు పద్యములను వ్రాసినాడు.

భ ర త నగ నల సలంబులు
వరుసనె యియ్యాఱు నెన్న – వాసవ గణముల్
మరి న హము లిన గణంబులు
సరవి దక్కినవి యెల్లఁ – జంద్ర గణంబుల్

వినుత ద్విత్రి చతుర్గురు
జనిత గణంబులు రవీంద్ర – చంద్రాఖ్యములై
చను నక్కర జాతుల కె-
ల్లను నాదిమ గణము మొదల – లఘు విడవలయున్

మొదటి పద్యములో చంద్ర గణములేవో అన్నది స్పష్టముగా లేదు. రెండవ పద్యములో కూడ స్పష్టత లోపించినది. కన్నడములోని బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములలో రెండేసి గణములను వదలినప్పుడు రవీంద్రచంద్ర గణములు లభించునన్నది సరిగా విదితము కాలేదు. అక్కరలలో కూడ ఆ ఐదు అక్కరల పేరులను అలా ఎందుకు స్వీకరించినాడో అన్న విషయము కూడ సందిగ్ధమే. క.జ. యందలి అక్కరల పేరులు నాగవర్మ ఛందోంబుధి, జయకీర్తి ఛందోనుశాసనములకు భిన్నము. ఆ గ్రంథములలోని అక్కరల పేరులు సక్రమముగా ఉంటే, రేచన ఎన్నిక మధ్యాక్కర, మధురాక్కరలలో భిన్నముగా నున్నది. ఈ విషయములను నేను అక్కరలపైన వ్యాసములో చర్చించినాను.

శాసన ప్రమాణములవలన, కొన్ని పద్యములలోని యతి నిర్ణయము వలన రేచన నన్నయభట్టు, నన్నెచోడుల పిదప యనియు, తిక్కనకు ముందనియు నా ఉద్దేశము.

పద్యము చివర పొల్లులను పూర్వకాలములో వాడేవారా?

ఈమధ్య శ్రీమతి లైలా యెర్నేనిగారు యాహూ కూటమి రచ్చబండలో ఒక ప్రశ్నను లేవదీసినారు. అది పద్యములలో పాదము చివర పొల్లులు ఉంటే వినడానికి కఠోరముగా ఉంటుందని. యాహూ రచ్చబండ కూటమిలో ఆమె ప్రచురించిన సందేశము

అన్ని హల్లుల్ అన్ని పొల్లుల్
అన్నీ బొల్లుల్ ఉంటే
తెలుగు కవిత్వంలో
అబ్బా! కుడతాయ్ కసిక్కిన
నల్లుల్,
చీమల్, దోమల్.
కయ్ కయ్ కయ్
కూస్తాయ్ కుక్కల్ నక్కల్
ఫట్ ఫట్ మంట్ పదాల్
పేల్తాయ్ పిస్టల్, గన్నుల్, బాంబుల్
అటులైనన్
అట్టి లైన్ లన్
అక్షరాలలో కనరాదు వెన్నెల
ఆడరారు అందమైన ఆడపిల్లలు
చస్తే కురవదు అమృతం.

పాదముల చివర పొల్లులు ఉంటే అవి తఱువాతి అక్షరముతో సంధి చేసికొంటాయి, ఉదా. పూచెన్ గలువలు = పూచెం గలువలు. ఒక పద్యపు ఉదాహరణము –

కొలిచితి నిన్నే యెపుడున్
వలచితి నిన్నెపుడు నేను – వరదుఁడి వంచున్
మలవలె రారా కావన్
నలినాక్షా చల్ల రమ్ము – నవ్వుల పువ్వుల్

సులభముగా అర్థము చేసికొనుటకై పై విధముగా వ్రాసిన పద్యము నిజముగా ఇలా ఉండాలి –

కొలిచితి నిన్నే యెపుడు
న్వలచితి నిన్నెపుడు నేను – వరదుఁడి వంచు
న్మలవలె రారా కావ
న్నలినాక్షా చల్ల రమ్ము – నవ్వుల పువ్వుల్

చివరి పదమైన పువ్వుల్ తప్ప మిగిలిన వాటిలోని పొల్లులు తఱువాతి పదములలోని మొదటి అక్షరములతో సంధి చేసికొన్నాయి. కొన్ని సమయాలలో తఱువాతి పదము అచ్చుతో ప్రారంభమయితే అదనముగా అక్షరమును వాడుతారు. అది ద్రుతమయితే ద్రుతముపైన ద్రుతమును ఉంచుతారు. పై పద్యములో మూడవ పాదములో మలకు బదులు అల అనే పదమును ఉపయోగిస్తే అప్పుడు ఆ పాదము ఇలాగుంటుంది – న్నలవలె రారా కావ(న్).

వృత్తములలో, జాత్యుపజాతులలో ఇవి ఏ విధముగా ఉంటాయో చూద్దామా? వృత్తములలో సామాన్యముగా పాదాంతములో ఉండే అక్షరము గురువుగా ఉంటుంది. అది పొల్లుతో అంతమైతే తఱువాతి పదములోని మొదటి అక్షరముతో చేరుతుంది. కాని పూర్వకవులు చాలమంది అట్టి చోటులలో గుర్వంతమగు పదాలనే వాడినారు, ఉదా.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? – గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పో-వం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం – బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే – యిక్కాలమున్? భార్గవా!- (పోతన భాగవతము, 8.590)

ఇందులో చివరి గురువులన్నీ అందముగా స్వతఃసిద్ధమైన దీర్ఘాక్షరములతో అంతమయ్యాయి.

పై విధముగా సాధ్యము కాకపోతే దీర్ఘాక్షరముతో ఆరంభమయ్యే ఒక పదమును అక్కడ ప్రారంభిస్తారు. ఉదా.

పుణ్యుఁడు రామచంద్రుఁ డట – వోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమ శ-రణ్యము నుద్ధత బర్హి బర్హ లా
వణ్యము గౌతమీ విమల -వాఃకణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు ని-కుంజ వరేణ్యము నగ్రగణ్యమున్. – (పోతన భాగవతము, 9.268)

ఇందులో పాదాంతములో కొత్త పదములు ప్రారంభ మయ్యాయి. చివరి పాదములో మాత్రమే ద్రుతాంతమైన పదము ఉన్నది. చదువుటకు ఇది సొబగుగా ఉన్నా, దీనిని పాడాలంటే, పాదాంతములో విఱుపు వస్తుంది.

తెలుగులో సామాన్యముగా ఉపయోగించే జాత్యుపజాతులలో ఉత్సాహము, కందము, ఆటవెలది బేసి పాదములలో మాత్రమే పదము గుర్వంతమగుటకు సాధ్యము. సీసము, తేటగీతి, మధ్యాక్కర, ఆటవెలది సరి పాదములు–వీటిలో పదము లెప్పుడు లఘ్వంతమే. అదెందుకంటే పాదము సూర్యగణముతో అంతమవుతుంది. తెలుగులో సూర్య గణములు– న-గణము, గ-లము, ఇవి లఘ్వంతములు. పాడుకొనేటప్పుడు వీటిని సాగదీసికోవచ్చు, కాని వాటిలో పొల్లులు లేవు. అందువలన వినుటకు సొంపుగా ఉంటుంది. బహుశా మొట్టమొదటి తెలుగు లాక్షణికులు ఈ ఉద్దేశముతో సూర్య గణములలో కన్నడములోని బ్రహ్మ గణములవలె గ-గమును, స-గణమును చేర్చ లేదేమో?


చిత్రము 1.

ఇక పొల్లుతో పాదము అంతమయినప్పుడు పూర్వ కాలములో వాటిని ఏ విధముగా ఉచ్చరించేవారు అనేది తఱువాతి ప్రశ్న. దీనికి మనకు పురాతన శాసనములు జవాబులు తెలుపుతాయి. సుమారు క్రీ.శ. 1108 (శక వర్షము 1030) కాలము నాటి అమరావతి శాసనమునుండి[8] రెండు పద్యములు మొదటి చిత్రములో చూపబడినవి. ఇందులో మొదటి పద్యములో చివరి పదము ‘ఉన్నతిన్’. కాని శాసనము చెక్కిన శిల్పి తాను ఎలా ఉచ్చరిస్తాడో ఆ విధముగా చెక్కినాడు, ‘ఉన్నతిన్’ కు బదులుగా ‘ఉన్నతిని’ అని చెక్కినాడు. అనగా గణ నియమము ప్రకారము పదము ‘ఉన్నతిన్’ అయినా, ఆ పదమును ఆ కాలములో ‘ఉన్నతిని’ అని పలికేవారన్న మాట. అదే విధముగా రెండవ పద్యములో చివరి పదము ఛందస్సు రీత్యా ‘నెగడెన్’, కాని శిల్పి ‘నెగడెను’ అని చెక్కినాడు. అదే విధముగా మొదటి పద్యములో చివరి పాదములో ‘వృత’ పదము ‘వ్రిత’ అని యున్నది. అంటే ఆ కాలములో ఋ-కారమును ‘రి’ అని పలికేవారు, ఇప్పటిలా ‘రు’ అని కాదు.


చిత్రము 2.

రెండవ చిత్రములో సుమారు క్రీ.శ. 1124 (శక సంవత్సరము 1046) నాటి ఉప్పరిల్లి శాసనములో[9] గల మూడు వృత్తములలో చివరి పదములలోని పొల్లులను అజంతముగా వ్రాసియుండుట గమనించ దగిన విశేషము. ‘తేజోధికుల్’, ‘ముదంబుతోన్’, ‘చిరస్థాయిగాన్’ ఛందస్సు ప్రకారము సరియైన పదములయితే వాటిని ‘తేజోధికులు’, ‘ముదంబుతోను’, ‘చిరస్థాయిగాను’ అని శిల్పి చెక్కి యున్నాడు. తెలుగు అజంత భాష కావున పదములలో ఛందోనియమముల ప్రకారము పొల్లులు ఉన్నా వాటిని అజంతములుగా పలుకడము కొన్ని శతాబ్దముల ముందు వాడుక. అంతే కాదు దంత్య చ-కారమును కూడ శిల్పులు ‘త్స’ అని చెక్కినారు ఆ కాలములో. ఈ అజంతము ఎప్పుడు పూర్తిగా పొల్లుగా మారినదో అన్న విషయమును పరిశోధించాలి.

ప్రస్తుత స్థితి

ప్రస్తుత కాలములో ఈ సమస్యను ఏ విధముగా పరిష్కరించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. సంస్కృతములో సరి పాదముల అంతములో తప్పక పాదాంత విరామ యతి ఉంటుంది. బేసి పాదాలలో కూడ సామాన్యముగా ఈ విరామయతి ఉంటుంది. అంతే కాక, ఈ విరామయతి కారణాన, పాదాంత లఘువును కూడ గురువుగా గ్రహించుట వాడుక. దీనిని తెలుగులో కూడ ఆచరిస్తే ఈ పొల్లుల కల్లోలము చాలవఱకు తగ్గుతుంది. క్రింద కొన్ని ఉదాహరణములు –

మధు మాసములో – మనమందు నినున్
హృదయేశ్వర నేఁ – బ్రియమై తలఁతున్
వ్యధ లుండవుగా – వరదా యనఁగా
మృదు గీతములే – మెల మ్రోఁగునుగా

ఇది ఒక తోటక వృత్తము. అక్షరసామ్య యతిని నేను పాద మధ్యములో నుంచినాను. ఇందులో అన్ని పాదములలో పాదాంత విరామము కూడ పాటింపబడినది. పాడు కొనేటప్పుడు చివరి పొల్లును వర్జించి ఆ లఘువును కొనసాగిస్తే వినుటకు బాగుంటుంది. పాదాంత లఘువు ఇక్కడ గేయ సౌలభ్యము కోసము గురువైనది. అనగా పద్యము క్రింది విధముగా నుంటుంది –

మధు మాసములో – మనమందు నిను(నూ)
హృదయేశ్వర నేఁ – బ్రియమై తలఁతును(తూ)
వ్యధ లుండవుగా – వరదా యనఁగా
మృదు గీతములే – మెల మ్రోఁగునుగా

మనసు పిలుచుచుండె నిన్నె – మదన మోహనా యనెన్
గనులు జూచుచుండె నిన్నె – కామవర్ధనా యనెన్
దనువు కోరుచుండె నిన్నె – తాపనాశనా యనెన్
క్షణము లడుగుచుండె నిన్నె – శాపమేలరా యనెన్

ఇది ఒక ఉత్సాహ వృత్తము. ఇందులో చివరి గురువు అన్ని పాదాలలో ద్రుతాంతము. కాని దీనిని పాటగా పాడుకోవాలంటే పొల్లు న-కారమును వదలి నె-కారమును పొడిగించుకొనవచ్చు లేక పురాతన శాసనములలోవలె యనెను అని పాడుకొనవచ్చును. లేకపోతే మొదటి రెండు పాదములలో చివర అనుస్వారముగా మార్చుకొన వచ్చును. అప్పుడు పద్యము ఇలాగుంటుంది –

మనసు పిలుచుచుండె నిన్నె – మదన మోహనా యనెం
గనులు జూచుచుండె నిన్నె – కామవర్ధనా యనెం
దనువు కోరుచుండె నిన్నె – తాపనాశనా యనె (ను)
క్షణము లడుగుచుండె నిన్నె – శాపమేలరా యనె (ను)

మధుర మనోహరమ్ము మధు-మాసము పాడఁగ మత్తకోకిలల్
మధురము మారుతమ్ము మధు-మాసమునందునఁ బూయ పుష్పముల్
మధురము మంజులమ్ము మధు-మాసము నర్తన సేయ భృంగముల్
మధురము మోహనమ్ము మధు-మాసము మ్రోఁగఁగ వేణురావముల్

ఇది ఒక చంపకమాల. ఇందులో పాదాంత విరామయతి పాటించబడినది. కాని అన్ని పాదాలు పొల్లు ల-కారముతో నంతమైనవి. పాడుకొనేటప్పుడు ‘కోకిలల్’, ‘పుష్పముల్’, ‘భృంగముల్’, ‘రావముల్’ పదములను ‘కోకిలలు’, ‘పుష్పములు’, ‘భృంగములు’, ‘రావములు’ అని పలికి పాడుకోవచ్చును, లయ ఏ మాత్రము చెడదు. అప్పుడు పద్యము ఈ రూపము తీసికొంటుంది –

మధుర మనోహరమ్ము మధు-మాసము పాడఁగ మత్తకోకిలలు
మధురము మారుతమ్ము మధు-మాసమునందునఁ బూయ పుష్పములు
మధురము మంజులమ్ము మధు-మాసము నర్తన సేయ భృంగములు
మధురము మోహనమ్ము మధు-మాసము మ్రోఁగఁగ వేణురావములు

ముగింపు

అక్షరములఁ గనుచు – నందమ్ము గొన వత్తు
రాడపిల్ల లంద – ఱాడుకొనుచు
నమృతధార గురియు – నాగకుండ, నలదు
వర్ణములను గవిత – వాడకుండ


గ్రంథసూచి

  1. కవిజనాశ్రయము – శోధన జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, 1932.
  2. కవిజనాశ్రయము – ముందుమాట నిడుదవోలు వేంకట రావు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1950.
  3. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి – మల్లియ రేచన మొదటి తెలుగు రచయిత, తెలుగు మఱుగులు, 87-92, తెలుగు గోష్ఠి, హైదరాబాదు, 1992.
  4. సరళ పంపభారత, ఎల్. బసవరాజు, గీతా బుక్ హౌస్, మైసూరు, 1999.
  5. యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనము – జయంతి రామయ్య పంతులు, సదానందనిలయ ముద్రాక్షరశాల, చెన్నపురి, 1917.
  6. ఆంధ్రమహాభారతము ఛందఃశిల్పము – పాటిబండ మాధవ శర్మ, అభినవభారతీ ప్రచురణము, 1966.
  7. తెలుఁగు భాషలో ఛందోరీతులు – రావూరి దొరసామిశర్మ, వెల్డన్ ప్రెస్, మద్రాసు, 1962.
  8. శాసనపద్యమంజరి – సం. జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, 1930.
  9. శాసనపద్యమంజరి – ద్వితీయ భాగము – సం. జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, 193?.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...