ఫాదర్స్ డే

వంకరటింకరగా పారే ఒక సెలయేరులాటి నా స్మృతిపథం ఈ రోజు వెల్లువతో నిండిపోయంది. ఎన్నో నదులతోబాటు అనంత గంభీర సాగరంతో సంగమించిన మరో నది నా మదిలో మెదులుతూ ఉంది యిప్పుడు. నాన్నా, నీ మోకాళ్ళపై ఆడుతుండే దినాలు మసక మసకగా కనిపిస్తున్నాయి. కాని నిద్ర పోవడానికి ముందు నిన్ను పాడమన్న రోజులు మాత్రం గుర్తులో ఉన్నాయి. నేను పెద్దవాడైన తరువాత తెలిసింది నీకు పాడడం రాదని, కాని నా శైశవ దశలో డంగుడింగు రమామణి అనే నీ పాట నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసేది. ఏవో బట్టలు పడ్డాయని చెబితే చెరువులో దూకి ఈదుకొంటూ వెళ్ళి వాటిని తీసికొని వచ్చిన దృశ్యం ఇప్పుడు కూడా నా కళ్ళముందు నాట్యమాడుతూ ఉంది. అప్పుడు నువ్వొక బలశాలియైన జలదేవతలా నాకగపడ్డావు. బంధువులు కానీ, స్నేహితులు కానీ, చివరకు ముక్కు మొహమూ తెలియని పరాయివాళ్ళు కానీ, ఎవరైనా చనిపోతే, వారి గౌరవార్థం వారి శవాన్ని కూడా మోసిన ఆ మానవత, ఆ ఉదారస్వభావం చాలా అరుదే.

ఇప్పుడు తలచుకొంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, నాలుగేళ్ళకే నాన్నను కోల్పోయిన నీ బాల్యం ఎంత కష్టతరంగా ఉండేదో? కాని నువ్వెప్పుడు ఆశాజీవివి. ఆ కాలంలో నీ జీవితంలో జరిగిన సంఘటనలను వర్ణిస్తూ నువ్వు చెప్పిన ఆ కథలు ఈ నాడు కూడా నా చెవులలో గింగురుమంటున్నాయి. స్వహస్తాలతో పని చేయడములోని గౌరవం, సంతృప్తి నువ్వు నాకు నేర్పిన గొప్ప విద్య. నాకు బాగా జ్ఞాపకముంది నీ నినాదం – కాలాన్ని, ధనాన్ని, నీటిని వ్యర్థంగా వాడకు! నువ్వు ఎన్నో మారులు చెప్పావు నీకా కాలంలో డాక్టర్ అవాలనే ఆశ ఉండేదని. కాని నీకు ధన సహాయం చేసే వాళ్ళెవ్వరూ లేరు అప్పుడు. నీ ఆశాకుసుమం వికసించక ముందే ముకుళించుకొని పోయింది. నీకు తెలియకుండానే బ్రిటిష్ రాజ్యాంగమనే పెద్ద యంత్రంలో నువ్వొక చిన్న సీలగా మారావు. నాకింకా జ్ఞాపకముంది గాంధీజీ నెల్లూరికి వచ్చినప్పుడు మీరంతా సీమ బట్టలను పోగులు పెట్టి ఎలా కాల్చారో అని నువ్వు చెప్పిన విషయం.

నాన్నా, నీకు అలభ్యమైన ఆ ఉన్నతవిద్యను అష్ట కష్టాలు పడి నాకు అందించావు, దాన్ని ఎలా మరవగలను? కాని నేను ఆ శిఖరాన్ని చేరే సమయంలో సంతోషించడానికి నువ్వు లేవు. నువ్వు నా దృష్టిలో స్థైర్యానికి, ధైర్యానికి, ఏకాగ్రతకు ఒక ఉన్నత శృంగానివి. నువ్వు నిజంగా ఒక మగధీరుడివే, నీ కళ్ళల్లో తడిని నేనెప్పుడు చూడలేదు. నేను జ్వరంతో పలవరిస్తూ కళ్ళు తెరిస్తే దేవుడిని ధ్యానం చేస్తూ నాకెదురుగా నువ్వు కనబడేవాడివి. నువ్వూ, నేను ఎప్పుడూ వాదించుకొనే వాళ్ళము. నిన్ను కవ్విస్తూ, నీకు కోపం తెప్పించడంలో నేనెంతో ఆనందం పొందే వాడిని. జీవితంలో రెండో అవకాశాలు ఉండవు. అలాటి అవకాశం దొరికితే బహుశా నీ దృక్పథాన్ని అర్థం చేసికోడానికి ప్రయత్నించగలను. నాకీరోజు తెలుగు సాహిత్యంలో అంతో ఇంతో ఆసక్తి ఉండడానికి నువ్వు కూడా ఒక కారణమేమో? రాత్రిళ్ళు నిద్రపట్టకపోతే “అట జని కాంచె భూమిసురుడు…”, “ఘనుడా భూసురు డేగెనో…” లాటి పద్యాలను నీకు నువ్వే నిద్రపోయేవరకు వల్లెవేస్తుంటే ఆ వయసులో అంతగా అర్థం కాకపోయినా ఆసక్తితో వాటిని విని మురిసిపోయేవాడిని.

ఈ రోజు నేను కూడా ఒక తండ్రిని, నా పిల్లలు విదేశీవాతావరణంలో పెరిగిన వాళ్ళు. ఫాదర్స్ డే రోజు బహుమతులను లేక విందు భోజనాలను లేక ఫోన్‌లో హర్షాభినందనలను ఇస్తారు. కాని వాళ్ళు ఒక్కొక్కప్పుడు నన్ను ఛాందసుడిగా, వారి నవీన జగత్తును అర్థం చేసికోజాలని భారతీయ బైతుగా భావిస్తారు. నేను వాళ్ళకు చెప్పేదల్లా ఒకటే – నన్ను ఎలా మీరు ఆదరిస్తున్నారో, అలాగే మీ పిల్లలు కూడా మిమ్ములను ఆదరించాలని నేను భగవంతుని కోరుతున్నాను. కాని మరుగై పోయిన నాన్నను, నన్ను, పెరిగి పెద్దైన నా పిల్లలను కలిపేదల్లా ఆ అంతర్వాహిని యైన ప్రేమ, స్నేహం, బాంధవ్యం, రక్త సంబంధం. భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు ఆ భగవంతుని వరశాపం.

నాన్నా, ఈ రోజు నీదన్నది నా దగ్గర ఉండేది నువ్వు వాడిన ఆ పాత రేజర్ ఒకటి మాత్రమే. దానికి బ్లేడులు కూడా ఇప్పుడు వెదకి కొనుక్కోవాలి. కాని నీ ప్రేమ, అనురాగం, నువ్వు చెప్పిన కమ్మటి కథలు, నువ్వు నేర్పిన విద్యలు, నీ మంచి మాటలు, నీ స్పర్శ తెచ్చే జ్ఞాపకాలు నేనీ భూమిపైన ఉండేవరకు నాతో ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకొనే వాళ్ళు ఉండేవరకు ఎవరు కూడా చనిపోరు. నాన్నా, నువ్వు ఇప్పుడూ, ఎప్పుడూ నేనున్నంతవరకు నాలో జీవిస్తావు, నాతో మాత్రమే మరణిస్తావు.


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...