విద్యాసుందరి

పరిచయము


బెంగుళూరు నాగరత్నమ్మ
Courtesy of Jyotsna Kamat

‘ఎందరో మహానుభావులు, అందరికి వందనములు’ అనే త్యాగరాజస్వామి కీర్తనను వినని తెలుగువారు అరుదే. తెలుగువారని ఎందుకు, కర్ణాటక సంగీతములో ఆసక్తి ఉన్నవారందరికీ ఈ పంచరత్న కృతి పరిచితమే. అట్టి మహానుభావులలో ఒక స్త్రీ, సుమారు 125 సంవత్సరాలకు ముందు దక్షిణ భారత దేశములో పుట్టింది. ఆమెయే విద్యాసుందరి నాగరత్నమ్మ. ఈమె శారదాస్వరూపిణి, లలిత కళలకు కాణాచి. భరతనాట్యము, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, కవిత్వము ఆమెకు కరతలామలకము. భోగినిగా ఆమె జీవితము ఆరంభమై, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా ముగిసింది. రక్తితో నిండిన ఆమె మనస్సు విరక్తితో నిండి భక్తి మార్గములో ప్రయాణము చేసి విముక్తి పొందింది. కన్నడ సీమలో జన్మించి, తెలుగు దేశమంతా సంచరించి, తమిళ భూమిలో అంతమయింది. ఆమె మన స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఒక పుటను వ్రాసింది. ఆమె తెలుగు సాహిత్య చరిత్రలో ఒక పుటను వ్రాసింది. ఆమె ఆనాటి రాజకీయ, సాంఘిక చరిత్రలో కూడ ఒక పుటను వ్రాసింది. కాని ఈ రోజు ఆమె పేరు వాగ్గేయకారుడైన త్యాగరాజస్వామి వారిపేరితో ముడి వేయబడింది. అది విడదీయగలేని ఒక బ్రహ్మముడి! త్యాగరాజస్వామికి భక్త్యంజలులు అర్పించే వారందరూ ఆమెకు కూడ శ్రద్ధాంజలులు తప్పక అర్పిస్తారు. ఆమె నాట్యములో బేలూరు శిలాబాలిక. సంగీతములో పరుగులు తీసే వరద కావేరి. కవితాహృదయములో పారిజాత కుసుమము. స్వాభిమానములో ఝాన్సీ లక్ష్మీబాయి. స్త్రీ స్వేచ్ఛా వాదములో ఈనాటి అమ్మలకు మూలపుటమ్మ. ఆమె జీవితము నన్ను చాల కాలమునుండి ఆకర్షిస్తూ ఉంది. దాని ఫలితమే ఈ చిన్ని వ్యాసము.

ముద్దుపళని రచించిన రాధికాసాంత్వనము నందలి కింది పద్యము నాగరత్నమ్మకు కూడ వర్తిస్తుంది –

ఏ నాతి నీ రీతి నెంతొ భక్తి జెలంగ
     వ్రాయించె జయధాటి రామకోటి
యే నారి నీ దారి నెలమి విద్వచ్ఛ్రేణిఁ
    దనియించె నెఱ మెచ్చి ధనము లిచ్చి
యే కల్కి నీ పోల్కి నిలఁ గీర్తిఁ గైకొనె
    గబ్బముల్ చేనంది ఘనతఁ జెంది
యే బాల నీ లీల నిటు దొరాదొరలచేఁ
    బొగడొందె గడిదేఱి పొలుపుమీఱి

తలప నే ధీర నీ మేరఁ దాతయార్యు
పాదముల వ్రాలె మది నెంచి ప్రస్తుతించి
కలరె నీసాటి ముత్యాలు కన్న మేటి
ప్రబల గుణపేటి శ్రీ ముద్దుపళని బోటి

– ముద్దుపళని, రాధికాసాంత్వనము (అవతారిక 32)

నాగరత్నమ్మ సర్వతోముఖ ప్రజ్ఞను విశ్లేషించుటకు ముందు ఆమె జీవితమును సంగ్రహముగా తెలిసికొంటే బాగుంటుందనుకొంటాను.

బాల్యము – మైసూరు

నాగరత్నమ్మ క్రీస్తుశకము 1878లో నవంబరు మూడవ తేది మైసూరికి సమీపములోనున్న కపిలా నదీతీరములో ఉండే నంజన్‌గూడులో పుట్టింది. ఆమె తల్లి పుట్టులక్ష్మమ్మ ఒక దేవదాసి, ఆమెకు జన్మ నిచ్చిన తండ్రి సుబ్బరావు అనే వకీలు. పూవు పుట్టగానే పరిమళించేటట్లు, ఆమె చిన్నప్పటినుండి సంగీతము అంటే చెవి కోసికొనేది. ఆమెకు పెద్ద ఊరిలో ఉంటే విద్యాభ్యాసము బాగా జరుగుతుందనుకొని మైసూరికి మకాము మార్చబడినది. ఆ కాలములో మైసూరును బ్రిటిషువాళ్ళు నేరుగా పాలించలేదు. మైసూరికి మహారాజు చామరాజ ఒడెయరు. అతని ఆస్థానములో విద్వాంసులైన గిరిభట్టర తమ్మయ్య నాగరత్నమ్మకు పాఠాలు నేర్పేవారు. పాటలు మాత్రమే కాక సంస్కృతము, కన్నడము ఇత్యాదులలో కూడ ఆమె జ్ఞానాన్ని ఆర్జించడానికి ఆరంభించింది. ఆమె విద్యాభ్యాసము ఇలా మూడు పువ్వులు, ఆరు కాయలుగా అవుతుంటే ఒక ఇక్కట్టు వచ్చింది. ఏదో చిన్న విషయములో నాగరత్నమ్మ తల్లి పుట్టులక్షమ్మకు, తమ్మయ్యకు భేదాభిప్రాయము వచ్చింది. అతడు తోకతొక్కిన పాములా లేచి “ఇక మీద నీ పిల్లకు నేను పాఠాలు నేర్పను. ఇక్కడనుండి తక్షణము వెళ్ళండి. మా ఇంటి గడప ఇకమీద దాటకండి”, అన్నాడు. తల్లికి కూడ కోపము వచ్చింది. “నా పిల్లకు ఇంకా బాగుగా విద్య నేర్పించి ఇదే ఊరిలో కచ్చేరి చేయించకపోతే చూడు, అంతవరకు మీ ఇల్లు మాత్రమే కాదు, మైసూరు కూడ వదలి వెళ్ళిపోతాము!” ఈ సమయములో వకీలు సుబ్బారావు వీళ్ళను విడిచి పెట్టాడు.

విద్యాభ్యాసము – బెంగళూరు

ఎవరో చెప్పారు పుట్టులక్షమ్మతో “మీరు కంచికి వెళ్ళండి, అక్కడ ధనకోటి అమ్మాళ్ అనే వారు ఉన్నారు, ఆమె మీకు సహాయము చేయవచ్చు”, అని. కంచికి పిల్లతో వెళ్ళింది పుట్టులక్షమ్మ. ధనకోటి అమ్మాళ్ ఇంటికి చాలమంది విద్వాంసులు వచ్చేవాళ్ళు, అందులో వాగ్గేయకారుడు శ్యామశాస్త్రి కొడుకైన సుబ్బరాయ శాస్త్రి, మనుమడైన అణ్ణాసామి శాస్త్రి కూడ ఉండేవారు. వీరి మూలముగా ధనకోటి గారికి అపురూపమైన కృతులు లభించాయి. కాని ఆమెకు ఆరోగ్యము బాగు లేదు, ఆయాసము, ఉబ్బసము. తొమ్మిదేళ్ళ నాగరత్న పాటలను విన్న ధనకోటి ఆమె విద్యాభాసమును శ్రీరంగములో కొనసాగించడానికి ఏర్పాటు చేస్తాను అన్నది. కాని అంత దూరము వెళ్ళటానికి తల్లికి మనస్సు, ఇంటి పరిస్థితులు అడ్డము వచ్చాయి. చివరకు ఆమె బెంగళూరు చేరింది. వరుసకు తమ్ముడైన వెంకటసామి ఇంటికి వెళ్ళింది. అతడు ఫిడేలు పాఠాలు చెప్పేవాడు. అతడు తన దగ్గర కొన్ని రోజులు పాఠాలు నేర్పించి విద్వాన్ మునిసామప్పవద్దకు తీసికొని వెళ్ళాడు. మునిసామప్ప కూడ వాయులీన విద్వాంసుడు. అతని గురువు కృష్ణస్వామి భాగవతర్, ఇతడు త్యాగరాజు ఆప్త శిష్యుడైన వాలాజాపేట్ వెంకటరమణ భాగవతర్ కొడుకు. అతడు ఆమెను శిష్యురాలిగా స్వీకరించాడు. తల్లి కూలినాలి చేసి పోషిస్తూ ఉండేది. నా దగ్గర డబ్బులు లేవు అంటే, మునిసామప్ప ఫరవాలేదు, నా మేనకోడలు చంద్రవదనతో నేర్చుకొంటుంది అనేవాడు. తాను సంగీతము నేర్పడము మాత్రమే కాదు, ఆంగ్లము, తెలుగు, తమిళ భాషలలో శిక్షణ, నాట్యాచార్యులైన కిట్టణ్ణచే నృత్యాభ్యాసము, తిరువేంగడాచారిచే అభినయకౌశల్యము పొందజేశాడు. పుట్టుకతో వచ్చిన ప్రతిభ అనే వజ్రాన్ని ఈ గురువులు సాన పెట్టి ప్రకాశవంతము చేశారు. అప్పుడు నాగరత్నమ్మకు సుమారు 13, 14 ఏళ్ళు. ఈ సమయములో ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. కూతురిపై ఎంతో ఆశ పెట్టుకొన్న పుట్టులక్షమ్మ ఉన్నట్లుండి చనిపోయింది. చిన్న పిల్లకు ఇది గొడ్డలిపెట్టు అయింది. కాని మునిసామప్ప ఆమెకు ధైర్యము చెప్పి తల్లి ప్రతిజ్ఞను నెరవేర్చుట నీ కర్తవ్యము అని బోధపరచి ఆమెను సముదాయించాడు.

రంగప్రవేశము

1892 నవరాత్రి ఉత్సవం సమీపించీంది. ఈ ఉత్సవములో నాగరత్నమ్మచే పాడించాలనే యోచన మునిసామప్పకి వచ్చింది. మైసూరులో వీణా శేషణ్ణగారి ఇల్లు సంగీతానికి ఒక దేవాలయము వంటిది. ఎందరో విద్వాంసులు, రసికులు అక్కడ గుమిగూడేవారు. నాగరత్నమ్మ రంగప్రవేశము అక్కడే. ఆమె సంగీతములోని సంప్రదాయ శుద్ధత, సాహిత్యములోని మంచి ఉచ్చారణ, కంఠములోని మాధుర్యము, అందమైన కల్పన ఆ విద్వత్సదస్సులోని ప్రాజ్ఞులను ఆనందపరచింది. కచ్చేరి ముగిసిన పిదప ఆమె వినయవిధేయతలతో అందరికీ నమస్కారము చేసింది. అక్కడ ఉన్న విద్వాంసులలో ఒకరైన బిడారం కృష్ణప్పను తనకు ఇంకా విద్యను నేర్పించమని ఆమె అడిగింది. ఈ సమయములో పెద్ద రాజకుమారి జయలక్ష్మమ్మణ్ణి ఋతుమతియైనది. ఆ సందర్భములో నాగరత్నమ్మను పాడమని అంతఃపురమునుండి ఆహ్వానము వచ్చింది, కొన్ని దినముల పిదప ఆమె జనానాలో నాట్యప్రదర్శన కూడ చేసింది. ఆమెకు ఒక విధముగా సంతోషము, తన తల్లి ప్రతిజ్ఞ నెరవేరిందని, మరొక విధముగా దుఃఖము కూడ. తన అభివృద్ధికొరకు తన సర్వస్వాన్ని ధారపోసిన ఆమె లేదు కదా అని. ఈ సమయములో ఆమె స్వర్గమునుండి నిన్ను ఆశీర్వాదము చేస్తుందని గురువు మునిసామప్ప భరోసా చెప్పాడు. ఇలా ఆమె రెండేళ్ళు మైసూరిలో నివసించింది. 1894 డిసెంబరులో చామరాజ ఒడెయరు చనిపోయారు. దానితో ఆమె మైసూరిని వదలి మరలా బెంగళూరు చేరింది.

యౌవనము – బెంగళూరు

షోడశి నాగరత్నమ్మ విద్యావతి, రూపవతి. ఆటలలో పాటలలో అందె వేసిన చేయి. ఆమె ఇంటికి రసికులు వచ్చేవారు. న్యాయవాదులు, న్యాయాధీశులు, ధనికులు, కళాపోషకులు ఆమె సంగీతగోష్ఠికి హాజరు అయ్యేవారు. అట్టివారిలో జడ్జి నరహరి రావు ఒకరు. ఈ నాటి హనుమంత నగర్ దగ్గరి సుబ్రహ్మణ్యస్వామి గుడి వద్ద ఒక పురాతన మంటపములో ఆమె ప్రతివారము కొందరు రసికుల సమక్షములో పాడేది. కొన్ని రోజులు నరహరి రావు గారు ఏవో వేరు పనుల కారణముగా విమనస్కులై ఉండగా, నాగరత్నమ్మ తనపై అతనికి కోపము వచ్చిందో, తానేమయినా తప్పు చేశానో అనుకొని దుఃఖించి మరల అతనిని చూచినప్పుడు తాను ప్రత్యేకముగా వ్రాసిన ఒక జావళిని వినిపించింది. నాగరత్నమ్మ వ్రాసిన ఒకే ఒక పాట ఇదియే. (ఆ పాట, నా అనువాదము కూడ అదే ఛందస్సులో ఉన్నది. కనుక తెలుగు పాటను కూడ అదే రాగములో కన్నడములోని పాటవలెనే పాడుకొనవచ్చును.) కోయముత్తూరు తాయి ఈ జావళిని గ్రామఫోన్ రికార్డ్‌గా ఇచ్చిన తరువాత ఇది చాల ప్రసిద్ధిని పొందిందని చెబుతారు. కన్నడములోని పాటను కే. వీ. నారాయణస్వామి గారు కూడా పాడారు.

మాతాడ బారదేనో మారమణనె
మాతనాడదె ఇంతు మౌనదిందిరువె
ప్రీతి గొలిద ప్రాణకాంతనె
నీ ఒందు ….

అంగళద బెళదింగళు
బిసిలాగి తోరుతిదె
భృంగద రవ కేళ
భీతి యాగుతిదె ….

మంద మారుత బందు
మరుళ మాడుతె నాథ
చందవుళ్ళ దేహ
కాంతి బాడుతె స్వామి ….

కామ శరవు ఎన్న
మైయలి తగలిదె
నామగిరి నరహరియె
న్యాయవేనో ….

మాటాడ వేలనయ్య మారమణుడా
మాటలాడక ఇట్లు మౌనముగ నుంటివి
ప్రీతి కొఱగు ప్రాణకాంతుడ
నీవొక ….

ముంగిలిలో దెలివెన్నెల
వడగాసి మండె గదా
తుమ్మెద సడి వినగ
భయము కల్గె మది ….

మంద పవనము వచ్చి
మరులు గొల్పెను నాథ
అందమైన తనువు
వన్నె వాడెను స్వామి ….

అంగజాస్త్రము నాదు
అంగము దగిలెను
నామగిరి నరహరీ
న్యాయమే యిది ….

ఈ పాటను విన్న మరునాడు నరహరి రావు ఆమె ఇంటికి వెళ్ళి “పిచ్చిదానా, ఏదో పని ఒత్తిడివల్ల పరధ్యానముగా ఉన్నా. నీపైన నాకు కోపము ఏమీ లేదు. నేను నిన్నుగురించి ఆలోచిస్తున్నాను. నీ విద్యకు, నీ ప్రతిభకు, నీ సాధనకు ఈ ఊరు సరియైనది కాదు. నీవు మదరాసుకు వెళ్ళి అక్కడ నీ విద్య ఔన్నత్యాన్ని, మైసూరు రాజ్యపు పేరును నిలబెట్టాలి. నా స్నేహితుడు రాజరత్నం ముదలియార్ నీకు సహాయము చేస్తాడు, వెళ్ళు” అన్నారు.

మదరాసు – దిగ్విజయము

ఇరవైయైదు ఏళ్ళ వయస్సులో నాగరత్నమ్మ మదరాసుకు వచ్చింది. ఆమెకు మదరాసులో సంగీత సాధనకు పూచి శ్రీనివాస అయ్యంగారుల ప్రోత్సాహము దొరికింది. ఆమె ఇంటిలోని కచ్చేరీలకు, భజనల కార్యక్రమములకు చాల మంది సంగీత విద్వాంసులు వచ్చేవారు. ఈ సమయములో ఆమె దక్షిణ భారతదేశములో దిగ్విజయయాత్ర చేసిందంటే అందులో అతిశయోక్తి లేదు. బొబ్బిలినుండి అనంతశయనము (తిరువనంతపురం) వరకు ఆమె పర్యటించింది. తిరుపతి వేంకటేశ్వరకవులలో ఒకరైన వేంకటేశ్వరకవి ఈమెపై ఒక లఘుకావ్యమును వ్రాసినారట. ఈ దేశ సంచారములో ఆమెకు ఎన్నో జయపత్రాలు లభించాయి. జయ పత్రమునకు అర్హత ఏమంటే సభలో మిగిలినవారు పాడినవి ఆమె అంతకంటె బాగుగా పాడుట, ఆమె పాడినదానిని మిగిలినవారు పాడలేక పోవుట. ఈ
సందర్భములో రాజమండ్రిలో జరిగిన కచ్చేరి చాల ప్రసిద్ధమైనది. ఆ సమ్మేళనమునకు ఆహ్వానము సంస్కృతములో వచ్చింది. బండినుండి దిగినప్పుడు ఆమెను ఎదుర్కొనుటకు ఒక విద్వత్సమూహమే కాచియుండింది. ఆరతిచేసి మంగళవాద్యములతో ఆమెను సభకు ఒక ఊరేగింపులో తీసికొని వెళ్ళినారు. అక్కడ ఆమె సంస్కృతములోనే మాటలాడింది. పాడిన పాటలంతా సంస్కృత భాషలోనిదే. సభాంతములో శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి గారు ఆమెకు ఎర్రని మణులతో ఆమె రూపుతో నున్న ఒక గండపెండేరాన్ని తొడిగినారట. ఇది ఒక అపూర్వమైన సన్మానము, గౌరవము అనుటలో సందేహము లేదు. మదరాసులో ఆమె ఒక కొత్త ఇల్లు కట్టి, దాని గృహప్రవేశ సందర్భములో తన గురువులైన బిడారం కృష్ణప్పగారిని ఆహ్వానించి పురందరదాసాది వాగ్గేయకారులచే రచించబడిన కన్నడ గీతములను మాత్రమే పాడించినదట. దీని ద్వారా తన మాతృభాష అయిన కన్నడము ఇతర భాషలకంటె సంగీతములో తక్కువైనది కాదు అని నిరూపించింది.

అపాయము – కలలో త్యాగరాజు

నాగరత్నమ్మకు ఒక కూతురు ఉండేది, తండ్రి ఎవరో మనకు తెలియదు. ఆ పాప కొన్ని ఏళ్ళకు బాల్యములోనే చనిపోయింది. ఇది తల్లి మనసుకు చాల బాధ కలిగించింది. దానిని మరచిపోవాలని ఒక చిన్న పిల్లను పెంపుడు కూతురుగా ఆదరిస్తూ పెంచుతూ ఉండేది. ప్రతి రోజు నిద్ర పోవడానికి ముందు ఈ పిల్ల పాలు ఇచ్చేది. ఒక రోజు ఆమెకు ఒక కల వచ్చింది, కలలో ఒక సన్యాసి వచ్చి ఆమెను నీకు రేపు ఒక అపాయము సంభవించబోతుంది జాగ్రత్త అని హెచ్చరించాడట. మెలకువ రాగానే ఈ సన్యాసి ఎవరై ఉంటారో అని పుస్తకాలను తిరగవేస్తుంటే ఆ సన్యాసి రూపము త్యాగరాజువలె ఉండినదట. అయినా తనకు త్యాగరాజస్వామి అపాయాన్ని గురించి ఎందుకు తెల్పాలి అని ఆలోచించింది. ఇక రాత్రి వచ్చింది. ప్రతి దినములా ఆమె పెంపుడు కూతురు ఆమెకు పాలు ఇవ్వడానికి వచ్చింది. కాని ఎందుకో లోటా చెయి జారి కింద పడింది, పాలు నేల పాలయింది. ఆ పిల్ల ఏడవటం మొదలు పెట్టింది. “నీవెందుకు ఏడుస్తావు, పాలు చల్లిపోతే వేరే పాలు తాగితే పోతుంద” అన్నది నాగరత్నమ్మ. ఆ పిల్ల నాగరత్నమ్మ కాళ్ళపై పడి ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలు పెట్టింది. “అమ్మా, ఆ పాలలో విషము కలిపా నేను, నా తల్లిదండ్రులు నీవు పోతే నీ ఆస్తి అంతా నాకు దక్కుతుంది, అలా చేయమన్నారు, చాల తప్పు జరిగింది” అని చెప్పిందట. నాగరత్నమ్మ ఆ పిల్లను లేవదీసి తనతో గదిలోనికి తీసికొని వెళ్ళి బీరువా తలుపులు తెరిచి నీకు కావల్సింది తీసికో అని చెప్పిందట. ఈ సంఘటనతో ఆమె మనస్సుకు ఒక పెద్ద ఆఘాతమే కలిగింది. దేవుడిని నమ్మినట్లు మనుష్యులను నమ్మడానికి సాధ్యము అవుతుందా? పురందరదాసు నంబి కెట్టవరిల్లవో రంగయ్యన నంబదె కెట్టరె కెడలి (నమ్మి చెడ్డవాడు ఎవ్వడూ లేడు, రంగని నమ్మక చెడిపోతే పోనీ) అని పాడాడు గదా! మరు దినము ఉదయము లేచి స్నానము చేసి త్యాగబ్రహ్మ పటానికి ముందు ధ్యానము చేస్తూ ఇలా అనుకొంది – ఆ మహానుభావుడు నన్ను ఎందుకు హెచ్చరించాడు, అతని ఋణాన్ని ఎలా తీర్చుకోవడమో?

తిరువైయ్యారు – జీర్ణోద్ధారణము

ఈ సమయములో బిడారము కృష్ణప్పనుండి ఒక ఉత్తరము వచ్చింది. అందులో కృష్ణప్ప గారు తాను తిరువైయ్యారుకు వెళ్ళానని, అక్కడ శ్రీ త్యాగరాజస్వామి సమాధి పరిస్థితి చాలా దుఃఖాన్ని కలిగించిందని వివరించారు. “మనము తినే ఈ తిండి ఆ మహానుభావుని దయవల్లనే కదా, మరి ఆ సమాధిని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. నీకు శ్రద్ధ, సౌకర్యము రెండూ ఉన్నాయి. నీవు త్యాగబ్రహ్మ సమాధిని పునరుద్ధరిస్తే ఆ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడు”, ఇది ఆ జాబు సారాంశము. రెండు రోజులకు ముందు త్యాగబ్రహ్మ తనకు జరగబోయే ముప్పును గూర్చి హెచ్చరించడము, నేడేమో ఈ ఉత్తరము. మిత్రులైన మునుసామి నాయుడు, నాగరాజభాగవతరులను సంప్రదించి ఆ రోజే ఆమె తంజావూరికి ప్రయాణము కట్టింది. తిరువైయ్యారు క్షేత్రమునకు పంచనద క్షేత్రము అని పేరు. ఇక్కడ కావేరీనది తూర్పునుండి పడమర దిక్కునకు ప్రవహిస్తుంది (అందువలనే నదము అని పేరు). నది ఒడ్డున త్యాగరాజుల వారి సమాధి , అది స్మశానము కూడ, కొబ్బరి చెట్లు, రాళ్ళు, ముళ్ళ కంపలు. ఆ చోటును చూసి ఆమె దీనిని తప్పక జీర్ణోద్ధారణము చేయవలసినదే అని తీర్మానించింది. ఆ స్థలాన్ని దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుద్ధము చేయించి, తరువాత గుడి, గోడలు కట్టించింది. తన స్వంత ధనాన్ని, నగలను ఈ ఖర్చుకై ఉపయోగించింది. తన మదరాసు ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. అక్టోబర్ 27, 1921లో పునాదిరాయిని నాటగా, జనవరి 7, 1925 రోజు గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఒక్కొక్క నిర్మాణముతో ఆమె ఆభరణాల సంఖ్య తక్కువవుతూ వచ్చింది!

ఆరాధన – పార్టీ రాజకీయాలు

త్యాగరాజస్వామి చని పోయిన దినము పుష్య బహుళ పంచమి. తాను బ్రదికి ఉన్నంతవరకు త్యాగరాజు మనుమడైన త్యాగరాజు తన తాతకు తద్దినము పెట్టేవాడు. అతని పిదప త్యాగరాజ శిష్యపరంపర ఈ కార్యాలను చేస్తుండేది. ఉమయాళపురం సుందర, కృష్ణ భాగవతులు, తిల్లైస్థానం రామ అయ్యంగార్, వాలాజాపేట్ వెంకటరమణ భాగవతర్. వీళ్ళందరు వారివారి ఊళ్ళల్లో ఈ శ్రాద్ధాన్ని చేసేవారు. రామ అయ్యంగార్ తరువాత వారి శిష్యులైన నరసింహ, పంచూ భాగవతర్ సోదరులు ఈ శ్రాద్ధాన్ని తిరువైయ్యారులో సంగీతముతో సహా చేసేవారు. అన్నదమ్ములలో కలిగిన విరసము వల్ల అవి రెండు పార్టీలుగా మారాయి. పెరియ కక్షి (పెద్ద పార్టీ) నరసింహ భాగవతరుది, చిన్న కక్షి (చిన్న పార్టీ) పంచూ భాగవతరుది. నాగరత్నమ్మ త్యాగరాజుల ఆలయాన్ని కట్టిన తరువాత ఆమె కూడ ఈ వర్ధంతిని చేసేది. అనగా మూడు పార్టీలు చేసేవి ఈ తద్దినాలను. ఈ మూడు పార్టీలు చివరకు 1940నుండి శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఆధ్వర్యాన ఒకే విధమైన పద్ధతిని అనుసరించారు. దీని ఫలితముగా చిన్న పార్టీకి మొదట పూజ చేసే హక్కు, తరువాత నాగరత్నమ్మకు, చివర సభయొక్క సభ్యులకు.

చివరి రోజులు

1929నుండి నాగరత్నమ్మ నివాసము తిరువైయ్యారులోనే. భక్తులకు, సంగీత విద్వాంసుల సౌకర్యానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. 1946లో చిత్తూరు నాగయ్య త్యాగయ్య చిత్ర నిర్మాణ సందర్భములో తిరువైయ్యారుకు వెళ్ళి నాగరత్నమ్మను కలిశారు. తనకు కూడ ఏమైనా త్యాగరాజస్వామికి చేయాలనే కోరిక ఉందని చెప్పగా ఒక సత్రాన్ని కట్టమని ఆమె సలహా ఇవ్వగా నాగయ్య గారు త్యాగరాజనిలయాన్ని కట్టించారు. ఆమె మైసూరునుండి వచ్చే భక్తులకై ఒక సత్రాన్ని కట్టాలని చాల కృషి చేసింది. కాని ఆరు వేల రూపాయలను మాత్రమే మైసూరు రాజ్యములో సేకరించగలిగింది. “అమ్మా నీవెందుకు మదరాసులో కచ్చేరీలు చేసి ఈ కార్యానికి ధనార్జన చేయరాదా” అని ఎవరో అడిగితే “నిజమే అక్కడ ఒకే దినములో దీనికన్న ఎక్కువ గణించగలను. కాని ఇది మైసూరు ప్రజలకు, ఈ కార్యానికి మైసూరువారు సహాయము చేస్తేనే మంచిది” అని చెప్పిందట. ఆమెకు 1951లో త్యాగరాజస్వామి కలలో కనబడి వెంకటగిరికి వెళ్ళమని ఆదేశించారట, కాని కారణము తెలుపలేదు. ఆమె అక్కడికి వెళ్ళగా, అక్కడ పుట్టపర్తి సాయిబాబాను సందర్శించింది. వాళ్ళిద్దరు త్యాగరాజస్వామి వ్రాసిన అపూర్వ రాగాల కృతులను పాడారట. ఆమె మే 19, 1952 నాడు త్యాగరాజస్వామిని తలుచుకొంటూ ప్రాణాలను త్యజించింది. ఆమెకు త్యాగరాజస్వామి చెంతనే దహనసంస్కారములను జరిపారు. ఆమె సమాధి త్యాగరాజస్వామి ఆలయానికి ఎదురుగానే ఉన్నది. ఆమె చేతులు జోడించి తన సర్వస్వమైన ఆ మహానుభావునికి నమస్కారము చేస్తూ శిలావిగ్రహముగా నేడు కూడ కూర్చుని ఉంది.

నాగరత్నమ్మ సంగీతము

నాగరత్నమ్మ మంచి గురువులవద్ద సంగీతాభ్యాసము చేసింది. మునిసామప్ప త్యాగరాజుల శిష్యపరంపరకు చెందిన వారికి శిష్యుడు. నాట్యాచార్యుడు కోలార కిట్టప్ప సదాశివరావు శిష్యుడు. నాగరత్నమ్మ కాక, వరాలు అని పిలువబడిన బెంగళూరు వరలక్ష్మి అతని ప్రసిద్ధ శిష్యురాలు. తరువాత మైసూరులో గురువైన బిడారం కృష్ణప్ప కర్ణాటక సంగీతములో అతి ప్రసిద్ధుడు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ కూడ కృష్ణప్ప శిష్యులే. తరువాత మదరాసులోని పూచి శ్రీనివాస అయ్యంగార్ గొప్ప సంగీత విద్వాంసులు. ఇలా ఎందరివద్దనో నేర్చుకొని తనదైన ఒక కొత్త బాణీని ఈమె సృష్టించుకొన్నది. ఆమెకు త్యాగరాజ కృతులంటే ఎంతో ఇష్టము. సాహిత్యమును చక్కగా అర్థము చేసికొని హృదయములో హత్తుకొనేటట్లు పాడగలిగేది. ఆమెకు సంస్కృతముతో బాగుగా పరిచయము ఉండినా కూడ దీక్షితుల కృతులను పాడుటకు జంకు పడేది. మాతృభాష కన్నడము కనుక దేవరనామములలో కూడ ఆసక్తి మెండు. ఆమెను గురించి ప్రఖ్యాత వాగ్గేయకారులైన మైసూరు వాసుదేవాచార్యులు (పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు, బ్రోచేవారెవరురా, మామవతు శ్రీసరస్వతీ, ఇత్యాదుల రచయిత) తాను వ్రాసిన నాను కండ కలావిదరు అనే కన్నడ పుస్తకములో ఇలా చెప్పారు (అనువాదము నాది) – “నాగరత్నమ్మది సుశిక్షితమైన సంగీతము. ఆఅమె కంఠములోని ఒక అపూర్వ లక్షణము ఏమనగా అందులో స్త్రీ కంఠముయొక్క మాధుర్యముతో పురుష స్వరపు గాంభీర్యము కూడ మిళితమైనది. సంగీత శాస్త్రాధ్యయనముతోబాటు నాట్య, అభినయ శాస్త్రములలో ఆమెకు పరిచయము ఉన్నందువలన ఆమె సంగీతము భావభరితము ఐనది. ఆమె కచ్చేరులలో స్వరకల్పనకన్న రాగాలాపనకు ప్రాముఖ్యత అధికము. యదుకులకాంభోజి రాగము పాడని కచ్చేరీలు అరుదు. ఆమెకు సంగీతములో మంచి పాండిత్యము ఉన్నందువలన విద్వాంసుల సవాలుకు జవాబును ఇచ్చే శక్తి ఆమెకు ఉండినది.” ఆమె ఒక గొప్ప ఇన్వెంటర్ కూడ. ఆమె ఒక చోటినుండి మరొక చోటికి తరచు వెళ్ళాలి, ఆ సమయములో తంబూరాను తనతో తీసికొని వెళ్ళేది. తంబూరా చాల పొడవైన వాద్యము గదా! రైలులో తీసికొని వెళ్ళడము కష్టము. ఒక కొలాప్సిబుల్ తంబురాను తానే నిర్మించింది. అది మూడు భాగాలు – సొరకాయ, తంత్రీ భాగము, మెట్లు ఉండే భాగము. మూటిని విడివిడిగా తీసికొని వెళ్ళవచ్చు. కావలసినప్పుడు వాటిని ఒకదానితో ఒకటి చేరిస్తే తంబురా లభిస్తుంది. శ్రుతి దోషము లేక శుద్ధమైన నాదమును ఇచ్చేది ఆ తంబూరా. ఆమె వేయికి పైగా కచ్చేరీలను ఇచ్చింది. ఒక చిన్న పుస్తకములో కార్యక్రమాలను గురించిన వివరాలు, తనకు దొరకిన వేతనము, ఇలాటివి వ్రాసేది. మొట్ట మొదట ఆదాయపు పన్ను కట్టిన వారిలో ఆమె ఒకతె! కోలార్ నాగరత్నమ్మ, కోలార్ రాజం, వీణా ధనమ్మాళ్, మదరాసు లలితాంగి (వసంతకుమారి తల్లి), హరికథా విదుషి బన్నీ బాయి ఆమెకు ఒకప్పుడు సమకాలీకులు. గ్రామఫోన్ రికార్డ్‌లను అసంఖ్యాకముగా సేకరించిన శ్రీ వీ. ఏ. కే. రంగారావును కడుపుతో నున్నప్పుడు, వారి తల్లిని నాగరత్నమ్మ ఆశీర్వదించి ఒక నిమ్మ పండును ఇచ్చి దీనిని పూజాగృహములో ఉంచమని చెప్పిందట. నీకు కొడుకు పుడుతాడని కూడ చెప్పగా, వాడొక మంచి సంగీత విద్వాంసుడు కమ్మని ఆశీర్వదించమని అడుగగా, అందరూ అందల మెక్కితే మోసేదానికి బోయీలు కావాలిగా అని చెప్పి, అతడు సంగీతాన్ని మెచ్చుకొనే రసికుడవుతాడు అని పలికిందట. భవిష్యత్తును దివ్యదృష్టితో చూడడము అంటే ఇదేనేమో? ఆమె పాడిన గ్రామఫోన్ రికార్డులు రంగారావుగారి దగ్గర ఉన్నవట. అందులో త్యాగరాజకృతులు, ముకుందమాల శ్లోకములు, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్ పాటలు, జావళులు ఉన్నవి. ఆ కాలములో ఇద్దరు నాగరత్నమ్మలు ఉండేవాళ్ళు – ఒకరు కోలార్ నాగరత్నమ్మ, మరొకరు బెంగళూరు నాగరత్నమ్మ. ఆమె పేరులోని ఇంగ్లీషు అక్షరాలైన బీ. ఎన్. ఆర్. ఆమెకు మరొక పేరయ్యింది. ఆమె పాటలను కొందరు బెంగాల్ నాగపూర్ రైల్వే స్టీం ఇంజన్‌కు పోల్చేవారట!

ఆమెకు ప్రియమైన ఒక పాట ఏకధాతు దివ్యనామ కీర్తనయైన “శ్రీరామ జయరామ” అనే ఉత్సవ సంప్రదాయ కీర్తన. ఈ పాటలో రామాయణములోని బాల, అయోధ్య కాండల సారాంశము ఉన్నది. ఆమె స్వయముగా శ్రీ త్యాగరాజస్వామిపై సంస్కృతములో ఒక అష్టోత్తరశతనామమును రచించినది. అన్ని అష్టోత్తరశతనామాలను అనుష్టుప్‌ ఛందములో రాస్తారు. నాగరత్నమ్మ అలా కాక దీనిని ఒక ప్రత్యేకమైన శైలిలో రాశారు.

నాగరత్నమ్మ – రాధికాసాంత్వనము

నాగరత్నమ్మ కన్నడ దేశములో పుట్టి తన మాతృభాషయైన కన్నడమును మాత్రమే కాక సంస్కృత, తెలుగు, తమిళ భాషలలో ప్రావీణ్యమును గడించినది. ఈ భాషలలో గల పుస్తకాలను కూడ చదివింది. ఆమెకు తెలుగంటే చాల ప్రీతి. ఆమె నోటినుండి వచ్చిన పలుకులు ఇవి- “నేను చిన్ననాటనుండియు సంగీత విద్యతోబాటుగా సాహిత్యవిద్యయందు గూడ కొంచెము పరిశ్రమ చేయుచు మా దేశభాషయగు కన్నడములోను, తెలుగులోను పెక్కు గ్రంథములు చదివితిని. తరువాత బెంగళూరినుండి యీ చెన్నపట్టణమునకు వచ్చినది మొదలుగా నరవములో కూడ ననేకగ్రంథములు చదువుచుంటిని. అయినను నా కాంధ్రభాషా గ్రంథములయందు గల యభిరుచి పై భాషలలో నంతగా లేకపోయినది. ఇట్లుండగా వేలాంవెర్రి అను సామెతగా చాల దినములనుండి తెలుగు బాసలో కవిత్వము చెప్పవలయునను కుతూహలము కూడ కలిగి పట్టుదలతో మరల భారతాదిగ నాంధ్ర గ్రంథములు చదివితిని.” తిరుపతి వేంకటేశ్వరకవులు రచించిన శ్రవణానందము అనే పుస్తకములో రాధికాసాంత్వనపు ప్రసక్తిని చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులోని తప్పులను చూచి చాల బాధ పడింది. సి పి బ్రౌన్‌దొరవంటి వారికి కూడ ఈ గ్రంథము ప్రియతమమైనదే. వేంకటనరసు దీనిని 1887లో ప్రచురించాడు, కాని అవతారికను, కొన్ని పద్యాలను పుస్తకమునుండి తొలగించాడు. ఆమె స్నేహితులొకరు తన ప్రతిని పంపగా దానిని చదివిన పిదప ముద్రిత ప్రతికి దీనికి గల భేదములను గమనించింది. అచ్చు ప్రతిలో కొన్ని పద్యాలే లేవు. ఆంధ్రకవుల చరిత్రలో రాధికాసాంత్వనము గురించి వీరేశలింగము పంతులు తప్పు తప్పుగా వ్రాసినది ఈమె గమనించింది. పళని తల్లి పేరు ముత్యాలు అని వీరేశలింగం అనుకొన్నారు. ముత్యాలు అన్నది తండ్రి పేరు. అదీగాక పంతులుగారు “గ్రంథములోని భాగము లనేకములు స్త్రీలు వినదగినవియు, స్త్రీనోటినుండి రాదగినవియు గాక దూష్యములైయున్నవి” అని రాశారు. హంసవింశతి, వైజయంతీవిలాసము, తారాశశాంకము మున్నగు పుస్తకాలలో కూడ “దూష్యములగు” పద్యాలున్నాయి. అంతకంటె ఎక్కువ రాధికాసాంత్వనములో లేదు. కాని వాటిని రాసిన కవులు పురుషులు, అయితే దీనిని రాసింది ఒక స్త్రీ, అందులో ఒక దేవదాసి కూడ. పంతులుగారి “రసికజనమనోరంజనములోని బూతులకన్నను నిందు పచ్చి బూతులు కంబట్టుచున్నదా” అని నాగరత్నమ్మ ప్రశ్నించింది. “ఈ గ్రంథము రస మొల్కుచుండుటచేతను, ఇది రచించినది స్త్రీయేగాక మాజాతిలో పుట్టిన దగుటచేతను దీనిని మంచి ప్రతిగా ముద్రింప వలయునను తలంపుతో వ్రాతప్రతిని ముద్రిత పుస్తకమును సరిచూచి నా మనసున కింపైన పాఠమునుంచి యొక ప్రతి పని బూని వ్రాసితిని” అని ప్రస్తావనలో మార్చి 9, 1910 (సౌమ్య సంవత్సర మహాశివరాత్రి) నాగరత్నము పలికింది. దీనిని వావిళ్ళ వారు ప్రచురించారు. జనుల శీలానికి, ధార్మిక వ్యవస్థకు ఈ పుస్తకములోని బూతు పద్యాలు అడ్డు తగులుతాయని 1911 లో పోలీస్ కమిషనర్ కన్నింగ్‌హాం ప్రతులను జప్తు చేయగా, వావిళ్ళ సంస్థను బూతు పుస్తకము ప్రచురించారని ప్రభుత్వము అభియోగము చేసింది. ప్రసిద్ధులైన కవులు, పండితులు, న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వము తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నది. వావిళ్ళ దుకాణాలపై దాడి 1927లో జరిగింది. ఈ కేసును గురించిన వివరాలను వావిళ్ళవారి రాధికాసాంత్వన ప్రతి చివర గల అనుబంధములో చదువ వీలగును. చివరకు భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తరువాత టంగుటూరు ప్రకాశం పంతులు మదరాసు రాజధాని ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు, అంటే సుమారు 36 సంవత్సరాలకు పిదప ఈ బహిష్కారము తొలగించబడినది. ఆ సమయానికి నాగరత్నమ్మ తిరువైయ్యారులో ఒక యోగినిగా మారింది. మచ్చుకు కింద రాధికాసాంత్వనమునందలి నిషేధించబడిన ఒక పద్యము –

ఎందఱిఁ జూడ నీవఱకు, నెందఱితోడుత ముచ్చటాడ, నే
నెందఱిఁ గేళిఁ గూడి సుఖ మెంతయుఁ జెందను? దాని యల్ల చో-
టందము, పొందు చందమును, నందునఁ జిందు సుఖద్రవంబు నే
చందనగంధియందుఁ గన, సారెఁ దలంచిన దానికే తగున్
– ముద్దు పళని, రాధికాసాంత్వనము, 3.113

నాగరత్నమ్మ తెలుగులో మద్యపానము అనేపుస్తకము, తమిళములో పంచీగరణ బౌదీక అను పుస్తకమును, సంస్కృతములో త్యాగరాజ అష్టోత్తరశతనామములను రచించెను. నాగరత్నమ్మ తెలుగు శైలి ఎలా ఉంటుందో అనేదానికి నిదర్శనముగా కింద ఆమెయే రాసిన రాధికాసాంత్వనములోని కడనుడి పద్యములు –

చిన్నికృష్ణుని కరుణా విశేషమునకుఁ
బాత్రురాలగు మా ముద్దు పళని ముద్దు
లొలుక వ్రాసినదని దీని నుద్ధరింప
సాహసించిన యీ నన్ను సైచవలయు

వదలఁగ బుద్ధి పుట్ట దిటువంటి ప్రబంధము నెన్ని సారులేఁ
జదివిన నింకనుం జదివి సంతస మందఁ దలంచుచుండు నె-
మ్మది యని తప్పు లెన్నియొ సమంజసమౌ గతి దిద్దియుంటి నో
చదువరులార! నాదయిన సాహసమున్ క్షమియింప వేడెదన్

నాగరత్నమ్మ – స్త్రీ సమానత్వము

త్యాగరాజస్వామి ఆరాధన సమయములో ఒక శతాబ్దము ముందు నేటిలా స్త్రీలను పాడనిచ్చేవారు కాదు. చాల దూరములో బయట ఒక గలీజుగా ఉండే చోట కావాలంటే వారు పాడుకోవచ్చు. వీణా ధనమ్మాళ్ వంటి విదుషీమణులకు కూడా ఇదే గతి. నాగరత్నమ్మ స్త్రీలకు కూడ పురుషులవలెనే అవకాశము ఇవ్వాలని పోరాడి ఆ స్థానాన్ని కల్పించింది. ఆమె 1948లో రాసిన వీలునామాలో తన సర్వస్వాన్ని ఆలయానికి అప్పగించింది. అది మాత్రమే కాదు ఆలయములో స్త్రీల, దేవదాసీల ప్రదర్శనలను ఏ కారణమువలన కూడ ఆపరాదు అని షరతు పెట్టింది. సాహిత్యములో గాని, సంగీతములో గాని స్త్రీలు పురుషులకు ఏ మాత్రము సాటివారు కారన్న ఊహ నాగరత్నమ్మకు అసహ్యము.

నాగరత్నమ్మ – దేవదాసి పద్ధతి

భారతదేశములో పురాతనకాలమునుండి దేవదాసి పద్ధతి అమలులో నుండింది. ఒక వర్గపు స్త్రీలు తమ జీవితాన్నే స్వామి సేవకై, దేవుని భోగములకై అంకితము చేసికొనుటే దీని ఉద్దేశము. కాళిదాసు మేఘదూతములోని ఒక పద్యములో కూడ వీరిని గురించిన ఒక వర్ణన గలదు. ఆ పద్యము –

పాదన్యాస-క్వణిత-రశనాస్ తత్ర లీలావధూతై
రత్నచ్ఛాయా-ఖచిత-వలిభిశ్చామరైః క్లాంతహస్తాః
వేశ్యాస్ త్వత్తో నఖపదసుఖాన్ ప్రాప్య వర్షాగ్రబిందూ-
నామోక్ష్యంతే త్వయి మధుకరశ్రేణిదీర్ఘాన్ కటాక్షాన్
– మేఘదూతం – 35, కాళిదాస మహాకవి

అక్కడ (ఉజ్జయినిలోని మహాకాలుని ఆలయములో) ఆటవెలదులు నృత్యము చేసేటప్పుడు వారి ఒడ్డాణములోని మువ్వలు వారి పదములతో సవ్వడి చేస్తాయి. రత్నఖచితమైన విసనకర్రలతో వాళ్ళు అందముగా వీస్తున్నారు. ఓ మేఘమా, నీ వర్షబిందువులు వాళ్ళ గోళ్ళపై పడగా ఎంతో హాయి కలిగిస్తుంది. నీపై వాళ్ళు తుమ్మెదల బోలు కటాక్షవీక్షణాలను ప్రసరిస్తారు.

దేవాలయము ఉంటే దేవదాసీలు ఉంటారన్న మాట. దక్షిణదేశములో ఒక్కొక్క గుడి అధీనములో నున్న దేవదాసీల సంఖ్య గర్వకారణమైనది. ఎలా మహమ్మదీయులను నిగ్రహించడానికి పోరాడే సిక్ఖు మతస్థులకు ఒక కుమారుని హిందువులు ప్రసాదించారో, అదే విధముగా కొన్ని కులాల వారు ఒక కూతురును దేవదాసిగా ఆలయాలకు అంకితము చేసేవారు. వారు నిత్యసుమంగళులు, సౌభాగ్యవతులు అని పిలువబడేవారు. అందులో కొందరు సంగీత నాట్యాలను అభ్యసించారు. భరత నాట్యము, ఒడిస్సీ నాట్యము వీరి పరిశ్రమవల్లనే నేటివరకు నిలిచింది. యుక్త వయస్సు వచ్చిన తరువాత వీరికి దేవుడి గుడిలో దేవుడితో పెళ్ళి. దేవుని విగ్రహ స్పర్శచే పావనమైన మంగళసూత్రాన్ని పూజారి వారి మెడలో కట్టుతాడు. తరువాత వాళ్ళు ఆ పూజారితోనో లేక రాజులతోనో, తరువాతి కాలములో జమీందారులు, స్తోమత ఉన్న వర్తకులు మున్నగువారితో దైహిక సంపర్కము పెట్టుకొంటారు. (దీనిని గురించి ప్రసిద్ధ స్త్రీవాద రచయిత ఎం. కే. ఇందిర కన్నడములో గెజ్జె పూజె అనే నవలలో వివరించారు, మినుగుతార కల్పన నటించిన అదే పేరితో గల చలన చిత్రము కూడ అత్యుత్తమమైనదే.) వీళ్ళందరూ బ్రాహ్మణేతర కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. వారి సంఘములో తల్లికే (అమ్మమ్మకు) అధికారము ఎక్కువ (మాతృస్వామ్యము లేక మేట్రిలీనియల్). సామాన్యముగా దేవదాసీలు ఒకే పురుషునితో మాత్రమే సంపర్కము పెట్టుకొనే వాళ్ళు. అతడు చనిపోతే మరలా ఇంకొకరితో పొత్తు ఉంచుకోరు. సుబ్బులక్ష్మి, వసంతకుమారి, లతా మంగేష్కర్, వీణా ధనమ్మాళ్, ముక్తా, బృందా మున్నగు ప్రసిద్ధ గాయనీమణులు దేవదాసీ వంశములోనే పుట్టారు. దేవదాసీలకు పురుషులతో ఉండే సంబంధము కేవలము దైహికము మాత్రమే కాదు. అది రసికులకు కళాకారులకు మధ్య ఉండే అవినాభావ సంబంధము, వారిని కలిపే ఒక ముడి వంటిది.

కొందరు నాగరత్నమ్మను గురించి రాసేటప్పుడు ఆమె పంకములో పుట్టిన పంకజము వంటిది అని చెప్పారు. కాని నాగరత్నమ్మ తాను బురదలో పుట్టిందని ఎన్నడూ అనుకోలేదు. తన కులముపైన ఆమెకు అభిమానము, గర్వము ఉండేది. తాము జనులు అనుకొనేటట్లు వేశ్యలు కాము, కళాకారులము అని ఆమె భావము. ఈ స్వాభిమానమే తన కులానికి చెందిన ముద్దు పళని రాధికాసాంత్వనాన్ని ప్రచురించాడానికి ఆమెకు ప్రోత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించింది. సంఘ సంస్కర్తలు, స్వాభిమానావలంబులు (జస్టిస్ పార్టీ, సెల్ఫ్‌రెస్పెక్ట్ మూమెంట్‌కి చెందిన వాళ్ళు) ఈ పద్ధతిని తొలగించాలని పట్టు బట్టారు. నిమ్న వర్గాలకు చెందిన ఈ పార్టీ నిమ్నవర్గాలకు చెందిన దేవదాసీలపై దాడి చేసింది! అదియును కాక ఇది ఒక బ్రాహ్మణ-బ్రాహ్మణేతర పోరాటములో చదురంగపు పావు అయింది. వీరితోబాటు కొన్ని క్రైస్తవ సంస్థలు, బ్రిటిష్ ప్రభుత్వము కూడ చేతులు కలిపాయి. హిందీలో నాచ్ అంటే నాట్యము అని అర్థము. nautch girls అంటే బోగమువాళ్ళు అని అర్థము, వేశ్యానిర్మూలన కార్యక్రమమే ఆంటీనాచ్ మూమెంట్. దేవదాసియైన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి దీనికి నడుము కట్టింది. ఆమె ఆ కాలములో అసెంబ్లీలో మొదటి మహిళా సభ్యురాలు. నాగరత్నమ్మ మదరాసు దేవదాసీ సంఘాన్ని ప్రారంభించింది, దానికి ఆమె కార్యదర్శి. ధనమ్మాళ్, సేలం మీనాక్షీ, మైలాపూర్ గౌరి మున్నగువారు అందులో సభ్యులు. పురాణాలనుండి, ఆగమాలనుండి ఎన్నో వాదాలను బయటికి తీసి దేవదాసి పద్ధతి కొనసాగాలని నాగరత్నమ్మ ప్రయత్నించింది. మఠాలలో స్వాములవారివలె తాము కూడ సన్యాసినులమని వాదించారు. కాని ఇదంతా బూడిదలో పోసిన పన్నీరయింది. చివరకు 1927లో ప్రవేశ పెట్టబడిన బిల్లు 1947లో చట్టమయింది. ఇది ఆమె జీవితములో ఒక పెద్ద ఓటమి. కర్ణాటకములో ఇది 1982లో, ఆంధ్రప్రదేశములో 1988లో అమలులోనికి వచ్చింది. తక్కువైనా ఇంకా మన దేశములో దేవదాసీలు ఉన్నారు. “పగలంతా దేవదాసులు, రాత్రి దేవీదాసులు” ఉన్నంతవరకు దేవదాసీలు మరొక పేరుతో మసలుతూనే ఉంటారు. ఇప్పుడు నృత్య, సంగీతాది కళలను అందరూ నేర్చుకొంటున్నారు, దేవదాసీలు మాత్రమే కాదు.

ముగింపు

నాగరత్నమ్మనుండి మనము ఎన్నో నేర్చుకోవచ్చు. ఆమెలా ఎన్నో భాషలు నేర్చుకోవచ్చు, ఆమెలా ఎన్నో కళలు నేర్చుకోవచ్చు. గురువులకు, పెద్దవారికి, విద్వాంసులకు ఆమె వినయ విధేయతలతో ఒళ్ళు కుంచించుకొని నమస్కరించేదని వాసుదేవాచార్యులు అన్నారు. ఆమె సౌందర్యము పూజ్యభావాన్ని కలుగ జేసేదట. ఆమె మితభాషి, నిగర్వి, కాని తప్పుంటే దానిని చూపక తప్పుకోదు. ధనార్జనను సద్వినియోగము చేసికొన్నది. తల్లిని ఎప్పుడు మరచిపోలేదు. ప్రతి యేడు తల్లియొక్క స్మారక దినాన్ని సమారాధనలతో, సంతర్పణలతో, దానాలతో, ఉపవాసముతో గడిపేది. బీదలపై కరుణ, సానుభూతి ఎక్కువ ఆమెకు. తాను త్యాగరాజు పాదాలవద్ద దాసినని చెప్పుకొనే అణకువ, వినయము గలిగినది. ఆమెకు గానకళావిశారద, విద్యాసుందరి అనే బిరుదులు ఉన్నా, త్యాగసేవాసక్త అనే బిరుదంటే ఆమెకు ఇష్టము. ఉత్తమ కళలకు, సహృదయతకు, మానవత్వానికి ఆమె ఒక త్రివేణీసంగమమే. కాలగర్భములో మరుగునబడిన ఒక భారతరత్నము బెంగళూరు నాగరత్నమ్మ.

ఆటవెలఁది నీవు, తేటగీతులఁ బాడి
త్యాగరాజుతోడి యోగ మొంద,
రసిక జనుల హృదయ రాజీవములు బూచె
రాగరత్నదీప, నాగరత్న!

కృతజ్ఞతలు

ఈ వ్యాసము మొదటలో ఉన్న నాగరత్నమ్మ చిత్రమును ఉపయోగించుటకు అనుమతి నిచ్చిన డాక్టర్ జ్యోత్స్నా కామత్ గారికి , తిరువైయ్యార్‌లోని శిలావిగ్రహపు చిత్రాన్ని ఉపయోగించుటకు అనుమతి నిచ్చిన శ్రీ పున్నా కృష్ణమూర్తిగారికి , ఇందులోని పాటల లింకులు చూపిన శ్రీ H.M.G. మూర్తి గారికి, గాయకుడు శ్రీ కే. వీ. నారాయణస్వామిగారికి, All India Radio సంస్థకు, త్యాగరాజాష్టోత్తరశతనామముల పుస్తకమును ఇచ్చిన శ్రీ వాడపర్తి శేషతల్పశాయిగారికి నా హృదయపూర్వకమైన వందనములు.

గ్రంథసూచి

  1. త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు ఉత్సవ సంప్రదాయ కీర్తనలు – స్వర కల్పన వోలేటి వెంకటేశ్వరులు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమి, 1979
  2. నా కండ కలావిదరు – వాసుదేవాచార్య, హిందూస్తాన్ ప్రెస్, మైసూరు, 1955
  3. బెంగళూరు నాగరత్నమ్మ – బీ. వీ. కే. శాస్త్రి, ఐబిఎచ్ ప్రకాశన, బెంగళూరు, 1982
  4. మేఘదూతం – కాళిదాస – ఆంగ్ల అనువాదము Franklin and Eleanor Edgerton, University of Michigan Press, Ann Arbor
  5. రాధికాసాంత్వనము – ముద్దుపళని, బెంగళూరు నాగరత్నముచే పరిష్కృతము, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1950
  6. శ్రీ సద్గురు త్యాగరాజ సుప్రభాతాదులు, శ్రీ అడవి ఆంజనేయస్వామి దేవస్థానము, నూజివీడు, 1983
  7. Bangalore Nagaratnammal – V. Sriram and Lakshmi Devnath, sangeetham.com (not operative now), 2002
  8. Devadasis – Sinners or Sinned Against – Anil Chawla, samartbhArat.com, 2002
  9. Women Writing in India, Vol. I, Ed. Susie Tharu and K. Lalita, The Feminist Press, New York, 1991

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...