శతక వాఙ్మయానికి పెట్టింది పేరు తెలుగు భాష. సుమతి శతకాన్ని, వేమన శతకాన్ని, కృష్ణశతకాన్నీ, భర్తృహరి శతకాల అనువాదాలను తెలుగు పిల్లలు ఇప్పటికీ చదువుకుంటున్నారు. ప్రాకృతములోని గాథాసప్తశతి కాలము (సుమారు రెండవ శతాబ్దము) నుండి నేటివరకు కవులు శతకాలను వ్రాస్తూనే ఉన్నారు. ఈ రచనలో కొందరి దృష్టి ఇహపరసాధన మయితే, మరి కొందరిది నీతిప్రబోధం. ఇంకా కొందరిది శృంగారం, మరి కొందరిది హాస్యము, వ్యంగ్యము. సామాన్యముగా శతకము ఒకే ఛందస్సులో ఉంటుంది. పద్యములోని చివరి పాదములో శ్రీవేంకటేశ్వరా, విశ్వదాభిరామ వినుర వేమ, సిరిసిరిమువ్వా లాటి మకుటము కూడా ఉంటుంది. కందము, ఆటవెలదిలాటి చిన్న పద్యాలు శతకానికి అందముగా ఉంటాయి.
నేను నా కొన్ని భావనల ఆధారముగా శతకందసౌరభమనే శతకాన్ని వ్రాసాను. నేను ఎంచుకొన్న పద్యపు ఛందస్సు కందము. ప్రాకృతములోని గాహ లేక గాథ సంస్కృతములో ఆర్యాగా మారినది. సంస్కృతములో పురాతనమైన మాత్రాఛందస్సులలో ఆర్యా ఒకటి. ఇది తొమ్మిది విధాలు, అందులో ఒకటైన ఆర్యాగీతియే స్ఖందఅ లేక కందముగా మారినది. కందములో చతుర్మాత్రలుండే గణాలను (గగ UU, భ UII, జ IUI, స IIU, నల IIII) మాత్రమే వాడుతారు. నాలుగు పాదాలుగా వ్రాయబడే కందము మనకు సుపరిచితమయినా, కందము నిజముగా ఒక ద్విపద. ఇందులోని ప్రతి పెద్ద పాదానికి ఎనిమిది చతుర్మాత్రలు ఉంటాయి. అందులో కురుచ పాదానికి మూడు, నిడివి పాదానికి ఐదు గణాలు ఉంటాయి. రెంటికీ ప్రాస ఉండాలి. బేసి గణాలు జ-గణముగా ఉండరాదు. నిడివి పాదానికి చివర గురువు ఉండాలి, నిడివి పాదములోని మూడవ గణము (పెద్ద పాదములో ఆరవ గణము) న-లముగానో లేక జ-గణముగానో ఉండి తీరాలి. నిడివి పాదములో మొదటి గణానికి నాలుగవ గణానికి అక్షరమైత్రి యతి చెల్లాలి. ఈ లక్షణాలు క్రింది పద్యములో గమనించగలరు.
కందము త్రిశరగణంబుల
నందము, గాభజసనలములట వడి మూఁటన్
బొందును, నలజల నాఱిట
నొందున్, దుద గురువు, జగణముండదు బేసిన్
– తిమ్మకవి, సులక్షణసారము, 32.
శతకందసౌరభములో వందకు పైగానే పద్యాలు ఉన్నాయి. వాటికి మకుటము లేదు. అవి అన్నీ ముక్తకాలే, అంటే ఏ పద్యానికి ఆ పద్యము అర్థవంతముగా ఉంటుంది. పీఠిక, చివరి మాటను తప్పించి వాటిని ప్రకృతి, ప్రేమ, పెళ్ళి, విరహము, జీవితము, ప్రపంచము అనే భాగాలలో ఉంచాను. ఇందులో కొన్ని చోట్ల ‘నేను’ అని వాడినా అది నిజముగా నేను కాదు. హాలుడు ఈ నవీన యుగములో ఉండి ఉంటే కొన్ని పద్యాలను ఇలా వ్రాసిఉండేవాడేమో? అన్ని పద్యాలు అందరికీ నచ్చకపోవచ్చు. కాని అందరికీ ఇందులోని పద్యాలు కొన్నైనా తప్పక నచ్చుతాయని నా ఆశ. ఇందులోని తప్పులను మన్నించి పాఠకులు సహృదయతతో ఆదరిస్తారని తలుస్తాను. మీ ఉత్సాహాన్ని రేకెత్తించడానికోసం కొన్ని పద్యాలను క్రింద ఉదహరిస్తున్నాను. అన్ని పద్యాలను గ్రంథాలయములో చదువవచ్చును.
జలమున వ్రాసెను గాలియు
లలితముగా రంగవల్లి రచనల నెన్నో
వెలిఁగెడు తరంగవల్లిగ
మెలమెల సాగినవి వెల్గు మిలమిలలోనన్
పాలసముద్రపుటలలో,
తూలికతో వ్రాసిన మణితోరణతతులో,
తేలిన ముద ఫేనములో,
రాలిన హిమరాశులు కడు రమ్యము మహిపై!
అమ్ము లయిదు కురియఁగఁ, గను
దమ్ములు నాలుగు విరియఁగఁ, దాళిముడులు మూ-
డిమ్మనువుల రెంటిఁ గలుపఁ
గమ్మని బ్రేమయు నొకటగుఁ గడు చెలువముతో
(ఈ పద్యములో ఐదునుండి ఒకటివరకు అంకెలు క్రమముగా గోచరిస్తాయి.)
వేసవినిఁ గళాశాలల
మూసిరి, గ్రంథాలయమునఁ బుస్తకములఁ దా
నాసగ చదువఁగ లేదిక
మూసిన పుస్తక మయె మది మోదము లేకన్!
(కాలేజీ లైబ్రరీలో ప్రేమికులు కలిసేవారు.)
అతిథికి నన్నముఁ బెట్టెను
గుతుకముతో నామె తనదు కూతురితోడన్
మెతుకుల వెండ్రుక నగపడ
నతి త్వరలో బంధు వగుదు వనుచును నవ్వెన్
(ఇక్కడ వచ్చిన అతిథికి తన కూతురిని పెండ్లి చేసికోమని తల్లి పరోక్షముగా చెప్పుతుంది. భోజనములో వెండ్రుకలు వస్తే బంధువులు అవుతారనే ఒక నమ్మకం ఉంది కొందరికి.)
నను నీవు వీడుచుంటివి
పనికై దేశమును, నన్ను వదలుచు నిటులన్
జనకున్న బాగు రాతిరి,
కనబడెనే రవి, మరొక్క కౌగిలి నీవా
చిత్తము రంజిలఁజేయగ
క్రొత్త టపా వచ్చెనంచుఁ గుతుకముతోడన్
దత్తరపడి వెదుకఁగ నట
చెత్త టపా యుండుఁ గాని చెలి వ్రాయదుగా
మఱల నదే సాయంత్రము
మఱల నదే రంగులవల మాయల ఛాయల్
మఱల నదే మధురస్మృతి
మఱల నదే గతపు గాథ మదిలో నిండెన్
వాడిన మల్లెల గంధము,
వీడిన బట్టల ముడుతలు, ప్రియతర మద్యం,
బాడిన ముద్దుల మాటలు,
నేడీ ప్రొద్దున రగిల్చె నిర్దయగను నన్
మ్రింగక మ్రింగే నొక నా
డంగజహారియు విషమ్ము నతి నైపుణితో
మ్రింగుచు జీర్ణించుకొనే
నంగన బ్రతిరోజు విషము నతి నైపుణితో
పది విష్ణువు రూపము లగు,
పదినొక్కటి రుద్రదేవుఁ బలు యంశములౌ,
పది పదినొక్కటి రెంటినిఁ
బదిలముగాఁ జేర్చవచ్చు వదలక ముగ్గై